అణు యుద్ధం వస్తే గెలిచేదెవరు..భారత్, పాక్ లలో ఎవరి సత్తా ఎంత?
మేం ఒక్క అణుబాంబు వేస్తే మీ దేశం మటాష్ మీరు ఒకటేస్తే మేం రెండేస్తాం మీ దేశం స్మాష్ ఒక్కోసారి దేశాల నాయకులు ఇలాంటి వ్యాఖ్యలే చేస్తుంటారు. మరి నిజంగా ఓ...
మేం ఒక్క అణుబాంబు వేస్తే మీ దేశం మటాష్ మీరు ఒకటేస్తే మేం రెండేస్తాం మీ దేశం స్మాష్ ఒక్కోసారి దేశాల నాయకులు ఇలాంటి వ్యాఖ్యలే చేస్తుంటారు. మరి నిజంగా ఓ రెండు దేశాలు పూర్తిస్థాయిలో అణుయుద్ధానికి దిగితే పరిస్థితి ఎలా ఉంటుంది ? అసలు ఒక దేశాన్ని నాశనం చేసేందుకు ఎన్ని అణుబాంబులు కావాలి ? ఏ దేశం వద్ద ఎన్ని అణుబాంబులు ఉన్నాయి ? అక్టోబర్ లో అంతిమయుద్ధం అంటూ పాకిస్థాన్ మంత్రి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఒక్కసారిగా అంతా అణ్వస్త్ర నాలెడ్జ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అదేంటో మనం కూడా చూద్దాం.
రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా జపాన్ పై అమెరికా రెండు అణుబాంబులు వేసే సరికి యుద్ధం ముగిసిపోయింది. అణుబాంబుల శక్తిసామర్థ్యాలు ఎంత పెరిగినా ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదు. రెండు అణ్వస్త్ర దేశాలు గనుక అణు యుద్ధం చేయాలనుకుంటే ఏ ఒకటో, రెండో అణుబాంబులు సరిపోవు. పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఈ ఫిబ్రవరిలో ఈ అంశాన్ని తమ దేశ నాయకులకు, పాక్ మిలిట్రీకి ఎంతో చక్కగా వివరించారు. భారత్ పై పాకిస్థాన్ ఒక్క అణుబాంబును ప్రయోగిస్తే భారత్ 20 అణు బాంబులు వేసి పాకిస్థాన్ ను తుడిచిపెట్టేస్తుందని ఆయన హెచ్చరించారు. అలా పాకిస్థాన్ తుడిచిపెట్టుకుపోకుండా ఉండేందుకు పరిష్కార మార్గాన్ని కూడా ఆయనే సూచించారు. అదేమిటంటే భారత్ ను నాశనం చేయాలంటే పాకిస్థాన్ ఏకకాలంలో 50 అణుబాంబులు భారతీయ నగరాలపై ప్రయోగించాలి. మరి అది సాధ్యమా ? అదీ చూద్దాం.
అమెరికా వద్ద, రష్యా వద్ద పదుల్లో కాదు వందల్లో కాదు వేల సంఖ్యలో అణుబాంబులు ఉన్నాయి. అణు బాంబులు వందో, రెండు వందలో ఉంటే సరిపోదా అనే ప్రశ్న తలెత్తుతుంది. అణు యుద్ధం చేసే స్థాయికి దేశాలు వచ్చాయంటే ఒకదానినొకటి సర్వనాశనం చేసుకునేందుకు సిద్ధపడ్డాయనే అర్థం. సాధారణ స్థాయి అణుబాంబును ఒక నగరంపై ప్రయోగిస్తే అది కనీసం ఆరు లక్షల మందిని హతమారుస్తుంది. ఆ నగరాన్ని నాశనం చేస్తుంది. ఆ లెక్కన నగరాల సంఖ్య ఎక్కువగా ఉంటే జనాభా ఎక్కువగా ఉంటే దేశ విస్తీర్ణం అధికంగా ఉంటే దాన్ని సర్వనాశనం చేసేందుకు వందల సంఖ్యలో అణుబాంబులు అవసరమవుతాయి. ఇలాంటి లెక్కలు వేసుకునే అమెరికా, రష్యాలు వేల సంఖ్యలో అణుబాంబులను రూపొందించుకున్నాయి. తదనంతర కాలంలో బ్రిటన్, ఫ్రాన్స్, చైనా కూడా అదే బాటలో పయనించాయి. అసలు అగ్రరాజ్యాల మధ్య అణ్వస్ర్తాల పోటీ ఎలా ప్రారంభమైందో చూద్దాం.
1945 జులైలో అమెరికా మొదటిసారిగా అణు పరీక్ష నిర్వహించింది. ఆ పరీక్ష నిర్వహించిన మరుసటి నెల ఆగస్టులోనే జపాన్ కు చెందిన హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబులు వేసింది. ఆ చేదు గుర్తులు నేటికీ సజీవంగానే ఉన్నాయి. ఆరంభంలో ఈ రంగంలో అమెరికా గుత్తాధిపత్యమే కొనసాగింది. ఓ నాలుగేళ్ళ తరువాత 1949లో సోవియట్ యూనియన్ తన మొదటి అణు పరీక్ష నిర్వహించింది. 1952 నాటికి బ్రిటన్ కూడా అణుశక్తి సామర్థ్యం సంతరించుకుంది. ఆ తరువాత ఎనిమిదేళ్ళకు ఫ్రాన్ 1960లో అణుబాంబులు తయారు చేయగలిగింది. 1964 నాటికి చైనా కూడా ఈ జాబితాలో చేరిపోయింది. ఇక ఇతర రాజ్యాలేవీ అణుబాంబు సామర్థ్యం పొందకూడదనే ఉద్దేశంతో ఈ ఐదు దేశాలూ 1968లో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని రూపొందించాయి. 1996లో కాంప్రెహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీని కూడా కుదుర్చుకున్నాయి. ఇండియా, ఇజ్రాయెల్, పాకిస్థాన్ ఎన్నడూ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకాలు చేయలేదు. కాలక్రమంలో అవి కూడా అణ్వస్త్ర దేశాలుగా మారాయి. ఇక ఇరాక్ 1991లో జరిగిన గల్ఫ్ యుద్ధానికి ముందు రహస్యంగా అణుబాంబులపై పరిశోధనలు చేసింది. 2003లో ఉత్తర కొరియా అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం నుంచి వైదొలిగింది. అప్పట్లోనే అది అణు పరీక్ష నిర్వహించింది. ఒప్పందం నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఇరాన్, లిబియా లు రహస్యంగా అణు శక్తి సంబంధిత కార్యకలాపాలు చేపట్టాయి. ఇక సిరియా కూడా అదే బాట పట్టినట్లుగా అనుమానాలున్నాయి. ఇదీ స్థూలంగా అణ్వస్త్ర దేశాల కథ. ఏ దేశం వద్ద ఎన్ని బాంబులు ఉన్నాయో చూద్దాం.
ఒక అంచనా ప్రకారం అమెరికా వద్ద 6,185 అణుబాంబులు ఉన్నాయి. రష్యా వద్ద 6, 490 ఉన్నాయి. ప్రపంచంలో వేలల్లో అణుబాంబులు ఉన్నది ఈ రెండు దేశాల వద్దనే. మిగిలిన దేశాల్లో పదుల నుంచి వందల సంఖ్యలోనే అణుబాంబులు ఉన్నాయి. ఫ్రాన్స్ వద్ద 300, బ్రిటన్ వద్ద 200 అణుబాంబులు ఉన్నాయి. చైనా వద్ద 290 అణుబాంబులు ఉన్నాయి. అసలైన అణ్వస్త్ర దేశాలుగా పరిగణించేది వీటినే. మరికొన్ని దేశాల వద్ద కూడా అణుబాంబులు ఉన్నా అధికారికంగా లేనట్లే లెక్క. అంతమాత్రాన అవి అణుదేశాలు కాకుండా పోవు. పాకిస్థాన్ వద్ద 160 దాకా అణుబాంబులు ఉంటే భారత్ వద్ద 140 దాకా ఉన్నట్లు ఒక అంచనా. ఇక ఇజ్రాయెల్ వద్ద 90 వరకు అణుబాంబులు ఉన్నాయి. మరో 200 అణు బాంబులను తయారు చేసుకునే సత్తా కూడా దానికి ఉందని అంచనా. ఉత్తరకొరియా వద్ద 30 దాకా ఉన్నట్లు భావిస్తున్నారు. వీటికి తోడు మరికొన్ని దేశాలు కూడా ఈ జాబితాలో చేరేందుకు ప్రయత్నిస్తున్నాయి. మొత్తం మీద ప్రపంచంలో 14 వేల న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. వీటిలో 90శాతం అమెరికా, రష్యాల వద్దనే ఉన్నాయి. కొంతలో కొంత ఊరటనిచ్చే అంశం ఏమిటంటే వీటిలో 9500 మాత్రమే ఆయా దేశాల సైన్యాలకు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన వాటిని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండు దేశాలు చెరో 1400 అణుబాంబులను సర్వసన్నద్ధంగా మోహరించి ఉన్నాయి. అవి గాకుండా చెరో 4 వేల అణుబాంబులను నిల్వ ఉంచుకున్నాయి. చెరో 6 వేల అణుబాంబులను నిర్వీర్యం చేయనున్నాయి. అదే సమయంలో అణు బాంబులను ప్రయోగించడంలో అత్యాధునిక శక్తిసామర్థ్యాల కోసం అమెరికా, రష్యా ప్రయత్నిస్తున్నాయి.
పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇటీవల అణుబాంబులు గురించి ప్రస్తావించారు. తాజాగా పాక్ రైల్వే శాఖ మంత్రి అంతిమ యుద్ధం గురించి మాట్లాడారు. అంతిమ యుద్ధం అంటే అణు యుద్ధమే. భారత్ తో సంప్రదాయక యుద్ధం చేసే శక్తి లేని పాకిస్థాన్ ఇక అణు యుద్ధం దిశగా మళ్ళుతునేందుకు ఈ వ్యాఖ్యలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.
పాకిస్థాన్ తో పోలిస్తే సంప్రదాయక ఆయుధ సంపత్తి భారత్ కే అధికంగా ఉంది. సంప్రదాయక యుద్ధంలో భారత్ తో గెలవగలిగే శక్తి పాకిస్థాన్ కు లేదు. ఇక అణ్వస్త్ర సామర్థ్యం విషయానికి వస్తే భారత్ కు అణుశక్తి బాలిస్టిక్ మిసైల్ జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ కూడా ఉంది. అంటే నేల, నింగి నుంచి మాత్రమే గాకుండా సముద్రం నుంచి అణ్వస్త్రాలను ప్రయోగించే శక్తి భారత్ కు ఉంది. పాకిస్థాన్ కు మాత్రం ఇలాంటి సామర్థ్యం లేదు. అలా అని పాకిస్థాన్ శక్తిసామర్థ్యాలను తక్కువ చేయలేం. దానికి షాహీన్ 3 లాంటి మిసైల్స్ ఉన్నాయి. దాంతో అది అండమాన్ దీవులపై కూడా అణుబాంబులు ప్రయోగించగలదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే రెండు దేశాలు కూడా పొరుగు దేశపు అంచుల దాకా అణు బాంబులను ప్రయోగించే సత్తా కలిగిఉన్నాయి. అయితే ఇక్కడ మరెన్నో అంశాలు కూడా కీలకపాత్ర వహిస్తాయి. అణుబాంబులు ఉంటే సరిపోదు. వాటిని సమర్థంగా ప్రయోగించగలిగే శక్తిసామర్థ్యాలు కూడా కావాలి. అవి మాత్రం భారత్ కే అధికంగా ఉన్నాయి. పాకిస్థాన్ ఆర్థికాభివృద్ధి అంతా కూడా ఒక ఐదారు నగరాల చుట్టూ మాత్రమే ఉంది. వాటిని ధ్వంసం చేస్తే చాలు పాకిస్థాన్ ఇక కోలుకోలేదు. యావత్ పాకిస్థాన్ అంతా భారత్ సరిహద్దులకు చేరువలోనే ఉంటుంది. ఇవన్నీ కూడా పాకిస్థాన్ కు ప్రతికూల అంశాలుగా మారుతాయి.
భారత్ తొలిసారిగా 1974 మే 18న అణు పరీక్ష నిర్వహించింది. స్మైలింగ్ బుద్ధ పేరిట పోఖ్రాన్ లో న్యూక్లియర్ బాంబ్ టెస్ట్ జరిగింది. 1998 మే 11న రెండో అణు పరీక్ష జరిగింది. ఆ కార్యక్రమానికి నాటి ప్రధాని వాజ్ పేయి హాజరు కావడం విశేషం. భారత్ మూడు రోజుల్లో ఆరు బాంబులను పరీక్షించింది. ఈ పరీక్ష నిర్వహించిన మూడు వారాల్లోగానే పాకిస్థాన్ తన సత్తా చాటుకుంది. 1998 మే 28న పాకిస్థాన్ తొలిసారిగా అణ్వస్ర్త పరీక్ష నిర్వహించింది. ఒకే రోజున అది ఐదు బాంబులను పరీక్షించింది. నాటి నుంచి రెండు దేశాల మధ్య అణ్వస్ర్తాల తయారీ పోటీ ప్రారంభమైంది. భారత్ నిన్నటి దాకా తొలిగా అణుబాంబు ప్రయోగించం అనే విధానానికి కట్టుబడి ఉండింది. ఇప్పుడు మాత్రం పరిస్థితిని బట్టి ఆ విధానాన్ని మార్చుకుంటామని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. అదే ఇప్పుడు పాకిస్థాన్ కు వెన్నులో వణుకు పుట్టిస్తుంది.
భారత్ నుంచి ఏ విధమైన సైనిక చర్య ఎదురైనా అణుబాంబులు ప్రయోగించే ఆలోచనతోనే పాక్ ఉన్నట్లుగా రక్షణ నిపుణులు చెబుతున్నారు. రెండు దేశాల మధ్య అణ్వస్త్ర యుద్ధం జరిగితే మొదటగా అణుబాంబు ప్రయోగించే దేశం పాకిస్థానే అని వారంటున్నారు. పాక్ గనుక అణ్వస్త్ర దాడి చేయగలదని భావిస్తే భారత్ మొదటగా అణుదాడి చేసే అవకాశం ఉందని మరికొందరు అంటున్నారు. గతంలో భారత్ క్షిపణులను, వార్ హెడ్స్ ను విడివిడిగా ఉంచేది. ఇప్పుడలా కాకుండా వార్ హెడ్స్ అమర్చిన క్షిపణులు సర్వసన్నద్ధంగా ఉంటున్నాయి. పాకిస్థాన్ కూడా ఇదే బాటలో ఉంది. ఒక దేశం ప్రయోగించే క్షిపణి నాలుగు నిమిషాల్లో అవతలి దేశాన్ని చేరుకుంటుంది. కశ్మీర్ వివాదం నేపథ్యంలో పాక్ తాజాగా అణ్వస్త్రాలను ప్రయోగించగల క్షిపణి పరీక్ష చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఘజ్నావి మిసైల్ 290 కి.మీ. పరిధిలో లక్ష్యాలను ఛేదిస్తుంది.
అణు యుద్ధం చేసేందుకు పాకిస్థాన్ ఉరకలు వేస్తున్న నేపథ్యంలో పాక్ పై అగ్రరాజ్యాలు వ్యవహరించే ధోరణి ఎలా ఉంటుందన్న ప్రశ్న తలెత్తుతోంది. పాక్ లోని అణ్వస్త్రాలు ఉగ్రవాదుల చేతుల్లో పడకుండా వాటిని తన నియంత్రణలోకి తీసుకోవాలని అమెరికా భావించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అణుయుద్ధం ముప్పును తప్పించేందుకు అమెరికా ఇప్పుడు అదే వ్యూహాన్ని అమలు చేస్తుందా అనే సందేహాలు కూడా ఇప్పుడు కలుగుతున్నాయి.
రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత అణు బాంబులను యుద్ధంలో వాడిన సందర్భాలు లేవు. కాకపోతే ఒక్కో దేశమే అణ్వస్త్రాలను పొందేందుకు ప్రాధాన్యం ఇచ్చాయి. అగ్రరాజ్యాల తరువాత అణ్వస్త్ర సామర్థ్యాన్ని పొందింది భారతదేశమే. 1962లో చైనాతో జరిగిన యుద్ధంలో ఓటమి భారత్ ను అణ్వస్త్రం దిశగా మారేలా చేసింది. 1971లో భారత్ తో జరిగిన యుద్ధంలో ఓటమి పాకిస్థాన్ ను అణ్వస్త్రం దిశగా మళ్ళే లా చేసింది. ఆ యుద్ధంలో పాక్ నుంచి బంగ్లాదేశ్ ను భారత్ విడగొట్టింది. దానికి ప్రతీకారం తీర్చుకునేందుకు పాకిస్థాన్ రగిలిపోతోంది. అందుకు ఉగ్రవాదాన్ని ఆయుధంగా మార్చుకుంది. పాకిస్థాన్ చేస్తున్న పరోక్ష యుద్ధంతో భారత్ తన యుద్ధ విధానాలను మార్చుకుంది. రెండు దేశాలు కూడా 1960ల నుంచే అణ్వాస్త్రాలపై కన్నేశాయి. భారత్ గనుక అణుబాంబు నిర్మిస్తే మనం ఆకులు, గడ్డి అయినా తిందాం ఆకలితో మాడుదాం అణుబాంబును మాత్రం తయారుచేసుకుందాం అని 1965లోనే పాకిస్థాన్ నాటి అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో అన్నారు. భారత్ పై పాకిస్థాన్ ఎంతటి పగతో రగిలిపోతుందో చెప్పేందుకు ఈ మాటలు చాలు.
1945 నాటి అణుబాంబులతో పోలిస్తే, భారత్, పాక్ ల వద్ద ఉన్న అణుబాంబుల శక్తి మరెంతో ఎక్కువ. నగరాలను లక్ష్యంగా చేసుకొని ప్రయోగిస్తే వాటిల్లే నష్టం ఎంతగానో ఉంటుంది. ఒక్కో బాంబుతో లక్షలాది ప్రజలు మరణిస్తారు. ఆస్తినష్టం కూడా అపారంగా ఉంటుంది. పర్యావరణంపై ప్రభావం దీర్ఘకాలం పాటు ఉంటుంది. రెండు దేశాల మధ్య పరిమిత అణు యుద్ధం జరిగినా దారి తీవ్రత ఎంతగానో ఉంటుంది. మిలియన్ల టన్నుల కొద్దీ పొగ వాతావరణంలోకి చేరుతుంది. అది ఓజోన్ పొరను నాశనం చేస్తుంది. ఆహార కొరతకు దారి తీస్తుంది. అణు బాంబును ప్రయోగిస్తే దాని ప్రభావం చాలా దూరం వరకు ఉంటుంది. రేడియో ధార్మికత వందలాది కిలోమీటర్ల దూరం విస్తరిస్తుంది. ఒక్కో బాంబు ఐదు మిలియన్ టన్నుల పొగను వాతావరణంలోకి చేరుస్తుంది. దశాబ్దాల పాటు అణు చలికాలం కొనసాగుతుంది. ఉపరితల ఉష్ణోగ్రతలు బాగా పడిపోతాయి. జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో 20 శాతం నుంచి 50 శాతం దాకా ఓజోన్ పొర నాశనమవుతుంది. నగరాలను మంటలు చుట్టుముడుతాయి. భవనాలు లాంటివన్నీ నాశనమైపోతాయి. వాతావరణ పరిస్థితి తిరిగి సాధారణమయ్యేందుకు కనీసం రెండు దశాబ్దాల కాలం పడుతుంది. సూర్య కిరణాలు భూమిని చేరుకోవడంలో ఆటంకాలు ఏర్పడుతాయి. చనిపోకుండా బతికున్న వారు ఎందుకు బతికున్నామా అని బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
గతంలో భారత్, పాక్ ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడినప్పడు అవి ముదిరిపోకుండా అమెరికా ఈ రెండు దేశాలపై ఒత్తిడి తెచ్చేది. ఇప్పుడు మాత్రం భారత్ అమెరికా మాట వినే పరిస్థితి లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమక్షంలో భారత్ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. మధ్యవర్తిత్వం వహిస్తానంటూ ట్రంప్ ఉబలాటపడ్డారు. అలాంటి శ్రమను ఇతర దేశాల వారికి ఇవ్వాలనుకోవడం లేదని మోడీ స్పష్టం చేశారు. దీంతో అమెరికాకు మిగిలిన ఏకైక మార్గం పాకిస్థాన్ పై ఒత్తిడి తేవడం అవసరమైతే పాకిస్థాన్ అణ్వస్త్రాలను తన నియంత్రణలోకి తీసుకోవడం. భారత ఉపఖండంలో అణ్వస్త్ర ముప్పును నివారించేందుకు గాను పాక్ అణ్వస్ర్తాలను అమెరికా తన నియంత్రణలోకి తీసుకొనే అవకాశం ఉందన్న వార్తలు గతంలో కూడా వినిపించాయి. పాకిస్థాన్ లో ఉగ్రవాదం పెరిగిన నేపథ్యంలో అమెరికా ఆ చర్య తీసుకోగలదన్న వార్తలు వచ్చాయి. పాక్ అణ్వస్త్రాలను ప్రయోగించడం అటుంచి వాటిని కాపాడుకోవడం కూడా పెద్ద సమస్యనే. పాక్ తన అణ్వస్త్రాలను దాచిన ప్రాంతాలివే అంటూ అమెరికాకు చెందిన రక్షణ నిపుణులు ఓ జాబితా వెలువరించారు.
1. ఆక్రో గారిసన్ (సింధ్)
2. గుజ్రాన్ వాలా గారిసన్ (పంజాబ్)
3. ఖుజ్ దార్ గారిసన్ (బలూచిస్థాన్)
4. మస్ రూర్ డిపో (కరాచీ)
5. నేషనల్ డెవలప్ మెంట్ కాంప్లెక్స్ (ఫతేజంగ్)
6. పానో అకిల్ గారిసన (సింధ్)
7. సర్గోదా డిపో (పంజాబ్)
8. తార్బాలా (ఖైబర్ ఫక్తూన్ ఖ్వా)
9. వాహ్ ఆర్డనన్స్ ఫెసిలిటీ (పంజాబ్)
ఈ జాబితా నిజమైనా అబద్దమైనా అణు యుద్ధం రాకుండా ఆపడంలో అగ్రరాజ్యాలు తమ వంతు కృషి చేస్తాయనడంలో సందేహం లేదు. అదే గనుక నిజమైతే అంతిమ యుద్ధం కాస్తా ఉత్తుత్తి బెదిరింపుగానే మారిపోతుంది. అయితే పాక్ అణ్వస్త్ర సామర్థ్యం భారత్ కు ఎప్పటికైనా పక్కలో బల్లెం లాంటిదే. తన జాగ్రత్తలు తాను తీసుకోక తప్పదు. డిఫెన్స్ కాస్తా అఫెన్స్ గా మారుతుంటేనే పాకిస్థాన్ మాట వినేటట్లుగా కనిపిస్తోంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire