Canada: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరో సంచలన నిర్ణయం.. భారతీయులపై ప్రభావం తప్పదా?

Canada: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరో సంచలన నిర్ణయం.. భారతీయులపై ప్రభావం తప్పదా?
x
Highlights

Canadian immigration policy: కెనడా ఇమ్మిగ్రేషన్ పాలసీలో కొన్ని లోపాలు ఉన్నాయని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో అంగీకరించారు. ప్రభుత్వం ఆ లోపాలను వేగంగా...

Canadian immigration policy: కెనడా ఇమ్మిగ్రేషన్ పాలసీలో కొన్ని లోపాలు ఉన్నాయని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో అంగీకరించారు. ప్రభుత్వం ఆ లోపాలను వేగంగా సరిదిద్దుకుని ఉంటే ఇంకా బాగుండేదన్నారు. కొంతమంది ఆర్థికంగా లాభం పొందడం కోసం కెనడా ఇమ్మిగ్రేషన్ ప్రోగ్రామ్‌ను వాడుకుంటున్నారని ట్రూడో ఆరోపించారు. అంతేకాకుండా ఇమ్మిగ్రేషన్ ప్రోగ్రామ్‌లో పలు మార్పులు తీసుకొస్తున్నట్లు ట్రూడో ప్రకటించారు. క్రమక్రమంగా పర్మినెంట్ రెసిడెంట్ వీసా, టెంపరరీ రెసిడెంట్ వీసా హోల్డర్స్ సంఖ్యను కూడా కుదించనున్నట్లు తెలిపారు. తాజాగా జస్టిన్ ట్రూడో తన యూట్యూబ్ ఛానెల్లో 7 నిమిషాల వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ట్రూడో చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ప్రస్తుత ఇమ్మిగ్రేషన్ పాలసీలో లొసుగుల కారణంగా కెనడాలో హౌజింగ్ సంక్షోభం, ఆర్ధికమాంద్యం సమస్యలు పెరిగిపోతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతిపక్షాలు కూడా పదేపదే ఇదే అంశాన్ని లేవనెత్తుతున్నాయి. దీంతో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా ఆ ఒత్తిడికి తలొగ్గక తప్పడం లేదనే వార్తలొస్తున్నాయి.

కెనడా ఇమ్మిగ్రేషన్ పాలసీలో మార్పులు

జస్టిన్ ట్రూడో చెప్పిన వివరాల ప్రకారం 2024 లో 485,000 వరకు పర్మినెంట్ రెసిడెంట్ వీసాలు అనుమతించనున్నారు. కానీ ఈ సంఖ్యను వచ్చే ఏడాది 20 శాతం తగ్గించి 3,95,000 కే కుదించనున్నారు. అలాగే, టెంపరరీ ఇమ్మిగ్రంట్స్ విషయంలో కూడా భారీ స్థాయిలో కోతలు ఉండనున్నాయి. మాస్టర్స్ డిగ్రీతో పాటు ఉపాధి కోసం కెనడాకు వెళ్లే విదేశీ విద్యార్థులు, ఇతర వృత్తి నిపుణులపై కెనడా సర్కారు తీసుకొచ్చే ఈ మార్పులు తీవ్ర ప్రభావం చూపనున్నాయి.

కంపెనీలు, యూనివర్శిటీలకు పెరిగిన ఆదాయం

కరోనావైరస్ మహమ్మారి తర్వాత ప్రపంచ దేశాలు ఆర్థిక మాంద్యం నుండి బయటపడుతుండగా, కెనడా మాత్రం ఎప్పటికంటే ఎక్కువ సంఖ్యలో ఇమ్మిగ్రంట్స్‌కి స్వాగతం పలికిందన్నారు. వృత్తి నిపుణుల కోసం విదేశీయులకు స్వాగతం చెప్పాం. కానీ కెనడా ఇచ్చిన ఆ అవకాశాన్ని కొన్ని పెద్ద కంపెనీలు, యూనివర్శిటీలు ఆదాయ మార్గంగా వాడుకున్నాయని ట్రూడో అభిప్రాయపడ్డారు. ప్యాండెమిక్ ముగిసిన తరువాత వృత్తి నిపుణుల కొరత తీరిన తరువాత ఇమ్మిగ్రేషన్ పాలసీ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సింది. కానీ అలా వేగంగా స్పందించడంలోనే తాము విఫలం అయ్యామని ట్రూడో అన్నారు.

భారతీయులే ఎక్కువ

కెనడాకు వెళ్లే విదేశీ విద్యార్థుల్లో భారతీయులే ఎక్కువ సంఖ్యలో ఉంటారని కెనడా ఇమ్మిగ్రేషన్ లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం కెనడాలోని అన్ని విద్యా సంస్థల్లో కలిపి 427,000 మంది ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు. కెనడాకు వచ్చే విదేశీ విద్యార్థులకు ఇబ్బందులు ఉండకుండా ఉండటం కోసం అక్కడి ప్రభుత్వం గతంలో ఫాస్ట్ ట్రాక్ స్టడీ వీసా ప్రోగ్రాం (SDS) ప్రవేశపెట్టింది. కానీ ఇమ్మిగ్రేషన్ పాలసీపై స్థానికంగా ఒత్తిడి పెరగడంతో కెనడా ఆ ఫాస్ట్ ట్రాక్ స్టడీ వీసా ప్రోగ్రాంను ఇటీవలే నిలిపేసింది. ఇక ఇప్పుడు ఏకంగా పర్మినెంట్ రెసిడెంట్ టెంపరరీ రెసిడెంట్ వీసాలపై కూడా నిబంధనలు కఠినం చేసేందుకు కెనడా సర్కారు సమాయత్తమవుతోంది. వచ్చే ఏడాది కెనడా పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో స్థానికుల నుండి వ్యతిరేకతను పోగొట్టేందుకే జస్టిన్ ట్రూడో ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కెనడా సర్కార్ వీసాల విషయంలో నిబంధనలు కఠినతరం చేసినట్లయితే, విదేశీ విద్య కోసం, ఉపాధి కోసం కెనడాకు వెళ్లే భారతీయులపై అది కొంత ప్రతికూల ప్రభావం చూపే అవకాశం లేకపోలేది ఓవర్సీస్ కన్సల్టెన్సీస్ చెబుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories