బైడెన్..భారత్ సంబంధాలు ఎలా ఉంటాయో?

బైడెన్..భారత్ సంబంధాలు ఎలా ఉంటాయో?
x
Highlights

అమెరికాలో డెమొక్రాట్ల పాలన ప్రారంభం కాబోతోంది. మరి భారత్ తొ సంబంధాలు అమెరికా గతంలో లానే కొనసాగిస్తుందా? భారత్ వైఖరి కూడా గతం మాదిరిగానే ఉండబోతోందా? ఏదైనా మార్పులు ఉండొచ్చా? ఒక విశ్లేషణ

భారత్ అమెరికా దేశాల మధ్య సంబంధాలు చాలా వ్యూహాత్మకంగా ఉంటాయి. ఇచ్చి పుచ్చుకునే ధోరణితో పాటూ..తాము వ్యతిరేకించే అంశాలపైన రెండు దేశాలూ కచ్చితంగానే స్పందిస్తాయి. ట్రంప్ హయాంలో రెండు దేశాల మధ్యా స్నేహం కొత్తదారులు తొక్కింది. చైనా విషయంలో భారత్ కు ట్రంప్ సర్కారు నుంచి ఎంతో సమర్ధన లభించింది. అదేవిధంగా చాలా అంశాలలో భారత్ తో సంబంధాల విషయంలో ట్రంప్ ఆచి, తూచి వ్యవహరించారు. దుడుకు స్వభావి అయినా, ఇండియా విషయంలో మాత్రం సమవ్యంతో వ్యవహరించడానికే ట్రంప్ ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పడు ట్రంప్ పక్కకి తోలగారు. బైడెన్ అధ్యక్ష పీఠం ఎక్కారు. మరి కొత్త అధ్యక్షుడు భారత్ తొ ఎటువంటి సంబంధాలు కోరుకుంటున్నారనేది వేచి చూడాల్సిందే. అయితే, ఇప్పటివరకూ ఉన్న వివిధ కారణాలు.. పరిస్థితులూ సమీక్షిస్తే.. అమెరికా-భారత్ మధ్య సంబంధాల విషయంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు.

చైనా విషయంలో..

అమెరికా ఎపుడూ పెద్దన్న పాత్ర పోషించాలని అనుకుంటుంది. అందుకే ప్రపంచమంతా వ్యతిరేకిస్తున్న చైనాను వెనకేసుకొచ్చి భారత్ తొ సంబంధాలను పాడు చేసుకునే ప్రయత్నం చేసే అవకాశాలు ఇప్పట్లో ఉండవు. చైనాతో ట్రంప్ మాదిరిగా, కయ్యానికి కాలు దువ్వకపోయినా.. గుడ్డిగా సమర్ధించే అవకాశమూ లేదు. ఎందుకంటే..ముందే చెప్పినట్టు అమెరికాకు ప్రపంచం పై పెద్దరికం చాలా ముఖ్యం. భారత్ తో చెలిమి సరిగా ఉంటేనే చైనాతో పోటీ పడటానికి అమెరికాకు అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ విషయంలో ట్రంప్ వ్యవహారశైలినే కొనసాగించే అవకాశం ఉంది.

రక్షణ సంబంధాలు..

భారత్ తో రక్షణ సంబంధాల విషయంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. దాదాపుగా గతంలో ఉన్నట్టే ఉండొచ్చు.. ఎందుకంటే గత రెండున్నర దశాబ్దాలుగా అమెరికాలో ఎవరు అధికారంలో ఉన్నా.. ఇండియాలో ఎవరు పాలకులుగా ఉన్నా ఈ విధానంలో పెద్దగా మార్పులు లేవనే చెప్పాలి. ఒక్క ఇండో-పసిఫిక్ వ్యూహంపై మాత్రం బైడేన్ ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి.

వాణిజ్య సంబంధాలు..

చైనా తరువాత అతి పెద్ద మార్కెట్ ఇండియాదే. అందువల్ల మన దేశంతో వాణిజ్య పరంగా ఏ దేశమైనా సత్సంబందాలే కోరుకుంటుంది. ఇది సహజం. అందువల్ల వాణిజ్య సంబంధ విషయాల్లో ఎటువంటి మార్పులూ ఉండకపోవచ్చు.. ఇంకా చెప్పాలంటే బైడెన్ మరింత మెరుగైన వాణిజ్య సంబంధాలు భారత్ తొ ఏర్పాటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

హెచ్-1బి వీసాలు..

ఇది అమెరికాలోని అనేక అంశాలతో ముడిపడిన వ్యవహారం అందువల్ల ఇప్పటికిప్పుడు బైడెన్ హామీలు ఇచ్చినట్టుగా మార్పులు రాకపోవచ్చు. కొంత కాలం తరువాత ఈ విషయంలో ఒక క్లారిటీ వస్తుంది. ఏది ఏమైనా బైడెన్ కు ఈ విషయంలో తానిచ్చిన హామీలు నిలబెట్టుకోవడం కొంచెం క్లిష్టమయ్యే సూచనలు ఉన్నాయి.

కాశ్మీర్ అంశం..

చివర్లో చెప్పుకుంటున్నా, ఇదే కీలకాంశం. కాశ్మీర్ విషయంలో అమెరికా వైఖరిని బట్టి భారత దేశ వైఖరి కూడా కచ్చితంగా మారిపోతుంది. కాశ్మీర్ విషయంలో వేలు పెట్టనంత వరకూ అన్ని సంబంధాలు యధావిధిగా సాగిపోతాయి. అయితే, ఆర్టికల్ 370 రద్దు విషయంలో భారత్ వైఖరిని కొత్తగా ఎన్నికైన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ వ్యతిరేకించారు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన డెమోక్రాట్లు ఈ విషయంలో భారత్ తో తీవ్రంగా విబేధించారు. ఇది మన ప్రభుత్వానికి కొంత ఇబ్బంది పెట్టె అంశం కావచ్చు.

మొత్తమ్మీద అమెరికాలో పాలన మారినా భారత్ తొ సంబంధాల విషయంలో పెద్దగా మార్పులు రాకపోచ్చని చెప్పుకోవచ్చు. ఇటువంటి దౌత్య సంబంధాలన్నీ.. కాలానుగుణంగా మార్పులు చేర్పులకు లోనవుతాయి. మరి భవిష్యత్తులో పరిస్థితులు ఎలా ఉంటాయన్నదానిపైనే భారత్-అమెరికా సంబంధాలు ఆధారపడి ఉంటాయనేది వాస్తవం.

Show Full Article
Print Article
Next Story
More Stories