Hezbollah vs Israel: ఇజ్రాయెల్‌పై 250 రాకెట్స్ ప్రయోగించిన హెజ్బొల్లా.. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్

Hezbollah vs Israel
x

Hezbollah vs Israel

Highlights

Hezbollah fired 250 Rockets at Israel: ఇజ్రాయెల్, హోజ్బొల్లా మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఇజ్రాయెల్, గాజా మధ్య బాంబుల మోత మోగుతోంది.

Hezbollah fired 250 Rockets at Israel: ఇజ్రాయెల్, హోజ్బొల్లా మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఇజ్రాయెల్, గాజా మధ్య బాంబుల మోత మోగుతోంది. తాజాగా హోజ్బొల్లా మిలిటెంట్ సంస్థ ఇజ్రాయెల్‌పై రాకెట్స్ వర్షం కురిపించింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250 రాకెట్స్‌ను ఇజ్రాయెల్‌పైకి ఎక్కుపెట్టింది. హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ చరిత్రలో ఇదొక అతిపెద్ద దాడిగా ఆ సంస్థ ప్రకటించింది. ఇంతకీ హెజ్బొల్లాకు ఎందుకంత కోపమొచ్చింది? ఏ కారణంతో ఇజ్రాయెల్ లాంటి శక్తివంతమైన దేశం మీద హెజ్బొల్లా 250 రాకెట్స్ గురిపెట్టింది? హెజ్బొల్లాకు అంత సాహసం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనేది నేటి ట్రెండింగ్ స్టోరీలో చూద్దాం.

హెజ్బొల్లాను చావు దెబ్బ కొట్టే యత్నం

ఇప్పటికే లెబనాన్‌ భూభాగంలోకి చొచ్చుకుపోయిన ఇజ్రాయెల్.. అక్కడ వరుస దాడులతో హమాస్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టింది. హమాస్ అనుబంధ సంస్థ అయిన హెజ్బొల్లాను కూడా అంతమొందించేందుకు ఇజ్రాయెల్ కంకణం కట్టుకున్నట్లు యుద్ధం చేస్తోంది. అందులో భాగంగానే హెజ్బొల్లా మిలిటెంట్స్‌కు గట్టి పట్టున్న దక్షిణ బేరూట్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో డజన్ల కొద్ది పౌరులు చనిపోయారు. భారీ అంతస్తుల భవనాలు నేలకూలాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి సంఖ్య ఎంతో కూడా కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. హెజ్బొల్లాకు స్థావరాలు లేకుండా చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

బుసలు కొట్టిన హెజ్బొల్లా

ఇజ్రాయెల్ చేసిన ఈ దాడికి హెజ్బొల్లా ప్రతీకారంతో రగిలిపోయింది. ఇక సమయం వృథా చేసి లాభం లేదనే నిర్ణయానికొచ్చిన హెజ్బొల్లా మిలిటెంట్స్... ఈసారి గోడౌన్లోంచి రాకెట్స్ బయటికి తీశారు. ఒకదాని తరువాత మరొకటి అన్నట్లు ఏకకాలంలో ఇజ్రాయెల్‌లోని నాలుగు లక్ష్యాలను టార్గెట్ చేస్తూ 250 రాకెట్స్‌ను ప్రయోగించారు. దక్షిణ ఇజ్రాయెల్‌లోని ఆష్దాదా నేవల్ బేస్ లక్ష్యంగా హెజ్బొల్లా ఈ మిస్సైల్స్ దాడి జరిపింది. వెంటనే టెల్ అవివ్‌లోని మిలిటరీ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని అడ్వాన్స్‌డ్ రాకెట్స్ ప్రయోగించింది. అదే సమయంలో నగరానికి మరో వైపున ఉన్న గ్లిలాట్ ఆర్మీ ఇంటెలీజెన్స్ స్థావరంపై కూడా రాకెట్స్ గురిపెట్టింది.

హెజ్బొల్లా వైపు నుండి 250 రాకెట్స్ దాడి జరిగినట్లుగా ఇజ్రాయెల్ డిఫెన్స్ వర్గాలు కూడా అంగీకరించాయి. హెజ్బొల్లా చేసిన మిస్సైల్స్ దాడుల్లో ఇదే అతిపెద్ద దాడిగా ఇజ్రాయెల్ రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. హెజ్బొల్లా ప్రయోగించిన రాకెట్స్‌లో కొన్నింటిని ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ విజయవంతంగా తిప్పికొట్టింది. ఇంకొన్ని రాకెట్స్ సెంట్రల్ ఇజ్రాయెల్‌పై పడ్డాయి. ఈ రాకెట్స్ ఎటాక్‌లో కొన్ని ఇళ్లు ధ్వంసమైనట్లుగా అసోసియేటెడ్ ప్రాన్స్ ప్రెస్ వెల్లడించింది. ఇంకొన్ని రాకెట్స్ ఏకంగా ఇజ్రాయెల్‌కి అతి ముఖ్యమైన టెల్ అవీవ్ నగరం వరకు చేరుకున్నాయని ఆ వార్తా సంస్థ తెలిపింది. ఇక్కడ కూడా రాకెట్స్ దాడిలో కొన్ని భవనాలు శిథిలమైనట్లు తెలుస్తోంది. ఏడుగురు గాయపడినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ వర్గాలు చెబుతున్నాయి.

కాల్పుల విరమణకు ముందుకొచ్చిన బెంజమిన్

తాజా దాడులకంటే కొద్ది రోజుల ముందే హెజ్బొల్లా వైపు నుండి ఇజ్రాయెల్‌కు కాల్పుల విరమణకు ఒక ప్రతిపాదన వెళ్లింది. కానీ ఇజ్రాయెల్ అప్పుడు ఆ ప్రతిపాదనను లైట్ తీసుకుంది. అయితే, ఇటీవలే నెదర్లాండ్స్‌లోని ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అరెస్ట్ వారెంట్ జారీచేసింది. ఇజ్రాయెల్ మాజీ డిఫెన్స్ చీఫ్ గల్లంట్ యోవ్‌కు కూడా ఈ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. యుద్ధం పేరుతో లెబనాన్ గడ్డపై బెంజమిన్ నెతన్యాహు, గల్లంట్ సాగించిన మారణకాండను ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు తప్పుపట్టింది. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు చేసిన ఈ వ్యాఖ్యలతో ప్రపంచ దేశాల ముందు నెతన్యాహు ఒక దోషిలా నిలబడాల్సి వచ్చింది.

హెజ్బొల్లా ప్రయోగించిన 250 రాకెట్స్ దాడి తరువాత తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని కాల్పుల విరమణ ఒప్పందానికి సూత్ర ప్రాయంగా అంగీకరించినట్లు సీఎన్ఎన్ తెలిపింది. అయితే, ఈ కాల్పుల విరమణకు కొన్ని షరతులు విధించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పటికే ఇజ్రాయెల్ తమ ఆధీనంలోకి తీసుకున్న భూభాగాన్ని తిరిగి ఇచ్చేందుకు బెంజమిన్ నో చెప్పినట్లు తెలుస్తోంది.

అరెస్ట్ వారెంట్ కాదు.. మరణ శిక్ష వేయాలి

ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు వ్యాఖ్యలపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమెనీ స్పందించారు. "ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేసిన నేరాలకు అరెస్ట్ వారెంట్ ఇవ్వడం కాదు.. ఆయనకి మరణ శిక్ష విధించాలి" అని ఖమెనీ డిమాండ్ చేశారు. ఇన్నేళ్లపాటు బెంజమిన్ చేసింది యుద్ధం కాదు.. యుద్ధం పేరుతో నేరాలకు పాల్పడ్డారు. అందుకే ఆయనకు అరెస్ట్ వారెంట్ సరిపోదు అని ఖమేనీ వ్యాఖ్యానించారు.

1975-90 మధ్య కాలంలో ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య సివిల్ వార్ జరిగింది. అప్పటి నుండి జరిగిన అనేక దాడుల్లో ఇజ్రాయెల్ వైపు కంటే లెబనాన్ వైపే ఎక్కువ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించిందని న్యూస్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇదే విషయమై లెబనాన్ ఆరోగ్య శాఖ మంత్రి డా ఫిరజ అబియాద్ మాట్లాడుతూ ఇజ్రాయెల్‌తో యుద్ధం మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు 40 వేలకు పైగా జనం మృతి చెందినట్లు తెలిపారు. మరి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు జోక్యంతో ఈ వార్‌కు తెరపడుతుందా? హెజ్బొల్లా ప్రతిఘటించిన తీరు బెంజమిన్‌లో మార్పు తెస్తుందా? ఏళ్ల తరబడిగా లెబనాన్ గడ్డపై బిక్కుబిక్కుమంటూ రోజులు వెళ్లదీస్తోన్న జనాలకు, పాలస్తినా శరణార్ధులకు స్వేచ్ఛా వాయువు దొరుకుతుందా అంటే కాలమే సమాధానం చెప్పాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories