Covid-19: ప్రపంచంపై మళ్లీ కొవిడ్‌ పంజా

Corona Cases Increases in Worldwide
x

ప్రపంచంపై మళ్లీ కొవిడ్‌ పంజా(ఫైల్ ఫోటో)

Highlights

*బ్రిటన్‌లో నిత్యం 40 వేలకు పైనే కేసులు *రష్యాలో కార్యాలయాలకు సెలవులు *చైనాలో బడుల మూత.. విమానాల రద్దు

Covid-19: కరోనా వైరస్‌ మళ్లీ పంజా విసురుతోంది. పలు దేశాల్లో కొవిడ్‌ కేసులు, మరణాలు క్రమంగా పెరుగుతున్నాయి. బ్రిటన్‌లో శుక్రవారం కొత్తగా సుమారు 50 వేల కేసులు నమోదయ్యాయి. రష్యా, ఉక్రెయిన్‌, రుమేనియాల్లో కొవిడ్‌ తీవ్రత ఎక్కువవుతోంది. చైనాలోనూ మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. దీంతో అక్కడి ప్రభుత్వం కొవిడ్‌ ఆంక్షలను కఠినతరం చేసింది. ప్రజలకు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్లు అందకపోవడం, కరోనా కొత్త వేరియంట్ల వ్యాప్తి తీవ్రంగా ఉండటమే ఇందుక్కారణమని భావిస్తున్నారు.

రష్యాలో శుక్రవారం 37,141 మంది వైరస్‌ బారిన పడ్డారు. ఆరోగ్యం విషమించి మరో 1,064 మంది మృత్యువుపాలయ్యారు. దీంతో అక్కడ మరణాల సంఖ్య 2,28,453కు చేరింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఎక్కడికక్కడ కొవిడ్‌ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అధ్యక్షుడు పుతిన్‌ అధికారులను ఆదేశించారు. వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్నచోట్ల శనివారం నుంచే లాక్‌డౌన్‌ అమలుచేసే అవకాశముందని వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఈనెల 30 నుంచి వచ్చేనెల 7 వరకూ కార్యాలయాలను మూసివేస్తామని ప్రకటించారు.

మాస్కోలో ఈనెల 28 నుంచి లాక్‌డౌన్‌ అమలు చేయనున్నారు. దేశంలో ఇప్పటివరకూ 45% మందికే పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ అందించారు. ఉక్రెయిన్‌లో శుక్రవారం కొత్తగా 23,785 కేసులు, 614 మరణాలు నమోదయ్యాయి. ఇక్కడ ఫైజర్‌, మోడెర్నా, ఆస్ట్రాజెనికా, సినోవాక్‌ టీకాలు అందుబాటులో ఉన్నా, కేవలం 15% మంది మాత్రమే పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ తీసుకున్నారు. యూరప్‌లో అర్మేనియా తర్వాత అత్యంత మందకొడిగా టీకా కార్యక్రమం సాగుతున్నది ఉక్రెయిన్‌లోనే. దేశంలో ఇప్పటివరకూ సుమారు 27 లక్షల మంది కొవిడ్‌ బారిన పడగా, 63 వేల మంది మరణించారు. ఇరాన్‌, రుమేనియాల్లోనూ కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతోంది.

కరోనా పుట్టిల్లయిన చైనాలో ఐదు రోజులుగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దేశ వ్యాప్తంగా గురువారం 28, శుక్రవారం 32 కేసులు వెలుగుచూశాయి. షాంఘైకు చెందిన వృద్ధ దంపతులు, మరికొందరు పర్యాటకులు గాన్సు, ఇన్నర్‌ మంగోలియా, జియాన్‌ తదితర ప్రాంతాల్లో ఇటీవల పర్యటించారు. వీరందరికి కరోనా సోకినట్టు తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఒక్కకేసు కూడా ఉండకూడదన్న పట్టుదలతో, మళ్లీ ఎక్కడికక్కడ ఆంక్షలను కఠినతరం చేశారు.

కేసులు వెలుగుచూసిన చోట్ల బడులు, పర్యాటక ప్రాంతాలను మూసివేశారు. విమాన సర్వీసులను నిలిపివేశారు. లాంజోవ్‌ నగర ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని గట్టి ఆదేశాలు జారీచేశారు. అత్యవసరమై బయటకు వచ్చేవారు తప్పనిసరిగా కొవిడ్‌ నెగెటివ్‌ ధ్రువపత్రం చూపించాలని ఆదేశించారు. కేసులు అంతగా లేకపోయినా, కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories