China: చైనాను విడిచి వెళ్తున్న ధనవంతులు

China Tops List of Countries for Most Millionaires Moving Abroad
x

China: చైనాను విడిచి వెళ్తున్న ధనవంతులు

Highlights

China: చైనాలో చర్చనీయాంశంగా ధనవంతుల తీరు

China: జీరో కోవిడ్ విధానం చైనాను కుదిపేస్తోంది. వరుస లాక్‌డౌన్‌లతో పరిశ్రమలు మూతపడ్డాయి. పిల్లల చదువులు అటకెక్కాయి. ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లుతున్నా జిన్‌పింగ్ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. జీరో కోవిడ్ విధానంతో చైనా ధనవంతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వేలాది మంది సంపన్నులు దేశం విడిచి వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారు. వారి సంపదను సైతం విదేశాలకు తరలించేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నారట. దేశం విడిచి వెళ్లిపోతున్నట్టు షాంఘైకి చెందిన కోటీశ్వరుడు, ఎక్స్‌డీ గేమింగ్‌ కంపెనీ అధిపతి హువాంగ్ యిమెంగ్ తన ఉద్యోగులకు చెప్పడం చైనాలో చర్చనీయాంశంగా మారింది.

కోవిడ్‌ ప్రపంచాన్ని గడగడలాడించింది. కోట్ల మందిని బలిగొన్నది. 2020లో ఆ వైరస్‌ పేరు చెబితే జనం వణికిపోయేవారు. అయితే 2021లో ప్రారంభంలోనే వ్యాక్సిన్లు రావడంతో కోవిడ్‌కు అడ్డుకట్ట పడింది. మహా ప్రళయం నుంచి ప్రపంచం గట్టెక్కింది. కరోనా రూపాంతరం చెంది.. ఇప్పటికీ విజృంభిస్తోంది. టీకాలు తీసుకుంటుండడంతో వైరస్‌ బారిన పడి మృతి చెందుతున్న వారి సంఖ్య భారీగా పడిపోయింది. మొదట్లో ఉన్న భయం పోయింది. కరోనా వచ్చిందంటే ఎలాంటి భయం లేకుండా హాయిగా ఐసోలేషన్‌కు వెళ్లిపోతున్నారు. అవసరమైన జాగ్రత్తలు తీసుకుని వైరస్ బారి నుంచి బయటపడుతున్నారు. అయితే చైనాలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి పరిస్థితులు పాజిటివ్‌ అని తేలితే జిన్‌పింగ్‌ ప్రభుత్వం చేసే హడావిడి అంతా ఇంతా కాదు. 2020లో వైరస్‌ విజృంభిస్తున్న తొలినాళ్లలో కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం అంతకంటే ఎక్కువ హంగామా చేస్తోంది. ఒక గ్రామంలో ఒక కేసు నమోదైనా ఆ గ్రామం మొత్తాన్ని క్వారైంటైన్‌ కేంద్రాలకు తరలిస్తుంది. నెగటివ్‌ సర్టిఫికేట్‌ ఇప్పుడే తెచ్చుకున్నామని మొత్తుకున్నా అక్కడి అధికారులు వినరు ఇక క్వారంటైన్‌ కేంద్రాలైతే నరకాన్ని తలపిస్తున్నాయి. క్వారంటైన్‌ పేరు చెబితేనే చైనీయులు వణికిపోతున్నారు.

2020 కరోనా ఉపద్రవం మొదలైన నాటి నుంచి చైనాలో వరుస లాక్‌డౌన్‌లను అమలుచేస్తోంది జిన్‌పింగ్‌ ప్రభుత్వం. దీంతో ప్రజలకు తినడానికి తిండి లేక విలవిలలాడుతున్నారు. ఉపాధిలేకపోవడంతో ఆకలి కేకలతో వేలాది మంది విలవిలలాడారు. కరోనా ఎంతకీ కట్టడి కాకపోవడంతో జీరో కోవిడ్‌ విధానానికి చైనా శ్రీకారం చుట్టింది. ఒక్క కేసు నమోదైనా వేలాది మందికి కరోనా టెస్టులు చేస్తూ హడావిడి చేస్తుంది. ఇటీవల షాంఘై, బీజింగ్‌ ప్రావిన్స్‌ల్లో ఒక్కో వ్యక్తికి రోజు మూడుసార్లు కూడా కరోనా టెస్టులు చేసినట్టు కథనాలు వెలువడ్డాయి. పాజిటివ్‌ అని తేలితే బలవంతంగా క్వారంటైన్‌ కేంద్రాలకు తరలిస్తున్నారు. దీంతో నరకంలాంటి క్వారంటైన్‌కు వెళ్లడం కన్నా వైరస్‌తో చావడమే మేలన్న స్థితికి చైనీయులు వచ్చారు. కరోనా టెస్టును తప్పించుకునేందుకు పలువురు యత్నించారు. వారిని తన్ని మరీ పోలీసులు టెస్టులు చేయించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి.

జీరో కోవిడ్‌ ఇప్పుడు చైనా ధనవంతులను కూడా వణికిస్తోంది. వరుస లాక్‌డౌన్‌లతో తీవ్ర నష్టాల పాలవుతున్నామని పిల్లల చదువులు కూడా నాశనమవుతున్నాయని భావిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువుడుతున్నాయి. దేశ వ్యాప్తంగా 10వేల మంది చైనా ధనవంతులు ఇతర దేశాలకు వెళ్లిపోవాలని యోచిస్తున్నారట. స్విట్జర్లాండ్‌, ఇజ్రాయెల్‌, సింఘపూర్‌, ఆస్ట్రేలియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ వంటి దేశాలకు 4వేల 800 కోట్ల డాలర్ల సంపదను తరలించేందుకు యత్నిస్తున్నారట. విదేశాలకు వెళ్లేందుకు అవసరమైన ఇమ్మిగ్రేషన్‌, సంపదను తరలించేందుకు మేనేజర్లను ప్రత్యకంగా నియమించుకుంటున్నారు. ఇలాంటి వారి సంఖ్య ఇప్పుడు మూడు నుంచి ఐదు రెట్లకు పెరిగినట్టు తెలుస్తోంది. జీరో కోవిడ్‌ విధానాన్ని వ్యతిరేకించలేరు అక్కడి ధనవంతులు. ఒకవేళ వ్యతిరేకిస్తే ఏం జరుగుతుందో వారికి తెలుసు. అందుకే దేశం విడిచి వెళ్లిపోవాలని యోచిస్తున్నట్టు సమాచారం. వరుస లాక్‌డౌన్లతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని గత్యంతరం లేకే వెళ్లిపోతున్నామని అక్కడి ధనవంతులు చెబుతున్నారు.

తాజాగా చైనాకు చెందిన గేమింగ్‌ సంస్థ ఎక్స్‌డీ అధినేత, కోటీశ్వరుడు హువాంగ్‌ యిమెంగ్‌ తమ కుటుంబంతో సహా చైనా నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్టు ఉద్యోగులకు తెలిపారు. ఈ విషయం ఇప్పుడు చైనాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే హువాంగ్‌ యిమెంగ్‌ నేరుగా కోవిడ్‌ విధానాలపై వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. స్పెయిన్‌, పోర్చుగల్‌, ఐర్లాండ్‌లోని ఏదో ఒక దేశానికి వెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అత్యంత ఖరీదైన షాంఘై రెస్టారెంట్ల యజమాని హ్యారీ హు తనకున్న 20శాతం వాటాను విక్రయించారు. 30 లక్షల డాలర్లకు విక్రయించాడు. తాను కెనడాకు వెళ్లిపోతున్నట్టు ప్రకటించాడు. ఇటీవల విధించిన లాక్‌డౌన్లతో తాను ఆకలితో చావు అంచుల వరకు వెల్లొచ్చినట్టు హు తెలిపారు. దేశం విడిచి వెళ్లిపోవడం తనకూ బాధగానే ఉందని హు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ చైనాను విడిచి వెళ్లాలనుకునే ధనవంతులకు నిబంధనలు ఆటంకంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. చైనా నిబంధనల ప్రకారం ఏడాదిలో 50వేల యువాన్లను మాత్రమే విదేశీ కరెన్సీగా మార్చుకునే అవకాశం ఉంది. అయితే తమ ధనాన్ని క్రిప్టో కరెన్సీగా మార్చుకుని వెళ్లేందుకు యత్నిస్తున్నారు డ్రాగన్‌ కంట్రీ కోటీశ్వరులు. క్రిప్టో కరెన్సీకి చైనాలోనూ ఎలాంటి నిబంధనలు లేకపోవడమే కారణం.

అయితే చైనా నుంచి ధనవంతులు వెళ్లిపోవడానికి జిన్‌పింగ్‌ ప్రభుత్వం అనుమతిస్తుందా? ప్రశ్న అందరిలోనూ వ్యక్తమవుతోంది. దేశం విడిచి వెళ్లిపోవడం అంత అషామాషీ కాదని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంతమంది వెళ్లిపోతారో? ఎంత మందిని ధనవంతులను జిన్‌పింగ్ ప్రభుత్వం అడ్డుకుంటుందో వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories