ట్రంప్ ను ఇబ్బందుల్లోకి నెడుతున్న జో బైడెన్.. ఇంతకీ ఏం చేస్తున్నాడంటే?

Joe Biden Pushing Donald Trump Into Chaos
x

ట్రంప్ ను ఇబ్బందుల్లోకి నెడుతున్న జో బైడెన్.. ఇంతకీ ఏం చేస్తున్నాడంటే?

Highlights

Joe Biden vs Donald Trump: మరో వారంలో ఆయన అధికారం నుంచి తప్పుకోవాలి .. ఈ సమయంలో దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోని తదుపరి పాలకునికి అధికార బదిలీ కోసం సహకరించాలి.

Joe Biden vs Donald Trump: మరో వారంలో ఆయన అధికారం నుంచి తప్పుకోవాలి .. ఈ సమయంలో దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోని తదుపరి పాలకునికి అధికార బదిలీ కోసం సహకరించాలి. కానీ ఇందుకు పూర్తిగా విరుద్దంగా ప్రవర్తిస్తున్నారు జో బైడెన్. కాబోయే అధ్యక్షునికి వీలైనన్ని ఇబ్బందులు సృష్టించే పనిలో పడ్డారు. అధికార బదిలీని క్లిష్టతరం చేసేలా ఉన్న బైడెన్ వివాదాస్పద నిర్ణయాలను తప్పుపడుతున్నారు ట్రంప్. తాను అధికారం చేపట్టగానే వీటన్నింటినీ తిరగదోడతానని స్పష్టం చేశారు.. డొనాల్డ్‌ ట్రంప్ జనవరి 20వ తేదీన అమెరికా నూతన అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో జోబైడెన్ ఎందుకు ఇలాంటి వివాదాస్పా నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్నది చర్చనీయంశంగా మారింది.

అగ్రరాజ్యంలో అధికార బదిలీకి సమయం దగ్గర పడింది. గత ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్నారు. జనవరి 20వ తేదీన జరగనున్న అధికార బదిలీ కోసం అమెరికాతో పాటు ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఏ ప్రజాస్వామ్య దేశాల్లో అయినా ఎన్నికలు, జరగడం, ప్రజల మద్దతు పొందిన రాజకీయ పార్టీకి చెందిన నాయకులు ప్రభుత్వ పగ్గాలను స్వీకరించడం సర్వసాధారణం. అయితే అగ్రరాజ్యంలో జరిగే ఈ తతంగం మాత్రం అంత సులభంగా పూర్తి కాదు. ఇదొక సుదీర్ఘమైన ప్రక్రియ. ఏకంగా రెండు నెలల సమయం పడుతుంది. ఎన్నికల్లో గెలిచిన అధ్యక్షుడు పాలనా పగ్గాలను చేపట్టేందుకు ఈ నిరీక్షణ కాలం తప్పదు. ఈలోగా అధికారులు అధికార బదిలీ ప్రక్రియ కోసం సన్నాహాలు చేస్తుంటారు. ప్రస్తుతం అమెరికాలో ఇదే పని కొనసాగుతోంది. అయితే ప్రస్తుత అధ్యక్షుడు జోబైడెన్ తీసుకుంటున్న నిర్ణయాలు అధికారం కోసం నిరీక్షిస్తున్న డొనాల్డ్ ట్రంప్‌కు ఏమాత్రం మింగుడు పడటం లేదు.

రాబోయే అధ్యక్షునికి అధికార బదిలీ చేసేందుకు ప్రస్తుత అధ్యక్షుడు సహకారం అందించడం మంచి సాంప్రదాయం. శతాబ్దాలుగా అమెరికాలో ఈ సాంప్రదాయం వారసత్వంగా వస్తోంది. ఈ విషయంలో ప్రస్తుత అధ్యక్షుడు, కాబోయే అధ్యక్షునికి సంబంధించిన బృందాలు పరస్పరం సహకరించుకుంటాయి. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. అధికార బదిలీ ప్రక్రియ అంత సులభంగా పూర్తి కావడం జో బైడెన్‌కు ఏమాత్రం ఇష్టం లేనట్లే కనిపిస్తోంది. తన పాలనా కాల చివరి రోజుల్లో ఆయన తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. రాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనను సజావుగా సాగించడానికి అవకాశం లేకుండా అన్ని రకాల చిక్కుముడులనూ సృష్టిస్తున్నారు. జోబైడెన్ గత నెల రోజులుగా తీసుకుంటున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదంగా మారిపోయాయి.

వైట్‌హౌస్‌లో కొత్త అధ్యక్షుడు అడుగుపెట్టాక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేయడం సహజం. అయితే ట్రంప్‌ కార్యవర్గం ఇటీవలి కాలంలో ఎన్నడూ చూడని స్థాయిలో వీటిని జారీ చేయనుంది. అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే ఏకంగా 100 ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. బైడెన్‌ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల్లో చాలా వాటిని ట్రంప్‌ వెనక్కి తీసుకొనే అవకాశాలున్నాయి. ఈ ఆర్డర్లలో అమెరికా-మెక్సికో సరిహద్దును కట్టడి చేయడం, క్యాపిటల్ హిల్స్ అల్లర్ల నిందితులకు క్షమాభిక్ష, ఫెడరల్‌ షెడ్యూల్‌ ఎఫ్‌లో ఉద్యోగుల నిబంధనలు మార్చడం, స్కూల్‌ జెండర్‌ పాలసీలు, టీకాలపై నిర్ణయం వంటివి ఉన్నాయి. ట్రంప్‌ సహచరులు ఇప్పటికే వీటని తయారు చేసేపనిలో నిమగ్నమయ్యారు. ప్రమాణ స్వీకారం రోజునే వీటన్నింటిపై ఆయన ఆదేశాలు జారీ చేసేలా నిర్ణయం తీసుకోనున్నారు. క్యాపిటల్‌ హిల్‌లో జరిగిన ఓ సమావేశంలో ట్రంప్‌ తన పార్టీ సెనెటర్లకు ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది.

మరోవైపు కొత్త అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ తీసుకోబోయే నిర్ణయాలను గ్రహించిన ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ముందుగానే వీటిని అడ్డుకునే ప్రయత్నాలు ఇప్పటికే మొదలు పెట్టారు. ముఖ్యంగా శిలాజ ఇంధన ఉత్పత్తిని పెంచాలన్న ట్రంప్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా.. గ్యాస్‌, చమురు డ్రిల్లింగ్‌ పనులు ముందుకు వెళ్లకుండా 75 ఏళ్ల నాటి 1953 ఔటర్‌ కాంటినెంటల్‌ షెల్ఫ్‌ ల్యాండ్‌ యాక్ట్‌ తెర మీదుక తెచ్చారు. అమెరికా సముద్ర జలాల్లో దాదాపు 62 కోట్ల ఎకరాల ప్రదేశాన్ని ఆయిల్‌, గ్యాస్‌ డ్రిల్లింగ్‌ నుంచి కాపాడేందుకు దీనిని వాడనున్నారు. చమురు, గ్యాస్‌ డ్రిల్లింగ్‌ నుంచి ఔటర్‌ కాంటినెంటల్‌ షెల్ఫ్‌ను పూర్తిగా మినహాయించే అధికారం అధ్యక్షుడికి లభిస్తుంది. తూర్పు, పశ్చిమతీరాలు, తూర్పు గల్ఫ్‌ మెక్సికో, అలాస్కాలోని ఉత్తర బేరింగ్‌ సముద్రం వంటివి వీటి కిందకు వస్తాయి. బైడెన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆపాలంటే కొత్తగా అధికారం చేపట్టబోయే ట్రంప్ మళ్లీ కాంగ్రెస్‌ ఆమోదం పొందాల్సి ఉంటుంది.

గత నెల అమెరికా చరిత్రలో తొలిసారిగా ఒకేరోజు 1500 మంది ఖైదీలకు శిక్ష తగ్గించడంతోపాటు, 39 మందికి క్షమాభిక్ష ప్రసాదించారు జోబైడెన్. గతంలో బరాక్‌ ఒబామా పదవీకాలం ముగిసే సమయంలో ఒకేరోజు 330 మంది ఖైదీలకు శిక్ష తగ్గించగా.. ఇప్పటివరకు అదే అత్యధికం. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ఇప్పటి వరకు 122 మందికి శిక్ష తగ్గించగా, మరో 21 మందికి క్షమాభిక్ష పెట్టారు. వీరిలో డ్రగ్స్‌ కేసులో శిక్ష అనుభవిస్తున్న వారితో పాటు స్వలింగ సంపర్కం నిబంధనలు ఉల్లంఘించిన వారే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫెడరల్‌ మరణశిక్షను ఎదుర్కొంటున్న 40 మంది ఖైదీల్లో 37 మందికి జో బైడెన్‌ క్షమాభిక్ష ప్రసాదించారు. పెరోల్‌కు అవకాశం లేని జీవిత ఖైదుగా మార్చడంతో వారికి ఉపశమనం లభించినట్లయింది. ఫెడరల్‌ ఖైదీలకు మరణశిక్షను తగ్గించడాన్ని డొనాల్డ్‌ ట్రంప్ ఖండించారు. తాను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వెంటనే రేపిస్టులు, హంతకులకు మరణశిక్ష అమలుచేస్తానని స్పష్టం చేశారు.

అమెరికా అధ్యక్ష హోదాలో దోషులకు, శిక్ష అనుభవిస్తున్నవారికి క్షమాభిక్ష పెట్టే అధికారం ఉంటుంది. అయితే జో బైడెన్ అక్రమ ఆయుధ కొనుగోళ్ల కేసులో దోషిగా తేలిన తన కుమారుడు హంటర్ బైడెన్‌కు.. క్షమాభిక్ష ప్రసాదిస్తూ సంచలన నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. రాజకీయ కుట్రలో భాగంగానే హంటర్‌పై కేసులు పెట్టారని తెలిపారు బైడెన్. అందుకే అతడికి క్షమాభిక్ష ప్రసాదించాలని నిర్ణయించుకున్నానని.. ఒక తండ్రిగా, అధ్యక్షుడిగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో అమెరికా ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నా అని పేర్కొన్నారు బైడెన్. అయితే ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. ఇది పూర్తిగా న్యాయవిరుద్ధమని, అధికార దుర్వినియోగమని మండిపడ్డారు. హంటర్‌కు క్షమాభిక్ష ప్రసాదించినట్లే క్యాపిటల్ హిల్స్ అల్లర్ల కేసులో బందీలుగా ఏళ్లుగా జైళ్లలో మగ్గుతున్న వారికి ఎందుకు ఉపశమనం కల్పించలేదని ప్రశ్నించారు ట్రంప్.

అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రమాణస్వీకారం చేసే రోజు దగ్గరపడేకొద్దీ.. బైడెన్‌ సర్కారు రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌కు మరింత సాయాన్ని వేగవంతం చేస్తోంది. కొద్ది రోజుల క్రితమే ఆయుధ సహాయం కోసం 500 మిలియన్ డాలర్ల విలువైన కొత్త ప్యాకేజీ ని ఇస్తామని తెలిపింది. యుద్ధం మొదలైన 2022 నుంచి ఉక్రెయిన్‌కు ఇప్పటివరకు 62 బిలియన్‌ డాలర్ల విలువైన ఆయుధాలను, ఇతర సాయాన్ని అందించింది అమెరికా.

తాను అధికారంలోకి వస్తే రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ముగిస్తానని.. మూడో ప్రపంచయుద్ధం రాకుండా చర్యలు తీసుకుంటానని ట్రంప్‌ పలుమార్లు పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో రష్యాను రెచ్చగొట్టేలా ఆయుధ సంపత్తికి నిధులు సమకూరుస్తుండటంపై రిపబ్లికన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కాగా అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తమవైపే ఉన్నారన్నారుని ఆశాభావం వ్యక్తం చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.

ట్రంప్‌ అధ్యక్షునిగా పగ్గాలు చేపట్టే ఘడియ దగ్గరపడుతున్న కీలక దశలో జో బైడెన్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యా ఇంధన రంగంపై తమ ఆంక్షల్ని ఉల్లంఘిస్తూ, ఆ దేశం నుంచి ఇంధనాన్ని రవాణా చేసుకుంటున్న 200కు పెగా సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలు విధించింది. అందులో భారత్‌కు చెందిన స్కైహార్ట్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్, ఏవియేషన్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ అనే రెండు కంపెనీలు కూడా ఉన్నాయి. రష్యా ఆర్థిక రంగానికి చోదక శక్తిలా పనిచేస్తున్న చమురు సహజవాయు రంగంపై విధించిన ఈ కొత్త ఆంక్షలు ఇప్పటిదాకా అమలు పరచిన ఆంక్షలన్నిటి కన్నా కీలకమైనవి. అమెరికా విధించిన ఆంక్షలు ఊహించినవేనని రష్యా ప్రభుత్వం పేర్కొంది. ట్రంప్‌ యంత్రాంగానికి ఇబ్బందులు కల్పించేందుకే బైడెన్‌ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని మాకు ముందే తెలుసు అని రష్యా అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు.

ప్రస్తుత అధ్యక్షుడు జోబైడెన్ తీసుకుంటున్న నిర్ణయాలపై గుర్రుగా ఉన్నారు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. జో బైడెన్‌ తన చివరి సమయంలో తీసుకున్న అధికారిక నిర్ణయాలు, చర్యలతో పరిపాలనను, అధికార బదిలీని కష్టతరం చేశారని ట్రంప్ ఆరోపించారు. తాను అధికారం స్వీకరించడానికి ముందే ఎన్ని కష్టతరమైన మార్పులు సాధ్యమో అన్నీ చేస్తున్నారని మండిపడ్డారు. న్యాయవ్యవస్థలో ఇలా జరగడం మునుపెన్నడూ చూడలేదని పేర్కొన్నారు. ఖరీదైన, అర్థంలేని పరిపాలనా ఉత్తర్వులు ఇచ్చి గ్రీన్‌ న్యూ స్కామ్‌, ఇతర రకాలుగా డబ్బును వృథా చేస్తున్నారని మండిపడ్డారు. అయితే ఈ ఉత్తర్వుల విషయంలో అమెరికా ప్రజలు భయపడాల్సిన పనిలేదని, తాను అధికారం చేపట్టగానే వాటిని తొలగిస్తానన్నారు. తన పరిపాలనలో అమెరికాను మరింత శక్తివంతమైన దేశంగా నిలబెడతానన్నారు. బైడెన్ తీసుకుంటున్న నిర్ణయాలను ట్రంప్ పార్టీ రిపబ్లికన్‌కు చెందిన నాయకులు కూడా తప్పుపడుతున్నారు. కొత్తగా అధికారంలోకి రాబోతున్న ట్రంప్‌నకు అడ్డుపుల్ల వేసే మాదిరిగా తన పదవీకాలం చివరి రోజుల్లో నిర్ణయాలు తీసుకుంటున్నట్లు రిపబ్లికన్లు ఆరోపిస్తున్నారు.

ఇటీవలే మరణించిన అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌కు సంతాపంగా 30 రోజుల పాటు జాతీయ జెండాను అవనతం చేయాలని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ ఆదేశించారు. ఈ నిర్ణయాన్ని కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తప్పుబట్టారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ మరణం కారణంగా.. కాబోయే అధ్యక్షుడి ప్రమాణ స్వీకార సమయంలో జెండా అవనతమై ఉండటం బహుశా ఇది మొదటిసారి కావచ్చు. ఎవరూ దీన్ని చూడాలని అనుకోరు. ఈ నిర్ణయంపై ఏ అమెరికన్ సంతోషంగా లేరుఅని సోషల్‌ వేదికగా ట్రంప్‌ రాసుకొచ్చారు. ఇది చాలా గొప్ప విషయంగా వారు భావిస్తున్నారు. ఎందుకంటే వాస్తవంగా వారికి దేశం అంటే ప్రేమ లేదని వ్యాఖ్యానించారు ట్రంప్. మరోవైపు.. జాతీయ జెండా అవనతం విషయంలో తమ నిర్ణయాన్ని పునఃపరిశీలించే ఆలోచన లేదని వైట్‌హౌస్‌ ప్రతినిధి పేర్కొన్నారు.

అయితే 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ వ్యవహరించిన తీరును కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సి ఉంది. నాడు అధ్యక్షునిగా ఉన్న ట్రంప్‌ను ఎన్నికల్లో ఓడించారు జో బైడెన్. అయితే తన ఓటమిని అంగీకరించలేదు. ఎన్నికల్లో మోసాలు జరిగాయని, తానే గెలిచానంటూ మొండికేశారు. ఫలితాలను రిగ్గింగ్‌ ఎన్నికలుగా అభివర్ణించిన ట్రంప్‌.. ఎన్నికల్లో గెలుపొందిన జో బైడెన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అధికార మార్పిడి ప్రక్రియకు సహకరించలేదు. అమెరికా భద్రత, నిఘాకు సంబంధించిన సమాచారాన్ని బైడెన్‌తో పంచుకోవడం లేదు వైట్‌హౌస్‌లో నూతన అధ్యక్షుడు బైడెన్‌కు స్వాగతం పలికే సాంప్రదాయాన్ని కూడా బహిష్కరించారు ట్రంప్. బైడెన్ విజయాన్ని గుర్తించేందుకు సమావేశమై కాపిటల్ హిల్స్‌లోని అమెరికా చ‌ట్టసభపై ట్రంప్ అనుచరుల దాడి వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం బైడెన్ వ్యవహార శైలి గతంలో ట్రంప్ తీరుకన్నా మెరుగ్గానే ఉందని సమర్దిస్తున్నారు డొమొక్రాట్ పార్టీ మద్దతుదారులు..

మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ చేతిలో కమలా హారిస్‌ ఓటమిపై జో బైడెన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోటీలో తాను ఉంటే కచ్చితంగా ట్రంప్‌ను ఓడించేవాడినని విశ్వాసం వ్యక్తం చేశారు. డెమోక్రటిక్‌ పార్టీలో ఐక్యత కోసమే పోటీ నుంచి వైదొలిగానని పేర్కొన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ను కమలా హారిస్‌ ఓడించగలదని అనుకున్నానని తెలిపారు. అమెరికా రాజకీయాల్లో కనిపిస్తున్న విభజనకు స్వస్తి పలకడానికే అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకొన్నానని తెలిపారు బైడెన్. అధ్యక్ష పదవి నుంచి దిగిపోయినా తాను రాజకీయాల నుంచి వైదొలగబోనని స్పష్టం చేశారు. ప్రజా జీవితంలో కొనసాగుతానని తేల్చి చెప్పారు బైడెన్. సాధారణంగా అమెరికా అధ్యక్షులుగా పని చేసినవారు పదవి నుంచి వైదొలగగానే ప్రజా జీవితానికి దూరంగా ఉంటారు. కానీ బైడెన్‌ తాను అలా చేయనని చెబుతున్నారు. అయితే ఏ రూపంలో ఆయన కొనసాగుతారో స్పష్టం చేయలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories