రాయలు ఏలిన రాయదుర్గంలో విజేత ఎవరు? భూపతిరాయల దుర్గంలో ఈసారి ఎగిరేది ఏ పార్టీ జెండా? కర్ణాటక సరిహద్దులో ఉన్న దుర్గం ఎవరి వశం కానుంది.? గత ఎన్నికల్లో...
రాయలు ఏలిన రాయదుర్గంలో విజేత ఎవరు? భూపతిరాయల దుర్గంలో ఈసారి ఎగిరేది ఏ పార్టీ జెండా? కర్ణాటక సరిహద్దులో ఉన్న దుర్గం ఎవరి వశం కానుంది.? గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి విజయం సాధించి మంత్రిగా కొనసాగుతున్న కాల్వ శ్రీనివాసులు మరోమారు గెలుస్తారా? చైతన్యవంతమైన ఓటర్లు ఉండే దుర్గం ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటారా? బీసీ ఓటర్లు అధికంగా ఉండే నియోకజవర్గంలో ఈసారి విజయం ఎవరిది? రాయదుర్గంలో రసవత్తరంగా సాగిన ఎన్నికల సమరం ఏం చెబుతోంది?
ప్రతి ఎన్నికల్లో విలక్షణమైన తీర్పు ఇచ్చే రాయదుర్గం నియోజకవర్గంలో ఈ సారి ఓటరు తీర్పు ఎటువైపు అన్న ఉత్కంఠ నెలకొంది. నియోజకవర్గాల విభజన 2009 తర్వాత రాయదుర్గం పట్టణం, మండలంతో పాటు బొమ్మనహళ్, కణేకల్, గుమ్మగట్ట, డి. హీరేహల్ మండలాలతో రాయదుర్గం నియోజవర్గం ఏర్పడింది. నియోకజవర్గంలో ముందు నుంచి కాంగ్రెస్, టీడీపీ మధ్య పోరు నెలకొంది. తాజా ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ హోరాహోరీగా తలపడ్డాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున కాల్వ శ్రీనివాసులు, వైఎస్ఆర్‌సీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లు 86.03 శాతం.
గతంకంటే పోలింగ్ శాతం పెరగడంతో ఈసారి ఎవరికి వారు తమకు లాభిస్తుందని చెబుతున్నారు. టీడీపీలో వర్గ పోరు, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తన గెలుపునకు దోహదపడుతుందని కాపు రామచంద్రారెడ్డి చెబుతున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లు వైసీపీకి పోలయ్యాయని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. టీడీపీలో గ్రూపు రాజకీయాలను తమకు అనుకూలంగా మారాయంటున్నారు. డీ హీరేహల్, బొమ్మనహళ్లు మండలాల్లో వైసీపీకి ఎక్కువగా ఓట్లు పోలయ్యాయని చెబుతున్నారు. గుమ్మగట్టలోనూ తమదే ఆధిక్యమన్నది వారి ధీమా. రాయదుర్గం రూరల్ కణేకల్‌తో పాటు రాయదుర్గం పట్టణంలో టీడీపీకి ఓట్లు అధికంగా వచ్చాయని తమ్ముళ్ల నమ్మకం. నియోజకవర్గంలో ఎక్కవుగా బడుగు బలహీనవర్గాలవారే ఉండడంతో ఆ ఓట్లన్నీ టీడీపీకే పడ్డాయని చెబుతున్నారు. మహిళలు, వృద్ధుల ఓట్లు టీడీపీని గెలిపిస్తాయన్న ఆశలుపెట్టుకున్నారు. ఐదేళ్లలో మంత్రి కాల్వ శ్రీనివాసులు చేసిన అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమను గట్టెక్కిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఒకసారి గెలిచిన పార్టీ రెండోసారి గెలవడం రాయదుర్గంలో ఇప్పటివరకూ జరగలేదు. 1989 నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. 1989లో కాంగ్రెస్, 1994లో టీడీపీ గెలవగా, 1999లో కాంగ్రెస్, 2004లో టీడీపీ, 2009లో కాంగ్రెస్, 2014లో టీడీపీ విజయం సాధించింది. ఈసారి సంప్రదాయం ప్రకారం కాపుకే దుర్గం ప్రజలు పట్టం కడతారా? లేక కాల్వ శ్రీనివాసులను గెలిపించి సంప్రదాయానికి స్వస్తి పలికారా అన్నది ఉత్కంఠగా మారింది. గెలుపుపై ఎవరికి వారు ధీమాగా ఉన్నప్పటికీ ఎవరు గెలిచినా తక్కువ మెజార్టీతో బయటపడతారన్న ప్రచారం ఉంది.
గత ఎన్నికల్లో మంత్రి కాల్వ శ్రీనివాసులుకు 92,344 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డికి 90,517 ఓట్లు పోలయ్యాయి. కాపుపై తక్కువ మెజార్టీ 1827ఓట్లతో విజయం సాధించారు. మాజీ ఎంపీ, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బీసీల్లో బలమైన నేతగా ఉండడంతో ప్రభుత్వంలో చీఫ్ విప్‌గా ఎన్నికయ్యారు. అనంతరం మంత్రివర్గ విస్తరణలో సమాచార, పౌరసంబందాలు, గ్రామీణ గృహనిర్మాణ శాఖ మంత్రి అయ్యారు. రాయదుర్గంలో బీన్స్‌కు తగిన ప్రోత్సాహం లేదని... గిట్టుబాటు కావడం లేదన్న ఆందోళన కొంత కాలంగా నెలకొంది. నియోజకవర్గంలోని బొమ్మనహళ్లు, కణేకల్లు మండలాల్లో సుమారు 20 గ్రామాల్లో సుమారు 12 వేల ఎకరాల్లో ఎడారి చాయలు కమ్ముకున్నాయి. మంత్రిగా.. గతంలో చీఫ్ విఫ్‌గా కాల్వ శ్రీనివాసులు వందల కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారని... నిరంతరం నియోజవర్గ అభివృద్ధికి పాటుపడుతున్నాడని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఎడారిగా మారుతున్న రాయదుర్గం నియోజవర్గాన్ని హరితదుర్గంగా మార్చేందుకు ప్రభుత్వం అనేక పథకాలు తీసుకువచ్చిందంటున్నారు తమ్ముళ్లు. జీవచ్ఛంగా మారిన బీటీ ప్రాజెక్టుకు హంద్రీ-నీవా ద్వారా 2 టీఎంసీల నీటిని తీసుకురావడానికి పనులు ప్రారంభించింది. ఎడారి నివారణలో భాగంగా తొలి విడుత ఇసుక దిబ్బలను తరలించేందుకు రూ.18.27 కోట్ల నిధులు మంజూరు చేయడంతో పాటు పనులు కొనసాగుతున్నాయి. వీటితో పాటు వందల కోట్ల నిదులు వెచ్చించి రహదారుల నిర్మాణం, విద్యాలయాల నిర్మాణాలు చేపట్టారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అక్రమాలు పెరిగాయని.. వందల కోట్ల ఇసుకను పక్క రాష్ట్రాలకు తరలించారన్న విమర్శలు వైసీపీ ప్రజల్లోకి తీసుకెళ్లింది. జగన్ ప్రకటించిన నవరత్నాలకు ప్రజలు ఆకర్షితులయ్యారని విజయం తమదేనంటున్నారు. అంతిమంగా రాయదుర్గంలో విజయం ఎవరిని వరిస్తుందన్నది వేచిచూడాల్సిన అంశం.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire