పలు దేశాల్లో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా వైరస్.. ఒక్కరోజే 4లక్షలకు పైగా కేసులు

Coronavirus and Omicron Cases Increasing day by day in some Countries | Coronavirus Live Updates
x

పలు దేశాల్లో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా వైరస్.. ఒక్కరోజే 4లక్షలకుపైగా కేసులు

Highlights

Coronavirus: చైనాలో 5వేలకుపైగా రోజువారీ పాజిటివ్ కేసులు...

Coronavirus: తగ్గినట్లే తగ్గిన కరోనా.. మళ్లీ విజృంభిస్తున్నట్లే కన్పిస్తోంది. కోవిడ్ పుట్టినిల్లుగా భావిస్తోన్న చైనాలో ఎప్పుడూ లేనన్ని కొత్త కేసులు నమోదవుతుండగా.. దక్షిణ కొరియాను వైరస్ వణికిస్తోంది. అంతేకాదు రికార్డు స్ధాయిలో కేసులు బయటపడుతున్నాయి. ఏకంగా 4లక్షలకుపైగా కేసులు వెలుగుచూశాయి. స్టెల్త్ ఒమిక్రాన్ రూపంలో కోవిడ్ మహమ్మారి చైనాను మళ్లీ వణికిస్తోంది. రెండేళ్ల తర్వాత తొలిసారి.. చైనాలో ఒక్కరోజే అత్యధికంగా 5వేల 280 కేసులు నమోదయ్యాయి.

కొత్త కేసు ఒక్కటీ రాకూడదన్న వ్యూహంతో రెండేళ్లకుపైగా కోవిడ్ ను కట్టడి చేస్తూ వస్తోన్న డ్రాగన్ కు ఈ వేరియండ్ దడ పుట్టిస్తోంది. వరుసగా ఆరో రోజు వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. ఒక్కసారిగా కేసులు పెరుగుతుండటంతో చైనా 13 పెద్ద నగరాలను మూసివేసింది. 3 కోట్ల మందికి పైగా ప్రజలను లాక్ డౌన్ లో ఉంచింది. ప్రజారవాణాను నిలిపివేసింది. పలు నగరాల్లో ఆంక్షలు విధించింది.

వారం రోజుల్లోనే దక్షిణ కొరియాలో 23.58 లక్షల కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. దక్షిణ కొరియా తర్వాత వియత్నాంలో కరోనా ఉద్ధృతంగా వ్యాపిస్తోంది. వియత్నాంలో గడిచిన వారంలో 18లక్షల మంది మహమ్మారి బారిన పడ్డారు. ఇక చైనా, దక్షిణ కొరియా, వియత్నాం దేశాల్లో మళ్లీ మహమ్మారి విజృంభించడానికి ఒమిక్రాన్ బీఏ.2 సబ్ వేరియంట్ కారణం అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఇక తాజాగా ఇజ్రాయెల్ లో కొత్త వేరియంట్ గుర్తించారు. బెన్ గురియన్ విమానాశ్రయానికి చేరిన ఇద్దరు ప్రయాణీకులకు పీసీఆర్ టెస్ట్ నిర్వహించగా కొత్త వేరియంట్ సంగతి తెలిసిందని ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలియజేసింది. ఒమిక్రాన్ కు చెందిన ఉప వేరియంట్ లు బీఏ.1, బీఏ.2ను కొత్త వేరియంట్ కలిగి ఉన్నట్లు వెల్లడించింది. కాగా రెండు వేరియంట్ల కరోనా గురించి తెలిసిందేనని, ఈ కొత్త వేరియంట్ వల్ల ముప్పు ఉండకపోవచ్చని ఇజ్రాయెల్ తెలియజేసింది.

మళ్లీ వైరస్ విజృంభిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్ధ స్పందించింది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వ్యాప్తి ఇంకా తీవ్రస్థాయిలోనే ఉందని, స్వల్ప విరామం తర్వాత వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయని వెల్లడించింది. ముఖ్యంగా కరోనా నిబంధనలు తొలగించిన ప్రాంతాల్లో వైరస్ తిరగబడుతోందని హెచ్చరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories