మానవత్వాన్ని మరిచిన కొందరు మనుషుల దుర్మార్గమిది. అమానవీయంగా ప్రవర్తించిన కొందరు కిరాతకుల దుష్టకాండ ఇది.
మానవత్వాన్ని మరిచిన కొందరు మనుషుల దుర్మార్గమిది. అమానవీయంగా ప్రవర్తించిన కొందరు కిరాతకుల దుష్టకాండ ఇది. మనుషులుగా పుట్టి... రాక్షసులుగా మారిన కొన్ని మానవమృగాల మారణకాండ ఇది. మాయమై పోతున్నాడమ్మా... మనిషన్న వాడు అన్న ఓ కవి ఆవేదనకు సజీవ తార్కాణమిది. అవును. కొందరు మనుషుల్లో కిరాతకులు నిద్రలేచి... ఓ అమాయకపు మూగజీవిని పొట్టున పెట్టుకున్నారు. అది గర్భంతో ఉన్న విషయం తెలియకపోవచ్చు... కానీ ఆహారం కోసం వచ్చిందన్న విషయం తెలిసినా... దానికి మరణశాసనం రాశారు.
అనాసపండును ఎరగా చూపి పండంటి జీవికి త్వరలోనే జన్మనిచ్చే ఓ గజరాజును అన్యాయంగా ఊసురు తీశారు. వీళ్లు మనుషులా... మానవమృగాలా? దేవుడు నడయాడిన భూమిపై.... జరిగిన దారుణ మారణ కాండ... దేశానికి, దేశాన్నే కదిలించిన ఘటన ఒక ఎత్తయితే... ఆ మూడు రోజులు ఆ మూగజీవి పడ్డ నరకయాతనను తలుచుకుంటూ యావత్ భారతం కన్నీళ్లు పెట్టుకుంటుందిప్పుడు.
మనిషిలో కిరాతకుడు మళ్లీ నిద్ర లేచాడు. ఆకలితో ఆశగా వచ్చిన ఏనుగుకు ఆహారం ఎరచూపి.. ప్రాణం తీశాడు. మనిషి ఇంత కిరాతకంగా ప్రవర్తించిన ఆ మూగజీవి మాత్రం.. చాలా ఔన్నత్యం ప్రదర్శించింది. తీవ్రంగా గాయపడినా... వారిపై దాడికి దిగకుండా, అక్కడి నుంచి మౌనంగా వెళ్లిపోయింది. నీటిలోకి దిగి ప్రాణం కాపాడుకునేందుకు యత్నించింది.. చివరకు మృత్యువు ముందు ఓడిపోయింది.
మనిషి అని నమ్మి వస్తే నమ్మించి మోసం చేశారు. మానవత్వం ఉంటుందని.. ఆశపడి వస్తే అన్యాయంగా ఆయువు తీశారు. పనసపండు నోటికి అందిస్తుంటే.. పసందుగా తిందామని అనుకుందే కానీ... ఇలా ప్రాణాలు తీస్తారని ఊహించలేదు. ఎందుకంటే అది అవడానికి మూగజీవే అయినా... మనుషులుగా పుట్టిన మనకు మానవత్వం ఉంటుందని భావించి ఉంటుంది పాపం. కానీ ఆ కిరాతకులకు మానవత్వం లేదు కదా... మనసు కూడా రాలేదు. చేతులారా పనసపండును నోట్లో పెడుతూ... వాళ్లు చూపించిన అమానవీయ ఘటన యావత్ దేశాన్ని కదలించివేసింది.
నమ్మించి మోసం చేయడం మనిషికి మాత్రమే తెలిసిన విద్య. నమ్మితే ప్రాణాలివ్వడం జంతువులకు తెలిసిన న్యాయం. అందుకే జంతుజాలం మొదటి నుంచి మనిషినే నమ్ముతోంది. ఆ మనిషి చేతులోనే ప్రాణాలు విడుస్తుంది. ఇప్పుడు చెప్పబోయే దారుణం గురించి వింటే కడుపు తరక్కుపోవడమే కాదు... పేగులు మెలిపెట్టి పిండేస్తాయ్. ఆకలితో ఉన్న ఏనుగుకు ఆహారాన్ని అందించినట్లే అందించి... దాని ప్రాణాల్ని తీసిన దుర్మార్గులు చేతికి దొరికితే చావబాదాలన్నంత కసి పుడుతుంది.
కేరళలోని సైలెంట్ వ్యాలీ దగ్గర ఓ ఏనుగు పట్ల.. గ్రామస్తులు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. నదిపాయల్లో ఆహారం వెతుక్కుంటూ ఓ ఆడ ఏనుగు గ్రామంలోకి వచ్చింది. ఎవరినీ ఏమీ చేయకుండా తన దారిన పోతుండగా.. కొందరు స్థానికులు దానికి ఒక పనసపండు ఆశచూపారు. ఆ పైనాపిల్‌లో పేలుడు పదార్థాలు పెట్టారు. పాపం ఆ ఏనుగుకు తెలియదు కదా. నిజంగానే వారు తన మీద ప్రేమతో పెడుతున్నారని ఆశపడింది. ఆ ఆశే దాని ఆయువు తీసింది. ఆ కిరాతకులను నమ్మి వారు ఇచ్చిన పండును తీసుకొని నోటపెట్టింది. అంతే.. ఆ పండు భారీ శబ్దంతో పేలింది.
ఆ పండు తినేటప్పటికే ఆ ఏనుగు గర్భంతో ఉంది. అప్పుడప్పుడే తల్లి ఏనుగు కడుపులో పిల్ల ఏనుగు పిండం ఎదుగుతోంది. మరికొన్నాళ్లలో బయట ప్రపంచాన్ని చూసేందుకు రెడీ అవుతోంది. కానీ అంతలోనే దారుణం జరిగిపోయింది. పేలుడు పదార్థాలతో కలపి పెట్టిన పనసపండ ఒక్కసారిగా పేలడంతో
ఆ ఏనుగు నోటి వెంట రక్తం ధారగా కారింది. అంత బాధలోనూ అది తనను మోసం చేసిన మనుషులపై దాడికి దిగలేదు. రక్తమోడుతున్న నోటీతో గ్రామం వదిలిపోయింది. కడుపులో బిడ్డ ఉండడంతో ఆకలి, మరోవైపు నరాలు మెలిపెట్టే బాధ, దీనికి తోడు గాయంపై ఈగలు... పాపం ఆ గజరాజు ఎంత నరకయాతన అనుభవించి ఉంటుందో.!!
అంత బాధతోనే ఆ ఏనుగు వెల్లియార్ నదిలోకి వెళ్లింది. బాధ తగ్గించుకునేందుకు యత్నించింది. నీటి ప్రవాహంతో గాయానికి కొంత ఉపశమనం లభించింది. తొండం నుంచి కారుతున్న రక్తానికి ముసురుకున్న ఈగలతో నరకం తప్పింది. అలా ఆ నదిలోనే ఉండిపోయింది. మూడురోజులైనా అది ఆ నీటి నుంచి బయటకు రాలేకపోయింది. మనుషులను నమ్మినందుకు అది తన కడుపులో బిడ్డతో సహా లోకాన్ని వదిలి వెళ్లిపోయింది.
మూడురోజుల పాటు ఏనుగు కదలకుండా నదిలోనే ఉండటాన్ని అటవీ శాఖ అధికారి మోహన్ కృష్ణన్ గమనించారు. వెంటనే అటవీ సిబ్బంది సహాయంతో ఈ ఏనుగును జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు. వైద్యాన్ని అందించారు. ఏనుగు ప్రాణాలను నిలపడానికి కొన్ని గంటల పాటు కష్టించారు. కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. కిందటి నెల 27వ తేదీన సాయంత్రం 4 గంటలకు పాపం... ఏనుగు మరణించింది. హృదయ విదారకమైన ఈ ఘటనను మల్లప్పురం అటవీశాఖ అధికారి మోహన్ కృష్ణన్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో దేశమంతటికి తెలిసిపోయింది.
ఇందాకా చెప్పుకున్నాం కదా... గత నెల 27న ఈ దిగ్భ్రాంతికర ఘటన కేరళలో జరిగింది. ఈ ఘటన పట్ల కేరళ వ్యాప్తంగా జంతు ప్రేమికులు, పర్యావరణ సంరక్షకులు నిరసన ప్రదర్శనలకు దిగుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మళప్పురం జిల్లా వెన్నియార్‌లో జరిగిన దేశాన్ని ఒకరకంగా కంటి తడి పెట్టించింది.
పాపం.... ఈ ఏనుగు మరణించే సమయానికి అది గర్భంతో ఉంది. దాని మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ చేసిన డాక్టర్లు కూడా కన్నీళ్లు పెట్టుకున్నంత పనిచేశారు. చనిపోయిన ఏనుగు కడుపులో నుంచి నిర్జీవంగా ఉన్న పిండాన్ని బయటికి తీయాల్సి వచ్చిందంటూ ఆవేదన చెందారు. బాణాసంచా పేలుడు వల్ల దాని నాలుక మొత్తం ధ్వంసమైందని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటన చోటు చేసుకున్నప్పటి నుంచి ఘన ఆహారాన్ని తీసుకోలేదని వారు తేల్చారు. పోస్టుమార్టమ్‌లో కూడా ఏనుగు కడుపులో ఘన పదార్థాలేవీ లభించలేదని చెప్పారు. మూడు రోజుల పాటు నదిలో నిల్చునే ఉండటం వల్ల అది నీళ్లను తాగి జీవించినట్లు అంచనా వేశారు. రక్తమోడుతున్న తొండంపై ఈగలు ముసురుకోకుండా ఉండటానికి నదిలో నిల్చోవడం వల్ల ఏనుగు ఊపిరి తిత్తుల్లో నీళ్లు చేరినట్లు గుర్తించారు.
ఈ ఘటన సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అయింది. నెటిజన్లు ట్విట్టరెటీలను కన్నీళ్లు పెట్టించింది. పండ్లల్లో బాణాసంచా పెట్టి... ఆకలితో ఉన్న 15 సంవత్సరాల ఏనుగు చంపారని తెలుసుకొని భగ్గుమన్నారు. కేరళలో ఏనుగు మృతిపై కేంద్రం కూడా సీరియస్ అయింది. ఉసురు తీసిన దుర్మార్గులను వదిలిపెట్టబోమని హెచ్చరించింది. క్రాకర్స్ తినిపించి మూగజీవాలను చంపడం భారతీయ సంస్కృతే కాదని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ట్వీట్ చేశారు. కేంద్రమే కాదు... ప్రముఖులు కూడా ఈ ఘటనపై స్పందించారు. దీన్ని సాటి మనిషి హత్యగానే పరిగణించాలని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌టాటా కోరారు.
అమాయక ఏనుగును క్రూరంగా చంపిన ఘటన కలచివేసిందన్నారు. క్రికెటర్ విరాట్ కోహ్లీ దంపతులు స్పందిస్తూ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఇలాంటి చర్యలకు ముగింపు పలకాలని, జంతువులపై ప్రేమను చూపండని పిలుపునిచ్చారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలీవుడ్ ప్రముఖులు అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం, శ్రద్ధాకపూర్ డిమాండ్ చేశారు. ఏనుగు ప్రాణం తీసిన నిందితుల ఆచూకీ తెలిపిన వారికి 50 వేల రూపాయలు ఇస్తామని హ్యుమన్ సొసైటీ ఇంటర్నేషనల్ ఆఫ్ ఇండియా బహుమతి ప్రకటించింది.
అటు- ఏనుగు మృతి ఘటనపై వైల్డ్ లైఫ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించామని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. ఏనుగు మృతి సర్వత్రా ఆగ్రహాలను రేకెత్తించిందని, అందుకు కారకులను వదిలేది లేదని కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు. నిందుతులను గుర్తించి చర్యలు తీసుకోవాలని పాలక్కడ్ జిల్లాలోని ఫారెస్ట్, పోలీస్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
ఏమైనా ఇది ఏమాత్రం క్షమించరాని నేరం. ఎవరు చేసినా తప్పే. ఎందుకు చేసినా తప్పే. మూగజీవాలతో ఆటలు సరే. కానీ సరాదాకు ప్రాణాలు తీసే హక్కు ఎవరకీ లేదు. ఉండదు కూడా. అమానవీయంగా ప్రవర్తించి... రాక్షసుల్లా వ్యవహరించిన ఆ కిరాతకులను పట్టుకోవాల్సిందే. పట్టుకొని తగిన శిక్ష విధించాల్సిందే. ఆ శిక్ష కూడా ఎలా ఉండాలంటే... ఇంకెవరు ఇలా ధైర్యం చేయవద్దు. మాకేం కాదులే అని విర్రవీగొద్దు. శిక్ష అలా ఉండాలి. ఇది ఏ ఒక్క జంతుప్రేమికుడి అభిప్రాయం కాదు... యావద్దేశం కన్నీటితో చేసుకుంటున్న విన్నపం.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire