Hamza Bin Laden: ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హంజా బతికే ఉన్నాడా?

Hamza Bin Laden
x

Hamza Bin Laden

Highlights

Hamza Bin Laden: ఒసామా బిన్ లాడెన్ కుమారుడు బతికే ఉన్నారని ఇంటలిజెన్స్ నివేదికలు సూచిస్తున్నాయి. 2019లో జరిగిన ఆపరేషన్‌లో హంజా చనిపోయాడని అప్పట్లో అమెరికా ప్రకటించింది.

Hamza Bin Laden: హంజా బిన్ లాడెన్.. ఆల్ ఖైదాను స్థాపించిన ఒసామా బిన్ లాడెన్ కుమారుడు. అతడు ఇంకా బతికే ఉన్నారని ఇంటలిజెన్స్ నివేదికలు సూచిస్తున్నాయని ‘ది మిర్రర్’ తెలిపింది. ఆల్ ఖైదాను పునరుద్దరించేందుకు హంజా కీలకంగా వ్యవహరిస్తున్నారని ది మిర్రర్ రిపోర్ట్ చేసింది. 2019లో జరిగిన ఆపరేషన్‌లో హంజా చనిపోయాడని అప్పట్లో అమెరికా ప్రకటించింది. కానీ, దీనికి విరుద్దంగా ది మిర్రర్ రిపోర్ట్ చేసిందని ఇండియన్ ఎక్స్ ప్రెస్ కూడా ఒక కథనం ప్రచురించింది.

ఆల్ ఖైదా పునరుద్దరణ కోసం ప్రయత్నాలు?
ఆల్ ఖైదాను పునరుద్దరణ కోసం హంజా బిన్ లాడెన్ ప్రయత్నాలు చేస్తున్నారని రక్షణ రంగ నిపుణులను ఉటంకిస్తూ డైలీ మెయిల్ తెలిపింది. అతడి సోదరుడు అబ్దుల్లా కూడా ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నారు. హంజాతో ఆల్ ఖైదాకు మంచి సంబంధాలున్నాయని, అతనితో వీరు రెగ్యులర్ గా సమావేశాలు నిర్వహిస్తున్నారని, ఆ కుటుంబానికి తాలిబాన్లు రక్షణ కల్పిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, పాశ్చాత్య దేశాలపై భవిష్యత్తులో దాడులకు కూడా హంజా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం వస్తున్నట్లు ది మిర్రర్ కథనం తెలిపింది. ఆ రిపోర్ట్ ప్రకారం హంజా తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు. అతని సోదరుడు కూడా ఆల్ ఖైదా పునరుద్దరణ కోసం ప్రయత్నిస్తున్నారు.

హంజాకు రక్షణగా 450 మంది
ఆఫ్గానిస్తాన్ లో 21 టెర్రర్ నెట్ వర్క్ లు పని చేస్తున్నాయని మరో నివేదిక తెలిపింది. ఆత్మాహుతి బాంబర్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేసినట్టుగా చెబుతున్నారు. తాజా ఇంటలిజెన్స్ నివేదికలో ఆల్ ఖైదా ఇస్లామిక్ స్టేట్ కు సహకరిస్తోందని, పశ్చిమ దేశాలపై మరో 9/11 తరహా దాడులు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

హంజాను గ్లోబల్ టెర్రరిస్ట్ గా అమెరికా గతంలోనే ప్రకటించింది. ఈ సంస్థలో ఆయన కీలకమైన వ్యక్తిగా తెలిపింది. పశ్చిమ దేశాలపై దాడులకు పిలుపునివ్వాలని ప్రచార వీడియోలను ఆయన విడుదల చేశారు. ఒసామా తర్వాత ఆల్ ఖైదా నాయకుడిగా ఉన్న ఐమాన్ అల్ జవహరితో సన్నిహితంగా పనిచేశారు. నేషనల్ మొబిలైజేషన్ ఫ్రంట్ ఎన్ ఎం ఎఫ్ సంస్థ తాజా నివేదిక కూడా హంజా బతికే ఉన్నారని తెలిపింది. ఆఫ్గానిస్తాన్ లోని పశ్చిమ ప్రాంతంలో హంజా ఉన్నాడని ప్రకటించింది. 450 స్నిప్పర్ల రక్షణలో ఉన్నట్టుగా తెలిపింది.

లాడెన్ మూడో భార్య కొడుకే హంజా
ఒసామా బిన్ లాడెన్ మూడో భార్య కొడుకే హంజా బిన్ లాడెన్. లాడెన్ 20 మంది పిల్లల్లో హంజా 15 వవాడు. చిన్నప్పటి నుంచే తండ్రి అడుగుజాడల్లో నడిచాడు. 9/11 దాడులకు ముందు ఆయన తన తండ్రితో అఫ్గానిస్తాన్ లో కలిసే ఉన్నారని అప్పట్లో నివేదికలు బయటకు వచ్చాయి. ఆయుధాలను ఎలా వాడాలో నేర్చుకున్నారని కూడా అప్పట్లో భద్రతా దళాలు గుర్తించాయి. ఉగ్రవాద శిబిరాలలో హంజా కన్పించేవారని కూడా వార్తలు వచ్చాయి.

హంజా తమ వైమానిక దాడిలో చనిపోయాడని అమెరికా 2019లో ప్రకటించింది. కానీ, ఇప్పుడు దానికి భిన్నంగా వస్తున్న ఇంటలిజెన్స్ రిపోర్ట్స్ మీద అమెరికా ఎలా స్పందిస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories