Khalil al-Hayya: ఇజ్రాయెల్‌ చేతిలో చనిపోయిన హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ స్థానంలో కొత్త చీఫ్

Khalil al-Hayya: ఇజ్రాయెల్‌ చేతిలో చనిపోయిన హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ స్థానంలో కొత్త చీఫ్
x
Highlights

Who is Khalil al-Hayya: హమాస్‌కి కొత్త చీఫ్ వచ్చారు. ఇప్పటివరకు హమాస్‌ని ముందుండి నడిపించిన యాహ్యా సిన్వార్ ఇజ్రాయెల్ చేతిలో హతమయ్యారు. దీంతో హమాస్‌లో...

Who is Khalil al-Hayya: హమాస్‌కి కొత్త చీఫ్ వచ్చారు. ఇప్పటివరకు హమాస్‌ని ముందుండి నడిపించిన యాహ్యా సిన్వార్ ఇజ్రాయెల్ చేతిలో హతమయ్యారు. దీంతో హమాస్‌లో మరో కీలక వ్యక్తిగా పేరున్న ఖలీల్ అల్ హయ హమాస్ కొత్త బాస్‌గా నియమితులయ్యారు. హమాస్ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న తరువాత ఖలీల్ అల్ హయ తన ప్రకటనను విడుదల చేస్తూ... ఇజ్రాయెల్ చేతిలో హత్యకు గురైన యాహ్యా సిన్వార్‌ని ఆకాశానికెత్తారు.

సిన్వార్ తన జీవితం మొత్తాన్ని పాలస్తినా స్వేచ్ఛ కోసమే త్యాగం చేశారని గుర్తుచేసుకున్నారు. ఆయన తన తుదిశ్వాస వరకు దేశం కోసమే పోరాడారన్నారు . పాలస్తినా గడ్డ కోసం పోరాడిన సిన్వార్, ఎప్పటికీ అమరుడిగా నిలిచిపోతారని ఖలీల్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

యువకుడిగా ఉన్నప్పటి నుండి ఇజ్రాయెల్‌లో జైల్లో ఉన్నప్పుడు కూడా యాహ్యా సిన్వార్ తన పోరాటాన్ని ఎప్పుడూ ఆపలేదని ఖలీల్ స్మరించుకున్నారు. ఇజ్రాయెల్ జైలు నుండి విడుదలయ్యాక మరింత చురుకుగా పనిచేశారని అభిప్రాయపడ్డారు. జెరుసలేం రాజధానిగా పాలస్తీనా తన మొత్తం భూభాగాన్ని స్వాధీనం చేసుకునే వరకు తమ పోరాటం ఆగదని, అప్పటివరకు బందీలను విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఖలీల్ స్పష్టంచేశారు.

ఎవరీ ఖలీల్ అల్ హయ?

ఖలీల్ అల్ హయ విషయానికొస్తే.. అతడు ప్రస్తుతం కతార్‌లో ఉంటున్నాడు. 2007 లో పాలస్తీనాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఖలీల్ కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయింది. తన కుటుంబం మొత్తాన్ని ఇజ్రాయెల్ దాడిలో కోల్పోయినప్పటికీ ఖలీల్ వైఖరి మాత్రం మిగతా వారి కంటే కొంత భిన్నంగా ఉండేది. ఎందుకంటే.. హమాస్‌లో మిగతా కమాండర్స్ అందరూ ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందానికి మొగ్గు చూపని సమయంలోనూ ఖలీల్ ఆ చొరవ తీసుకున్నారు.

2014 లో హమాస్ - ఇజ్రాయెల్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో అతడి పాత్రే కీలకం. ఆవేశంతో ఊగిపోయే రకం కాకుండా ప్రాక్టికల్‌గా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే మనిషిగా ఖలీల్‌కి పేరుంది.

దౌత్యపరమైన సంప్రదింపుల్లో ఖలీల్ దిట్ట. అంతర్జాతీయ స్థాయిలో మధ్యవర్తిత్వం చేసేవారితోనూ సత్సంబంధాలున్న వ్యక్తిగా ఖలీల్ పేరు చెబుతుంటారు. అందుకే ఒకవేళ ఇజ్రాయెల్‌తో మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలన్నా.. లేదంటే రెండు దేశాల మధ్య శాంతిస్థాపన దిశగా ఏదైనా ముందడుగు వేయాలన్నా, అందుకు ఖలీల్ కరెక్ట్ పర్సన్ అనే అభిప్రాయం వ్యక్తమైంది. కాకపోతే ఖలీల్ కూడా వచ్చీ రావడంతోనే హమాస్ వైఖరేంటో గట్టిగానే బల్లగుద్దీ మరీ చెప్పారు.

ఇజ్రాయెల్ తమ డిమాండ్లను ఒప్పుకునే వరకు తమ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ వాసులను విడిచిపెట్టేది లేదన్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని ఖలీల్ తేల్చిచెప్పేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories