గురుశిష్యుల మధ్య వైరం భగ్గుమందా?

గురుశిష్యుల మధ్య వైరం భగ్గుమందా?
x
Highlights

వాళ్లిద్దరు గురు-శిష్యులు. ఒకరంటే ఒకరికి అవినాభావ బంధం. రాజకీయాల్లో గురువులను మించిన శిష్యులుంటారు. ఆ శిష్యునికి గురువు మాటేవేదం. గురువుబాటే మార్గం. ఆ...

వాళ్లిద్దరు గురు-శిష్యులు. ఒకరంటే ఒకరికి అవినాభావ బంధం. రాజకీయాల్లో గురువులను మించిన శిష్యులుంటారు. ఆ శిష్యునికి గురువు మాటేవేదం. గురువుబాటే మార్గం. ఆ గురువు కోసమే, ఒకప్పుడు ఎనలేని త్యాగం కూడా చేశాడు శిష్యుడు. ఆ గురువు బాటలోనే మరో పార్టీలోకి వెళ్లారు. ఆ శిష్యుని పట్ల గురువు కూడా చాలా ఆదరణ చూపారు. కానీ వన్‌ ఫైన్ మార్నింగ్‌, వారిద్దరి మధ్య వైరం భగ్గుమంది. ఇప్పుడు పలకరించుకోలేనంత అగాథం ఏర్పడింది. ఇంతకీ ఆ గురుశిష్యుల మధ్య ఏం జరిగింది?

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సిర్పూర్ టి ఎమ్మెల్యే కోనప్ప.ఇద్దరి మధ‌్య విడదీయరాని బంధముంది. ఇద్దరూ గురుశిష్యులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పేరు పొందారు. ఎమ్మెల్యే కోనప్పకు, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాటే వేదం. మంత్రితో తన అనుబంధం, గురువు శిష్యులాంటిదని అనేకసార్లు బహిరంగంగా ప్రకటించారు కోనప్ప. 2010లో గురువు కోసం అప్పటి కాంగ్రెస్ టికెట్‌ను త్యాగం చేశారు కోనప్ప. అలాగే, 2014 ఎన్నికల్లో వీరిద్దరూ బీఎస్పీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. తర్వాత ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి టిఆర్‌ఎస్‌లో చేరారు కోనప్ప.

కోనప్పతో కలిసి చేరడం వల్లే ఇంద్రకరణ్ రెడ్డికి మంత్రి పదవి లభించిదన్న ప్రచారం ఉంది. ఇలాంటి త్యాగాలకు, అనుబంధాలకు ప్రతీకగా ఉన్న వీరిద్దరి మధ్య, కుమ్రంబీమ్ జిల్లా కాగజ్ నగర్ మండలం సర్సాల గ్రామం అటవీ అధికారులపై దాడి చిచ్చు రేపింది. ఈ దాడిలో ఎమ్మెల్యే కోనప్ప తమ్ముడు క్రిష్ణ ప్రధాన సూత్రధారి, పాత్రధారి. క్రిష్ణదాడి చేసిన దృశ్యాలతో సహా ఆధారాలు బయటపడ్డాయి. దాంతో ఆయనపై కేసులు నమోదు చేసి జైలుకు పంపారు పోలీసులు. అదేవిధంగా దాడిలో పాల్గొన్న మరికొంతమందిపై కేసులు ఫైలయ్యాయి. అయితే అటవీ మంత్రిగా ఇంద్రకరణ్ రెడ్డి సొంతశాఖ ఆఫీసర్లపై దాడి జరగడంతో, దాడిని తీవ్రంగా ఖండించడమే కాకుండా చర్యలు చేపట్టారు మంత్రి. దాంతో గురువు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారుల వైపు, శిష్యుడు ఎమ్మెల్యే కోనప్ప దాడి చేసిన వారివైపు నిలిచారు. ఇద్దరు చెరోవైపు నిలవడంతో, గురుశిష్యుల బంధంలో విభేదాలు రాజుకున్నాయి.

కోనప్ప తమ్ముడు క్రిష్ణ, అతని అనుచరులు దాడిచేసిన ప్రాంతంలో, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని హరితహారం మొక్కలు నాటారు. భారీ బందోబస్తు మధ్య మొక్కలు నాటించాల్సి వచ్చింది. దాంతో ఇంద్రకరణ్ రెడ్డి తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని మనస్థాపం చెందారట కోనప్ప. సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తారని భావిస్తే వివాదం పెద్దగా చేశారని, మంత్రి తీరుపై తన అనుచరుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారట ఎమ్మెల్యే కోనప్ప. మరోవైపు దాడిచేసిన గ్రామస్థులు, అటవీ అధికారులపై ఫిర్యాదు చేశారు. గ్రామస్తులు కంప్లయింట్ చేయడంతో అటవీ అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులు నమోదయ్యాయి. ఈ పరిణామంతో కోనప్ప మంత్రికి సవాల్‌ విసిరినట్టయ్యిందని జిల్లాలో మాట్లాడుకుంటున్నారు జనం.

మంత్రి పదవి సైతం తనవల్లే ఇంద్రకరణ్ రెడ్డికి లభించిదని, కాని కష్టకాలంలో మంత్రి అండగా నిలబడటంలేదని తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారట కోనప్ప. సమస్యను పరిష్కరించాల్సిన మంత్రి పట్టించుకోకపోవడం వల్లే, తీవ్రరూపం దాల్చిందని కోనప్ప అంటున్నారని కార్యకర్తలు బయట చెప్పుకుంటున్నారు. మంత్రి సకాలంలో స్పందించి ఉంటే ఈ దాడులు జరిగేవి కావని, ఇదంతా మంత్రి అసమర్థత కారణంగా చోటుచేసుకుందని కోనప్ప అనుచరులు రగిలిపోతున్నారట. ఈ పరిణామాలతో గురు శిష్యులైన మంత్రి ఇంద్రరణ్ రెడ్డి, కోనప్ప మధ్య అంతరం భారీగా పెరిగిపోయిందని బయట ప్రచారం సాగుతోంది.

అంతేకాదు ఈ ఇద్దరి నాయకుల మధ్య విభేదాలు, చివరికి ప్రత్యర్థులుగా మారుస్తున్నాయని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఈ పరిణామాలతో పలకరింపులు కూడా కరువయ్యాయన్న ప్రచారం సాగుతోంది. గురువుకు షాక్ నిచ్చే పోడుభూముల అస్త్రాలను కోనప్ప సిద్దం చేస్తుండటంతో, ఇద్దరి మధ్య ప్రచ్చన్నయుద్ధం మరింత ముదిరేలా కనిపిస్తోంది. మరి శిష్యుని అస్త్రాలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎలా తిప్పి కొడుతారోనని, చివరికి పోడు భూముల పోరు ఎలాంటి మలుపు తిరుగుతుందోనని ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు టీఆర్ఎస్‌ నాయకులు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories