America: మళ్లీ అధ్యక్ష రేసులో డొనాల్డ్ ట్రంప్.. రిపబ్లికన్ పార్టీలో మొదలైన వర్గపోరు
* ట్రంప్‌కు పోటీగా ఎదుగుతున్న రాన్ డిశాంటిస్.. రిపబ్లికన్లలో అత్యధికంగా డిశాంటిగోస్ వైపే మొగ్గు
United States Of America: అమెరికాలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రపంచ దేశాలను ప్రభావితం చేసే అమెరికాలో నవంబరు 8న జరిగిన మధ్యంతర ఎన్నికల ఫలితాలు చివరి దశకు చేరుకున్నాయి. సెనేట్‌లో ఆధిపత్యం సాధించిన డెమొక్రాట్లు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. దిగువ సభలో స్వల్ప ఆధిక్యాన్ని సాధించినా రిపబ్లికన్లలో మాత్రం ఆందోళన మొదలయ్యింది. పార్టీ సునామీ సృష్టిస్తుందని ఆశించిన రిపబ్లికన్లను ఫలితాలు మరింత గందరగోళానికి గురిచేశాయి. పార్టీకి ఎవరు నాయకత్వం వహిస్తారన్న దిగులు వారిని వెంటాడుతోంది. ప్రస్తుతం రిపబ్లికన్లలోనే విభజన మొదలయ్యినట్టు తెలుస్తోంది. కొందరు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైపు మొగ్గుచూపుతుండగా మరికొందరు మాత్రం ఫ్లోరిడా గవర్నర్‌గా ఎన్నికైన రాన్ డిశాంటిస్ పై ఆసక్తి చూపుతున్నారు. ఇదే రిపబ్లికన్లను కలవరపరుస్తోంది.
అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల పై ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. పూర్తిగా ఫలితాలు ఇప్పటికీ రాకపోయినా ఫైనల్ గా క్లియర్ పిక్చర్ వచ్చేసింది. సెంటిమెంట్ ప్రకారం అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీ మధ్యంతర ఎన్నికల్లో సత్తా చాటుతుంది. ఈ లెక్కన అధికార డెమొక్రాట్లపై రెడ్‌వేవ్ సునామీ సృష్టిస్తుందని రిపబ్లికన్లు ఆశించారు. వారి ఆశలకు అమెరికన్ ఓటర్లు గండీకొట్టారు. సెంటిమెంట్‌ను పక్కన పెట్టి డెమొక్రాట్లకు పట్టం కట్టారు. మధ్యంతర ఎన్నికల్లో భాగంగా ప్రతినిధుల సభ ఫలితాల్లో రిపబ్లికన్లు సత్తా చాటుతున్నారు. 218 మార్క్ సీట్లకు చేరువయ్యారు. మరోవైపు సెనేట్ ఫలితాల్లో మాత్రం రిపబ్లికన్లు వెనుకబడ్డారు. మెజార్టీ 51 స్థానాల మార్క్‌కు డమొక్రాట్లు చేరువయ్యారు. రిపబ్లికన్లు మాత్రం 49 స్థానాలకే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. దీంతో డెమొక్రాట్లు సంబురాలు జరుపుకుంటున్నారు. ప్రతినిధుల సభలో ఆధిక్యం సాధించినా రిపబ్లికన్లలో మాత్రం ఆందోళన మొదలయ్యింది. తాజా ఫలితాలు ఆ పార్టీని మరింత గందరగోళంలోకి నెట్టింది. పార్టీ నేత విషయంలో రిపబ్లికన్లు రెండు జట్లుగా విడిపోతున్నారు. కొందరు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైపు మొగ్గుచూపుతుండగా మరికొందరు రిపబ్లికన్ పార్టీలో ఫైర్ బ్రాండ్ తాజాగా ఫ్లోరిడా గవర్నర్‌గా ఎన్నికైన రాన్ డిశాంటిస్‌కు మద్దతు పలుకుతున్నారు. దీంతో తమ నాయకుడు ఎవరో రిపబ్లికన్లు తేల్చుకోలేకపోతున్నారు.
రిపబ్లికన్ పార్టీలో ట్రంప్‌ను కొందరు వ్యతిరేకిస్తున్నారు. అందుకు కారణం తాజా మధ్యంతర ఎన్నికల ఫలితాలే. ట్రంప్‌కు అనుకూలంగా ఉన్న నేతలందరిని అమెరికన్ ఓటర్లు తిరస్కరించారు. ఇదే రిపబ్లికన్ పార్టీలో చీలికకు కారణమవుతోంది. నిధులు ఇచ్చే దాతలు, పార్టీ నేతలు ఫ్లోరిడా గవర్నర్ డిశాంటిస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఫ్లోరిడా గవర్నర్ ఎన్నికల్లో 60 శాతం ఓట్లతో డిశాంటిగోస్ అపూర్వ విజయం సాధించారు. ఫలితాలు వచ్చిన తరువాత ఇప్పుడే పోరాటం మొదలయ్యిందంటూ డిశాంటిగోస్ ప్రకటించారు. తాజా విజయంతో పార్టీలో మరింత స్ట్రాంగ్‌గా మారిన డిశాంటిస్ 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు గట్టి పోటీని ఇస్తున్నారు. రిపబ్లికన్లంతా ఇప్పుడు డిశాంటిస్ నామాన్నే జపిస్తున్నారు. 44 ఏళ్లకే రెండు సార్లు గవర్నర్‌గా ఎన్నికై రాన్ సంచలనం సృష్టించారు. భవిష్యత్తు అధ్యక్ష పదవి రేసు అభ్యర్థిగా డిశాంటిస్ మారారు. పలువురు రిపబ్లికన్లు ట్రంప్ బదులుగా డిశాంటిస్ రావాలని కోరుకుంటున్నారు. అధ్యక్ష ఎన్నికలపై డిశాంటిస్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయితే పార్టీలో మారుతున్న ట్రెండ్ ట్రంప్‌కు ఆందోళన కలిగిస్తోంది. విషయం పొడిగిస్తే తనకే ముప్పు తప్పదని ట్రంప్ గ్రహించారు. అధ్యక్ష ఎన్నికల్లో డిశాంటిస్ పోటీ చేయరని భావిస్తున్నట్టు ట్రంప్ చెప్పారు. అధ్యక్ష ఎన్నికల్లో రాన్ పోటీ చేయడం అతడికి, రిపబ్లికన్ పార్టీకి మంచిది కాదన్నారు. అంతేకాదు రాన్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే అతడికి సంబంధించిన కొన్ని రహస్యాలను బయటపెడుతానంటూ ట్రంప్ హెచ్చరించారు. రాన్ డిశాంటిస్‌కు ట్రంప్ నిక్ నేమ్ కూడా పెట్టారు "రాన్ రాన్ డిసాంక్టిమోనియస్" అది స్వయంగా ట్రంపే వెల్లడించారు.
అయితే ట్రంప్ ఎందుకు డిశాంటిస్‌ను వ్యతిరేకిస్తున్నారు? సొంత పార్టీకి చెందిన గవర్నర్‌పైనే ఎందుకు విమర్శలు గుప్పిస్తున్నారు? అంటూ జోరుగా చర్చ జరుగుతోంది. అందకు మరే ఇతర కారణం లేదు. కేవలం 2024 అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ ట్రంప్ పోటీ చేయాలనుకుంటున్నారు. తనకు డిశాంటిస్ అడ్డుపడుతున్నాడని ట్రంప్ భావిస్తున్నారు. అసలు విషయమేమిటంటే ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడు డిశాంటిస్. పైగా సొంత రాష్ట్రానికి చెందినవాడు. ట్రంప్‌ను అత్యంత అభిమానించే నేతల్లో డిశాంటిస్ అందరికంటే ముందుంటారు. ట్రంప్ ఏం చెప్పినా డిశాంటిస్ చేస్తారు. ట్రంప్ శిష్యుడిగా ఆయకు పేరుంది. అదే సమయంలో ట్రంప్‌తో పాటు డిశాంటిస్ కూడా పార్టీలో క్రమంగా ఎదుగుతున్నాడు. ఇది సహజంగానే ట్రంప్‌కు మింగుడు పడడం లేదు. తాను లేకుంటే డిశాంటిగోస్ లేడని ట్రంప్ చెబుతున్నారు. తన వల్లే రాన్ ఎదిగినట్టు చెబుతున్న ట్రంప్ ఇప్పుడు తనే అతడిని అణిచి వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే డిశాంటిస్ మాత్రం ట్రంప్‌కు తలవంచేది లేదంటున్నారు. పైగా ఇద్దరి మధ్య జనరేషన్ గ్యాప్ ఉంది. డిశాంటిస్ వయస్సు 44 ఏళ్లు అయితే ట్రంప్ ఏజ్ 76 ఏళ్లు. రిపబ్లికన్ స్టార్ లీడర్‌గా ఎదుగుతున్న డిశాంటిస్‌కు మద్దతు పలకాలో.. క్రమంగా ప్రతిష్ట మసకబారుతున్న ట్రంప్‌కు జై కొట్టాలో అని పార్టీశ్రేణులు మదనపడుతున్నాయి. ఇద్దరు నేతల మధ్య పోరు ఇప్పుడు రిపబ్లికన్లకు ఆందోళన కలిగిస్తోంది. వర్గపోరు కాస్తా డెమొక్రాట్లకు మేలు జరుగుతుందని రిపబ్లికన్లు వాపోతున్నారు.
తాజా మధ్యంతర ఎన్నికల ఫలితాలు డెమొక్రాట్లకు ఏమంత పెద్ద అనుకూలంగా లేవు. సెనేట్‌లో కేవలం రెండు స్థానాలతోనే ఆధిక్యాన్ని సాధించారు. అయితే ఇది అధ్యక్షుడు బైడెన్‌కు అనుకూలించే అంశమే. మిగతా రెండేళ్ల కాలంలో సెనేట్‌లో ప్రభుత్వానికి ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా చూసుకొవచ్చు. రిపబ్లికన్లు పైచేయి సాధించి ఉంటే బైడెన్ ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి బిల్లును అడ్డుకునే అవకాశం లభించేది. పైగా వైట్ హౌస్ అధికారులపై నేరుగా దర్యాప్తునకు ఆదేశించే అవకాశం దక్కేది. ఈ పరిస్థితి నుంచి బైడెన్ గట్టెక్కారు. దీంతో డెమొక్రాట్ పార్టీ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు. కానీ కాంగ్రెస్‌లో మాత్రం ఇప్పటికే రిపబ్లికన్ల ఆధిక్యం కొనసాగుతోంది. ఇదిలా ఉంటే తాజా ఫలితాలతో రిపబ్లికన్ల వేవ్‌కు మాత్రం బైడెన్ అడ్డుకట్ట వేసినట్టయ్యింది. 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న బైడెన్‌కు తాజా ఫలితాలు లైన్ క్లియర్ చేసినట్టు అయ్యింది. మరోసారి బైడెన్‌నే అధ్యక్ష అభ్యర్థిగా డెమొక్రాట్లు ప్రతిపాదించే అవకాశం ఉంది. అయితే బైడెన్ వయస్సు, ఆయన వ్యాఖ్యలు, ప్రవర్తించే తీరును అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారు. ఇది బైడెన్‌కు ప్రతికూల అంశం. అయితే డెమొక్రాట్లలో ఇప్పటికిప్పుడు స్టార్ లీడర్ అంటూ ఎవరూ లేరు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ ఉన్నా ఆమెకు అంత సీన్ లేదంటున్నారు అమెరికా రాజకీయ విశ్లేషకులు.
అయితే రిపబ్లికన్ పార్టీలో మాత్రం ట్రంప్‌కు అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. పార్టీలో వ్యతిరేకత, డిశాంటిస్ వైపు రిపబ్లికన్లు మొగ్గుచూపుతుండడం ట్రంప్‌ను టెన్షన్ పెడుతోంది. 2023 చివరి నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో? ట్రంప్ వైపే రిపబ్లికన్లు మొగ్గుచూపుతారా? అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే భారీగా డబ్బున్న ట్రంప్ ఎన్నికలకు నిధులను భారీగా కేటాయించే అవకాశం ఉంది. అందుకే రిపబ్లికన్లు పలువురు ట్రంప్ వైపు చూస్తున్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire