బంగ్లాదేశ్‌లో హిందువులు సురక్షితంగా ఉన్నారా?

Are Hindus safe in Bangladesh?
x

బంగ్లాదేశ్‌లో హిందువులు సురక్షితంగా ఉన్నారా?

Highlights

బంగ్లాదేశ్ లోని హిందువులతో పాటు మైనార్టీల నుంచి ఆస్తులను స్వాధీనం చేసుకొనేందుకు వీలుగా రూపొందించిన ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ కూడా పరోక్షంగా దాడులకు కారణమనే అభిప్రాయాలున్నాయి. 1965 లో ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ ను తీసుకువచ్చారు.

షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన కొద్ది గంటలకే అక్కడి హిందువులపై దాడులు జరిగాయి. ఇలా దాడికి గురైన వారిలో నేత్రోకోనాలో నివసిస్తున్న అవిరూప్ కుటుంబం కూడా ఉంది. వంద మందితో కూడిన అల్లరి మూక కర్రలతో దాడిచేశారని తన సోదరి ఫోన్ చేసి చెప్పిందని అవిరూప్ చెప్పారు. వారు తమ ఇంటిని దోచుకున్నారని కూడా ఆయన చెప్పారని బీబీసీ న్యూస్ రిపోర్ట్ చేసింది.

బంగ్లాదేశ్ లో హిందువులతో పాటు మైనార్టీలకు రక్షణ కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యంతర ప్రభుత్వ బాధ్యతలు చేపట్టిన మహమ్మద్ యూనస్ ను కోరారు. బంగ్లాదేశ్ లో పరిస్థితులు హిందువులను వెనక్కి రప్పించేంత తీవ్రంగా లేవని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ భరోసా ఇచ్చారు. అయితే, అదే సమయంలో పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని ఆయన చెప్పారు.


హసీనా రాజీనామా తర్వాత హిందువుల పై దాడులు

బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసిన తర్వాత హిందువులపై దాడులు పెరిగాయని మీడియా రిపోర్ట్ చేసింది. దేశంలోని రెండు వందలకు పైగా హిందువుల ఇళ్లు, వ్యాపార సంస్థలపై దాడులు జరిగాయి. దాదాపు 15 హిందూ దేవాలయాలు ధ్వంసమయ్యాయి.

ఇప్పటివరకు 40 మంది హిందువులపై దాడులు జరిగినట్టుగా బంగ్లాదేశ్ హిందూ బుద్దిస్ట్ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ రణదాస్ గుప్తా చెప్పారని రాయిటర్స్ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. దినాజ్ పూర్ లోని బోచాగంజ్ లో హిందువులకు చెందిన 40 దుకాణాలు ధ్వంసమైనట్టుగా కూడా వార్తలు వచ్చాయి.

బంగ్లాదేశ్ లోని దాదాపు 27 జిల్లాల్లో హిందూ ఆలయాలు, నివాసాలపై అల్లరిమూకలు లూటీలకు పాల్పడినట్టుగా వార్తలు వచ్చాయని ఈశా పౌండేషన్ వ్యవస్థాపకులు జగ్గీ వాసుదేవ్ చెప్పారు. హసీనా పార్టీ అవామీ లీగ్ అక్కడి మైనార్టీలకు ముఖ్యంగా హిందువులకు అనుకూలంగా వ్యవహరిస్తుందనే ప్రచారం కూడా ఈ దాడులకు కారణం.


భారత్ తో హసీనాకు మంచి సంబంధాలు

షేక్ హసీనాకు భారత్ తో మంచి సంబంధాలున్నాయి. గతంలో ఆమె దిల్లీలో ఆరేళ్ల పాటు రహస్య జీవితం గడిపారు. అవామీ లీగ్ పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె బంగ్లాదేశ్ కు తిరిగి వెళ్లారు. ప్రధానిగా బాద్యతలు చేపట్టిన తర్వాత ఇండియాతో ఆమె తన స్నేహన్ని కొనసాగించారు.

2009లో బంగ్లాదేశ్ లో ఆమె అధికారాన్ని చేపట్టిన సమయంలో ఇండియాలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నారు. 2014 నుంచి మోదీ ప్రధానిగా కొనసాగుతున్నారు. ఈ రెండు ప్రభుత్వాలతో ఆమె స్నేహపూర్వకంగానే మెలిగారు.

ఈ ఏడాది జనవరిలో మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆమె ఇండియాలోనే పర్యటించారు. బంగ్లాదేశ్, భారత్ మధ్య దశాబ్దాల కాలంగా ఉన్న సరిహద్దు సమస్యను పరిష్కరించి రెండు దేశాల మధ్య బంధాన్ని మరింత పటిష్టం చేశారు.

హసీనా ప్రత్యర్థి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. బేగం ఖలీదా జియా నేతృత్వంలోని బీఎన్ పీ అధికారంలో ఉన్న సమయంలో భారతదేశ వ్యతిరేక వైఖరిని తీసుకుంది. 2001 నుంచి 2006 వరకు జమాత్ ఇ ఇస్లామీ వంటి ఇస్లామిక్ గ్రూపులతో బీఎన్ పీ పొత్తు పెట్టుకుంది. ఈశాన్య భారతదేశాన్ని ఇబ్బందులకు గురిచేసిన ఉల్ఫా వంటి అనేక తిరుగుబాటు గ్రూపులు అప్పట్లో బంగ్లాదేశ్ నుండి కార్యకలాపాలు నిర్వహించాయి.


బంగ్లాదేశ్ లో హిందువుల జనాభా ఎంత?

బంగ్లాదేశ్ లో ముస్లింల తర్వాత హిందువులే ఎక్కువ. 2011 జనాభా లెక్కల ప్రకారం బంగ్లాదేశ్ జనాభా 14 కోట్ల 97 లక్షలు. ఇందులో హిందువుల జనాభా ఒక కోటి 27 లక్షలు. అంటే, దేశ జనాభాలో హిందువులు 8.5 శాతంగా ఉన్నారు. అయితే, దీనికన్నా ముందు 1974లో జరిగిన జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ హిందువుల జనాభా 13.5 శాతం ఉండేది. అప్పట్లో దేశ జనాభా 7 కోట్ల 65 లక్షలు ఉండగా, అందులో హిందువులు ఒక కోటి 3 లక్షల మంది ఉన్నారు.

2011 నాటికి ఆ దేశ జనాభా రెట్టింపు అయింది. కానీ, హిందువుల జనాభా మాత్రం 25 లక్షలే పెరిగింది.సింపుల్ గా చెప్పాలంటే 1974 – 2011 మధ్య కాలంలో బంగ్లాదేశ్ లో హిందువుల జనాభా 13.5 శాతం నుంచి 8.5 శాతానికి పడిపోయింది.ఈ దేశంలో హిందువులు, క్రిస్టియన్లు, బౌద్దులు మైనార్టీలు. దేశ విభజనకు ముందు బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ కలిసే ఉన్నాయి. హిందువుల్లో మెజారిటీ బెంగాలీ హిందువులే. బంగ్లాలోని హిందువులు ఎక్కువగా సంస్కృతం, బెంగాలీ, ఇతర గిరిజన భాషలు మాట్లాడుతారు. దుర్గా పూజ ఇక్కడి హిందువుల అతి ముఖ్యమైన పండుగ. కాళీపూజ, జన్మాష్టమి, హోళీ, సరస్వతి పూజ, శివరాత్రిని కూడా ఘనంగా జరుపుకుంటారు.


బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు కొత్తేమీ కాదు

బంగ్లాదేశ్ లో హిందువులతో పాటు మైనారిటీ వర్గాలపై గతంలో కూడా దాడులు జరిగాయి. 2021 అక్టోబర్ లో హిందువులపై దాడులు జరిగాయి. దుర్గాపూజ సమయంలో ఈ దాడులు చేశారు. కనీసం 80 దేవాలయాలను ధ్వంసం చేశారు.

2013 నుంచి 2021 మధ్య మైనారిటీలపై 3600 దాడులు జరిగినట్టుగా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ దాడుల్లో 559 ఇళ్లు , కనీసం 1678 దేవాలయాలు, విగ్రహాలు, ప్రార్థనా స్థలాల ధ్వంసం లేదా దహనం చేశారు. సోషల్ మీడియాలో పెట్టిన వివాదాస్పద పోస్టు ఈ దాడులకు కారణమైంది.

2023 జూలై నుంచి 2024 జూన్ వరకు బంగ్లాదేశ్ అంతటా హిందూ మైనారిటీలు హింసను ఎదుర్కొన్నట్టుగా బంగ్లాదేశ్ హిందూ, బౌద్ద, క్రిస్టియన్ కౌన్సిల్ వార్షిక నివేదిక తెలిపింది. ఈ ఏడాది జూలై 8న ఆ సంస్థ జనరల్ సెక్రటరీ రాణాదాస్ గుప్తా నివేదికను మీడియాకు విడుదల చేశారు.

ఇస్లామిస్ట్ గ్రూపులు, స్థానిక రాజకీయ సంస్థల మద్దతుతో హిందూ దేవాలయాలపై దాడులు, విధ్వంసం, దోపీడీలు 94 నమోదైనట్టుగా గుప్తా తెలిపారు. 2022లో 45 హత్యలు, 10 హత్యాయత్నాలు జరిగాయి. ఈ దాడుల్లో 479 మంది హిందువులు గాయపడ్డారని ఈ నివేదిక వివరించింది.


ఆస్తులు లాక్కొనేందుకే హిందువులపై దాడులా?

బంగ్లాదేశ్ లోని హిందువులతో పాటు మైనార్టీల నుంచి ఆస్తులను స్వాధీనం చేసుకొనేందుకు వీలుగా రూపొందించిన ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ కూడా పరోక్షంగా దాడులకు కారణమనే అభిప్రాయాలున్నాయి. 1965 లో ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ ను తీసుకువచ్చారు.

భారతదేశానికి వలస వచ్చిన హిందువుల భూమి, భవనాలను స్వాధీనం చేసుకోవడానికి అనుమతి వస్తుంది. దాని ప్రకారంగా భారత్ కు పారిపోయిన లక్షలాది హిందువుల ఆస్తులు జప్తు చేశారు. బంగ్లాదేశ్ కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ చట్టాన్ని వెస్టెడ్ ప్రాపర్టీస్ యాక్ట్ గా మార్చారు.


హిందువులకు ఆస్తులు తిరిగి ఇచ్చే చట్టం

అయితే, 2008 ఎన్నికల సమయంలో వెస్టెడ్ ప్రాపర్టీస్ యాక్ట్ ద్వారా ఆస్తులు కోల్పోయిన వారంతా తిరిగి పొందేలా చట్టం తెస్తామని అవామీ లీగ్ వాగ్దానం చేసింది. ఈ వాగ్దానం మేరకు వెస్టెడ్ ప్రాపర్టీస్ రిటర్న్ (సవరణ) బిల్లును హసీనా ప్రభుత్వం తీసుకొచ్చింది.

దేశంలోని హిందు మైనార్టీల నుంచి స్వాధీనం చేసుకొని ఆస్తులను తిరిగి పొందేందుకు వీలుగా ఈ బిల్లును బంగ్లాదేశ్ పార్లమెంట్ 2011 నవంబర్ 28న ఆమోదించింది.

బంగ్లాదేశ్ లో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం దేశంలో హిందువులతో పాటు మైనార్టీలపై దాడులను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని హక్కుల సంఘాలు కోరుతున్నాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ముందున్న తొలి సవాలు ఇదే.

Show Full Article
Print Article
Next Story
More Stories