దక్షిణ కొరియాపై కిమ్‌ సోదరి నిప్పులు.. అణుబాంబుల వర్షం కురిపిస్తామని హెచ్చరిక..

Kim Yo-jong Fire on North Korea | Telugu Online News
x

 దక్షిణ కొరియాపై కిమ్‌ సోదరి నిప్పులు 

Highlights

North Korean: తమపై దాడులకు దిగితే.. బుల్లెట్లతో కాల్చమని..అణుబాంబుల వర్షం కురిపిస్తామని హెచ్చరిక

North Korea: ఉత్తర కొరియా అధ్యక్షుడు, ఆధునిక నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సోదరి కిమ్‌ యో జోంగ్‌ దక్షిణ కొరియాపై నిప్పులు కక్కారు. ఫ్లూటు జింక ముందు ఊదు. సింహం ముందు కాదంటూ దక్షిణ కొరియాను హెచ్చరించారు. సైనిక చర్య ప్రారంభిస్తే ఏవో బుల్లెట్లతో కాల్పులు జరిపి ఊరుకుంటామనుకుంటున్నారేమో ఏకంగా బాంబుల వర్షం కురిపిస్తామని దక్షిణ కొరియాకు యో జోంగ్‌ బెదిరించారు. మా అణ్వాయుధాలే మీకు సమాధానం చెబుతాయంటూ తీవ్ర స్థాయిలో యో జోంగ్‌ హెచ్చరించారు.

ఆధునిక నియంత, ఉత్తర కొరియా అధ్యక్షుడు ఇటీవల తరచూ క్షిపణి ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. ఒక వైపు ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంతో తీవ్ర ఆందోళనలో ఉన్న ప్రపంచాన్ని. కిమ్‌ మరింత కలవరపరుస్తున్నారు. అమెరికాపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా ఈ ప్రయోగాలు చేస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. అయితే దక్షిణ కొరియా మంత్రి చేసిన వ్యాఖ్యలు కిమ్‌ సోదరి యో జోంగ్‌కు ఆగ్రహం తెప్పించాయి. ముందస్తు దాడులు చేసి తమతో పెట్టుకోవద్దని దక్షిణ కొరియాకు యో జోంగ్‌ ఘాటుగా హెచ్చరించారు. తమపై దాడులకు దిగితే బుల్లెట్లతో కాల్పులు జరపమని అణుబాంబులే దక్షిణ కొరియాకు సమాధానం చెబుతాయని యో జోంగ్‌ హెచ్చరించారు. సాహసాలు చేయాలన్న ఆలోచనను దక్షిణ కొరియా కట్టిపెడితే మంచిదని హితవు పలికారు. తాము దాడి చేస్తే దక్షిణ కొరియా సమూలంగా నాశనమవుతుందని యో జోంగ్‌ హెచ్చరించారు.

మూడ్రోజుల్లో కిమ్‌ సోదరి యో జోంగ్‌ రెండు మార్లు దక్షిణ కొరియాపై మండిపడ్డారు. గత వారం దక్షిణ కొరియా రక్షణ శాఖ మంత్రి సు వూక్‌ చేసిన వ్యాఖ్యలే ఆమె ఆగ్రహానికి కారణం. తమ అమ్ముల పొదిలో అనేక క్షిపణులు ఉన్నాయని ఉత్తర కొరియాలోని ఏ మూలకైనా అవి చేరుకోగలవని పరోక్షంగా సు వూక్‌ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. వాటి గురి తప్పే ప్రశ్నే లేదని దక్షిణ కొరియా మంత్రి స్పష్టం చేశారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన యో జోంగ్‌ దక్షిణ కొరియా మంత్రి వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు. రెచ్చగొట్టే ఇలాంటి వ్యాఖ్యలను మానుకోవాలని సు వూక్‌ మానుకోవాలని యో జోంగ్‌ సూచించారు. యుద్ధమే వస్తే అణ్వాయుధాలతో శత్రువులను నిర్మూలిస్తామని యో బెదిరింపులకు దిగారు. ఇలాంటి ప్రకటలు చేసేముందు ఆచి తూచి మాట్లాడాలని లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని దక్షిణ కొరియా మంత్రికి కిమ్‌ యో జోంగ్‌ హితవు పలికారు.

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తరువాత రెండో స్థానంలో కిమ్‌ యో జోంగ్‌ ఉంటారు. అత్యంత కీలకమైన అధికార పార్టీ ఢి ఫ్యాక్టోకు సెకండ్‌ ఇన్‌ కమాండర్‌గా ఆమె నియమితులయ్యారు. కిమ్‌ తన తరువాతి స్థానాన్ని సోదరికే కట్టబెట్టారు. ఆమె కూడా కిమ్‌లాగే దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఒకానొక దశలో కిమ్‌ చనిపోయారని.. ఇక ఆయన సోదరి యో జోంగ్‌కే అధికార పగ్గాలు చేపట్టనున్నట్టు ప్రచారమైంది. అయితే కిమ్‌ స్లిమ్‌ అవ్వడానికి కొన్నాళ్లు భయట ప్రపంచానికి కనిపించలేదు. దీంతో కిమ్‌ చనిపోయారనే కథనాలు ప్రచారమయ్యాయి. ఆ సమయంలోనూ అమెరికాపై కిమ్‌ సోదరి యో జోంగ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బెదిరింపుల్లో అన్న కిమ్‌ కంటే చెల్లి యో జోంగ్‌ ఒక ఆకు ఎక్కువే చదివిందంటారు నిపుణులు కిమ్‌ తరఫున ఇతర దేశాధినేతలతోనూ యో జోంగ్‌ చర్చలు జరుపుతారు. అన్ని రకాలుగా సోదరుడికి యో జోంగ్‌ అండగా నిలుస్తోంది.

2017లో చివరిగా ఉత్తర కొరియా అణుపరీక్షలను నిర్వహించింది. అయితే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ ఉన్న సమయంలో కిమ్‌తో చర్చలు జరిపారు. 2018 అణ్వస్త్ర ప్రయోగాలను నిలిపేయాలన్న ఒప్పందం కుదురింది. నాటి నుంచి ప్రయోగాలను కిమ్‌ ఆపేశాడు. అయితే తాజాగా 2022 నుంచి కిమ్‌ దూకుడు పెంచాడు. ఉత్తర కొరియా చేపడుతున్న అణు పరీక్షలతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నట్టు అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. కిమ్‌ తనదైన దూకుడుతో అమెరికాకు కొరకాని కొయ్యగా మారారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఉత్తర కొరియా పది సార్లు ప్రయోగాలు జరిపింది. ఇటీవలే కిమ్‌ స్టైలిస్ట్‌ వీడియోను ఒకటి ఉత్తర కొరియా విడుదల చేసింది. అది నెటిజన్లను ఎంతో ఆకట్టుకుంది. తాజాగా కిమ్‌ సోదరి యో జోంగ్‌ వ్యాఖ్యలతో మరోసారి ఉత్తర కొరియా వార్తల్లో నిలిచింది.

ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్‌ ఇల్‌ సంగ్‌ జయంతిని ఈనెలంతా అక్కడి ప్రజలు ఉత్సవంగా జరుపుకోనున్నారు. ప్రస్తుత పాలకుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌కు కమ్‌ ఇల్‌ సంగ్‌ తాత అవుతారు. ఆయన జయంతి సందర్భంగా అక్కడి ప్రజలు వేరే ఉత్సవాలు, పుట్టిన రోజులను కూడా ఎవరూ జరుపుకోరాదు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు.

Show Full Article
Print Article
Next Story
More Stories