ఐరోపాను కమ్ముకుంటున్న చీకట్లు.. రోజు రోజుకు తీవ్రమవుతున్న విద్యుత్‌ సంక్షోభం

Europes Plan to Tackle Winter Energy Crisis | Telugu News
x

ఐరోపాను కమ్ముకుంటున్న చీకట్లు.. రోజు రోజుకు తీవ్రమవుతున్న విద్యుత్‌ సంక్షోభం

Highlights

*పడిపోతున్న గ్యాస్, చమురు నిల్వలు

Europe Energy Crisis: ఐరోపాలో విద్యుత్‌ సంక్షోభం రోజు రోజుకు తీవ్రమవుతోంది. విద్యుత్‌ బిల్లులు భారీగా పెరిగాయి. గ్యాస్‌ నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోతున్నాయి. మరోవైపు శీతాకాలం రూపంలో ముప్పు ముంచుకొస్తోంది. గ్యాస్‌, చమురు ఆదా చర్యలు తీవ్రమయ్యాయి. అదే సమయంలో చమురు, గ్యాస్‌ దిగుమతులు ఐరోపా దేశాలను కలవరపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్‌ సంక్షోభాన్ని గట్టెక్కేందుకు ఐరోపా దేశాలు ఏం చేయున్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది. వచ్చే శీతాకాలాన్ని ఐరోపా దేశాలు ఎలా ఎదుర్కొననున్నాయి? ఆ దేశాల ముందున్న ఆప్షన్లు ఏమిటి? గత్యంతరం లేక ఆంక్షలను ఎత్తివేసి... గ్యాస్‌ ఇవ్వండి బాబూ.. అంటూ రష్యాను అడుక్కోవాల్సిందేనా?

విద్యుత్‌ సంక్షోభంతో ఐరోపా దేశాలు విలవిలలాడుతున్నాయి. రోజు రోజుకు గ్యాస్‌ నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోతున్నాయి. ఎక్కడ చమురు, గ్యాస్‌ విక్రయిస్తారంటే.. అంటువైపు ఐరోపా దేశాలు పరుగులు పెడుతున్నాయి. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా.. తగినంత గ్యాస్‌, చమురు లభించడంలేదు. ఈ నేపథ్యంలో ఐరోపాలోని అన్ని దేశాలు విద్యుత్‌ ఆదాపై దృష్టిసారించాయి. అందుకు కఠినమైన నిర్ణయాలను తీసుకున్నాయి. తాజాగా ప్రభుత్వ కార్యాలయాల్లో రాత్రి పూట విద్యుద్దీపాలను ఆర్పివేయాలని గ్రీస్‌ దేశం ఆదేశించింది. అంతేకాదు.. ఎయిర్ కండిషనర్లు, హీటర్ల వినియోగాన్ని నిషేధించింది. ఒకవేళ ఏ కార్యాలయంలోనైనా వినియోగించినట్టు నిర్ధారణ అయితే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తే.. ఆయా సంస్థల విద్యుత్‌ బిల్లులను చెల్లించేది లేదని స్పష్టం చేసింది. దీన్ని బట్టి.. గ్రీస్‌లో గ్యాస్‌, చమురు నిల్వలు ఎంత తీవ్రస్థాయికి పడిపోయిన విషయం ఇట్టే అర్థమవుతోంది. అందుకే గ్రీస్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలను తీసుకున్నది. ఇక ఫ్రాన్స్‌లోనూ దాదాపు గ్రీస్‌లోని పరిస్థితులే నెలకొన్నాయి. వీధి లైట్లను డిమ్‌లో వెలిగిస్తున్నారు. మిరుమిట్లు గొలిపే చారిత్రక కట్టడాలపై అంధకారం అలముకుంది. ఆహ్లాదకరంగా కనిపించే ఫౌంటైన్లు ఆగిపోయాయి. దీంతో ఫ్రెంచ్‌ నగరాలు ఎడారులను తలపిస్తున్నాయి. రాత్రిపూట కాంతులీనే ఈఫిల్‌ టవర్‌ విద్యుత్‌ దీపాలు ఆరిపోయాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ టవర్‌ను చీకట్లు కమ్ముకున్నాయి. దేశంలో నెలకొన్న పరిస్థితులపై ఫ్రెంచ్‌ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఐరోపాలో విద్యుత్‌ సంక్షోభం కలకలం రేపుతోంది. అయితే ఈ దారుణ పరిస్థితుల నుంచి ఐరోపా బయటపడే మార్గముందా? ఆ దేశాల తక్షణ కర్తవ్యమేమిటి? అన్నది జోరుగా చర్చ సాగుతోంది. చమురు, గ్యాస్‌ కొరత తలెత్తకుండా అమెరికన్లు కొంతమేర అప్రమత్తంగా ఉన్నారు. అయితే ఐరోపాలో విద్యుత్‌ సంక్షోభంపై మాత్రం ఎలాంటి పరిష్కార మార్గాలు కనిపించడం లేదు. అయితే ఆమెరికా మాత్రమే ఆశాకిరణంలా మారింది. ఇక శీతాకాలం వచ్చిందంటే.. ఐరోపాలో విద్యుత్‌ వినియోగం భారీగా పెరుగుతుంది. చలి నుంచి రక్షించుకోవడానికి హీటర్లను వాడాల్సిందే. లేదంటే ప్రాణాలు కోల్పోవడం ఖాయం.. ఈ సమయం కోసమే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఎదురుచూస్తున్నారు. ఆంక్షలతో తమను ఇబ్బంది పెడుతున్న ఐరోపా దేశాలపై ప్రతీకారంతో రగిలిపోతున్నారు. సరిగ్గా అదును చూసి.. శీతాకాలంలోనే పుతిన్ గ్యాస్‌ సరఫరాను నిలిపేస్తారేమో అని.. ఐరోపా దేశాల్లో ఆందోళన మొదలయ్యింది. ఏ క్షణంలోనైనా ఐరోపాకు గ్యాస్ ఎగుమతులను ఆపేయవచ్చని అమెరికా కూడా భావిస్తోంది. నిజంగా వారు ఆందోళన చెందుతున్నట్టు పుతిన్‌ అదే పని చేస్తే మాత్రం ఐరోపాలో తీవ్రమైన మాద్యం నెలకొనే ప్రమాదం ఉంది. పరిశ్రమలన్నీ మూతపడుతాయి. ప్రజలకు ఉపాధి లేకుండా పోతుంది. దీంతో ఆయా దేశాల్లో గడ్డు పరిస్థితులు నెలకొననున్నాయి. అంటే... మధ్యయుగం నాటి పరిస్థితులు తప్పవని అమెరికా మీడియాలో కథనాలు వెలువుడుతున్నాయి. గతంలో మాదిరిగా మళ్లీ నిప్పుపై ధారాపడాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

ఐరోపాలో నెలకొన్న విద్యుత్‌ సంక్షోభం తాత్కాలికమేనని ఆయా దేశాలు భావిస్తున్నాయి. కానీ.. ఐరోపాలో సంక్షోభం దీర్ఘకాలం కొనసాగడంతో పాటు ద్రవోల్బణం విపరీతంగా పెరిగే అవకావం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకు తాజాగా సర్వేలే నిదర్శనం. 19 దేశాల ఐరోపా కూటమిలో రియల్‌ జీడీపీ 1.7 శాతం పడిపోయినట్టు స్ఫష్టం చేస్తున్నాయి. జర్మనీలో జీడీపీ 2.3 శాతం, ఇటలీ 2.1 శాతం, ప్రాన్స్‌ 1.2 శాతం, స్పెయిన్ 1.6 శాతం జీడీపీ పడిపోయినట్టు సర్వేలు వివరిస్తున్నాయి. అయితే ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఐరోపా దేశాల్లో నెలకొన్న సంక్షోభం అమెరికాకు కలిసివస్తోంది. రష్యాతో చమురు, గ్యాస్‌ సంబంధాలను వదులుకోవడంతో.. ఐరోపా దేశాల్లో ఆర్థికంగా పరిస్థితులు దిగజారుతున్నాయి. దీంతో గత్యంతరం లేక.. ఐరోపా దేశాలు.. అమెరికా వైపు సాయం కోసం ఆశగా చూస్తున్నాయి. ఐరోపా దేశాలను పలు అమెరికన్‌ కంపెనీలు ఆకర్షిస్తున్నాయి. అమెరికా పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే అమెరికా సహజ వాయువు ఉత్పత్తిని ముమ్మరం చేసింది. ఈ గ్యాస్‌ను ఐరోపా దేశాలకు విక్రయించి సొమ్ము చేసుకునేందుకు అమెరికా సిద్ధమైంది. ప్రస్తుతం అమెరికా ఎగుమతి చేస్తున్న గ్యాస్‌లో 70 శాతం ఐరోపా దేశాలకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటివరకు 3వేల కోట్ల క్యూబిక్ మీటర్లను ఎగుమతి చేస్తున్నట్టుగా నివేదికలు చెబుతున్నాయి. ఒవరాల్‌గా ఉక్రెయిన్‌ యుద్ధం.. అమెరికా వ్యాపారానికి కలిసివస్తోంది. కానీ.. యుద్ధం కారణంగా ఐరోపా దేశాలను మాత్రం కష్టాల చీకట్లు కమ్ముకుంటున్నాయి.

ఉక్రెయిన్‌ఫై యుద్ధానికి దిగిన రష్యాపై.. నిరసనగా... ఐరోపా దేశాలు కఠిన ఆంక్షలను విధించాయి. రష్యా యుద్ధాన్న, విస్తరణ కాంక్షకు తాము బలవుతామనే ఆందోళన ఐరోపా దేశాలను ఉక్కిరిబిక్కిరి చేసింది. అందుకే యుద్దంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ దూకుడును అడ్డుకునేందుకు కఠిన అంక్షల అస్త్రాన్ని ప్రయోగించాయి. అందులో భాగంగా.. రష్యాతో కొత్త గ్యాస్‌, చమురు కొనుగోళ్లను రద్దు చేసుకున్నాయి. పాత ఒప్పందాల ప్రకారం.. ఈ ఏడాది చివరి వరకు ఐరోపా దేశాలకు రష్యా గ్యాస్‌ సరఫరా చేయాలి. రష్యా ఒప్పందాన్ని గౌరవిస్తుందని ఐరోపాద దేశాలు భావించాయి. కానీ.. కఠిన ఆంక్షలు విధించిన ఆ దేశాలపై ప్రతీకారంతో పుతిన్ రగిలిపోయాడు. సాధారణంగా అయితే గ్యాస్‌ సరఫరా నిలిపేసే అవకాశం లేదు. అందుకే నిర్వహణ, మరమ్మతుల పేరుతో ఐరోపా దేశాలకు పుతిన్ చెక్‌ పెట్టాడు. ఫలితంగా రోజు రోజుకు ఐరోపా దేశాల్లో గ్యాస్‌ నిల్వలు తరిగిపోతున్నాయి. దీంతో 19 దేశాల్లో కష్టాలు కరెంటు మొదలయ్యాయి. తాజాగా ఆయా దేశాలు విద్యుత్‌ ఆదాకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. యుద్ధం ఇప్పుడిప్పుడే ఆగేలా లేదు.. ఆంక్షలను కూడా వెంటనే తొలగించే అవకాశం లేదు. ఇప్పుడు ఆమెరికానే ఐరోపా దేశాలు నమ్ముకున్నాయి. కరెంట్‌ కష్టాల నుంచి గట్టెక్కించే ఒకే ఒక్క అవకాశం ఇది తప్ప మరో మార్గం కనిపించడం లేదు. అక్కడక్కడా ఆరకొర గ్యాస్‌ను కొనుగోలు చేస్తున్నా... అది ఏమాత్రం సరిపోవడం లేదు.

ముందూ వెనుకా.. ఆలోచించుకుండా ఐరోపా తీసుకున్న ఆంక్షల నిర్ణయంతో.. అక్కడి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. మరోవైపు వాతావరణం ఐరోపా దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. శీతాకాలం సమీపిస్తున్నా.. ఎండలు మండుతున్నాయి. దీంతో విద్యుత్‌ వినియోగం కూడా భారీ పెరిగింది. గత్యంతరం లేక కరెంటు బిల్లులను 19 దేశాలు పెంచాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories