South Korea: సియోల్‌లో హాలోవీన్‌ మరణ మృదంగం

Halloween Celebrations Turned Into Real Life Horror In South Korea
x

South Korea: సియోల్‌లో హాలోవీన్‌ మరణ మృదంగం

Highlights

South Korea: వేడుకల్లో తొక్కిసలాటలో 150 మందికి పైగా మృతి

South Korea: దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో నిర్వహించిన హాలోవీన్‌ వేడుకలు మరణమృదంగాన్ని మోగించాయి. ఈ వేడుకల్లో జరిగిన తొక్కిసలాటలో 150 మందికి పైగా మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. వారలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరుగొచ్చని దక్షిణ కొరియా అధికారులు చెబుతున్నారు. మృతుల్లో అత్యధికంగా టీనేజర్లే ఉన్నారు. లక్షల మంది మేర హాజరైన ఈ వేడుకకు సినీ తార వచ్చారనే సమాచారంతో అక్కడకు వెళ్లేందుకు యత్నించే క్రమంలో తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తోంది. అయితే హాలోవీన్‌ వేడుకలు అంటే ఏంటి? ఎవరు ఈ వేడుకలను చేసుకుంటారు? ఎందుకు లక్షమంది ఒకేసారి వచ్చారు? వంటి ప్రశ్నలు ఇప్పుడు అందరిలోనూ మొదలయ్యాయి.

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో నిర్వహించిన హాలోవీన్‌ వేడుకలు అత్యంత భయానకంగా మారాయి. వేడుకల్లో జరిగిన తొక్కిసలాటలో 150 మందికి పైగా మృతి చెందారు. పదుల సంఖ్యలో యువత తీవ్ర గాయాల పాలయ్యింది. వారిలో పలువురి పరిస్థితి విషమంగా మారింది. ఏటా జరిగే హాలోవీన్‌ వేడుకలకు లక్ష మందికి పైగా హాజరయ్యారు. సమీపంలోని బార్‌కు ఒక సినీతార వచ్చారనే సమాచారంతో అక్కడకు వెళ్లేందుకు ఒక్కసారిగా యత్నించడంతో తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తోంది. ఇరుకు వీధులతో ఉన్న ఆ ప్రాంతంలో వేలాది మంది పరిగెత్తడంతో పలువురు కిందపడిపోయి.. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రమాదానికి కారణం, మృతుల సంఖ్యను దక్షిణ కొరియా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. అయితే మృతులు, క్షతగాత్రుల్లో చాలామంది 20 ఏళ్లకు అటు ఇటుగా ఉన్నవారేనని అధికారులు వెల్లడించారు. మృతుల్లో 19 మంది విదేశీయులు కూడా ఉన్నట్లు సమాచారం. వారు ఏ దేశానికి చెందినవారన్నది మాత్రం ఇంకా నిర్ధారించాల్సి ఉంది. రెండేళ్ల విరామం తర్వాత కొవిడ్‌-19 పూర్తి స్థాయి ఆంక్షలను తొలగించడంతో వేడుకలకు యువకులు భారీ ఎత్తున హాజరయ్యారు. హాలోవీన్‌ జరిగే ఇటేవాన్‌ ప్రాంతంలో చాలా బార్లు, క్లబ్బులు, షాపింగ్‌ కాంప్లెక్సులు ఉంటాయి. ఈ నేపథ్యంలో యువకులు భారీ ఎత్తున వేడుకలకు హాజరవుతుంటారని తెలుస్తోంది. తాజాగా సంఘటనా స్థలాన్ని దేశ అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ సందర్శించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు సహాయం చేస్తామన్నారు. అలాగే ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు.

అయితే హాలోవీన్‌ వేడుకలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఈ వేడుకలు ఎందుకు జరుపుకుంటారు? యువతనే ఎందుకు ఎక్కువగా హాజరయ్యారు? అంటూ పలువురు ఆరా తీస్తున్నారు. వేలాది మంది హాజరయ్యే హాలోవీన్‌ వేడుకల వెనుక ఘనమైన చరిత్రే ఉంది. నిజానికి హాలోవీన్ అనే పదం.. స్కాట్లాండ్‌కు చెందినది. ఆల్ హాలో ఈవ్ నుంచి పుట్టుకొచ్చింది. 2వేల ఏళ్ల క్రితం ఐరోపాలో ఎంతో ప్రత్యేకమైన పండుగ ఇది. ఐర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్‌‌లోని కొన్ని ప్రాంతాల్లో నివసించే సెల్ట్స్ జాతి ప్రజలు... నవంబరు 1ని కొత్త సంవత్సరంగా జరుపుకునేవారు. దానికి ఒకరోజు ముందే... ఈ హాలోవీన్ వేడుకలు నిర్వహించడం సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ వేడుకల్లో భాగంగా. మంటలను వెలిగించడం, గుమ్మడికాయలను చెక్కడం, హాలోవీన్‌ నేపథ్య చిత్రాలను చూడడం చేస్తారు. మంటలను వెలిగించి... దెయ్యాలను పారదోలాలనే ఉద్దేశంతో ఈ పండుగ సందర్భంగా ప్రజలు విచిత్రమైన దుస్తులు ధరిస్తారు. క్రీస్తు శకం 8వ శతాబ్దంలో పోప్ గ్రెగొరీ-3 నవంబర్1 న సాధువులను గౌరవించే రోజుగా గుర్తించాలని ప్రకటించారు. కాలక్రమంలో రోమన్ పండుగలైన పోమెనా, ఫెరాలియా ఆల్ సెయింట్స్ డే, సంహైన్‌లకు సంబంధించిన సంప్రదాయాలు ఒక్కటయ్యాయి. ఆల్ సెయింట్స్ డేకి ముందు రోజు సాయంత్రం ఆల్ హలోస్ వేడుకలు జరుపుకుంటారు. దీన్నే ప్రస్తుతం హాలోవీన్ అని పిలుస్తున్నారు.

నిజానికి ఐరోపాలో వేసవి ముగిసి.. శీతాకాలం ప్రారంభమయ్యే సమయంలో అంటే.. నవంబరు 1న హాలోస్‌ వస్తుంది. కొత్త సంవత్సరానికి ముందు రోజున అంటే అక్టోబరు 31న ఆత్మలు, దెయ్యాలు వస్తాయని పురాతన సెల్ట్స్ జాతి ప్రజల నమ్మకం. ఆత్మలు ఉన్నాయని బలంగా నమ్మే జాతుల్లో సెల్ట్స్‌ జాతి ఒకటి. తమ వారి ఆత్మలను సంతృప్తి పరిచేందుకు, వారి జ్ఞాపకార్థం వేసిన పంటలను, జంతువులను బలి ఇస్తారు. ఆ సమయంలో ప్రజలు జంతువుల తలలు, చర్మాలు వంటి దుస్తులను ధరిస్తారు. అయితే ఇర్లాండ్‌, బ్రిటన్‌ నుంచి వలసల కారణంగా.. హాలోవీన్‌ వేడుక.. ఆమెరికాతో పాటు ఆసియా దేశాలకు పాకింది. సాధారణంగా.. పంటలు కోసే ప్రాంతాల్లో ప్రజలందరూ ఒకే చోటకు చేరి.. కథలు చెబుతూ.. తమ సాంప్రదాయాలను ఇతరులతో పంచుకోవడానికి ఆసక్తి చూపుతారు. అలాంటి వేడుకల్లో పుట్టుకొచ్చినదే ఈ హాలోవీన్‌. కానీ.. కాలక్రమేణ అది దెయ్యాలను, ఆత్మలను పిలిచే పండుగగా మారింది. ఆ తరువాత.. దెయ్యాలను పారదోలే.. పండుగగా రూపాంతరం చేందింది. కానీ.. పాప్‌ కల్చర్‌, మారుతున్న పరిస్థితుల కారణంగా.. ఈ వేడుక ప్రభావం మరింత పెరిగింది. వాస్తవం చెప్పాలంటే ఈ వేడుకు పుట్టిన ఐరోపా దేశాల్లోనూ హాలోవీన్‌ను పెద్దగా జరుపుకోవడం కనిపించదు. కానీ.. ఇప్పుడు ఆధునికతను అందిపుచ్చుకున్న ఈ ఫెస్టివల్‌.. పబ్బుల్లోనూ, క్లబ్బులోనూ.. ధనవంతులు జరుపుకోవడం కనిపిస్తోంది.

హాలోవీన్ రోజున నలుపు, నారింజ రంగులతో అలంకరిస్తారు. అయితే ఈ రెండు రంగులను ఎందుకు ఎంచుకున్నారో చాలామందికి తెలియదు. నారింజను శక్తికి చిహ్నంగా భావిస్తారు. అదే సమయంలో ఈ రంగు శరత్‌ రుతువు సీజన్‌ కూడా చూపుతుంది. నలుపు రంగు భయం, మరణానికి చిహ్నంగా చెబతారు. అంతేకాదు.. నలుపు శీతాకాలానికి కూడా సంకేతం. ఈ రెండు రంగులు రుతువుల మార్పు, జీవితం, మరణాన్ని సూచిస్తాయి. ఈ కారణంగా, ప్రజలు హాలోవీన్ వేడుకల సమయంలో ఈ రెండు రంగుల దుస్తులను ధరిస్తారట. ఈ హాలోవిన్ సంప్రదాయం ప్రారంభమైన సమయంలో దెయ్యాలు సంచరిస్తాయని నమ్ముతారు. ఆ కారణంగానే నలుపు, నారింజ రంగు దస్తులు ధరించి తమ ఇళ్ల వెలుపల ఆహారాన్ని ఉంచుతారు. అయితే ఆ ఆచారం క్రమంగా మారి.. చర్చిలో ప్రార్థన చేసేలా రూపుదిద్దుకున్నది. క్రమంగా పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఈ ఆచారాన్ని అనుకరించారట. అక్టోబర్ 31 న జరుపుకునే ఈ పండుగను సంహైన్ అని పిలుస్తారు. మన దేశంలోనూ కొందరు ఈ పండుగను ఇష్టపడుతున్నారు. హాలోవీన్ విస్తరిస్తున్న నేపథ్యంలో అన్ని మెట్రో నగరాల్లో యువతను ఆకర్షించడానికి పలు పబ్బుల్లో ఇలాంటి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వీకెండ్‌లో ప్రత్యేకంగా హాలోవీన్ థీమ్ పార్టీలను కూడా నిర్వహిస్తున్నాయి. ముంబయి, గోవా, బెంగళూరు, దిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో ఈ పార్టీలు ఏర్పాటు చేశారు.

దక్షిణ కొరియాలోనూ ఈ వేడుకలను ఏటా జరుపుకుంటారు. తాజాగా ఈ వేడుకలు మరణ మృదంగాన్ని మోగించాయి. దక్షిణ కొరియాలో హాలోవీన్ అనేది పెద్ద ఉత్సవం కాదు. అయితే ఇటైవాన్ ప్రాంతంలో అంతర్జాతీయ సంస్కృతి ఎక్కువగా కనిపిస్తుంది. హాలోవీన్ ఉత్సవం సందర్భంగా జనం పార్టీ చేసుకోవటానికి పెద్ద ఎత్తున హాలోవీన్ దుస్తులు ధరించి వచ్చారు. ఈ ఘటన దక్షిణ కొరియాలో తీవ్ర విషాదం నింపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories