గబ్బిలం నుంచి కాదు.. చైనా 'వ్యూహన్' నుంచే వైరస్ వ్యాప్తి !
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న కరోనా మహమ్మారికి బీజం ఎక్కడ పడిందనే అంశం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. వైరస్ పుట్టుకకు కారణాల పరిశోధనలో...
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న కరోనా మహమ్మారికి బీజం ఎక్కడ పడిందనే అంశం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. వైరస్ పుట్టుకకు కారణాల పరిశోధనలో డ్రాగన్ కంట్రీ టార్గెట్ గా మారుతోంది. ఇంతకీ ప్రపంచ దేశాల చూపు సీ ఫుడ్ మార్కెట్ నుంచి వుహాన్ వైరాలజీ ఇన్ స్టిట్యూట్ కు ఎందుకు మళ్లింది..? కరోనా పుట్టకపై జరిగిన పరిశోధనలు ఏం చెబుతున్నాయి..?
కరోనా వైరస్ పుట్టుకకు వుహాన్ లోని ప్రయోగశాలే వేదికంటూ వాదనలు వినిపిస్తున్నాయి. వైరస్ వ్యాప్తిలో చైనా కుట్ర కోణం ఉందన్న విమర్శలూ పదునెక్కుతున్నాయి. ప్రపంచ దేశాలు అనుమానిస్తున్నట్లుగా ఈ వైరస్ వుహాన్‌లోని ప్రయోగశాల నుంచే లీకయిందా? వైరస్ వ్యాప్తి నిజంగా కుట్రేనా? వైరస్ వ్యాప్తిలో గబ్బిలాల పాత్ర ఎంత అనే అంశాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి.
సాధారణంగా మహమ్మారులు ప్రబలినప్పుడు పేషెంట్ జీరోను కనుక్కోవటం కీలకం. కానీ కొవిడ్-19 విషయంలో ఇది ఇప్పటికీ సాధ్యం కాలేదు. వుహాన్‌లోని హునాన్ సీఫుడ్ మార్కెట్‌లో రొయ్యలు విక్రయించే మహిళను కరోనా పేషెంట్ జీరోగా పేర్కొంటున్నా.. ఆ మహిళకు వైరస్ ఎలా సోకిందో మాత్రం తేలలేదు. గతంలో గబ్బిలాల నుంచి వైరస్ సోకిందని వార్తలు రాగా ఆ మార్కెట్లో గబ్బిలాలను విక్రయించరని ఫాక్స్ న్యూస్, ఎన్‌టీడీ మీడియా సంస్థలు తెలిపాయి.
అంతేకాదు వుహాన్‌లో డిసెంబర్ 1న నమోదైన తొలికేసుకు సీఫుడ్ మార్కెట్ కు ఎలాంటి సంబంధం లేదని మెడికల్ జర్నల్ 'ది లాన్సెట్ ప్రచురించింది. ఇక తొలి 41 కొవిడ్ కేసుల్లో 14 మందికి కూడా ఈ మార్కెట్‌తో నేరుగా సంబంధం లేదు. డిసెంబర్ 10న నమోదైన మరో 3 కేసుల్లో కూడా రెండింటికి ఈ మార్కెట్‌తో సంబంధం లేదు. దాంతో వైరస్ వుహాన్ ల్యాబ్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ టార్గెట్ చేయటంతో వుహాన్ వైరాలజీ ఇన్ స్టిట్యూట్ వివాదాల్లో చిక్కుకుంది. అయితే ఈ వైరస్ అమెరికా నుంచి వచ్చిన సైనికులు వ్యాప్తి చేశారని చైనా ప్రచారం చేసింది. ఆ తర్వాత ఈ వైరస్ ఇటలీ నుంచి వ్యాపించిందంటూ చైనా పత్రికలు కథనాలు రాశాయి.
అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లపై పరిశోధనలు చేసేందుకు వుహాన్ లో పీ4 స్థాయి పరిశోధనశాలను నిర్మించారు. సార్స్ ప్రబలిన తర్వాత ఈ ల్యాబ్ నిర్మాణానికి చైనా శ్రీకారం చుట్టింది. 3 వేల చదరపు మీటర్ల వైశాల్యంలో నిర్మించిన ఈ ల్యాడ్ కు ఫ్రాన్స్‌కి చెందిన అలైన్ మెరియక్స్ కన్సల్టెంట్‌గా వ్యవహరించింది. 2018లో వినియోగంలోకి వచ్చిన ఈ ల్యాబ్ లో దాదాపు 15వందల రకాల వైరస్‌లను నిల్వచేసి పరిశోధనలు చేస్తున్నారు. ఇక్కడకు విదేశాల నుంచి అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లను తరలించినట్లు 2019లో ఆరోపణలు వచ్చాయి. ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దీనికి అమెరికా నుంచి ఆర్థిక సాయం కూడా అందగా గతంలో పలువురు అమెరికా పరిశోధకులు ల్యాబ్ ను సందర్శించారు. కానీ కరోనా ప్రబలిన వెంటనే అంతర్జాతీయ పరిశోధకులను పీ4 ల్యాబ్‌కు రానివ్వకుండా అడ్డుకుంది చైనా.
సీఫుడ్ నుంచి కరోనా వచ్చిందనడానికి బలమైన కారణాలేమి లేకపోవటంతో ఇప్పుడు వేళ్లన్నీ వుహాన్ వైపే చూపిస్తున్నాయి. కరోనా చైనాలోనే పుట్టిందని చెప్పటానికి ఆధారాలు లేవు. అయినా చైనాపై విమర్శలు పెరగటానికి కారణాలేంటి..? చైనా తీసుకున్న నిర్ణయాలే అందుకు కారణమవుతున్నాయా..?
కరోనా ప్రారంభంలోనే చైనా పీ4 ల్యాబ్ కు ఇతర దేశాల పరిశోధకులను రాకుండా కట్టడి చేసింది. అంతేకాదు ఈ వైరస్ గురించి ముందుగా బయటపెట్టిన వైద్యుడు వెన్‌లియాంగ్‌ను వేధించి జైల్లో పడేసింది. ఆ తర్వాత విషయం తెలుసుకుని అతన్ని విడిచిపెట్టినా ఆ తర్వాత కరోనా ఉపద్రవం గురించి బయటి దేశాలను కనీసం అలర్ట్ చేయలేదు. ఇదే ఇప్పుడు అన్ని దేశాల వాదన. కరోనా ప్రబలిందన్న విషయాన్ని చైనా చెప్పకపోవటం ఇందులో కుట్రకోణం దాగుందనే ఆరోపణలకు కారణమైంది.
కరోనా పుట్టుకపై జరుగుతోన్న పరిశోధనల గురించి ప్రభుత్వ ఆమోదం పొందాకే ప్రచురించాలని ఆ దేశానికి చెందిన రెండు యూనివర్శిటీలు నోటీసులిచ్చాయి. ఫుడాన్ యూనివర్సిటీకి చెందిన ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ కాలేజ్ ఏప్రిల్ 10న చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్ పంపిన నోటీస్‌ను పబ్లిష్ చేసింది. అయితే చైనా కరోనా గురించి ఏదో విషయం దాస్తోందన్న అనుమానాలు రేకెత్తటంతో ఈ నోటీసులను వెబ్ సైట్ నుంచి తొలగించింది. చైనా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియో సైన్సెస్ కూడా ఇలాంటి నోటీస్‌నే జారీ చేసి తర్వాత తొలగించింది.
చైనా ఎక్స్‌పర్‌మెంటల్ యానిమల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక్క హుబే ప్రావిన్స్‌లోనే 3 లక్షల జంతువులను వినియోగించి ప్రయోగాలు చేశారు. అయితే ఉపయోగించిన జీవులను ఆ తర్వాత ఉద్యోగులు విక్రయిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. లి నింగ్ అనే ఓ సైంటిస్ట్ ఇలా చేసినట్లు తేలడంతో జనవరి 2న 12 ఏళ్ల జైలు శిక్ష విధించారు. వుహాన్లోని పీ4 ల్యాబ్‌లో ఉపయోగించిన జీవిని కూడా ఇలా మాంసపు మార్కెట్‌కు తరలించారా? దాంతో కరోనా వైరస్ కూడా పరిశోధన శాలల నుంచి వచ్చిందనే ప్రచారం జోరందుకుంది. ఇక ల్యాబ్‌కు సంబంధించిన ఏ సమాచారం బయటకు పొక్కడానికి వీల్లేదని జనవరిలో ల్యాబ్ డైరెక్టర్ జనరల్ ఉద్యోగులకు మెయిల్ చేసినట్లు 'ది ఎపోక్ టైమ్స్' తెలిపటం కూడా చైనా తీరుపై అనుమానాలు పెంచాయి.
2018 జనవరిలో పీ4 ల్యాబ్‌ను సందర్శించిన అమెరికా నిపుణులు అక్కడి లోపాలను గమనించి తమ దేశానికి సమాచారం అందించారు. ఈ వార్తను వాషింగ్టన్ పోస్టు ప్రచురించింది. అదే ఏడాది మే 29 న చైనాడైలీ తన ట్విట్టర్‌లో కొన్ని ఫోటోలు పోస్టు చేసింది. అందులో వైరస్‌లను భద్రపర్చే రిఫ్రిజిరేటర్ సీల్ ఊడిపోయి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఫొటోలను రీసెంట్ గా 'ది సన్ అనే పత్రిక వెలుగులోకి తీసుకురావటం కలకలం రేపుతోంది. వుహాన్ ల్యాబ్ లో నిర్లక్ష్యం కారణంగా కూడా వైరస్ వ్యాపించి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక వుహాన్ ల్యాబ్ నుంచి వైరస్ పుట్టిందనే వివాదంలో ఓ మహిళా సైంటిస్ట్ పేరు బలంగా వినిపిస్తోంది. ఆవిడే 'షి జియాంగ్‌లీ. గబ్బిలాల్లోని కరోనా వైరస్‌లపై పరిశోధనలు చేస్తోన్న ఆమెని చైనాలో బ్యాట్ ఉమన్ అని పిలుస్తారు. కరోనా వైరస్ అటాక్ చేయటానికి గ్వాంగ్‌డాంగ్, గ్వాంగ్‌జీ, యునాన్ ప్రావిన్స్‌లు అనుకూలంగా ఉంటాయని వుహాన్ లో ప్రబలుతుందని అనుకోలేదని ఈ బ్యాట్ ఉమన్ చెప్పటం చైనాపై వస్తోన్న ఆరోపణలను బలపరిచాయి. కరోనా వుహాన్ ల్యాబ్ నుంచి లీక్ కాలేదు కదా? అని షి జియాంగ్ లీ అన్నట్లు సైంటిఫిక్ అమెరికన్ పత్రిక పేర్కొంది. ఈ వ్యాఖ్యలు దుమారం రేపటంతో ఆమె తనపై వస్తోన్న వార్తలను ఖండించారు.
2010లో కరోనా వైరస్ స్పైక్ ప్రొటీన్‌పై పరిశోధనలు చేసిన షి జియాంగ్ లీ.. మనిషిలోని ఏసీఈ2 రిసెప్టర్లకు ఈ వైరస్ సోకగలదని గుర్తించింది. 2013లో ఈ విషయాన్ని ధ్రువీకరించింది. చైనాలో తొలి కేసు నమోదైన కొద్ది రోజుల్లోనే జన్యు క్రమాన్ని కనుగొన్నారు. అయితే అప్పట్లో ఆ విషయం బయటకు రాకుండా ఆపేసింది చైనా.
ఇక కరోనా వ్యాప్తి చేసిందంటూ చైనాపై ప్రపంచ దేశాల విమర్శలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే తమ ల్యాబ్ నుంచి కరోనా వచ్చే అవకాశమే లేదంటోంది చైనా. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి నిజంగా కుట్రేనా? నిపుణులు ఏమంటున్నారు? అనేవి ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి.
కొవిడ్-19 మహమ్మారికి కారణమైన సార్స్-కోవ్-2 వైరస్ ఎక్కడ్నుంచి వచ్చిందన్న దానిపై అంతర్జాతీయ దుమారం చెలరేగింది. తాజాగా నోబెల్ బహుమతి గ్రహీత లుచ్ మౌంటెనియర్ కూడా కరోనా వైరస్ లక్షణాలు సహజసిద్ధంగా లేవని చెప్పటం చైనాపై ఆరోపణలకు బలం చేకూర్చాయి. వుహాన్ ప్రయోగశాలలో పెను ప్రమాదం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచి ప్రబలిందనడానికి ఆధారాల్లేవని ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఫ్రాన్స్ ప్రెసిడెన్షియల్ ఆఫీస్ ప్రకటన విడుదల చేసింది. ఇక అమెరికా అత్యుత్తమ డాక్టర్లలో ఒకరైన ఆంథోనీ ఫౌచీ కూడా ఈ వైరస్ ల్యాబ్ నుంచి వచ్చిందన్న ఆరోపణలను కొట్టిపారేశారు. ఈ వైరస్ ల్యాబ్ నుంచి వచ్చిందనడానికి ఆధారాల్లేవని లండన్‌లోని కింగ్స్ కాలేజీకి చెందిన బయోసెక్యూరిటీ పరిశోధకురాలు ఫిలిప్పా లెంట్జోస్ వెల్లడించారు.
చైనా కావాలని చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. వైరస్ విషయంలో ఏదో తేడా జరిగిందని చైనాకు తెలుసన్నారు. అమెరికాతో పోలిస్తే చైనాలోనే ఎక్కువ మంది ఈ మహమ్మారికి బలై ఉంటారన్నారు ట్రంప్. ఇక ట్రంప్ కు మద్దతిచ్చిన ఆస్ట్రేలియా కరోనా పుట్టుకపై స్వతంత్ర్య దర్యాప్తు జరపాలని కోరింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సంక్షోభాన్ని ఎదుర్కొన్న తీరుపై కూడా విచారణ జరపాలంది.
పరిశోధనల తీరు, వైరస్‌లు, నమూనాలను నిర్వహించే విధానంపై తమకు పూర్తి అవగాహన ఉందని వుహాన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ డైరెక్టర్ జనరల్ యువాన్ జిమింగ్ తెలిపారు. ల్యాబ్ లో కఠిన నియంత్రణలున్నాయని తమ దగ్గర నుంచి బయటకు వచ్చే అవకాశాల్లేవన్నారు. కరోనా కట్టడికి మేం చేపడుతున్న చర్యల్లో, శాస్త్రీయ పరిశోధనల్లో జోక్యం చేసుకోవాలనే లక్ష‌్యంతో ఆరోపణలు చేస్తున్నారన్నారు యువాన్ జిమింగ్. వైరస్ ను కృత్రిమంగా తయారు చేయటం అసాధ్యమని తేల్చిచెప్పారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire