Corona: బ్రిటన్‌, రష్యాలలో విరుచుకుపడుతున్న కరోనా

Corona Cases Increased in India China Britain Russia Countries
x

బ్రిటన్‌, రష్యాలలో విరుచుకుపడుతున్న కరోనా(ఫైల్ ఫోటో)

Highlights

* చైనాలో మళ్లీ కలకలం రేపుతున్న వైరస్ * కరోనా థర్డ్‌వేవ్‌పై భారత్‌లో భయాందోళనలు

Corona: అంతరాష్ట్ర, అంతర్జాతీయ రాకపోకలు ఇప్పుడు మామూలుగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు బ్రిటన్‌, రష్యాలలో విరుచుకుపడుతున్న వైరస్‌ భారత్‌లో ప్రవేశించడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చంటున్నారు. నిబంధనల ఉల్లంఘనలు ఇలాగే కొనసాగితే మూడోదశ ఉద్ధృతి తప్పదంటున్నారు.

రష్యా, బ్రిటన్‌లలో తాజాగా కరోనా కేసులు అమాంతంగా పెరుగుతున్నాయి. చైనాలోనూ మళ్లీ వైరస్‌ కలకలం రేపుతుంది. దీంతో థర్డ్‌ వేవ్‌ ముప్పు త్వరలోనే భారత్‌లోనూ ఉండనుందనే భయాందోళనలు మొదలయ్యాయి. దేశంలో కేసులు తగ్గుముఖం పడుతుండడంతో కొవిడ్‌ లేదనే భావన ప్రజల్లో నెలకొంది.

దీంతో మాస్కులు ధరించకపోవడం, సోషల్ డిస్టెన్స్‌ పాటించకపోవడం సాధారణమైంది. ఈ ధోరణి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెట్టేసే ప్రమాదముందని ఇప్పటికే రాష్ట్ర వైద్యశాఖ హెచ్చరించింది. సాధ్యమైనంత వేగంగా అర్హులైన వారంతా టీకాలను పొందాలని ఆరోగ్యశాఖ సూచిస్తోంది.

గత ఏడాది కొవిడ్‌ తొలిదశ మార్చిలో మొదలైనా.. ఉద్ధృతి మాత్రం మే నుంచి సెప్టెంబరు వరకూ కొనసాగింది. అయితే ఆర్నెల్ల తర్వాత సెకండ్ వేవ్ ఉద్ధృతి ఒక్కసారిగా మొదలైంది. డెల్టా వేరియంట్‌ ప్రవేశంతో ఈ ఏడాది మే-జూన్‌ మాసాల్లో తీవ్ర నష్టం జరిగిపోయింది.

రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారమే ఒక్కరోజులో గరిష్ఠంగా 10వేలకు పైగా కేసులు 50కిపైగా మరణాలు సంభవించాయి. కేవలం మూడు నెలల్లో చేసిన తీవ్ర నష్టం నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది.

గత మూడు నెలలుగా కేసుల సంఖ్య క్రమేణా తగ్గుతోంది. రాష్ట్రంలో కేసుల నమోదు 0.5 శాతం లోపే ఉంటోంది. రోజుకు 150-200లోపే కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇదే సమయంలో ఒకవైపు ఎన్నికలు, మరోవైపు పండుగలు, శుభకార్యాలు, ఇతర కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి.

సుమారు 80 శాతానికి పైగా ప్రజలు మాస్కులు ధరించడం లేదని వైద్యశాఖ చెబుతోంది. ఎవరూ సోషల్ డిస్టెన్స్ పాటించడంలేదు. ఈ తరహా నిర్లక్ష్యం మరో ఉద్ధృతికి కారణమయ్యే అవకాశాలకు దారితీస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories