Swatantra Park: స్వాతంత్ర స్ఫూర్తి కోసం..'యోధుల' స్మృతివనం..

Statues Of Freedom Fighters In Swatantra Park
x

Swatantra Park: స్వాతంత్ర స్ఫూర్తి కోసం..'యోధుల' స్మృతివనం..

Highlights

Swatantra Park: సమరయోధుల స్ఫూర్తిని భావితరాలకు అందిస్తున్న స్మృతివనం

Swatantra Park: దేశ స్వాతంత్రం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా సమర్పించిన మహనీయుల విగ్రహాలను ఒకే చోట ప్రతిష్ఠించి స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని భావితరాలకు అందిస్తున్న సమరయోధుల స్మృతివనం... స్వాతంత్ర దినోత్సవ వేళ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది... పోరాటాల పురిటిగడ్డగా పేరొందిన శ్రీకాకుళం జిల్లాలో దేశం కోసం తమ జీవితాలను అర్పించిన స్వాతంత్ర సమరయోధులు, సంఘ సంస్కర్తల విగ్రహాలను ఒకేచోట ప్రతిష్ఠించారు ఆ గ్రామస్తులు...

శ్రీకాకుళం నగరంలో స్వాతంత్ర్య సమరయోధుల పార్కు... ఇక్కడ అడుగుపెట్టగానే కేవలం భారతీయులకే కాదు.. జిల్లా నుంచి విదేశాల్లో పనిచేస్తున్న వారు కూడా ప్రత్యేకమైన అనుభూతి పొందుతారు. స్వాతంత్ర సమరయోధుల స్మృతివనం భావితరాలైన యువతకు దేశభక్తి, స్వాతంత్ర స్ఫూర్తి అందించేందుకు నిరంతరం పనిచేస్తోంది. శ్రీకాకుళం నగరంలో 40 మంది స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు, 105 అడుగుల ఎత్తు ఉన్న జాతీయ జెండా త్యాగధనుల స్ఫూర్తిని నిరంతరం చాటి చెబుతోంది.

స్వాతంత్ర పోరాటంలో అసువులు బాసిన యోధులతో పాటు ప్రపంచాన్ని ప్రభావితం చేసిన సంఘ సంస్కర్తలను కూడా కొలువుదీర్చిన ఈ ప్రాంతం జిల్లా వాసులనే కాకుండా విదేశాల్లో నివసిస్తున్న వారిని కూడా ప్రభావితం చేస్తోంది. దేశభక్తిని పెంపొందించేందుకు ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ పాఠశాల విద్యార్థులు యువత వివిధ రంగాల ప్రముఖులు వాటిలో భాగస్వామ్యం చేస్తూ స్వాతంత్ర స్ఫూర్తిని కలిగిస్తున్నారు.

సిక్కోలు యువత స్వాతంత్ర స్ఫూర్తిని అందుకొనేలా నిరంతర కార్యక్రమాలు నిర్వహిస్తూ దేశభక్తిని చాటి చెబుతున్నారు. జాతి, కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా... మన జాతీయ జెండా ఎంతో గొప్పదనే భావన యువకుల్లో పెంపొందించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇంకా మానవత్వపు విలువలకు ప్రతిరూపంగా నిలిచిన మదర్ థెరిస్సా, శాంతిని ప్రబోధించిన గౌతమబుద్ధుడు, యువతకు స్ఫూర్తి, స్వాతంత్రపు కెరటం భగత్ ‌సింగ్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహాలు ఇక్కడ కొలువుదీరడం విశేషం. స్వాతంత్ర ఉద్యమంలో మన ప్రాంతం నుంచి చురుగ్గా పనిచేసి... అనంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తొలి ఎంపిగా పనిచేసిన కందాల సుబ్రహ్మణ్య తిలక్, సర్దార్ బిరుదాంకితులు గౌతు లచ్చన్న, మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం, మాకొద్ది తెల్లదొరతనమంటూ ఎలుగెత్తి చాటిన గరిమెళ్ల సత్యనారాయణ, తెల్లదొరలపై యుద్ధం చేసిన ఝాన్సీ లక్ష్మీబాయి వంటి వీరుల ప్రతిరూపాలు అక్కడ ఉండడం విశేషం. స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినదించిన లోకమాన్య బాలగంగాధర్ తిలక్, తన గుండెను బ్రిటిష్ తుపాకులకు ఎదురుగా నిలిపిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు, దేశ తొలి విద్యాశాఖామంత్రి మౌలానా అబుల్ కలామ్ అజాద్, భారతరత్న బిరుదాంకితులు, ప్రపంచం గర్వించే ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య తదితరుల విగ్రహాలు ఇక్కడ కొలువు దీరాయి.

ఉన్నతమైన ఆలోచనకు సమాజంలో దాతలు జిల్లా యంత్రాంగం తోడుగా నిలిచి భావితరాలకు స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని నిరంతరం అందించేందుకు శాశ్వతంగా నిర్మించిన ఈ స్మృతివనం... ఇప్పుడు స్వాతంత్రోద్యమ చారిత్రక ప్రదేశంగా పేరుగాంచింది. నేడు మనం స్వేచ్ఛా వాయివులు పీల్చుకుంటున్నామంటే ఆ యోధులే కారణమని తెలపడమే ఈ పార్కు ఉద్దేశమని నిర్వాహకులు చెబుతున్నారు.. యువత వీరిని స్పూర్తిగా తీసుకుంటుందని ఆశిద్దాం.

Show Full Article
Print Article
Next Story
More Stories