అచ్చెన్న అరెస్టుతో సిక్కోలు టీడీపీకి జరిగిన మేలేంటి?

అచ్చెన్న అరెస్టుతో సిక్కోలు టీడీపీకి జరిగిన మేలేంటి?
x
achem naidu (File Photo)
Highlights

అచ్చెన్నాయుడు అరెస్టుతో తెలుగుదేశం రగిలిపోతోంది. ప్రతి జిల్లాలోనూ ఆందోళనలతో టీడీపీ కదంతొక్కింది. అచ్చెన్న అరెస్టు అక్రమం అంటూ చంద్రబాబు ఆగ్రహంతో...

అచ్చెన్నాయుడు అరెస్టుతో తెలుగుదేశం రగిలిపోతోంది. ప్రతి జిల్లాలోనూ ఆందోళనలతో టీడీపీ కదంతొక్కింది. అచ్చెన్న అరెస్టు అక్రమం అంటూ చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇలా అన్ని జిల్లాలూ, అచ్చెన్న అరెస్టుతో ఉడుకుతున్నాయి. కానీ సొంత జిల్లాలో మాత్రం, ఆనంద తాండవమట. అచ్చెన్నాయుడి అరెస్టు, శ్రీకాకుళం టీడీపీకి ఎనలేని మేలు చేసిందని, ఆ జిల్లా తెలుగు తమ్ముళ్లు మాట్లాడుకుంటున్నారట. అచ్చెన్న అరెస్టుతో, సిక్కోలు టీడీపీ ఎందుకంత హ్యాపీ?

తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా చెప్పుకునే శ్రీకాకుళం జిల్లాలో ఆ పార్టీకి బలమైన నేతలతో పాటు పటిష్టమైన క్యాడర్ ఉంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తెలుగు తమ్ముళ్ళు పార్టీని అంటిబెట్టుకునే ఉన్నారు. అయితే గట్టి క్యాడర్ ఉన్నప్పటికీ, నేతల మధ్య గ్రూపుల గోల భారీస్థాయిలోనే వుందన్న విమర్శలూ ఉన్నాయి. అయితే నాయకుల మధ్య ఆధిపత్య పోరు నిజమే అనేది పలు సందర్భాల్లో బహిర్గతమైంది కూడా. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో లో జిల్లా నేతల్లో మార్పు వచ్చిందనే చర్చ జోరుగా సాగుతోంది.

నిన్న మొన్నటి వరకు ఎవరికి వారే యమునా తీరే అనే చందంగా వ్యవహరించిన నేతలంతా, ఇప్పుడు గ్రూపు రాజకీయాలను పక్కన పెట్టేశారట. రాష్ట్రంతో పాటు జిల్లాలోని తెలుగుదేశం నేతలు ఒక్కొక్కరిపై కేసులు నమోదవుతుండటంతో, జిల్లాలోని ఆ పార్టీ నేతలు ఐక్యతా రాగాన్ని అందుకున్నారట. మొదటిగా జిల్లాలో ప్రభుత్వ మాజీ విప్ కోన రవి కుమార్‌పై కేసు నమోదు కావడంతో, జిల్లా తెలుగుదేశం నేతలకి గట్టి షాక్ తగిలింది. ఆ సందర్భంలో జిల్లా టిడిపి నేతలంతా ఒకే తాటిపైకి వచ్చి కూన రవికి అండగా నిలిచారు.

కానీ అదీ, మూడు నాళ్ళ ముచ్చటే అన్నట్లుగా మిగిలిపోయింది. కాగా తాజాగా మాజీ మంత్రి, టిడిపి శాసన సభ ఉపనేత అచ్చెన్నాయుడు అరెస్టు అందరినీ ఒక్కసారిగా ఉల్లిక్కిపడేలా చేసిందట. ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడిని, ఏసీబీ అధికారులు నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు చేసి తీసుకెళ్ళారు. దీంతో జిల్లా తెలుగుదేశం నేతలు దిగ్బ్రాంతికి గురయ్యారట. అచ్చెన్న వ్యవహారంతో ఊహంచని షాక్ తిన్న జిల్లా టీడీపీ నాయకులు ఐక్యంగా నడవకపోతే తమ ఉనికికీ ప్రమాదం వస్తుందని గుర్తించారట.

దీంతో జిల్లా నేతలంతా అచ్చెన్నాయుడు అరెస్టు నిరసిస్తూ శ్రీకాకుళం జిలల్లోని అన్ని నియోజకవర్గాల్లో పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించారు. అదేసమయంలో జిల్లా తెలుగుదేశం నాయకులంతా ఏకతాటిపైకి వచ్చి అరెస్టును ఖండిస్తూ జిల్లా కేంద్రంలో ఆందోళన కార్యక్రమం చేశారు. ఇక అరెస్టైన అచ్చెన్నాయుడు కుటుంబానికి మద్దతునూ ప్రకటించారు. అయితే ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు మరో అడుగు ముందుకేసి అచ్చెన్నాయుడు ఇంటికి స్వయంగా వెళ్ళడం జిల్లాలోని కిమిడి , కింజరాపుల మధ్య ఉన్న ఆధిపత్య పోరుకి ఫుల్ స్టాప్ పెట్టిందని పరిశీలకులు భావిస్తున్నారు.

ఎన్నికల ముందు వరకూ శ్రీకాకుళం జిల్లా టిడిపిలో గ్రూపుల గోల ఎక్కువగా వినిపించేది. అయితే కూన రవి, అచ్చెన్నాయుడు వ్యవహారంలో మాత్రం నేతలంతా ఐక్యంగా ముందుకు సాగటంతో క్యాడర్ కు కొత్త సంకేతాలు వెళ్లాయట. మా నాయకులు గతంలో లాగా కాదు.. ఇపుడు మేమంతా ఒక్కటే.. ఎవరికైనా కష్టం వస్తే ఐక్యంగా కదులుతాం అంటూ ఇపుడు తెలుగుతమ్ముళ్ళు గట్టిగా చెబుతున్నాయట. అయితే ఈ ఐక్యత ఎన్నికల వరకూ ఉంటుందా లేకా గతంలో కూనరవి అంశంలో మాదిరిగా మూన్నాళ్ళ ముచ్చటగానే ముగుస్తుందా అనేది మాత్రం, కార్యకర్తల డౌట్. మొత్తం మీద శ్రీకాకుళం జిల్లా తెలుగుగ్దేశం పార్టీ నేతల మధ్య అచ్చెన్న అరెస్టు ఐక్యతకు ఆజ్యం పోసిందా లేక ఇదీ తూతూ మంత్రంగానే మిగిలిపోతుందా అనేదానికి కాలమే సమాధానం చెప్పాలి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories