జనసేనుడి సొంత జిల్లాలో కొత్త చర్చేంటి?

జనసేనుడి సొంత జిల్లాలో కొత్త చర్చేంటి?
x
Highlights

అంతన్నారు.. ఇంతన్నారు.. కానీ చివరకు పార్టీ కార్యాలయాలే ఎత్తేసే పరిస్థితికి వచ్చారు. సొంత జిల్లాలోనే, పార్టీ ఆఫీసును ఖాళీ చేశారు. ఇదే జనసైనికులను డైలమాలో పడేస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా, పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఎందుకు ఎత్తివేశారు. పవన్‌ తీసుకున్న ఈ నిర్ణయంపై సొంత జిల్లాలో ఎలాంటి చర్చకు ఆస్కారమేర్పడింది.

అంతన్నారు.. ఇంతన్నారు.. కానీ చివరకు పార్టీ కార్యాలయాలే ఎత్తేసే పరిస్థితికి వచ్చారు. సొంత జిల్లాలోనే, పార్టీ ఆఫీసును ఖాళీ చేశారు. ఇదే జనసైనికులను డైలమాలో పడేస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా, పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఎందుకు ఎత్తివేశారు....పవన్‌ తీసుకున్న ఈ నిర్ణయంపై సొంత జిల్లాలో ఎలాంటి చర్చకు ఆస్కారమేర్పడింది. జనసేనాని సొంత జిల్లా పశ్చిమగోదావరిలో జనసేన పార్టీ కార్యాలయాలు మూతపడుతుండటం దేనికి సంకేతం...ఉన్న వాటిని ఖాళీ చేయడం దేనికి సిగ్నల్.. పార్టీ శ్రేణుల్లో నిస్తేజం అలుముకుంటోందా.

ప్రభంజనం సృష్టిస్తానంటూ 2009లో యువరాజ్యంతో రాజకీయ అరంగేట్రం చేసి, ఆ తర్వాత 2014 ఎన్నికల ముందు సొంత పార్టీ జనసేన స్థాపించి, ఐదేళ్ల తర్వాత 2019 ఎన్నికల్లో పోటీ చేసేవరకూ వచ్చిన పవన్ కళ్యాణ్ పట్టుమని పదేళ్ల రాజకీయ జీవితం చూడకుండానే ఎన్నో అనుభవాలు, పరాభవాలు ఎదుర్కొన్నారు. రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి ఎలాగున్నా, సొంత జిల్లా పశ్చిమగోదావరి జిల్లాలోనే ఘోర పరాజయం మూటకట్టుకోవడంతో, ఆ పార్టీకే ప్రశ్నార్థకమవుతోంది.

అన్న చిరంజీవికి 2009లో, తమ్ముళ్లు పవన్, నాగబాబులకు 2019లో సొంతజిల్లాలో పరాజయం తప్పకపోవడంతో సొంత జిల్లాను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామంటూ చెప్పిన మెగా సోదరులు ఇక ఈ జిల్లావైపు కన్నెత్తి చూడడం మానేశారన్న చర్చ జరుగుతోంది. భీమవరం ఎమ్మెల్యే అభ్యర్ధిగా పవన్, నర్సాపురం ఎంపీ అభ్యర్ధిగా నాగబాబు పోటీచేసి, కనీసం ఓటింగ్ రోజైనా, పోలింగ్ రోజైనా ప్రజల్లోకి రాకపోగా, ఆ తర్వాత కూడా జిల్లావైపు కన్నెత్తి చూడలేదు. తృతీయ స్థానాన్ని కట్టబెట్టి డిపాజిట్లు దక్కేలా కష్టపడ్డ పార్టీ శ్రేణులకు సైతం మొహం చాటేయడంతో ఇక పశ్చిమ గోదావరిజిల్లాలో జనసేన పరిస్థితి ఏంటన్న అనుమానాలు చక్కర్లు కొడుతున్నాయి. వీటికి బలం చేరుకుతున్నట్లుగా ఏకంగా జిల్లా కేంద్రమైన ఏలూరులో అప్పటి వరకూ ఉన్న పార్టీ కార్యాలయం కాస్తా ఆగమేఘాలపై ఖాళీ చేయడంతో, జనసేన అడ్రస్ లేని పార్టీగా మారింది...

పొలిటికల్ ఊహాగానాలకు తగ్గట్టుగానే జనసేన తీరు, పలు అనుమానాలకు తావిస్తోంది. సొంత జిల్లా అని చెప్పుకునే పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత, ఏకంగా పార్టీ కార్యాలయాలనే ఖాళీ చేసేయడంతో జనసేన జిల్లా వాసుల్లో చాలా డౌట్లు రైజ్‌ అవుతున్నాయి. ఎన్నికల ముందు జిల్లా కేంద్రమైన ఏలూరులో హంగు, ఆర్భాటాలతో ఏర్పాటు చేసిన జిల్లా జనసేన కార్యాలయం భవనం ఎన్నికల ఫలితాల తర్వాత ఖాళీ చేసేశారు. పార్టీ శ్రేణులు జిల్లా కార్యాలయం వైపు చూడకపోవడం, పార్టీని జిల్లా స్థాయిలో నడిపించే నాయకులెవ్వరూ లేకపోవడంతో కార్యాలయ వ్యయ భారం సాకుతో జెండాలు పీకేసి, భవనం ఖాళీ చేసేశారు.

ఏలూరులో జనసేన కార్యాలయం మరో చోటికి మారుస్తున్నామంటూ సర్ధిచెప్పుకునే ప్రయత్నం చేసినా, అవి నమ్మబుద్ది కావడం లేదని జనాలంటున్నారు. అంతేకాదు, సాక్షాత్తూ అధినేత పవన్ పోటీచేసిన భీమవరంలో అయితే, ఎన్నికల ఓటింగ్ పూర్తవగానే కౌంటింగ్ వరకూ ఆగకుండానే, భీమవరంలో ఏర్పాటుచేసిన పార్టీ కార్యాలయం ఖాళీ చేసేయడంతో, పరాజయాన్ని పవన్ ముందే అంచనా వేశారా అన్న చర్చ జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనం తాత్కాలికంగా ఏర్పాటు చేశామని చెప్పినా, ఆ తర్వాత కౌంటింగ్ పూర్తయింది, నెలలు గడుస్తోంది, ఇప్పటివరకూ భీమవరంలో అసలు నియోజకవర్గ పార్టీ కార్యాలయమే లేకపోవడం, పవన్‌ను నమ్ముకుని భారీగానే ఓట్లేసి రెండో స్థానంలో నిలబెట్టిన ప్రజలకు, పవన్ అందుబాటులో లేకపోవడంతో కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా భీమవరంలో శూన్యమనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో జనసేనలోనూ వలసలు తప్పడంలేదు, వలసవెళ్లిన వారి నుంచి విమర్శలూ తప్పడంలేదు.

ఇక ఏకంగా ఏలూరులో జిల్లా పార్టీ కార్యాలయం ఖాళీ చేయడం, అధినేత పోటీ చేసిన భీమవరంలోనూ పార్టీ కార్యాలయం లేకపోవడంతో జనసేన ఉన్నట్టా.. లేనట్టా.. అనే సందేహాలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. మేమున్నామంటూ అప్పుడప్పుడూ అధినేత పవన్ అమరావతిలో సమీక్షలు పెట్టి, కమిటీలు వేసి, కష్టపడ్డవారికి ప్రాతినిథ్యం ఇస్తున్నామని చెబుతుండడంతో, క్షేత్రస్థాయిలో జనసైనికులు మాత్రం అసహనంతో రగలిపోతున్నారన్న చర్చ జరుగుతోంది. నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లుగా, అభ్యర్ధులకే అప్పజెప్పిన పవన్ కళ్యాణ్, ఎన్నికల ముందు రాజకీయ పార్టీల్లోంచి వలస వచ్చిన వారికి టిక్కెట్ ఇచ్చి, ఘోర పరాజయం చవిచూసిన వారికి నియోజకవర్గ బాధ్యతలు కట్టబెట్టి, ఇప్పుడు పార్టీకోసం కష్టపడ్డవారికి న్యాయం చేశామనడం విడ్డూరంగా ఉందని ఇప్పటికే చెవులు కొరుక్కుంటున్నారు పార్టీలోని నేతలు.

మరోవైపు జిల్లాలో జనసేన అభ్యర్ధి పోటీచేయకుండా మిత్రపక్షాలైన బీఎస్పీ, సీపీఎం పోటీ చేసిన కొవ్వూరు, గోపాలపురం, ఉండి నియోజకవర్గాల్లోనూ ఇప్పటిదాకా జనసేనకి అడ్రస్ ఎక్కడుందో ఎవరికి తెలియని పరిస్థితి. మరి ఇక్కడ ఇన్ ఛార్జ్ బాధ్యతలు ఎవరు అంటే, సైనికులకే తెలీదు. దీంతో జనసేన సోషల్ మీడియా గ్రూపుల్లో అయితే చాలామంది ఆక్రోషం ఆపుకోలేక మండిపడుతుంటే, ఇక అనవసరం అంటూ.. అధిక శాతం మంది జనసేన గ్రూపుల్లోంచి లెఫ్ట్ అయిపోతుండడం మిగిలిన పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది.

అప్పుడే జిల్లా పార్టీ పీకేసిన నాయకులు, ఐదేళ్లు ఎక్కడుంటారనే అంతర్యుద్ధం, పార్టీ శ్రేణుల్లో మొదలైంది. దీంతో ఓటమి భుజాన వేసుకున్న నాయకులా పార్టీని నడిపించేది, స్థానిక ఎన్నికల్లో మళ్లీ అదే పరాభవం మూటకట్టుకోడానికా అంటూ చర్చలు మొదలెట్టేశారు. అయితే, పార్టీ సిద్ధాంతాలు నచ్చి చేరిన నాయకులు మాత్రం, పార్టీ పీకేస్తున్నారని, ఆఫీసులు ఖాళీ చేస్తున్నారని వస్తున్న విమర్శలు తిప్పికొడుతూ, నిత్యం జనసేన నాయకులు ప్రజల్లోనే ఉంటూ, అందుబాటులో ఉంటారని, నియోజకవర్గానికి ఒక పార్టీ కార్యాలయం ఉంటుందని పార్టీలో చతికిలబడుతున్న శ్రేణులకు జీవం పోసేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకూ సఫలమవుతాయో చూడాలి. ప్రశ్నించడమే ధ్యేయంగా పుట్టిన జనసేన పార్టీ సొంత జిల్లాలో సమస్యలు చెప్పుకునేందుకు బాధితులు రావాలంటే, ఆ పార్టీ కార్యాలయం ఎక్కడ అనే సందేహం సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories