కొత్త బాధ్యతలకు బాలయ్య సిద్దమా?

కొత్త బాధ్యతలకు బాలయ్య సిద్దమా?
x
Highlights

నందమూరి బాలకృష్ణ. తొడగొడతే బాక్సాఫీసు బద్దలు. మీసం మెలేస్తే కేరింతలు. కత్తి దూస్తే ఈలలు. తుపాకీ పడితే గోల. పంచ్‌ డైలాగ్‌ విసిరితే స్క్రీన్‌ షేక్....

నందమూరి బాలకృష్ణ. తొడగొడతే బాక్సాఫీసు బద్దలు. మీసం మెలేస్తే కేరింతలు. కత్తి దూస్తే ఈలలు. తుపాకీ పడితే గోల. పంచ్‌ డైలాగ్‌ విసిరితే స్క్రీన్‌ షేక్. ఇప్పుడు అలాంటి బాధ్యతనే ఒకటి బాలయ్యకు అప్పగించాలని, చంద్రబాబుకు సూచిస్తున్నారట కొందరు నాయకులు. బాలయ్య అంటే ఎగిరిగంతేసే ప్రాంతంలో, కీలక బాధ్యతలు ఇవ్వాలని పురమాయిస్తున్నారట. ఇంతకీ బాలయ్య గడప తొక్కుతున్న కొత్త పాత్ర ఏంటి? నందమూరి వారసుడు అందుకు ఒప్పుకుంటారా?

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర పరాజయంతో ఇప్పటికీ కోలుకోలేకపోతోంది తెలుగుదేశం. ఓడిన నేతల్లో నిస్తేజం. గెలిచినవారిలో పక్కచూపులు. ఎప్పుడెప్పుడు టీడీపీని రీప్లేస్ చేద్దామా అని అటు జనసేన, ఇటు బీజేపీ వ్యూహాలు. వెరసి కార్యకర్తల్లో ధైర్యంనింపేవారే కరువయ్యారు. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఇలాంటి తరుణంలో, బాలయ్య అస్త్రాన్ని ప్రయోగించాలని ఆలోచిస్తున్నారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.

ఒకవైపు ఇప్పటికే ఎన్నికల ఘర్షణలో చనిపోయిన తెలుగుదేశం కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తున్నారు చంద్రబాబు. కార్యకర్తలను, వారి కుటుంబాలను ఓదారుస్తున్నారు. అయితే తానొక్కడిని తిరిగితే సరిపోదని, కార్యకర్తల్లో జోష్ నింపాలంటే, మాస్ లీడర్ కావాలని ఆలోచిస్తున్న చంద్రబాబు మదిలో తన వియ్యకుండు, బావమరిది బాలయ్య మెదులుతున్నారట. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పునరుజ్జీవం కావాలంటే, ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త నాయకత్వానికి పగ్గాలు అప్పగించాలనే ప్రతిపాదన పార్టీలో బలంగా వినిపిస్తోందన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలతోనే నందమూరి బాలకృష్ణకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలని, చాలాంది నేతలు చంద్రబాబు మీద ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తోంది. రాయలసీమ పార్టీ బాధ్యతలు. అవును. బాలకృష్ణకు నాలుగు జిల్లాల రాయలసీమ పార్టీ బాధ్యతలను అప్పగిస్తే ఎలా ఉంటుందన్నదానిపై పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇందుకు అనేక కారణాలు కూడా నేతలు వివరిస్తున్నారు.

2019 ఎన్నికల్లో సీమలో తెలుగుదేశానికి ఘోరమైన ఫలితాలొచ్చాయి. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో టీడీపీకి దక్కిన సీట్లు మూడే మూడు. చిత్తూరు జిల్లాలో చంద్రబాబునాయుడు, అనంతపురం జిల్లాలో బాలయ్య, పయ్యావుల కేశవ్ విజయం సాధించారు. కడప, కర్నూలు జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ రెండు జిల్లాల్లో టీడీపీకి ఒక్క సీటూ రాలేదు. ముందు నుంచి పట్టున్న రాయలసీమలో ఈసారి ఎందుకు వెనకబడిపోయామన్నది చంద్రబాబు మదిని తొలిచేస్తోంది. అందుకే సీమలో పార్టీ మళ్లీ తొడగొట్టాలంటే, బాలకృష్ణకు ఈ ప్రాంత బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ పార్టీలో వినిపిస్తోంది.

రాయలసీమలో బాలయ్యకు మాస్‌ ఫాలోయింగ్ చాలా ఉంది. సినిమాలతోనే కాదు రియల్‌లైఫ్‌‌తోనూ ఆయన అభిమానులు సంపాదించుకున్నారు. ఎన్టీఆర్‌ వారసుడిగానూ జనంలో క్రేజ్‌ వుంది. సీమలో ఘోరంగా ఓడినా, తెలుగుదేశానికి చెక్కుచెదరని ఓటు బ్యాంకు కూడా వుంది. వచ్చే ఐదేళ్ల పాటు ఓటు బ్యాంకును నిలుపుకోవాలంటే, పార్టీని కాపాడుకోవాలంటే, బాలయ్య లాంటి నాయకుడే కరెక్టని, పార్టీలో చాలామంది భావిస్తున్నారట. చంద్రబాబు దృష్టికి కూడా ఈ విషయాన్ని తెస్తున్నారట. బాలయ్యకు సీమ బాధ్యతలు అప్పగిస్తే, ఇక నాలుగు జిల్లాల్లోనూ బాలయ్య విస్తృతంగా పర్యటిస్తారు. పట్టణాలు, గ్రామాల్లోని కార్యకర్తలను పరామర్శిస్తారు. వీలైతే రోడ్‌ షోలు కూడా నిర్వహించేందుకు పార్టీ నేతలు ఆలోచిస్తున్నారట. అలా నిత్యం సీమ ప్రజలతో వుంటూ పార్టీలో పునరుజ్జీవం తేవాలని, అందుకు బాలయ్యే సరైన వ్యక్తని బాబు చెవిలో వేస్తున్నారట కొందరు నేతలు.

కార్యకర్తలు, కొంతమంది నేతలయితే రాయలసీమ బాధ్యతలు బాలయ్యకు ఇవ్వాలని కోరుకుంటున్నా, మరి, నిజంగా బాలయ్య ఇలాంటి బాధ్యతలు తీసుకుంటున్నారా...లేదంటే మరింత టైం అడుగుతారా అన్నది ఉత్కంఠ కలిగిస్తోంది. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో, కార్యకర్తల్లో ధైర్యం నింపడానికి తానెప్పుడూ సిద్దంగా ఉంటానని గతంలోనే బాలయ్య చెప్పారు. మరి ఇలాంటి సమయంలో నిజంగానే కొంతమంది సలహా మేరకు బాలయ్యకు రాయలసీమ బాధ్యతలు బాబు అప్పగిస్తారా.. నందమూరి వంశానికి ఇప్పటి వరకూ కీలక బాధ్యతలు అప్పగించని చంద్రబాబు, ఇప్పుడు బాలయ్యకు అవకాశం ఇస్తారా. చూడాలి. ఏమవుతుందో.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories