India-Canada Ties: కెనడా ఎన్నికల్లో ట్రూడో వ్యాఖ్యలతో దుమారం... సీరియస్‌గా రియాక్టయిన భారత్
India-Canada Ties: కెనడా మళ్ళీ భారతదేశంపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. భారత్ కూడా అంతే తీవ్రంగా తన రియాక్షన్ చూపించింది. కెనడాలో ఎన్నికలు జరుగుతున్న వేళ...
India-Canada Ties: కెనడా మళ్ళీ భారతదేశంపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. భారత్ కూడా అంతే తీవ్రంగా తన రియాక్షన్ చూపించింది. కెనడాలో ఎన్నికలు జరుగుతున్న వేళ సిక్కుల మద్దతు కోసం ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రమాదకర వ్యూహాలకు పాల్పడుతున్నారని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఖలిస్థానీ ఉద్యమాలకు మద్దతు ఇస్తూ భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందనే ఆరోపణలు ఇప్పటికే కెనడా మీద ఉన్నాయి. దేశంలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ట్రూడో ఈసారి ఏకంగా భారత్‌నే దోషిగా చూపించే ప్రయత్నం చేయడం పాత వివాదాన్నే మళ్ళీ కొత్తగా రాజేసింది. ఖలిస్తాన్ ‘ఉగ్రవాది’ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు దర్యాప్తు చేస్తున్న కెనడా, ఈ హత్యలో భారత హై కమిషనర్ సంజయ్ వర్మ సహా ఆరుగురు దౌత్యవేత్తలకు ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు చేసింది. ఇది సహజంగానే భారత ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. భారత దౌత్యవేత్తలపై అనుమానం వ్యక్తంచేయడమంటే నేరుగా భారత్‌పై బురద జల్లడమే అవుతుంది.
అసలు ఈ వివాదం ఎలా మొదలైంది? జస్టిన్ ట్రూడో రాజకీయ లబ్ధి కోసమే ఈ కొత్త వివాదాన్ని సృష్టించారా? అసలు కెనడా – భారత సంబంధాలు ఎలా ఉన్నాయి?
కెనడాలో ఖలిస్తాన్ గొడవేంటి?
ఇప్పటికే గత కొన్నేళ్లుగా భారత్‌కు వ్యతిరేకంగా కెనడాలో ఖలిస్థానీ వేర్పాటువాదానికి మద్ధతు పెరుగుతోంది. భారత దేశానికి, ఇక్కడి ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కెనడాలో తరచుగా ఖలిస్థానీల నిరసన ప్రదర్శనలు కూడా జరుగుతున్నాయి. కెనడాలో నివసించే భారతీయుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తోంది. అందులోనూ పంజాబ్ నుండి వెళ్లిన సిక్కుల సంఖ్య అధికంగా కనిపిస్తోంది. వాళ్లలో కొంతమంది ఇలా ఖలిస్థానీ ఉద్యమం పేరుతో కెనడాలో భారత్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారనే పేరుంది. కానీ వాస్తవానికి అక్కడున్న మిగతా భారతీయులకు, ఈ ఖలిస్థానీ వేర్పాటువాదానికి ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ ఖలిస్థానీ ఉద్యమ నేతలు అక్కడి రాజకీయ నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
ట్రూడో పార్టీతో సిక్కులకు సన్నిహిత సంబంధాలు
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకి చెందిన లిబరల్ పార్టీతో అక్కడి సిక్కులకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే అభిప్రాయం ఉంది. ఒక రకంగా కెనడాలో స్థిరపడిన సిక్కుల ఓట్లు అక్కడి రాజకీయ నాయకులకు భారీ ఓటు బ్యాంకుగా మారాయి. ప్రత్యేకించి క్యూబెక్ ప్రావిన్స్‌లోని మాంట్రియల్, ఒంటారియో ప్రావిన్స్‌లోని టొరొంటో వంటి కొన్ని ప్రాంతాల్లో వీరి ప్రభావం మరీ అధికంగా ఉంది. ఇక్కడ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల విజయాన్ని డిసైడ్ చేసే స్థాయిలో వారి ఓట్లున్నాయి. అందువల్లే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ ఓటు బ్యాంకుని ఆకర్షించడం కోసం వారికే జై కొడుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కెనడాలో సిక్కులు ఎలా చక్రం తిప్పుతున్నారంటే…
వచ్చే ఏడాది కెనడాలో ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి ప్రధాని అయ్యేందుకు ట్రూడో గట్టిగానే పావులు కదుపుతున్నారు. అది జరగాలంటే అక్కడ బలమైన ఓటు బ్యాంకుని చేరదీయాల్సిన అవసరం ట్రూడోకి అనివార్యమైంది. ట్రూడోకే కాదు.. అక్కడ ఏ పార్టీకైనా ఇప్పుడు సిక్కులను అక్కున చేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందుకు ఓ బలమైన కారణం లేకపోలేదు.
భారత రాజకీయాలతో పోల్చుకుంటే కెనడా రాజకీయాల్లో ఒక భిన్నమైన పద్ధతి ఉంది. కెనడా ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను అక్కడి రాజకీయ పార్టీలు కేవలం తమ ఇష్టానికి సెలెక్ట్ చేయవు. ఎన్నికల్లో నామినేట్ వేయాలంటే ముందుగా ఆ నేతలు అక్కడి ఓటర్ల నుండి మద్ధతు లేఖలు తెచ్చుకోవాల్సి ఉంటుంది. సరిగ్గా ఇదే అంశంపై కెనడాలోని సిక్కులకు వరమైంది. తాము ఎవరికి మద్ధతిస్తే.. వారే అక్కడ అభ్యర్థి అయ్యే అవకాశం కలిగింది. అంటే నామినేషన్ దశలోనే అక్కడి సిక్కులు స్థానిక నేతలను తమ వైపు తిప్పుకుంటున్నారన్నమాట.
ఇక రెండోది మరీ ముఖ్యమైన అంశం. కెనడాలో రాజకీయ పార్టీలకు కార్పోరేట్స్, సంఘాలు ఫైనాన్స్ చేసేందుకు వీల్లేదు. కానీ చారిటీ సంస్థలకు ఆ అవకాశం ఉంది. దాంతో కెనడాలో ఉన్న కొన్ని సిక్కు గురుద్వారాల పేరుతో అక్కడి రాజకీయ నేతలకు భారీ మొత్తంలో డబ్బులిస్తున్నారు. అలా అక్కడి రాజకీయ పార్టీలను సైతం సిక్కులు ప్రభావితం చేస్తున్నారు.
ట్రూడో సర్కారుకి తగ్గుతున్న ఆదరణ
కెనడాలో గత ఏడాది కాలంగా ట్రూడో సర్కారుకు ఆధరణ తగ్గుతోందని అక్కడి రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో జరిగిన పలు ఎన్నికల్లో ఆ పార్టీకి బలం తగ్గుతుండటమే అందుకు కారణంగా చెబుతున్నారు. దానికితోడు పలు ప్రాంతాల్లో సిక్కు ఓటర్లు మెజార్టీ ఓటర్లుగా ఉన్నారు.
అక్కడ రాజకీయ నేతగా ఎదిగిన జగ్‌మీత్ సింగ్ అనే సిక్కు ఏర్పాటు చేసిన న్యూ డెమొక్రటిక్ పార్టీ ట్రూడోకు ఇచ్చిన మద్దతును ఉపసంహరించుకుంది. ఇవన్నీ ట్రూడోకు వచ్చే ఎన్నికల్లో ప్రతికూల పరిణామాలు. అందుకే సొంత దేశంలో విజయం కోసం, సిక్కు ఓట్ల కోసం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్‌తో కయ్యం పెట్టుకోవడానికైనా వెనుకాడటం లేదనేది విశ్లేషకుల మాట.
నిజ్జర్ హత్యతో ట్రూడో రాజకీయం?
కెనడాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత దౌత్యవేత్తలకు రక్షణ కల్పించే విషయంలో ట్రూడో చిత్తశుద్ధిని నమ్మలేమని భారత్ అనుమానం వ్యక్తంచేసింది. అందుకే కెనడాలో ఉన్న భారత హై కమిషనర్ సహా దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించుకుంటున్నట్లు స్పష్టంచేసింది. అదే సమయంలో భారత్‌లో ఉన్న ఆరుగురు దౌత్యవేత్తలను కూడా దేశం విడిచివెళ్లాల్సిందిగా స్పష్టంచేసింది. అదే సమయంలో కెనడా ప్రధాని ట్రూడో కూడా అక్కడున్న భారత దౌత్యవేత్తలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగా క్షీణించాయి.
ఇంతకీ కెనడా గురించి భారత్ ఏమంటోంది?
ఈ మొత్తం క్రమంలో కెనడా గురించి భారత్ వైఖరి చాలా స్పష్టంగా ఉంది. భారత్‌కి వ్యతిరేకంగా భారత గడ్డపై శాంతి భద్రతల సమస్య తలెత్తేలా కెనడాలో జరుగుతున్న ఖలిస్థానీ కుట్రలకు అక్కడి ప్రభుత్వం మద్దతిస్తోందని భారత్ ఆరోపిస్తోంది. ఇప్పుడు కూడా సొంత రాజకీయ ప్రయోజనాల కోసమే భారత్‌పై ట్రూడో సర్కారు ఈ ఆరోపణలు చేస్తోందని భారత విదేశాంగ శాఖ స్పష్టంచేసింది.
అమెరికా మద్ధతు ఎవరికి?
ఇవన్నీ ఇలా ఉండగా.. తాజాగా ఈ అంశంపై అమెరికా కూడా స్పందించింది. కెనడా ప్రభుత్వం చేస్తోన్న ఆరోపణలను భారత్ తీవ్రంగా పరిగణించాలని చెప్పిన అమెరికా.. నిజ్జర్ హత్య కేసు విచారణలో కెనడా సర్కారుకు భారత ప్రభుత్వం సహకరించాలని స్పష్టంచేయడం కొసమెరుపు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire