పుతిన్‌ కుటుంబంపై అమెరికా, పశ్చిమ దేశాల ఆంక్షలు

Allegations of opposition leader Alexei Navalny on Vladimir Putin
x

పుతిన్‌ కుటుంబంపై అమెరికా, పశ్చిమ దేశాల ఆంక్షలు

Highlights

*పుతిన్‌ ఆస్తులపై ప్రతిపక్ష నేత అలెక్సీ నవల్నీ ఆరోపణలు

Vladimir Putin Family Secretes: ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య చేపట్టింది. దీనికి నిరసనగా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను కట్టడి చేసేందుకు రష్యాపై ప్రపంచ దేశాలు కఠిన ఆంక్షలు విధించాయి. బుచా నగరంలో రష్యా సైన్యం సాగించిన ఊచకోతతో మరిన్ని ఆంక్షలు విధించాయి. పుతిన్‌ కూతుళ్లపైనా ఆంక్షలు విధిస్తున్నట్టు అమెరికాతో సహా పశ్చిమ దేశాలు ప్రకటించాయి. దీంతో అందరి దృష్టి పుతిన్‌ ఫ్యామిలీపై పడింది. కుటుంబ వివరాలను వెల్లడించడానికి పుతిన్‌ అస్సలు ఇష్టపడరు. దీంతో ఆయన ఫ్యామిలీ వివరాలు, వ్యవహారాలు బయటి ప్రపంచానికి అస్సలు తెలియదు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పుతిన్‌ వ్యక్తిగత జీవితం, కుటుంబం గురించి చర్చ జరుగుతోంది.

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ వ్యక్తిగత జీవితం, కుటుంబం గురించి బయటి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువే. తన కుటుంబం గురించి మాట్లడడం తనకు ఇష్టం ఉండదని పుతిన్‌ గతంలోనే చెప్పారు. అయితే తన కూతుళ్లు రష్యాలోనే ఉన్నారని రష్యాలోనే చదివారని మాత్రం తెలిపారు. వాళ్లు మూడు బాషలు అనర్గళంగా మాట్లాడగలరని కూడా వివరించారు. అయితే తన కుటుంబం గురించి అంతకుమించి చెప్పలేనన్నారు. ప్రతి ఒక్కరికీ సొంత జీవితం ఉంటుందని గౌరవంగా బతకాలని అనుకుంటారని 2015లో జరిగిన ఓ సమావేశంలో పుతిన్‌ చెప్పుకొచ్చారు. ఆ ఇద్దరిలో పెద్ద కూతురు 37 ఏళ్ల మరియా వోరంత్సోవా, రెండో కూతురు 36 ఏళ్ల కాటెరినా టిఖోనోవా. అందుకు కారణం పుతిన్‌ తన ఆస్తులను కుటుంబ సభ్యుల వద్ద దాచి ఉంచారని పశ్చిమ దేశాల అనుమానం. ఈ నేపథ్యంలో పుతిన్‌ కూతుళ్లపైనా ఇప్పుడు అమెరికా సహా పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో వారి ఆస్తులు కూడా జప్తు చేయబడుతాయి. అంతేకాదు ఈ ఆంక్షలు ఉన్నంత కాలం వారు పశ్చిమ దేశాలకు వెళ్లలేరు.

పుతిన్‌ తన కుటుంబ జీవితం వివరాలను గోప్యంగా ఉంచినా.. కొన్ని పత్రాలు, మీడియా కథనాలు అప్పుడప్పుడు పుతిన్‌ చేసిన బహిరంగ ప్రకటనలతో కొన్ని వివరాలు బయటకు వస్తూనే ఉన్నాయి. 1979లో రష్యన్‌ విమానయాన సంస్థ ఏరోప్లాట్‌ ఎయిర్‌ హోస్ట్రెస్‌ ల్యూడ్మిలా ష్కెబ్నేవాతో పుతిన్‌ ప్రేమలో పడ్డారు. అప్పటికి పుతిన్‌ సోవియట్‌ యూనియన్‌ గూఢచార సంస్థ కేజీబీలో కీలక అధికారిగా పని చేస్తున్నారు. ప్రేమలో నాలుగేళ్లు మునిగి తేలిని ఈ జంట 1983లో వారు పెళ్లి చేసుకున్నారు. వారిద్దరికీ పుట్టిన కూతుళ్లే కాటెరినా టిఖోనోవా, మరియా వోరంత్సోవా. 2014లో మాజీ ఒలింపిక్‌ జిమ్నాస్ట్‌, 24 ఏళ్ల అలీనా కబేవాతో పుతిన్‌కు అఫైర్‌ ఉందన్న వార్తలు గుప్పమన్నాయి. అయితే ఈ వార్తలను పుతిన్‌ ఖండించారు. ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసేవారిని తాను ఎప్పటికీ ఇష్టపడడని పుతిన్‌ తెలిపారు. పుతిన్‌ బంధంపై మీడియా కథనాలు వెలుడిన తరువాత భార్య ల్యూడ్మిలా అతడి నుంచి విడాకులు తీసుకున్నారు.

పుతిన్‌కు అలీనాతో సంబంధాలు ఉన్నాయన్న కథనాలు రాసిన రష్యా మీడియా సంస్థ ఆ తరువాత మూతపడింది. అయితే అలీనాతో పుతిన్‌ వ్యవహారంపై మాత్రం ఆ తరువాత తరచూ మీడియాలో కథనాలు వచ్చాయి. ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో ఆమె స్విట్జర్లాండ్‌లో చాలా సురక్షితంగా, అజ్ఞాతంగా ఉన్నట్టు ఇటీవల కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో అలీనాపై చర్యలు తీసుకోవాలంటూ చేంజ్‌ డాట్‌ ఓఆర్‌జీ అనే వెబ్‌సైట్‌ లక్ష మంది సంతకాలను సేకరించి స్విట్జర్లాండ్‌ ప్రభుత్వాన్ని కోరింది. లక్షలాది మంది జీవితాలను నాశనం చేసిన పుతిన్‌ ప్రియురాలికి ఆతిథ్యమివ్వడం ఏమిటని ఆ వెబ్‌సైట్‌ ప్రశ్నించింది. అయితే ఆమె స్విట్జర్లాండ్‌లో ఉన్నట్టు మాత్రం ఎలాంటి ఆచూకీ లేదని స్విస్‌ ప్రభుత్వం తెలిపింది. అయితే అలీనా-పుతిన్‌ బంధం, పుతిన్‌ ఆస్తుల వివరాలపై రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నవల్నీ పలు వివరాలను బయటపెట్టారు. పుతిన్‌ అక్రమంగా కూడబెట్టిన ఆస్తులన్నీ అలీనా వద్ద దాచినట్టు అలెక్సీ నవల్నీ ఆరోపించారు.

నేషనల్‌ మీడియా గ్రూప్‌ అనే స్టేట్‌ మీడియా హోల్డింగ్‌ కంపెనీలో బోర్డు చైర్‌పర్సన్‌గా అలీనా ఉన్నదని.. ఆమెకు భారీగా జీతం కూడా ఇస్తున్నట్టు నవల్నీ ఆరోపించారు. అయితే మీడియా సంస్థలను నిర్వహించేంత సామర్థ్యం లేదన్నారు. అయినా.. ఆమె చైర్‌పర్సన్‌గా ఉన్నారంటే అందుకు కారణం పుతిన్ అంటూ విమర్శలు గుప్పించారు. ఈ వివాదాస్పద ఆరోపణల తరువాత రష్యా ప్రభుత్వం ప్రతిపక్ష నేత అలెక్సీ నవల్నీని అరెస్టు చేయించింది. అలీనాతో సంబంధమే కాకుండా మరో మహిళ స్వెత్లానాతో కూడా పుతిన్‌కు సంబంధం ఉన్నట్టు రష్యాకు చెందిన ఓ మీడియా సంస్థ 2020లో కథనాన్ని ప్రచురించింది. ఆమెకు పుట్టిన కూతురు కూడా పుతిన్‌ పోలీకలు అచ్చుగుద్దినట్టు ఉన్నాయని.. పేరుకు మధ్యలో వ్లాదిమిర్‌ కూడా ఉన్నట్టు తెలిపింది. పుతిన్‌ సన్నిహితుడి బ్యాంకు ఖాతా నుంచి స్వెత్లానా ఖాతాలోకి భారీగా నగదు బదిలీ అయినట్టు కథనంలో వివరించింది. ఈ కథనాన్ని క్రెమ్లిన్‌ ఖండించింది. అర్థం లేదని కథనంగా అప్పట్లో తోసిపుచ్చింది.

పుతిన్‌ పెద్ద కూతురు మరియా వోరంత్సోవా ప్రస్తుతం విద్యా, వ్యాపార రంగాల్లో ఉన్నారు. 2018లో రష్యన్‌ స్టేట్‌ మీడియాలో న్యూరో టెక్నాలజీ గురించి మాట్లాడినప్పుడు ఒకసారి, 2021లో ఓ బిజినెస్‌ వేదికపైన మరోసారి ఆమె కనిపించారు. ఈ రెండు సందర్భాల్లోనూ తండ్రి పుతిన్‌ ప్రస్తావన తీసుకురాలేదు. ఆమె డచ్‌కు చెందిన వ్యక్తికిని వివాహం చేసుకున్నారు. అయితే ఇప్పుడు విడిపోయినట్టు తెలిసింది. ఇక చిన్న కూతురు కాటెరినా టిఖోనోవా ఎక్కువగా పబ్లిక్‌లో కనబడుతారు ఆమె రాక్‌ అండ్‌ రోల్‌ డ్యాన్సర్‌. 2013లో జరిగిన ఓ అంతర్జాతీయ స్థాయి పోటీలో ఆమె పాల్గొన్నారు. అదే సంవత్సరం పుతిన్‌ చిరకాల మిత్రుడు కుమారుడు కిరిల్‌ షామలోవ్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. 2018లో రష్యాలోని కొందరు వ్యాపారవేత్తలపై అమెరికా ఆంక్షలు విధించింది. అందులో షామలోవ్‌ కూడా ఒకరు. రష్యాలోని ఓ పెట్రో కెమిల్‌ కంపెనీలో షామలోవ్‌ ప్రధాన షేర్‌ హోల్డర్‌. పుతిన్‌ కూతురిని పెళ్లి చేసుకున్నాక వ్యాపార రంగలో షామలోవ్‌ వేగంగా ఎదిగినట్టు తెలిసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories