మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ... కొత్త పల్లవిని అందుకున్న అమెరికా
America Warings India: మొదట బుజ్జగిస్తుంది. మాట వినకపోతే హెచ్చరిస్తుంది. హెచ్చరిక కాదు నిరసన అంటుంది. ఆ తరువా బెదిరిస్తుంది. అయినా వినకపోతే బ్లాక్‌మెయిల్‌కు దిగుతుంది. ప్రపంచ దేశాలపై అగ్రదేశం అమెరికా వ్యవహరించే తీరు ఇది ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో భారత్ తీరును అమెరికా మొదటి నుంచి ఆగ్రహంగా ఉంది. ఎటో ఒకవైపు నిలబడి సూచిస్తోంది. భారత్ మాత్రం తటస్థ వైఖరిని వీడలేదు. రష్యాతో భారత్ చమురు దిగుమతుల ఒప్పందం కుదుర్చుకోవడంతో బైడెన్ ప్రభుత్వం సహించలేకపోతోంది. ఒకవైపు ప్రధాని మోదీతో బైడెన్ విర్చువల్ భేఠీ మరోవైపు మానవ హక్కుల ఉల్లంఘన పేరుతో బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతోంది.
ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించింది. నాటి నుంచి భారత్ తటస్థ వైఖరిని అవలంభిస్తోంది. ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య నెలకొన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భారత్ సూచిస్తోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రదాని నరేంద్ర మోదీ ఫోన్‌లో పలుమార్లు చర్చించారు. యుద్ధంపై ఆందోళన వ్యక్తం చేశారు. దౌత్యపరమైన చర్చలతో శాంతి స్థాపన కృషి చేయాలని ఇరుదేశాలను ప్రధాని కోరారు. మరోవైపు ఉక్రెయిన్ యుద్ధంపై అటు ఉక్రెయిన్‌కు అనుకూలంగా, రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన అన్ని తీర్మానాల్లో ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. తటస్థ వైఖరిని మాత్రం వీడలేదు. అయితే బుచా నగరంలో ప్రజల ఊచకోతను మాత్రం భారత్ ఖండించింది. అయితే భారత్ తటస్థ వైఖరిని అమెరికా నిరసిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధానికి అనుకూలమో? వ్యతిరేకమో స్పష్టం చేయాలని భారత్‌ను అమెరికా నిలదీస్తోంది. తాము మాత్రం తటస్థమేనని పదే పదే భారత్ స్పష్టం చేస్తోంది.
ఉక్రెయిన్‌పై ఆక్రమణకు దిగిన రష్యాను, ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ను కట్టడి చేసేందుకు అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు కఠిన ఆంక్షలను విధించాయి. మాస్కోను ఏకాకిని చేసేందుకు ఏ దేశం కూడా వాణిజ్య సంబంధాలు పెట్టుకోకూడదంటూ ప్రపంచ దేశాలను కోరాయి. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమున్నాయి. దేశంలో చమురు ధరలను స్థిరంగా ఉంచేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై భారత్ దృష్టిసారించింది. అదే సమయంలో భారత్‌కు తక్కువ ధరకే ముడి చమురును ఎగుమతి చేస్తామని రష్యా ప్రకటించింది. దీంతో చమురు దిగుమతులపై మాస్కోతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయంపైనా అమెరికా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రష్యాపై ఆంక్షలను భారత్ ఉల్లంఘించిందని ఉక్రెయిన్ యుద్ధాన్ని భారత్ సమర్థించడమేనని అమెరికా మండిపడింది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయవద్దని హెచ్చరించింది. అయితే చమురు కొనగోలు ఆంక్షలు కిందికి రావని భారత్ స్పష్టం చేసింది. అందుకు అమెరికా కూడా అంగీకరించింది. ఇలా చెబితే భారత్ వినదని బైడెన్ తన దూతగా భారత సంతతికి చెందిన దలీప్ సింగ్‌ను ఢిల్లీకి పంపింది. అయినా తమ వైఖరిని మాత్రం మార్చుకోమని భారత్ మరోమారు స్పష్టం చేసింది.
ఎన్ని రకాలుగా ప్రయత్నించినా.. భారత్ మాట వినకపోవడంతో.. అమెరికా తాజాగా బ్లాక్ మెయిలింగ్‌కు దిగింది. మానవ హక్కుల ఉల్లంఘన పాట అందుకుంది. సాధారణంగా మానవ హక్కుల ఉల్లంఘన పేరిట పలు దేశాలపై అమెరికా ఆంక్షలను విధిస్తుంది. భారత్‌ను అడ్డుకునేందుకు మానవ హక్కుల ఉల్లంఘన అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. భారత్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన పరిణామాలను తాము పర్యవేక్షిస్తున్నామని అమెరికా విదేశాంఖ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ తెలిపారు. విదేశాంగ మంత్రి జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్, అమెరికా విదేశాంగ శాఖ సెక్రటరీ ఆంటోని బ్లింకన్ సమావేశయ్యారు. అయితే మంత్రులు జైశంకర్, రాజ్‌నాథ్ సింగ్ ఈ విషయంపై మాట్లాడకపోవడం గమనార్హం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో అమెరికా అద్యక్షుడు బైడెన్ వర్చువల్ విధానంలో భేఠీ అయ్యారు. ఇందులోనూ అమెరికా ఈ అంశాన్ని ప్రస్తావించలేదు. భారత్‌లో ముస్లింలపై దాడులకు దిగుతున్నట్టు అధ్యక్షుడు బైడెన్‌కు చెందిన డెమోక్రటిక్ పార్టీ సభ్యుడు ఎంఎస్ ఓమర్ కూడా వ్యాఖ్యలు చేశారు.
అమెరికా ఎప్పుడూ ద్వంద్వ ధోరణిని అవలంభిస్తుంది. అమెరికాను నమ్ముకునే ఉక్రెయిన్ యుద్ధాన్ని కొని తెచ్చుకుంది. రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ఉక్రెయిన్‌ను ఉపయోగించుకోవాలని అమెరికా భావించింది. మీ వెనుక మేమున్నామని నమ్మించింది. నాటో సభ్యత్వంపై చివరి వరకు సాగదీసింది. రష్యా దాడి చేయడంతో ప్లేటు ఫిరాయించింది. బాంబుల వర్షం కురిపిస్తున్నా చూస్తూ ఉండిపోయింది. మరోవైపు నాటు సభ్యత్వం ఇవ్వమని తేల్చి చెప్పింది. అమెరికాను నమ్మి.. యుద్ధానికి దిగిన ఉక్రెయిన్‌కు వాస్తవం బోధపడింది. అప్పటికే ఉక్రెయిన్ నిండా మునిగింది. ఉక్రెయిన్‌కు ఆయుధాలు, ఆర్థిక సాయం చేసినా ఇప్పుడిప్పుడే కోలుకునే పరిస్థితులు లేవు.. రష్యా దాడిలో కీలకమైన నగరాలు సమూలంగా ధ్వంసమయ్యాయి. ఎక్కడ చూసినా శిథిలాలే దర్శనమిస్తున్నాయి. అంతకుముందు అఫ్ఘానిస్థాన్ విషయంలోనూ అమెరికా అలానే వ్యవహరించింది. తీరా తాలిబన్లు పలు ప్రాంతాలపై పట్టుబిగించారు. కాబుల్‌ను ఆక్రమించుకునే సమయానికి చెక్కేసింది. అఫ్ఘాన్ ప్రజలను నిండా ముంచింది.
అమెరికా తీరు తెలిసిన భారత్ తన జాతీయ, వాణిజ్య ప్రయోజనాలే ప్రధాన్యమని గుర్తించింది. అలా అని అమెరికాతో శత్రుత్వాన్ని మాత్రం కోరుకోవడం లేదు. ప్రపంచ దేశాలతో సత్సంబంధాలను కోరుకుంటున్నట్టు భారత్ చెబుతోంది. అదే తమ విధానమని అమెరికాకు కూడా భారత్ స్పష్టం చేస్తోంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire