America: చిలికి చిలికి గాలివానలా యుద్ధం

America Going To War | Telugu Online News
x

America: చిలికి చిలికి గాలివానలా యుద్ధం

Highlights

America: *ఉక్రెయిన్‌కు యుధాలు ఇవ్వొద్దని పుతిన్ హెచ్చరికలు *క్రెమ్లిన్ హెచ్చరికలను పట్టించుకోని అమెరికా

America: లేదు లేదంటూనే అమెరికా యుద్ధం దిశగా అడుగులు వేస్తోంది. రష్యాపై తాము దాడి చేయడం లేదుగా అంటూ పుతిన్ వద్దన్న పనినే బైడెన్ ప్రభుత్వం చేస్తోంది. ఉక్రెయిన్‌కు భారీగా ఆయుధ సాయం అందించేందుకు సిద్ధమవుతోంది. అందుకు ఏకంగా 33 బిలియన్‌ డాలర్లను ఇవ్వనున్నది. ఉక్రెయిన్‌ తనను తాను కాపాడుకునేందుకు ఆయుధాలు ఇస్తున్నట్టు చెబుతోంది. యుద్ధం ఖర్చు తక్కువేమీ కాదని కానీ ఆక్రమణను అనుమతిస్తే అంతకంటే ఎక్కువ భరించాల్సి వస్తుందని బైడెన్‌ కాంగ్రెస్‌లో ప్రకటించారు. తాజా పరిణామాలు పుతిన్‌ను రెచ్చగొడుతున్నాయి. వెనక్కి తగ్గకపోతే దేనికైనా రెడీ అంటూ పుతిన్‌ ప్రకటించచారు. దీంతో ప్రపంచ యుద్ధం దిశగా అడుగులు పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఉక్రెయిన్-రష్యా యుద్ధం చిలికి చిలికి గాలివానలా మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఆయుధాలు ఇవ్వొద్దని అమెరికాను రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. మళ్లీ మళ్లీ ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఐరోపాలో పరిస్థితులను ప్రమాదకరంగా అమెరికా మారుస్తోందంటూ మాస్కో ఆరోపించింది. క్రెమ్లిన్ హెచ్చరికలను అమెరికా పట్టించుకోవడం లేదు సరికదా మరింత ఉక్రెయిన్‌కు సాయం అందించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా 33 బిలియన్ డాలర్ల సాయం ఉక్రెయిన్కు అందించేందుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ కాంగ్రెస్ అనుమతి కోరారు. ఉక్రెయిన్‌లో భారీగానే ఖర్చు చేస్తున్నామని అయితే.. రష్యాను కట్టడి చేయకపోతే అంతకన్నా ఎక్కువ వెచ్చించాల్సి వస్తుందని బైడెన్‌ కాంగ్రెస్‌కు తెలిపారు. తాజాగా బైడెన్‌ ప్రతిపాదించిన సాయంలో అత్యాధునిక అమెరికా ఆయుధాలు కూడా ఉన్నాయి. రెండ్రోజుల క్రితం ఉక్రెయిన్-పోలాండ్ సరిహద్దులోని రహస్య ప్రదేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకన్, అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ రహస్య భేటీ జరిగింది. అదే సమయంలో ప్రపంచ యుద్ధం ముప్పు పొంచి ఉందని రష్యా హెచ్చరించింది.

అయితే రష్యాపై తాము దాడి చేయమని అమెరికా చెబుతోంది. నాటో కూటమి దేశాల జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదని మొదటి నుంచి బైడెన్ హెచ్చరిస్తున్నారు. నాటో విషయం తప్ప తాము రష్యా జోలికి వెళ్లమని చెబుతున్నారు. ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరాపైనా బైడెన్ స్పందించారు. ఆక్రమణకు వస్తున్న శత్రువు నుంచి తనను తాను రక్షించుకునేందుకు ఉక్రెయిన్‌కు ఆయుధ సాయం అందిస్తున్నట్టు తమ చర్యలను సమర్థించుకున్నారు. అదే సమయంలో ఉక్రెయిన్‌కు ఆయుధాలను అందించడంపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఉక్రెయిన్‌కు సాయమందించేందుకు నాటో కూటమి సిద్ధంగా ఉన్నట్టు నాటో జనరల్ సెక్రటరీ జెన్స్‌ స్టోలెన్‌బర్గ్‌ ప్రకటించారు. ఉక్రెయిన్ యుద్ధంపై బ్రిటన్ విదేశీ వ్యవహారాల మంత్రి లిజ్ ట్రస్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్ యుద్ధంలో విజయం సాధిస్తే ఐరోపాలో భయంకరమైన పరిస్థితులు ఏర్పాడుతాయని ఆమె హెచ్చరించారు. యుద్దంలో ఉక్రెయిన్ గెలుపు వ్యూహాత్మక అత్యవసరమని తేల్చి చెప్పారు. ఉక్రెయిన్ నుంచి రష్యాను వెళ్లగొట్టేందుకు వేగంగా చర్యలు తీసుకోవాలని లిజ్ ట్రస్ సూచించారు.

సైనిక చర్యపై ఎవరైనా జోక్యం చేసుకుంటే మెరుపు దాడులు తప్పవని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. రష్యాకు వ్యతిరేకంగా చేసే ఏ పనిని సహించమన్నారు. మరోవైపు బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రి లిజ్ ట్రస్ చేసిన వ్యాఖ్యలపై క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌కు పాశ్చాత్య దేశాలు అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలు ఇవ్వడంతో ఐరోపాలో భద్రత ప్రమాదంలో పడిందన్నారు. ప్రపంచ యుద్ధం దిశగా పాశ్చాత్య దేశాలు అడుగులు వేస్తున్నట్టు పెస్కోవ్ ఆరోపించారు. అమెరికా, ఐరోపా, బ్రిటన్ దేశాలు ఇలాగే వ్యవహరిస్తే తాము కూడా వెనక్కి తగ్గేది లేదని పెస్కోవ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఉక్రెయిన్‌లో బ్రిటీష్ పౌరుడు హత్యకు గురయ్యాడు. మరో బ్రిటీషర్ అదృశ్యమయ్యాడు. బ్రిటన్ మంత్రి వ్యాఖ్యలు చేసిన తరువాత ఈ ఘటనలు జరగడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనల వెనుక మాస్కో హస్తం ఉందని బ్రిటన్ భావిస్తోంది. అయితే పూర్తి వివరాలు మాత్రం తెలియలేదు.

ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య చేపట్టింది. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం రెండు నెలలు పూర్తి చేసుకుని మూడో నెలలోకి అడుగుపెట్టింది. సైనిక చర్య మొదలైన నాటి నుంచి పల్లెలు, పట్టణాలు, నగరాలు అన్న తేడా లేకుండా రష్యా దళాలు దాడులు నిర్వహించాయి. ఏ నగరంలో చూసినా ధ్వంసమైన భవనాల శిథిలాలే దర్శనమిస్తున్నాయి. ఈ యుద్ధంలో దక్షిణ ఉక్రెయిన్‌లోని కీలకమైన ఓడరేపు పట్టణం మరియూపోల్‌పై మాత్రమే రష్యా బలగాలు పట్టు సాధించాయి. ఈ నగరంలోని ప్రజలను తరలించేందుకు ఉక్రెయిన్‌ తీవ్రంగా యత్నిస్తోంది. మరియూపోల్‌లోని అజోవ్‌స్తల్‌ స్టీల్‌ ప్లాంట్‌లో 2వేల మందికి పైగా ఉక్రెయిన్ సైనికులు ఉన్నట్టు రష్యా అంచనా వేస్తోంది. ఇప్పటికే మరియూపోల్‌కు విముక్తి లభించిందని అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించారు. అజోవ్‌స్తల్‌ స్టీల్‌ ప్లాంట్‌పై దాడులు చేయొద్దని ముట్టడించాలని పుతిన్‌ తమ సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. స్టీల్‌ ప్లాంట్‌ అనేది ఎన్నో చిక్కుముడులతో కూడుకున్నదని దానిపై దాడి చేయడమంటే కొరివితో కాలు దువ్వుకోవడమేనని పుతిన్‌కు తెలిసే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

తాజా పరిణామాల నేపథ్యంలో అటు అమెరికా తీరు, ఇటు రష్యా దూకుడుతో ప్రపంచ దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పలు దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయి. యుద్దంలోకి అమెరికా ఇలాగే కవ్విపు చర్యలు చేపడితే పుతిన్ రెచ్చిపోయి ఎంతటికైనా తెగించే ప్రమాదముందని భయపడుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories