Kim Jong-un: మంచి మనసు చాటుకున్న కిమ్‌ జోంగ్‌ ఉన్‌

Kim Jong-un Gifted a Luxury Mansion to Ri Chun | Telugu News
x

Kim Jong-un: మంచి మనసు చాటుకున్న కిమ్‌ జోంగ్‌ ఉన్‌

Highlights

Kim Jong-un: రీ చున్‌కు విలాసవంతమైన భవనం బహుమతిగా ఇచ్చిన కిమ్‌

Kim Jong-un: కిమ్‌ జోంగ్‌ ఉన్‌.. ఈ పేరు వినని వాళ్లు గానీ, ఆ మనిషి తెలియని వాళ్లు గానీ బహుశా ఎవరూ ఉండకపోవచ్చు. అణ్వస్త్ర ప్రయోగాలు, వివాదాస్పద నిర్ణయాలతో పాటు అత్యంత కిరాతకంగా వ్యవహరించే వ్యక్తి. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఏది చేసినా ప్రపంచవ్యాప్తంగా సంచలనే ఇప్పటికే ఎన్నోసార్లు తన వైఖరితో వార్తల్లో ట్రెండింగ్‌లో నిలిచారు. అందుకే కిమ్‌ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం వరుస మిసైల్‌ టెస్ట్‌లతో అగ్రరాజ్యం అమెరికాకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఒకవైపు.. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం, మరోవైపు. శ్రీలంకలో సంక్షోభం ఇలాంటి సమయంలో కూడా మీడియా ఒక్కసారిగా ఉత్తర కొరియా వైపు దృష్టి పెట్టింది. అంటే కిమ్‌ మరో సంచలనానికి సిద్ధమయ్యారని అందరూ అనుకున్నారు. కానీ ఈ సారి కిమ్ ఓ మంచి నిర్ణయమే తీసుకొని తాను కూడా ఓ మనసున్న మనిషినే అని నిరూపించుకున్నారు కిమ్‌. ఇంతకీ కిమ్‌ ఏం చేశారో తెలుసుకోవాలనుకుంటున్నారా.? వాచ్‌ దిస్‌...

సంచలనాత్మక నిర్ణయాలతో ఎప్పుడూ మీడియాలో నిలిచే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్ మంచి మనసును చాటుకున్నారు. ఉత్తర కొరియా అధికారిక టీవీ ఛానల్​యాంకర్ కు కిమ్ జోంగ్ ఉన్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఛానల్‌లో పనిచేసే ఓ న్యూస్‌ రీడర్‌కు విలాసవంత భవనం అందజేసి ఆమెను ఆశ్చర్యపరిచారు. దేశ అధికారిక మీడియా 'కొరియన్‌ సెంట్రల్‌ టెలివిజన్‌ (కేసీటీవీ)'లో దశాబ్దాలుగా పనిచేస్తున్న 79 ఏళ్ల రీ చున్‌ హైకి ఓ బంగ్లా గిఫ్ట్‌గా ఇచ్చారు. 1970 ప్రారంభంలో కిమ్‌ ఇల్‌ సంగ్‌ హయాంలో విధుల్లో చేరిన ఆమె గత 50 ఏళ్లకు పైగా ప్రభుత్వ ప్రసారాలకు గొంతుకగా పనిచేస్తున్నారు. ఈ మధ్య కాలంలో దేశాధినేతలకు సంబంధించిన వ్యవహారాలు, అణు, క్షిపణి పరీక్షలు తదితర ప్రధాన సంఘటనలను తన ఉద్వేగభరిత స్వరంతో ప్రజల వద్దకు చేరవేశారు. క్రమంగా దేశ వార్తాప్రసారాలకు ముఖచిత్రంగా ఆమె మారారు. కొరియా సంప్రదాయ వస్త్రధారణలో ఉండే రీచున్‌కు పింక్‌ లేడీగా కూడా గుర్తింపు ఉంది.

ప్యోంగ్యాంగ్‌లో కొత్తగా నిర్మించిన రెసిడెన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఇంటి ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కిమ్‌ కూడా హాజరయ్యారు. రీచున్‌తో కలిసి ఇల్లంతా కలియదిరిగారు. మెట్లు ఎక్కేటప్పుడు, దిగే సమయంలో ఆమెకు అసౌకర్యం కలగకుండా చెయ్యి పట్టుకుని నడిపించారు. ఆరోగ్యంగా ఉండాలని, తన వర్కర్స్ పార్టీ పాలనాస్వరాన్ని గట్టిగా వినిపించాలని కిమ్‌ ఆమెను కోరినట్లు సమాచారం. ఆమె సైతం తన కొత్త ఇల్లు ఒక హోటల్‌లా ఉందని భావించారని, పార్టీ పట్ల కృతజ్ఞతతో ఆమె కుటుంబ సభ్యులందరూ రాత్రంతా మేల్కొని ఉన్నారని న్యూస్‌ ఏజెన్సీలు తెలిపాయి. రీ చున్‌ సేవలకు గుర్తింపుగానే ఆమెకు విలాసవంతమైన భవనాన్ని కిమ్‌ గిఫ్ట్‌గా ఇచ్చారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే రీ చున్‌కు అధికార పార్టీ రుణపడి ఉంటుందని, ఆమె ఆరోగ్యంగా ఉంటూ పార్టీ కోసం ఇదే ఉత్సాహంతో పనిచేస్తారని ఆశిస్తున్నానని అన్నారు కిమ్. రీ చున్‌తో పాటు పార్టీ కోసం పనిచేస్తున్న దాదాపు 10వేల మందికి కిమ్‌ విలాసవంతమైన ఇళ్లను కానుకగా అందజేసినట్టు తెలుస్తోంది. కిమ్‌ ఉదారతకు తన కుటుంబ సభ్యులు రాత్రంతా ఏడుస్తూనే ఉన్నారని ఉద్వేగంగా తెలిపారు రీ చున్‌. కరోనా మహమ్మారి కష్టాలు, దౌత్య ప్రతిష్టంభనలతో దేశం సతమతమవుతోన్న వే ప్రజల నుంచి మద్దతు కూడగట్టేందుకు కిమ్‌ ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే ఈ ఖరీదైన బహుమతిని రీ చున్‌కు అందజేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. రీ చున్ హై ఇందుకు స్పష్టమైన ఉదాహరణని ఆమె కిమ్‌ అణు, క్షిపణి పరీక్షలను బలంగా ప్రచారం చేశారని తెలిపారు.

కిమ్‌ సోదరి కిమ్‌ యో జోంగ్‌ కూడా అన్నకు తగ్గ చెల్లెలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రత్యర్థులను బెదిరించడంలో కిమ్‌ కంటే నాలుగు ఆకులు ఎక్కువే చదివారామె. దానికి ఉదాహరణ లేకపోలేదు. తాజాగా పొరుగుదేశం దక్షిణ కొరియాకు స్ట్రాంట్‌ వార్నింగ్‌ ఇచ్చారు కిమ్‌ సోదరి కిమ్ యో జోంగ్. ముందస్తు దాడులకు దిగితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని, అణ్వాయుధాలతో దాడిచేసి దక్షిణ కొరియా సైన్యాన్ని సమూలంగా నాశనం చేస్తామని ఆమె హెచ్చరించారు. అయితే.. కిమ్‌ సోదరి ఆగ్రహానికి దక్షిణ కొరియా వ్యాఖ్యలే కారణంగా తెలుస్తోంది. తమ అమ్ములపొదిలో అనేక క్షిపణులు ఉన్నాయని, ఉత్తర కొరియాలో ఏ మూలకైనా అవి చేరుకోగలవని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు, వాటి గురితప్పే ప్రశ్నే ఉండబోదని తెలిపింది.

దీంతో దక్షిణ కొరియాకు గట్టి కౌంటర్‌ ఇచ్చారు కిమ్‌ యో జోంగ్‌. రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని మండిపడ్డారు. సాహసాలు చేయాలన్న ఆలోచనను దక్షిణ కొరియా కట్టిబెడితే మంచిదని హితవు పలికారు. ఇలాంటి దుందుడుకు వ్యాఖ్యలు ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత దెబ్బతీస్తాయని స్పష్టం చేశారు. ఇలాంటి ప్రకటనలు చేసేముందు ఓసారి ఆలోచించుకోవాలని సూచించారు. అణుశక్తికి వ్యతిరేకంగా ముందస్తు దాడుల గురించి 'పిచ్చి' సుహ్ చర్చించడం 'చాలా పెద్ద తప్పు' అని కిమ్ యో జోంగ్ వ్యాఖ్యానించారు. తమ అణ్వాయుధ దళాల ప్రాథమిక లక్ష్యం ఒక నిరోధకంగానే పనిచేస్తాయని, యుద్ధమే వస్తే అటువంటి ఆయుధాలను శత్రు నిర్మూలనకు వినియోగిస్తామన్నారు. ఈ భయంకరమైన దాడి ఫలితంగా దక్షిణ కొరియా సైన్యం పూర్తిగా విధ్వంసం, వినాశనం కంటే దయనీయమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందని దక్షిణ కొరియాను హెచ్చరించారు కిమ్‌ సోదరి కిమ్‌ యో జోంగ్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories