అన్ని వైపుల నుండి కుమ్మేస్తున్న సెకండ్ వేవ్.. అసలు జంతువులకు ఎలా కరోనా సోకుతోంది..?
COVID-19 in Animals: ప్రపంచం ప్రమాదం అంచుకు చేరుతోంది. జీవరాశుల ఉనికికే ఇప్పుడు పెనుముప్పు ఏర్పడింది.
COVID-19 in Animals: ప్రపంచం ప్రమాదం అంచుకు చేరుతోంది. జీవరాశుల ఉనికికే ఇప్పుడు పెనుముప్పు ఏర్పడింది. మానవాళిని కాటేస్తున్న కరోనా ఇప్పుడు మూగ జీవాలను కూడా వదలడం లేదు. ఇప్పుడు వ్యాక్సిన్లు మానవాళికే కాదు జంతుజాలానికి కూడా వేయాల్సిన పరిస్ధితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న కేసులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
ఇప్పటికే కోట్లాది మంది మృత్యువాత పడ్డారు. ఇంకా మరణం అంచులకు చేరుతున్న వారూ ఎంతో మంది ఉన్నారు. ఏడాదిగా ఇదే భయం. ప్రాణాలు అరచేతిలో పెట్టుకు బతకాల్సిన పరిస్ధితులు. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా అందరికీ అందక పోవడంతో అదో ఆందోళన. దీనికి తోడు ఇప్పుడు కొత్త భయం ప్రపంచాన్ని వణికిస్తోంది. జంతు జాలానికి కూడా కరోనా వ్యాపిస్తుండడంతో తీవ్ర భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా పెంపుడు జంతువులు పశువులతో పాటు జూ సంరక్షణలో ఉన్న జంతువులలో కూడా కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి.
మానవాళికి సోకుతున్న కరోనాపైనే ఇప్పటి వరకు సమగ్ర పరిశోధనలు జరగలేదు. జంతువులకు సోకుతున్న వాటిపై కూడా పెద్దగా దృష్టి పెట్టింది లేదు. దీంతో ఇప్పుడు పరిస్ధితి పూర్తిగా దిగజారిపోతోంది. అనేక దేశాల్లో పెంపుడు జంతువులైన పిల్లులు, కుక్కలు, కోళ్ళు కరోనా ఇన్ఫెక్షన్ కు గురైన సందర్భాలు బయట పడ్డాయి. కరోనా వ్యాప్తి లోకి వచ్చిన తొలినాళ్ళలోనే బ్రిటన్ లో ఓ పిల్లికి కరోనా సోకిన కేసు వెలుగు చూసింది. అయితే మానవాళికి సోకే కరోనా తీవ్ర లక్షణాలు మాత్రం వాటిలో కనిపించలేదన్నది వైద్యుల వాదన. ఇలా ఎన్నో కేసులు ఒకటొకటిగా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. న్యూయార్క్ లోని బ్రాంక్స్ జంతు సంరక్షణా కేంద్రంలో ఓ పులికి కరోనా సోకినట్లు తేలింది. ఈ ఘటనతో అనేక కేసులు వరుసగా బయటపడ్డాయి. అలాగే కాలిఫోర్నియాలోని మరో జూలో పెద్ద సంఖ్యలో గొరిల్లాలు కూడా కరోనా బారిన పడ్డాయి. అసలు జంతువులకు ఎలా కరోనా సోకుతోంది..? గాలి ద్వారానా లేక జూ సంరక్షకుల ద్వారానా నీటి ద్వారానా ఇలా అనేక అంశాలపై పెద్ద ఎత్తున అధ్యనం జరిగింది. దీంట్లో తేలింది ఏమిటంటే జూలో కీపర్లుగా పని చేస్తున్న వారి వల్లే జంతువులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అయితే జంతువుల నుండి కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు కూడా ఉన్నాయా అన్నదే ఇప్పుడు భయం గొలుపుతున్న అంశం.
కరోనా సోకకుండా ఉండేందుకు మానవాళి అనేక జాగ్రత్తలు పాటిస్తోంది. సామాజక దూరం, శానిటైజేషన్, మాస్క్ వంటి ప్రాధమిక జాగ్రత్తలు అందులో ముఖ్యమైనవి. మరి జంతువులకు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి. వాటికి ఇచ్చే ఆహారం ఎలా ఉండాలి. మూగ జీవాల మనో వేదన ఇప్పుడు భరించలేని విధంగా మారింది. ఈ అంశాలపై కూడా పరిశోధకులు దృష్టి పెట్టారు. జంతువలకు వ్యాక్సిన్లు ఇవ్వాలా లేక ఇతర మందుల ద్వారా పరిస్ధితి అధిగమించొచ్చా అన్నదానిపై పెద్ద ఎత్తున అధ్యయనం జరుగుతోంది. ఇప్పుడిప్పుడే భారత్ లో కూడా జంతుజాలానికి కరోనా సోకుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇదే ఇప్పుడు అందరినీ కలవర పరుస్తున్న అంశం.
మానవులకు సోకినట్లు జంతువులకు కూడా ఇన్ఫెక్షన్లు సోకుతాయా..? హైదరాబాద్ జూలో ఎనిమిది సింహాలకు కోవిడ్ లక్షణాలు బయటపడ్డంతో ఇప్పుడు తీవ్ర ఆందోళన మొదలైంది. సెకండ్ వేవ్ ఎవరినీ వదలడం లేదు. దీంతో కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాలతో పార్కులన్నింటినీ మూసి వేశారు. జూ పార్క్ లలో సందర్శకులను అనుమతించడం లేదు. దీంతో జంతువులకూ వ్యాక్సిన్లు వేయాల్సిన అవసరం ఏర్పడుతోందా.. ?
జంతువులకూ కరోనా సోకుతుండడంతో వాటి ప్రభావం మానవాళిపై ఎలా ఉంటుందోనన్న భయం పెరుగుతోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వ్యాధి తీవ్రత అధికంగా ఉంది. సెకండ్ వేవ్ అన్ని వైపుల నుండి కుమ్మేస్తోంది. ముఖ్యంగా ఈసారి భారత్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. మొదటి దశ నుండి బయటపడ్డా ఇప్పుడు మాత్రం వదలడం లేదు. జంతువులకు కూడా సోకిన వైనం బయటపడ్డంతో ఆందోళన మరింత పెరింగిది. హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో ఎనిమిది సింహాలలో కరోనా వ్యాధి లక్షణాలు బయటపడ్డంతో వాటి శాంపిల్స్ ను పరీక్షల నిమిత్తం సీసీఎంబీకి పంపారు. వాటి రిపోర్టులు వస్తే కానీ విషయం ఏంటన్నది తెలియదు.
ప్రపంచ వ్యాప్తంగా మింక్ అనే జంతువులో ఎక్కువగా కరోనా లక్షణాలు బయట పడ్డాయి. మింక్ ఫామ్ముల్లో ఎక్కువగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తీవ్ర అనారోగ్యం పాలై పెద్ద సంఖ్యలో మింక్ లు చనిపోయాయి. ముఖ్యంగా డెన్మార్క్ ను కరోనా ఓ కుదుపు కుదిపేసింది. ఆ సమయంలో వ్యాధి తీవ్రతను అరికట్టేందుకు లక్షల సంఖ్యలో మింక్ లను చంపేశారు. అంతేకాదు ఓ ఏడాది పాటు మింక్ ఫామ్ ల ఏర్పాటుపై కూడా డెన్మార్క్ తీవ్ర నిషేధం విధించింది. మింక్ ల ద్వారా కరోనా బాగా వ్యాపించిందని అక్కడ వైద్య నిపుణులు నిర్ధారించారు. ఈ పరిణామమే ఇప్పుడు ప్రపంచాన్ని ఓ భయంలోకి నెట్టేసింది. దీంతో రష్యా అన్ని దేశాల కంటే ఓ అడుగు ముందుకు వేసిందిజంతువులలో ఇన్ఫెక్షన్లను అరికట్టడానికి దాదాపు 19 వ్యాక్సిన్ల తయారీపై దృష్టి పెట్టింది. ఇప్పటికే కార్నివాక్-కోవ్ అనే వ్యాక్సిన్ జంతువుల కోసం తయారు చేసింది. అందుబాటులోకి తెచ్చింది. అగ్రికల్చరల్ రెగ్యులేటరీలో నమోదు చేసిన ఈ వ్యాక్సిన్ కు సంబంధించి క్లినికల్ ట్రయిల్స్ కూడా పెద్ద ఎత్తున జరిగాయి. ఈ వ్యాక్సిన్ వివిధ జంతువుల్లో యాంటీబాడీలను ఉత్పత్తి చేసినట్టు గుర్తించారు. దీంతో ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి పెద్ద ఎత్తున జరుగుతోంది.
జంతువులకు సోకే కరోనా అనేక రకాలుగా రూపాంతరాలు చెంది మరింత ప్రమాదకరంగా మనుషులకు సోకే అవకాశాలు లేకపోలేదన్నది ఓ అభిప్రాయం. దీంతో మరింత జాగ్రత్తలపై ఇప్పుడు దృష్టి పెట్టారు. దేశంలో పెండు జంతువులు పెంచుకుంటున్న వారి సంఖ్య చాలా ఎక్కువ. అలాగే వ్యవసాయంపై ఆధారపడి జీవించే వారు కూడా అధికం. పశువులు పెంచుకుంటున్న వారిలో ఇప్పుడు భయం తీవ్రంగా మారింది. నిత్యం పశువుల సంరక్షణలో గడిపే వారి ఆరోగ్య పరిస్ధితిపై ఆందోళన పెరుగుతోంది. అంతేకాకుండా మనుషులకు వచ్చే శ్వాసకోశ వ్యాధుల వల్ల కొన్ని జంతువులకు కూడా ముప్పు తప్పదన్న హెచ్చరికలు వస్తున్నాయి. కోతులు ఈ బారిన పడే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. దీంతో భారత్ లో జంతువులకు కూడా వ్యాక్సిన్ తీసుకు రావాల్సిన ఆవశ్యకత అత్యవసరంగా మారింది. అయితే ఇప్పుడున్న పరిస్ధితుల్లో అది సాధ్యమేనా అన్నది ప్రశ్నార్ధకంగా మారుతోంది. ఇప్పటికే దేశ ప్రజలందరికీ టీకాలు అందని పరిస్ధితి. వ్యాక్సిన్ కొరత కారణంగా ఇంకా కోట్లాది మంది టీకాలు వేయించుకోలేదు. ఇలాంటి స్ధితిలో జంతు జాలానికి టీకాలంటే అయ్యే పనేనా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే జంతువులలో వ్యాధి సోకకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని కూడా గుర్తు చేస్తున్నారు.
ఆకలి మందగించడం.. జలుబు.. దగ్గు.. జ్వరం వంటి లక్షణాలతో 10 రోజులుగా ఎనిమిది సింహాలు నరకయాతన అనుభవిస్తున్నాయి. పరీక్షలలో వీటికి కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలింది. వెంటనే శాంపిల్స్ సేకరించారు. నిర్ధారణ కోసం సీసీఎంబీకి పంపారు. ఇప్పుడు మిగతా జంతువుల పరిస్ధితిపై ఆందోళన మొదలైంది. అసలు జంతువులకు కరోనా సోకుతుందా.. ? వాటి నుండి మిగతా వాటికి వ్యాప్తి చెందే అవకాశం ఉందా.. ?
330 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో ఇప్పుడు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఇక్కడ మొత్తం 12 సింహాలు ఉంటే వాటిలో ఎనిమిది సింహాలు పది రోజులుగా తీవ్ర అస్వస్ధతకు గురయ్యాయి. ఇందుకు కారణాలను పరిశీలిస్తే కరోనాగా అనుమానాలు మొదలయ్యాయి.
జంతువులలో కరోనా వ్యాపించే అవకాశాలు నూటికి నూరు పాళ్ళు ఉన్నాయని పశువైద్య నిపుణులు అంటున్నారు. అయితే లక్షణాలు స్వల్పంగా ఉంటాయని చెబుతున్నారు. వీటివల్ల మనుషులకు వ్యాపించే అవకాశాలను కొట్టి పారేస్తున్నారు. పెంపుడు జంతువుల విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. గతంలో బర్డ్ ఫ్లూ , నిఫా వంటి వైరస్ లు అన్నీ జంతువులు నుండి జంతువులకే సంక్రమించాయి. కానీ ఇప్పుడు పరిస్ధితి అలా లేదు. అయితే కరోనా పక్షులకు, పౌల్ట్రీలలో ఉండే వాటికి సంక్రమించే అవకాశమే లేదని అంటున్నారు మరికొందరు నిపుణులు చెబుతున్న మాట.
మానవులకు సోకుతున్న వైరస్ పై ఎలాంటి అద్యయనం జరుగుతోందో అలాగే జంతుజాలంలో వ్యాపిస్తున్న వైరస్ పై కూడా సమగ్ర అధ్యయనం జరగాల్సి ఉందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా వైల్డ్ యానిమల్స్.. పెంపుడు జంతువుల విషయంలో జాగ్రత్తలు అవసరం అంటున్నారు. ఏదైనా భయం భయమే. జంతువైనా.. మనిషైనా ప్రాణం ప్రాణమే. ఇప్పుడున్న పరిస్ధితుల్లో వేటి విషయంలో వాటికి జాగ్రత్తలు పాటించాల్సిందే. అజాగ్రత్తగా ఉంటే .. అందరికీ ప్రమాదమే.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire