Afghanistan - Taliban: * 50 మందికి పైగా తాలిబన్ ఫైటర్లు హతం * కాబూల్ విమానాశ్రయం దగ్గర కాల్పులు
Afghanistan - Taliban: ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితులు రోజురోజుకూ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. బగ్లాన్ ప్రావిన్సులో తాలిబన్లపై స్థానిక సాయుధ ప్రజలు తిరుగుబాటు జెండా ఎగరేశారు. మూడు జిల్లాలను స్వాధీనం చేసుకున్నారు. ఉలిక్కిపడ్డ ముష్కర ముఠా.. 24 గంటల వ్యవధిలోనే ఆ జిల్లాలను తిరిగి ఆక్రమించుకొని తమదే పైచేయి అని నిరూపించుకుంది. ఇరు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణల్లో 50 మందికి పైగా తాలిబన్ ఫైటర్లు హతమయ్యారు. మరోవైపు- కాబుల్ విమానాశ్రయం వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
తాలిబన్లకు వ్యతిరేకంగా అఫ్గాన్‌లో ఆదివారం తొలి సాయుధ తిరుగుబాటు చోటుచేసుకుంది. కాబూల్‌కు ఉత్తరాన దాదాపు 120 కిలోమీటర్ల దూరంలోని బగ్లాన్ ప్రావిన్సులో స్థానిక సాయుధ ప్రజలు ఎదురుతిరిగారు. అక్కడి అంద్రాబ్ లోయలోని బానో, దేహ్ సలాహ్, పుల్ ఎ-హెసార్ జిల్లాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ పరిణామంతో తాలిబన్లు ఉలిక్కిపడ్డా.. వెంటనే తేరుకున్నారు. అంద్రాబ్‌కు అదనంగా ఫైటర్లను పంపించారు. కోల్పోయిన మూడు జిల్లాలను తిరిగి తమ వశం చేసుకున్నారు. అయితే తిరుగుబాటుదారులు సోమవారం జరిపిన మెరుపుదాడుల్లో 50 మందికి పైగా ఫైటర్లు హతమవడం తాలిబన్లకు గట్టి ఎదురుదెబ్బ.
అఫ్గాన్‌లో ఇప్పటికీ తమ అధీనంలోకి రాని పంజ్‌షేర్‌ను ఆక్రమించుకునే ప్రయత్నాలను తాలిబన్లు ముమ్మరం చేశారు. వందల మంది ఫైటర్లు ఆ ప్రావిన్సును చుట్టుముట్టారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నేరుగా ఆక్రమణకు పాల్పడకుండా తాలిబన్లు పంజ్‌షేర్‌లోని అఫ్గాన్ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్, దివంగత దిగ్గజ మిలటరీ కమాండర్ అహ్మద్ షా మసూద్ తనయుడు అహ్మద్ మసూద్ తదితరులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు 300 మంది తాలిబన్లను పంజ్ షేర్ సైన్యం హతమార్చినట్లు తెలుస్తోంది.
దేశం వీడి వెళ్లడమే లక్ష్యంగా అఫ్గాన్ పౌరులు భారీగా తరలివస్తుండటంతో కాబుల్ విమానాశ్రయం వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. విమానాశ్రయంలోకి ప్రవేశించే ఓ ద్వారానికి సమీపంలో.. గుర్తుతెలియని దుండగులు సోమవారం కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో అఫ్గాన్ సైనికుడొకరు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. జర్మనీ సైన్యం ఈ వివరాలను వెల్లడించింది. కాబుల్ నుంచి విదేశీయుల తరలింపును తాలిబన్లు అడ్డుకోవడం లేదన్నారు. మరోవైపు- కాబుల్ విమానాశ్రయం వద్ద గుమిగూడుతున్న జనాన్ని లక్ష్యంగా చేసుకొని ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థ ఆత్మాహుతి దాడులకు తెగబడే ముప్పుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
అఫ్గాన్ నుంచి భారత పౌరుల తరలింపు కొనసాగుతోంది. నాటో, అమెరికా విమానాల ద్వారా తొలుత కతార్‌కు చేరుకున్న 146 మంది భారతీయులను అక్కడి నుంచి నాలుగు విమానాల్లో స్వదేశానికి తీసుకొచ్చింది. విమానాశ్రయంలో దిగిన తర్వాత అందరికీ పరీక్షలు నిర్వహించామని, అందులో ఇద్దరికి కరోనా ఉన్నట్లు తేలిందని ఢిల్లీ ప్రభుత్వ నోడల్ అధికారి రాజేందర్ కుమార్ తెలిపారు. రెండో విడతలో స్వదేశానికి చేరుకున్నవారిలో ఎక్కువ మంది అఫ్గాన్‌లో విదేశీ కంపెనీల్లో పనిచేస్తున్నవారే. మరో 46 మంది అఫ్గాన్ సిక్కులు, హిందువులు సహా 75 మందిని అఫ్గాన్ నుంచి భారత వాయుసేన విమానంలో తీసుకువచ్చారు.
అఫ్గాన్ నుంచి విదేశీ బలగాలు, పౌరులు, శరణార్థులను బయటకు తరలించేందుకు ఈ నెల 31ని తుది గడువుగా విధించుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ప్రస్తుతం ఆ గడువును పొడిగించే యోచనలో ఉన్నట్లు సమాచారం. 31లోపు తరలింపు ప్రక్రియను పూర్తిచేయడం అసాధ్యమని ఐరోపా సమాఖ్య, బ్రిటన్ ఇప్పటికే పేర్కొన్నాయి. గడువు పొడిగింపు కోసం బైడెన్‌పై ఒత్తిడి పెంచాలని బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు స్పందిస్తూ.. గడువు పొడిగింపు అవకాశాలను కొట్టిపారేయలేనన్నారు.
తరలింపు ప్రక్రియలకు తుది గడువును పొడిగించాలని అమెరికా, బ్రిటన్ యోచిస్తున్నట్లు వార్తలొస్తుండటంతో తాలిబన్ అధికార ప్రతినిధి సుహైల్ షహీన్ స్పందించారు. గడువు పొడిగింపు తమకు ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదని తేల్చిచెప్పారు. ఎర్ర గీత దాటొద్దంటూ అమెరికాను హెచ్చరించారు. తుది గడువును పొడిగించడమంటే తమను రెచ్చగొట్టడమేనన్నారు. అందుకు పర్యవసానాలు ఉంటాయని స్పష్టం చేశారు.
ఢిల్లీలోని ఐరాస శరణార్థుల హైకమిషనర్ కార్యాలయం ఎదుట అఫ్గాన్ శరణార్థులు సోమవారం పెద్దఎత్తున ప్రదర్శన నిర్వహించారు. మెరుగైన అవకాశాల కోసం అఫ్గాన్లు ఇతర దేశాలకు వలస వెళ్లేందుకు మద్దతుగా లేఖలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కొన్నిరోజుల పాటు ఇలా నిరసనలు కొనసాగిస్తామని చెప్పారు. దేశంలో 21వేల మంది అఫ్గాన్ శరణార్థులు ఉంటే వారిలో 7వేల మంది వద్దనే తగిన పత్రాలు ఉన్నాయని అఫ్గాన్ సంఘీభావ సంఘం నాయకులు తెలిపారు. భారత్‌లో తమకు సరైన అవకాశాలు లేవని, మెరుగైన భవిత కోసం మరో దేశానికి ఎందుకు వెళ్లకూడదని ప్రశ్నించారు. తాము తిరిగి అఫ్గాన్‌కు మాత్రం వెళ్లలేమని చెప్పారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire