Whisky War: ముగిసిన విస్కీ వార్‌... 50 సంవత్సరాల నాటి వివాదం

Canada and Denmark settle ‘Whisky War’ with a Bottle Exchange
x

Whisky War: ముసిగి విస్కీ వార్‌... 50 సంవత్సరాల నాటి వివాదం

Highlights

Whisky War: డెన్మార్క్-కెనడా బార్డర్‌ వివాదమే విస్కీ వార్‌

Whisky War: విస్కీ వార్‌ ఈ యుద్ధం గురించి మీరు ఎప్పుడూ విని ఉండరేమో విస్కీ వార్‌ అంటే విస్కీ కోసం జరిపిన పోరాటం అనుకుంటే తప్పులో కాలేసినట్టే. విస్కీ వార్‌ అంటే 50 ఏళ్ల సరిహద్దు వివాదం రెండు దేశాల మధ్య పోరాటం ఒక్క బుల్లెట్‌ పేలలేదు ఒక్క ప్రాణమూ కోల్పోలేదు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో ఆ రెండు దేశాలు మేల్కొన్నాయి. శాంతియుత చర్చలతో వివాదాని పుల్‌స్టాప్‌ పెట్టాయి. చివరికి విస్కీ వార్‌కు ముగింపు పలికాయి. ఇంతకు ఆ రెండు దేశాలేవి? మధ్యలో విస్కీ ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.

కెనడా, డెన్మార్క్‌ దేశాల మధ్య 50 ఏళ్లుగా సరిహద్దు వివాదం రగులుతోంది. ఈ వివాదానికి కారణమైన 1.20 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణమున్న హాన్స్‌ ద్వీపాన్ని సమానంగా పంచుకునేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఆ మేరకు ఇరుదేశాల విదేశాంగ మంత్రులు ఒప్పందంపై సంతకాలు చేశాయి. సరిహద్దు వివాదాలను ఎలా పరిష్కరించుకోవాలో ఇతర దేశాలకు మేం చూపుతున్నాం మేము ఓ ఉదాహరణగా నిలుస్తున్నాం అన్నారు కెనడా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మెలనీ జోలీ ద్వైపాక్షిక చర్చల ద్వారా ఎంతటి వివాదాలనైనా పరిష్కరించుకోవచ్చని అదే సరైన మార్గమని ఆమె వివరించారు. ఒప్పందం అనంతరం సంప్రదాయబద్దంగా ఇరు దేశాల విదేశాంగ మంత్రులు విస్కీ బాటిళ్లను మార్చుకున్నారు. ఇన్నాళ్ల ఈ వివాదం ఇప్పుడే ఎందుకు ముగిసిందంటే మాత్రం దానికి ఉక్రెయిన్‌-రష్యా యుద్ధమే కారణమని చెప్పొచ్చు. ఈ యుద్ధం నేపథ్యంలోనే కెనడా, డెన్మార్క్‌ దేశాలు అప్రమత్తమయ్యాయి. శాంతియుత చర్చలతో పరిష్కారానికి అంగీకరించాయి.

డెన్మార్క్-కెనడా మధ్య సరిహద్దు వివాదాన్ని విస్కీ వార్‌గా పిలుస్తారు. 1971లో కెనడా, డెన్మార్‌ మధ్య నరెస్‌ జలసంధి ద్వారా సరిహద్దు ఏర్పాటయ్యింది. ఈ జలసంధి వెడల్పు సరిగ్గా 36 కిలోమీటర్లు ఉంది. నరెస్‌ జలసంధిని ఇరు దేశాలు 18 కిలోమీటర్ల వెడల్పు చొప్పున పంచుకున్నాయి. అయితే అక్కడే వివాదం మొదలయ్యింది. సరిగ్గా ఈ జలసంధికి మధ్యలో 1.2 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హన్స్‌ అని పిలువబడే ద్వీపమున్నది. ఇది ఓ నిర్మాణుష్యమైన రాతి ద్వీపం అక్కడెవరూ ఉండరు. ఆ ద్వీపంలో ఎలాంటి సహజ వాయువులు లేవు. పైగా అదేమీ వ్యూహాత్మక ప్రదేశం కూడా కాదు అయినా ఇరు దేశాలు ఆ ద్వీపం తమదంటే తమదని పట్టుబట్టాయి. ఈ క్రమంలో కెనడా సైన్యం ఓ అడుగు ముందుకు వేసింది. 1984లో ముందుగా ఆ ద్వీపంలోకి వెళ్లి తమ దేశ జెండాను పాతి అక్కడొక కెనడియన్‌ విస్కీ బాటిల్‌ను పెట్టింది. ఆ తరువాత కొన్నాళ్లుకు విషయం తెలుసుకున్న డెన్మార్క్‌ తమ సైన్యాన్ని పంపింది. కెనడా జెండాను తొలగించి డెన్మార్క్‌ జెండాను ఏర్పాటు చేశారు.

ఈ తంతు 5 దశాబ్దాలుగా సాగుతోంది. అయితే ఈ వివాదంలో ఇప్పటివరకు ఒక్క బుల్లెట్‌ కూడా పేలలేదు. ఒక్క ప్రాణం కూడా కోల్పోలేదు. అక్కడ ఇరు దేశాల సైన్యం వెళ్లి విస్కీ బాటిల్‌ను పెట్టడం తమ జెండాను తొలగించడం జరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఈ వివాదాన్ని విస్కీ వార్‌గా పిలుస్తున్నారు. హాన్స్‌ ద్వీపంపై పూర్తి హక్కుల కోసం ఇరు దేశాలు చర్చలు జరుపుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ సరిహద్దు నియమాల ప్రకారం హాన్స్‌ ద్వీపం తమదేని ఇరు దేశాలు ప్రకటించాయి. 21 మంది విదేశాంగ మంత్రులు ఈ ద్వీపం కోసం చర్చలు జరిపినట్టు తాజాగా కెనడా మంత్రి మెలనీ జోలి తెలిపారు. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాలు వివాదానికి పుల్‌స్టాప్ పెట్టాలని భావించాయి. ఇరు దేశాలు హాన్స్‌ ఐలాండ్‌ను సమానంగా పంచుకునేందుకు అంగీకారం తెలపడంతో వివాదం ముగిసింది. విస్కీ వార్‌ ఆగిపోయింది.

తమలాగే సరిహద్దు వివాదాలను శాంతియుత చర్చలతో పరిష్కరించుకోవాలని కెనడా, డెన్మార్క్‌ విదేశాంగ మంత్రులు పిలుపునిచ్చారు. ఈ విషయం రష్యా గుర్తించి ఉక్రెయిన్‌తో చర్చలు జరిపి ఇరు దేశాలు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చాయి. తమ ఒప్పందంతో శాంతి సందేశాన్ని పుతిన్‌తో పాటు ప్రపంచ దేశాలకు ఇచ్చామని డెన్మార్క్‌ విదేశాంగ శాఖ మంత్రి జెప్పే కోఫోడ్‌ తెలిపారు. దక్షిణ చైనా సముద్రంలోనూ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈ నేపథ్యంలో విస్కీ వార్‌కు ముగింపు పలికినట్టే ఇక్కడా సమస్యపై ఇరు దేశాల ప్రతినిధులు చర్చలు జరిపి పరిష్కరించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. యుద్ధంతో చేస్తే ప్రపంచ దేశాలూ నష్టపోతాయని ప్రజలకు తీరని కష్టాలు ఎదురవుతాయంటున్నారు.

ఏదేమైనా 50 ఏళ్ల వివాదానికి ఇరు దేశాలు దౌత్య మార్గంలో పరిష్కరించుకోవడం శుభపరిణామం. ప్రపంచ వ్యాప్తంగా సగానికి పైగా దేశాలకు సరిహద్దు వివాదాలు ఉన్నాయి. దౌత్య, ద్వైపాక్షిక చర్చలతో వివాదాలను పరిష్కరించుకుంటే ఆయా దేశాల మధ్య స్నేహం, వాణిజ్యం కూడా పెరిగే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories