ప్రధాని మోడీ ఇటీవల కాంగ్రెస్ పై ఆరోపణల తీవ్రతను పెంచారు. ఆయనతో గొంతు కలిపిన బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ సోదరి, ఆమె భర్త, తండ్రి, నాయనమ్మ, ముత్తాతల...
ప్రధాని మోడీ ఇటీవల కాంగ్రెస్ పై ఆరోపణల తీవ్రతను పెంచారు. ఆయనతో గొంతు కలిపిన బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ సోదరి, ఆమె భర్త, తండ్రి, నాయనమ్మ, ముత్తాతల దాకా ఎవరినీ వదలడం లేదు. ప్రధాని మోడీ సైతం స్వయంగా అలాంటి ఆరోపణలు చేస్తున్నారు. మరి ఆయన గాంధీ-నెహ్రూ వంశం పై ఎందుకలా విరుచుకుపడుతున్నారు. అందుకు ప్రత్యేక కారణాలున్నాయా? ఆ విమర్శల వెనుక మోడీ వ్యూహం ఏంటి లాంటి అంశాలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఒక చెట్టును కొట్టేయాలంటే కొమ్మలను కొట్టేస్తే సరిపోదు కాండం దాకా నరికేసినా సరిపోదు. వేళ్ళు గనుక భూమిలో ఉంటే మళ్ళీ ఆ చెట్టు చిగురిస్తుంది. పెరిగి పెద్దదవుతుంది. అందుకే మోడీ వేళ్ళతో సహా కాంగ్రెస్ చెట్టును కొట్టివేయాలనుకుంటున్నారు. బీజేపీ నినాదమైన కాంగ్రెస్ ముక్త భారత్ ను నిజం చేద్దామని ప్రయత్నిస్తున్నారు. మోడీ ప్రచారశైలి చూస్తుంటే అదే విషయం స్పష్టమవుతోంది.
దేశంలో గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్. ఆ పార్టీకీ బీజేపీకి మధ్య వైరం ఇప్పటిది కాదు. అది జన్మజన్మల శత్రుత్వం. స్వాతంత్ర్యానికి పూర్వ నుంచి కొనసాగిన వైరం. రెండు భావజాలాల మధ్య యుద్ధం. కాంగ్రెస్ ను ఎదుర్కొనేందుకు అతివాద హిందూభావజాలం రెండు, మూడు సార్లు రూపం మార్చుకొని చివరకు బీజేపీగా ఎదిగింది. దేశం ఎదుర్కొంటున్న రకరకాల సమస్యలకు స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ అనుసరించిన విధానాలే కారణమన్నది బీజేపీ విశ్వాసం. అందుకే ఎప్పుడు ఏ చిన్న అవకాశం వచ్చినా....గాంధీ, నెహ్రూల నుంచి నేటి తరం కాంగ్రెస్ నేతల దాకా అందరినీ బీజేపీ నేతలు విమర్శిస్తుంటారు. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. ప్రధాని మోడీ మొదలుకొని బీజేపీ నాయకులంతా కూడా ఒక్కసారిగా కాంగ్రెస్ పాతతరం నాయకుల తప్పిదాలను ఒక్కసారిగా మళ్ళీ వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా చేయడం వెనుక మరో వ్యూహం కూడా ఉంది.
ఆరోపణలు చేసే వ్యక్తి దాడి చేసే స్థాయిలో ఉంటాడు. ఆరోపణలకు గురయ్యే వ్యక్తికి వాటికి వివరణలు ఇచ్చుకోవడంలో సమయం గడిచిపోతుంది. ఆరోపణలకు ఉండే ప్రాధాన్యం వివరణలకు ఉండదు. ఆరోపణలు ప్రభావం చూపించినంతగా వివరణలు ప్రభావితం చేయలేవు. వివరణ ఇచ్చుకోవాల్సిన వారు తమ వ్యూహాలపై దృష్టి పెట్టలేకపోతారు. తాజా ఎన్నికల్లో జరుగుతున్నది ఇదే. ఎవరు మొదట దాడి చేస్తే ఓటర్ల దృష్టిగా అటుగా పోతున్నది. ఈ విషయంలో ఓటర్ల నాడిని బీజేపీ నేతలు సరిగ్గానే పట్టుకున్నారు. అందుకే రాహుల్ గాంధీని, ఆయన సోదరి, ఆమె భర్తను మాత్రమే గాకుండా అమ్మ, నాయనమ్మ, ముత్తాత దాకా ఎవరినీ వదలడం లేదు. ఒక్కొక్కరిపై ఒక్కో రకం ఆరోపణలు. నెహ్రూ విషయంలో సిద్ధాంతపరమైన ఆరోపణలు చేస్తే....తాజాగా రాబర్ట్ వాద్రా విషయంలో అక్రమార్జనను ప్రధానంగా తెరపైకి తీసుకువచ్చారు. రక్షణ రంగంలో కొనుగోళ్ళు, ప్రభుత్వ యంత్రాంగాలను సొంతానికి వాడుకోవడం లాంటివి కూడా ఇందులో ఉన్నాయి.
బీజేపీ తరఫున ప్రధాని అభ్యర్థిగా మోడీ రంగంలో ఉన్నారు. విపక్షం తరఫున కనీసం పది మంది అభ్యర్థులు ప్రధాని పదవిని ఆశిస్తున్నారు. సరిగ్గా ఈ అంశమే బీజేపీకి కొంతమేరకు కలసివచ్చేదిగా మారింది. తనకు సరైన ప్రత్యర్థి రంగంలో లేరని భావిస్తున్న మోడీ టైమ్ మెషిన్ ఎక్కి రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, నెహ్రూ హయాంలదాకా వెనక్కు వెళ్ళారు. రాజీవ్ గాంధీపై మోడీ ఎక్కుపెట్టిన అస్త్రాలు చూస్తుంటే....ఆయన ప్రత్యర్థి రాహుల్ గాంధీనా.....రాజీవ్ గాంధీనా అనే సందేహం కూడా కలుగుతుంది. రాహుల్ గాంధీ రాఫెల్ అంశాన్ని తెరపైకి తీసుకువస్తే రాజీవ్ గాంధీ హయాం నాటి బోఫోర్స్ కుంభకోణాన్ని మోడీ గుర్తు చేస్తున్నారు. చౌకీదార్ చోర్ హై అంటూ రాహుల్ గాంధీ నినదిస్తే. గల్లీ గల్లీ మే షోర్ హై రాజీవ్ గాంధీ చోర్ హై అంటూ వచ్చిన నినాదాలను బీజేపీ నేతలు వినిపిస్తున్నారు. మిస్టర్ క్లీన్ గా రాజకీయాల్లోకి వచ్చిన రాజీవ్ గాంధీ చివరకు భ్రష్టాచారి నెం.1 గా మారారని మోడీ విమర్శించారు. రాజీవ్ గాంధీ తన వ్యక్తిగత విహారాలకు యుద్ధనౌకలను టాక్సీలుగా ఉపయోగించుకున్నారని కూడా మోడీ ఆరోపించారు.
1984లో ఇందిరాగాంధీ హత్య సందర్భంగా సిక్కులపై జరిగిన దాడులను కూడా మోడీ ప్రస్తావించారు. ఆ అంశాన్ని కప్పిపుచ్చుకోవడంలో శామ్ పిట్రోడా లాంటి కాంగ్రెస్ నాయకులు వేసిన తప్పటడుగులు ఆ వివాదాన్ని మరింత పెద్దదిగా చేశాయి. సిక్కులపై జరిగిన దాడుల వెనుక రాజీవ్ హస్తం ఉందని కూడా మోడీ అన్నారు. ఢిల్లీ, పంజాబ్ లలో ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కూడా సిక్కులపై దాడులను మోడీ ఉద్దేశపూర్వకంగానే ప్రస్తావించారు. రాహుల్ గాంధీ సోమనాథ్ ఆలయ సందర్శనకు వెళ్ళిన సందర్భాన్ని నెహ్రూపై దాడి చేసేందుకు మోడీ ఉపయోగించుకున్నారు. సోమనాథ్ ఆలయం నిర్మించడం నెహ్రూ కు ఇష్టం లేకపోయిందని వ్యాఖ్యానించారు. ఇక రాహుల్ సోదరి ప్రియాంక, బావ రాబర్ట్ వాద్రాలపై బీజేపీ నాయకులు భూ కుంభకోణం ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. ఇలాంటి ఆరోపణలన్నీ కూడా కాంగ్రెస్ కు కొత్త చిక్కులు తెస్తున్నాయి. సరైన వ్యూహాలు రూపొందించుకోవడంలో వెనుకంజ వేసేలా చేస్తున్నాయి. బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ కోరుకుంటున్నది కూడా అదే.
ఎన్నికల్లో పోటీ చేసే నాయకులు సాధారణంగా తాము గెలిస్తే భవిష్యత్తులో చేయబోయే పనులేంటో చెబుతారు. ప్రధాని మోడీ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. టైమ్ మెషిన్ ఎక్కి నెహ్రూ హయాంలోకి కూడా వెళ్ళారు. అక్కడి నుంచి మొదలుపెట్టి ఒక్కో తరం కాంగ్రెస్ నాయకులను విమర్శించడం ప్రారంభించారు. అలా చేయడం వెనుక విమర్శకుల విమర్శలు మాత్రం మరోలా ఉన్నాయి. కాంగ్రెస్ ముక్త భారత్ విషయాన్ని పక్కకు పెడితే చెప్పుకోవడానికి చేసిన ఘనకార్యాలు ఏవీ లేనందువల్లే మోడీ ఇలా మాటల దాడి ప్రారంభించారన్న ఆరోపణలూ ఉన్నాయి.
గత ప్రభుత్వాలతో పోలిస్తే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కూడా వాటికి దీటుగానే పని చేసింది. సామాజికంగా, రాజకీయంగా సాహసోపేత నిర్ణయాలు కూడా తీసుకుంది. సంక్షేమ పథకాలను, సామాజిక కార్యక్రమాలను చేపట్టింది. అయితే బీజేపీ ప్రభుత్వం చేసిన ఒకటి, రెండు పొరపాట్లు మాత్రం రాజకీయంగా దాన్ని ప్రభావితం చేసేవిగా మారాయి. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ లాంటివి సామాన్యులకు చేదుమాత్రలుగా మిగిలాయి. వాటికి పరిహారం అన్నట్లుగా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కిసాన్ సమ్మాన్ యోచన పథకాన్ని ప్రవేశపెట్టింది. అది ఆశించిన ఫలితాలను అందించకముందే ఎన్నికలు ముంచుకొచ్చాయి. అదే సమయంలో పాక్ పై సర్జికల్ దాడులు లాంటివి బీజేపీకి కలసివచ్చే అంశాలుగా మారాయి. ఈ నేపథ్యంలో తాము చేసిన సర్జికల్ దాడులను కూడా మోడీ గొప్పగా చెప్పుకోగలిగారు. తమ హయాంలో కూడా సర్జికల్ దాడులు జరిగాయని కాంగ్రెస్ చెప్పినా.....తగు ఆధారాలు మాత్రం చూపెట్టలేకపోయింది. అందుకే మోడీ కాంగ్రెస్ పై వ్యంగాస్త్రాలు సంధించారు. మీరు సర్జికల్ దాడులు చేసింది వీడియో గేమ్ లోనా అంటూ ప్రశ్నించారు. మొత్తం మీద మోడీ హయాం బీజేపీ - కాంగ్రెస్ ల మధ్య పోరులో కొత్త అస్త్రాలను తీసుకువచ్చింది. భారత్ ముక్త కాంగ్రెస్ అంటూ బీజేపీ నినదించేలా చేసింది. ఆ నినాదమే మోడీని కాంగ్రెస్ పాత తరం నాయకులపై విమర్శలు చేయించింది.
ఎన్నికల సమయంలో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే. అయితే అవి విధానాల పరంగా ఉండాలి తప్పితే వ్యక్తిత్వంపై దాడులుగా మారకూడదు. విమర్శలు చేయడంలోనూ హద్దులు పాటించాలి. అయితే వీటిని ఏ పార్టీ కూడా పాటించడం లేదు. అందుకే ప్రచారంలో వ్యక్తిగత దూషణలు అధికమైపోయాయి. జంతువులతో పోల్చడం మొదలుకొని అసభ్యపదజాలం వాడే వరకూ పరిస్థితి దిగజారింది. హుందాగా ఎన్నికల ప్రచారం జరగడం ప్రజాస్వామ్య పరిపక్వతకు నిదర్శనం. అందరు నేతలూ ఆ విషయాన్ని గుర్తిస్తారని ఆశిద్దాం.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire