ఫ్రాన్స్‌లో తీవ్ర చమురు సంక్షోభం.. పెట్రోలు బంకుల్లో నో స్టాక్‌ బోర్డులు

France Faces More Fuel Shortages as Unions Plan to Prolong Strikes
x

ఫ్రాన్స్‌లో తీవ్ర చమురు సంక్షోభం.. పెట్రోలు బంకుల్లో నో స్టాక్‌ బోర్డులు

Highlights

*కొన్ని బంకుల వద్ద కిలోమీటర్ల కొద్దీ క్యూలు

France: పెట్రోలు బంకుల్లో నో స్టాక్‌ బోర్డులు.. ఉన్న చోట పెట్రోలు కోసం భారీ క్యూలు.. గంటల తరబడి ఎదురు చూపులు... ఈ పరిస్థితులను విన్నా.. చూసినా.. మనకు టక్కున గుర్తొచ్చేది శ్రీలంకనే. అక్కడి పరిస్థితులు అంతగా ప్రచారమయ్యాయి మరి.. కానీ.. తాజాగా అలాంటి పరిస్థితులే ఇప్పుడు ఐరోపాలోనూ కనిపిస్తున్నాయి. ప్రధానంగా ప్రాన్స్‌లో పరిస్థితులు మరింత విషమంగా మారుతున్నాయి. ఇప్పుడు దేశ రాజధాని ప్యారిస్‌లో ఎక్కడ చూసినా.. భారీగా వాహనాల క్యూలే కనిపిస్తున్నాయి. శ్రీలంకను అధ్వాన స్థితికి నెట్టిన పరిస్థితులే.. ప్రాన్స్‌లోనూ నెలకొన్నాయి. ఉరుము ఉరిమి.. మంగళం మీద పడిన చందంగా.. చమురు సంక్షోభం కారణంగా.. నాటోకు వ్యతిరేకంగా ఫ్రాన్స్‌ ప్రజలు ఆందోళనలకు దిగుతున్నారు.

ఉక్రెయిన్‌ యుద్ధం.. ప్రపంచంలోని పలు దేశాల తలరాతలను మార్చేసింది. యుద్ధానికి సంబంధంలేని ఎన్నో దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. అసలే అప్పుల్లో నడుస్తున్న పలు పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు.. యుద్ధం పిడుగులా మారింది. ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైన సమయంలో ఉన్నట్టుండి అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. అప్పటివరకు కరోనా వైరస్‌తో అతలాకుతలమైన పలు దేశాల్లో... విదేశీ మారక నిధుల నిల్వలు పడిపోయాయి. దీంతో దిగుమతులకు డాలర్లు చెల్లించలేకపోయాయ. దీంతో చమురు, ఆహారం వంటి దిగుమతులు నిలిచిపోయాయి. ఫలితంగా పలు దేశాల్లో సంక్షోభం దిశగా పయనించాయి. అలాంటి దేశాల్లో ముందువరుసలో ఉన్న దేశం.. పొరుగున ఉన్న శ్రీలంక. ఫలితంగా దిగుమతులు నిలిచిపోవడంతో.. చమురు సంక్షోభం నెలకొన్నది. పెట్రోలు బంకుల వద్ద చమురు కోసం భారీగా వాహనాలు క్యూలు కట్టాయి. చమురు కోసం క్యూలో నిలబడి పలువురు ప్రాణాలను కూడా కోలోపోయారు. ఆ తరువాత శ్రీలంక వ్యాప్తంగా ప్రజల ఆందోళనలు ఉధృతమయ్యాయి. అక్కడి ప్రధాని, అధ్యక్షుడి నివాసాలను ముట్టడించడంతో రాజపక్స సోదరులు పదువులను వదులుకుని పారిపోయారు.

ఈ ఏడాది మార్చిలో శ్రీలంకలో నెలకొన్న పరిస్థితులే.. తాజాగా ఐరోపా దేశం ప్రాన్స్‌లోనూ కనిపిస్తున్నాయి. రిఫైనరీ కంపెనీల్లో చమురు నిల్వలు పడిపోతున్నాయి. పెట్రోలు బంకుల వద్ద నో స్టాక్‌ బోర్డులు కనిపిస్తున్నాయి. పెట్రోలు విక్రయించే బంకుల వద్ద వాహనాలు క్యూ భారీగా కనిపిస్తున్నాయి. పెట్రోలు ఫిల్లింగ్ కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. దీనికి కారణం.. ఉక్రెయిన్‌ యుద్దమే.. నిజానికి రష్యా నుంచి చమురు, గ్యాస్‌ను ఫ్రాన్స్‌ దిగుమతి చేసుకుంటోంది. అయితే ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య చేపట్టడాన్ని నిరసిస్తూ.. ఐరోపా దేశాలు క్రెమ్లిన్‌ చమురు, గ్యాస్‌ కొత్త ఒప్పందాలు రద్దు చేసుకున్నాయి. రష్యాపై భారీగా ఆంక్షలను విధించాయి. మరోవైపు గతేడాది ఒప్పందం ప్రకారం.. ఇవ్వాల్సిన గ్యాస్‌, చమురును రష్యా నిలిపేస్తోంది. అందుకు పైపులైన్‌ లేకేజీలను కారణంగా చూపుతోంది. ఆంక్షలు విధించిన ఐరోపా దేశాలపై మాస్కో పగ తీర్చుకుంటోంది. ఫలితంగా ఐరోపా దేశాల్లో అంధకారం నెలకొన్నది. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌లో పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. ఫ్రాన్స్‌లో చమురు సంకోభానికి ఉక్రెయిన్‌ యుద్ధమే కారణమా? లేక మరో కారణం ఏమైనా ఉందా?

ఫ్రాన్స్‌లో ప్రస్తుత చమురు సంక్షోభానికి ఉక్రెయిన్‌ యుద్ధం ఓ కారణమైతే.. ఆ దేశంలోని జనరల్‌ కాన్‌ఫెడరేషన్‌ ఆఫ్‌ లేబర్‌-సీజీటీ ఆందోళనలు మరో కారణం.. ఫ్రాన్స్‌లోని కార్మిక సంఘాల్లో సీజీటీ అతి పెద్దది. ఈ సంఘానికి చెందిన 40వేల మంది కార్మికులు పెట్రోలు కంపెనీల్లో పని చేస్తున్నారు. తమ జీతాలను 10 శాతం పెంచాలని సీజీటీ కార్మికులు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నారు. కానీ చమురు కంపెనీలు మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు. దీంతో రెండు వారాలుగా సీజీటీ కార్మికులు విధులను బహిష్కరించారు. వారి ఆందోళన కారణంగా.. 60 శాతం చమురు ఉత్పత్తి నిలిచిపోయింది. ఫలితంగా దేశంలో పెట్రోలు బంకుల వద్ద కిలోమీటర్ల క్యూలు కనిపిస్తున్నాయి. చమురు కోసం ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. చమురు కష్టాలు పెరుగుతుండడంతో ప్రజలు నిరసనలు హోరెత్తిస్తున్నారు. రెండ్రోజుల క్రితం వేలాది మంది ప్రజలు రాజధాని ఫ్రాన్స్‌లో ఆందోళనకు దిగారు. ఐరోపా సమాఖ్య, నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌-నాటో నుంచి బయటకు రావాలంటూ నిరసనకారులు నినాదాలు చేశారు. నాటో, ఐరోపా కూటమి నుంచి బయటకు వస్తే.. ఫ్రాన్స్‌ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే వీలుంటుందని వాదిస్తున్నారు. యుద్ధం కారణంగా తమ దేశానికి జరిగిన నష్టాన్ని పూడ్చుకునే అవకాశం ఉంటుందంటున్నారు. రష్యాతో ప్రాన్స్‌కు పెద్దగా సమస్యలు లేవని.. చమురు, గ్యాస్‌ దిగుమతులకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు.

కార్మికుల నిరసనలు, ప్రజల ఆందోళనలతో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానియేల్‌ మాక్రాన్‌పై ఒత్తిడి పెరుగుతోంది. అయితే మాక్రాన్ మాత్రం తాజా ఆందోళనలు, డిమాండ్లపై స్పందించలేదు. ఇప్పటికే ఫ్రాన్స్‌లో నిత్యావసర ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రజలు ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు శీతాకాలం సమీపిస్తోంది. తాజాగా నెలకొన్న చమురు, గ్యాస్‌ సంక్షోభంతో మళ్లీ కట్టెల కోసం, పేడ కాడల కోసం ఫ్రెంచ్‌ ప్రజలు ప్రయత్నిస్తున్నారు. పాత కట్టెల పొయ్యిలను, దీపాలను శుభ్రం చేసుకుంటున్నారు. తాజా పరిణామాలు ఒక్క ఫ్రాన్స్‌కే పరిమితం కాలేదు. అటు ఐరోపాలోని ఇతర దేశాల్లోనూ ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జర్మనీ, పోలాండ్‌, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్‌ దేశాల్లోనూ చమురు సంక్షోభం నెలకొన్నది. శీతాకాలం సమీపిస్తుండడంతో ఆయా దేశాల్లో ఆందోళన మొదలైంది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. డిసెంబర్‌లో ఇంకెలా ఉంటుందోనని టెన్షన్‌ వెంటాడుతోంది. గత్యంతరం లేక ఆయా దేశాలు విద్యుత్‌ కోతలను అమలు చేస్తున్నాయి. విద్యుత్‌ ఆదా చేసేందుకు పలు ఆంక్షలు విధిస్తున్నాయి. వీధిలైట్లను ఆర్పేస్తున్నాయి. పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయి.

ఇదిలా ఉంటే.. ఫ్రాన్స్‌ ప్రజలు తాజా ఆందోళనలపై సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. నాటో నుంచి బయటకు రావాలంటూ డిమాండ్‌ చేయడంపై విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఉక్రెయిన్ యుద్ధం తరువాత.. దేశ భద్రత అనేది అత్యంత కీలకమైన సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో పలు దేశాలు.. రక్షణ కూటముల చేరేందుకు మొగ్గు చూపుతున్నాయి. ప్రస్తుతం యుద్ధంతో అతలాకుతలం అవుతున్న ఉక్రెయిన్‌ కూడా.. నాటో సభ్యత్వం కోసం తహతహలాడుతోంది. నాటో సభ్యత్వమే ఉంటే.. రష్యా అంత సులభంగా దాడికి దిగేది కాదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నాటో దరఖాస్తును ఆమోదించాని ఇటీవల ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మళ్లీ కోరారు. అదే సమయంలో ఫ్రాన్స్‌ ప్రజలు మాత్రం.. నాటో సభ్యత్వాన్ని వదులుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. పెరుగుతున్న నిత్యావసరాలు, చమురు, గ్యాస్‌ కోసమే నాటో సభ్యత్వం వదులుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఐరోపాలోని ఇప్పటికీ పలు దేశాలు నాటో సభ్యత్వం కోసం ధరఖాస్తు చేసుకున్నాయి. రష్యా నుంచి ముప్పు పొంచి ఉందని ఫిన్లాండ్‌, నార్వే దేశాలు తమ సభ్యత్వాన్ని ఆమోదించాలని కొన్నేళ్లుగా కోరుతుండడం గమనార్హం.

యుద్ధం కారణంగా ధనిక దేశమైన ఫ్రాన్స్‌లో పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయి. అక్కడి ప్రజలు ప్రభుత్వంపై నిరసనలతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలను పెంచాలని కార్మికులు, ఉద్యోగులు ఆందోళన బాటపడుతున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. ఫ్రాన్స్‌కు కూడా మరో శ్రీలంకగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories