Kolhapur Political War: కొల్లాపూర్ వార్‌లో మూడో కృష్ణుడి రచ్చేంటి?
Kolhapur Political War: కొల్లాపూర్ సంస్థానంలో మొన్నటి వరకు రెండే రెండు కత్తులు కవాతు చేశాయి.
Kolhapur Political War: కొల్లాపూర్ సంస్థానంలో మొన్నటి వరకు రెండే రెండు కత్తులు కవాతు చేశాయి. ఇప్పుడు మూడో కత్తి ఎంటరైంది. మూడో కృష్ణుడి రాక, మొదటి రెండు వర్గాల్లో కాక రేపుతోందట. ఇంతకీ ఎవరా మూడో కృష్ణుడు? ఆయన కథేంటి? నిన్నా మొన్నటి వరకు ఆ నియోజకవర్గంలోని రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారాయి. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీ వీడుతున్నాడని, లేదా పార్టీనే అతన్ని సస్పెండ్ చేస్తుందని.. అటు ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి హవా తగ్గిపోతుందని ఇలా జూపల్లి వర్సెస్ ఎమ్మెల్యే హర్షవర్దన్ రెడ్డి అన్నట్టు నిత్యం ఏదో ఓ చర్చ కొల్లాపూర్ టీఆర్ఎస్ లో కొనసాగుతూ వస్తుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ జూపల్లి, ఎమ్మెల్యే వర్గాలుగా పార్టీ చీలిపోయింది.
ఇది రాష్ట్ర రాజకీయాల్లో అందరికి తెలిసిన విషయమే. కానీ కొల్లాపూర్ లోని టీఆర్ఎస్ పార్టీ రెండు కాదు మూడుముక్కలుగా చీలేందుకు సర్వం సిద్దమైందట. జూపల్లి ఎమ్మెల్యేల మద్య ఉన్న వర్గపోరును క్యాచ్ చేసుకునేందుకు పార్టీలోని ఓ యువ నాయకుడు పావులు కదుపుతున్నాడట. ఇరు వర్గాల పోరుతో అసంతృప్తితో ఉన్న కార్యకర్తలను కలుపుకుని మూడో వర్గం తయారు చేసుకునే పనిలో ఉన్నాడట ఆయువ నేత. దీంతో కొల్లాపూర్ నియోజవర్గంలోని టీఆర్ఎస్ పార్టీలో మూడు ముక్కలాట ఆడేందుకు సర్వం సిద్దమౌందని కొల్లాపూర్ లో లోకం కోడై కూస్తుం
కొల్లాపూర్ నియోజకవర్గం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రాజకీయ పగల, సెగల సెగ్మెంట్. జూపల్లి కృష్ణారావు, కొల్లాపూర్ సంస్థానం తనదేనని చెప్పే మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి జూపల్లి, కాంగ్రెస్ నుంచి హర్షవర్ధన్ పోటీ చేశారు. జూపల్లి ఓడిపోయారు. ఎవరికివారే వారివారి పార్టీలోనే వుంటే, యుద్ధం అలాగే వుండేది. ఇప్పుడు ఇద్దరూ టీఆర్ఎస్‌లోనే వున్నారు. అదే ప్రచ్చన్నయుద్ధమైంది. ఇప్పుడు వీరి యుద్ధం మధ్యలో మూడో వ్యక్తి ఎంటరవుతున్నాడు. దీంతో రెండు వర్గాలు కొట్లాట, మూడు ముక్కలాటగా రూపాంతరం చెందింది.
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో 2014లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా, గెలిచి మంత్రి పదవి చేపట్టిన జూపల్లి కృష్ణారావు, 2018 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందిన బీరం హర్షవర్ధన్ రెడ్డిని అధిష్టానం టీఆర్ఎస్‌లోకి తీసుకోవడం, మంత్రి నిరంజన్ రెడ్డి పూర్తి సపోర్ట్ ఉండటంతో టీఆర్ఎస్ లో వర్గపోరు మొదలయ్యింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మంత్రిగా ఉండి, చక్రం తిప్పిన జూపల్లికి అధిష్టానం నుంచి సముచిత స్థానం లేకపోయినా, తన ఉనికి కాపాడుకోవడానికి అధికార పార్టీలోనే వుంటూ ఎమ్మెల్యే తో ఢీ అంటే ఢీ అంటూ సర్పంచ్, ఎంపిటిసి, జడ్పిటిసి, మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గాన్ని గెలిపించుకునేందుకు కత్తులు దూశారు జూపల్లి.
అయితే ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డికి మంత్రి నిరంజన్ రెడ్డి, అధిష్టానం అండదండలతో పార్టీలో కొత్తయినా, జూపల్లితో సై అంటున్నారు. నియోజకవర్గంలో జరిగే శుభకార్యాల్లో కూడా జూపల్లి, ఎమ్మెల్యే బీరం ఇద్దరూ పోటాపోటీగా పాల్గొంటూ ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. కరోనా సమయంలో ప్రజల్లో చైతన్యం నింపేందుకు పోటాపోటీగా గ్రామాలలో పర్యటిస్తున్నారు. దీనితో ఇరువర్గాల కార్యకర్తలు సోషల్ మీడియాలో మరింత రెచ్చిపోయి వ్యవహరిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీలో ఈ రెండు వర్గాల మధ్య వార్ కొనసాగుతుండగానే గులాబీ పార్టీ నుంచి మరో నాయకుడు ఎంటరయ్యారు. టీఆర్ఎస్ ఎన్నారై అధ్యక్షుడు రంగినేని అభిలాషరావు మూడో కేంద్రంగా మారుతుండటం చర్చనీయాంశంగా మారింది.
ఈ అభిలాష్ రావ్ వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం వెంకటాపల్లి గ్రామానికి చెందిన నేత. ఈయన ఎన్.ఆర్. ఐగా ఉంటూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన అభిలాష్ రావుకు, అధిష్ఠానం వద్ద సైతం మంచి గుర్తింపు వుందన్న ప్రచారం వుంది. ఈయనతో మంత్రి నిరంజన్ రెడ్డి దగ్గర కూడా సన్నిహితంగా వ్యవహరించటంతో, స్థానికంగా ఈమధ్య చర్చనీయాంశమయ్యారు. అంతేకాదు, కొల్లాపూర్ నియోజకవర్గంలో వివిధ మండలల కార్యకర్తలతో రోజూ టచ్ లో ఉంటూ రానున్న ఎన్నికలకు కొల్లాపూర్ నుంచి పోటీ చేసేందుకు సర్వ సిద్దం చేసుకుంటున్నట్టు సమాచారం. అదే హర్ష, జూపల్లి వర్గంలో కొత్త కలవరానికి కారణమవుతోందట.
ఇప్పటికే ఇరువర్గాల్లోని, అసంతృప్తి వాదులను, పనులు కాకుండా ఇబందులు పడుతున్నవారిని లక్ష్యంగా చేసుకుని మరో కొత్తవర్గం, అంటే ముచ్చటగా మూడో వర్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. బహిరంగంగా పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి పనులు చేయనప్పటికీ, వనపర్తి జిల్లాలోకి వచ్చే కొల్లాపూర్ నియోజకవర్గ మండలాలైన వీపనగండ్ల, చిన్నంబావి, పాన్ గల్ , పెంట్లవెళ్లి మండలాల్లో ఒక బలమైన వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు ప్రచారం. క్రమంగా పార్టీలో తన పట్టు నిలుపుకునేందుకు తీవ్రంగా యత్నిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో కొల్లాపూర్ నియోజకవర్గంలోని టీఆర్ఎస్ పార్టీ మూడు వర్గాలుగా తయారయిందని, ఎవరికి మద్దతు తెలపాలో తెలియక తలలు పట్టుకుంటున్నారట కారు గుర్తు కార్యకర్తలు.
ఎన్నారై అభిలాష్ రావు విడిగా కార్యక్రమాలు నిర్వహించటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, మంత్రి నిరంజన్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కొల్లాపూర్‌లో వచ్చే ఎన్నికల్లో ఒకే పార్టీ నుంచి త్రిముఖ పోటీ ఉంటుందా..? ఎవరు అదిష్టానం నుంచి టిక్కెట్టు దక్కించుకుంటారు అన్నది చర్చనీయాంశంగా మారింది. రోజురోజుకు కొల్లాపూర్ రాజకీయం ఎలా ఉంటుందో తెలియక నియోజకవర్గ ప్రజలు తలలు పట్టుకునే పరిస్థితులు నెలకొన్నాయి. చూడాలి ముగ్గురిలో ఎవరు ఫ్రంట్ రన్నర్‌గా నిలుస్తారో..
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire