తమిళనాడు రాజధాని చెన్నైలోని లోక్‌సభ నియోజకవర్గాల్లో డీఎంకే, అన్నాడీఎంకే మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. రాజధానిపై తొలినుంచి పట్టు పెంచుకున్న...
తమిళనాడు రాజధాని చెన్నైలోని లోక్‌సభ నియోజకవర్గాల్లో డీఎంకే, అన్నాడీఎంకే మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. రాజధానిపై తొలినుంచి పట్టు పెంచుకున్న డీఎంకే ఈసారి దాన్ని నిలుపుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. జయ ప్రభంజనంలో చెన్నైలోని అన్ని సీట్లను తన ఖాతాలో వేసుకున్న అన్నాడీఎంకే కూడా ఈసారి దాన్ని కొనసాగించాలని ఉవ్విళ్లూరుతుంది. ప్రస్తుతం ఒక్క దక్షిణ చెన్నైలో డీఎంకే, అన్నాడీఎంకే మధ్య ప్రత్యక్ష పోటీ ఉండగా, రెండు స్థానాల్లో డీఎంకే.. అన్నాడీఎంకే మిత్రపక్షాలతో తలపడుతోంది. మొత్తంగా చెన్నపట్నం పోరు ఏం చెబుతుందో చూద్దాం.
మూడు నియోజకవర్గాల్లో భాగంగా మొదటగా మధ్య చెన్నైని చూద్దాం. ఇక్కడ పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులకు సినీ నేపథ్యం ఉంది. డీఎంకే అభ్యర్థి దయానిధి మారన్ కరుణానిధి కుటుంబసభ్యుడు కాగా పీఎంకే అభ్యర్థి శ్యామ్‌పాల్ కొన్ని చిత్రాల్లో చిన్నపాత్రలు పోషించారు. కమల్‌హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం నుంచి పోటీ చేస్తున్న కమీలానాజర్ ప్రముఖ నటుడు నాజర్ భార్య.
ఇక సమస్యల విషయానికొస్తే సెంట్రల్, అన్నానగర్, ఎగ్మూరు, ప్యారిస్‌కార్నర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. హార్బర్-మదురవాయల్ వంతెన పనులు అటకెక్కాయి. కూవం నది తీరంలో ఆక్రమణలు కొనసాగుతున్నాయి. 1977 నుంచి ఈ స్థానానికి 11 సార్లు ఎన్నికలు జరగగా డీఏంకే ఏడు సార్లు, ఒకసారి అన్నాడీఎంకే, మిగిలిన సార్లు కూటమి అభ్యర్థులు గెలుపొందారు.
దక్షిణచెన్నై నియోజకవర్గాన్ని చూస్తే ఈసారి ప్రధాన పార్టీల నుంచి విద్యాధికులే పోటీ చేస్తున్నారు. అన్నాడీఎంకే నుంచి సిట్టింగ్ ఎంపీ జయవర్థన్ బరిలో ఉన్నారు. జయవర్ధన్ రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి జయకుమార్ కుమారుడు. ఎంబీబీఎస్ చదివిన జయవర్థన్ 2014లో 26 ఏళ్ల వయసులో ఎంపీ అయ్యారు. డీఎంకే అభ్యర్థి సుమతి అలియాస్ తమిళచ్చి తంగపాండియన్.. రాష్ట్ర మాజీ మంత్రి తంగపాండియన్ కుమార్తె. ఆంగ్ల సాహిత్యంలో పీజీ పట్టభద్రురాలు. ఆమె భర్త చంద్రశేఖర్ విశ్రాంత ఐపీఎస్ అధికారి. ఏఎంఎంకే అభ్యర్థిగా రాష్ట్ర న్యాయశాఖ మాజీ మంత్రి ఇసక్కి సుబ్బయ్య, ఎంఎన్‌ఎం నుంచి విశ్రాంత ఐఏఎస్ రంగరాజన్ పోటీ చేస్తున్నారు.
దక్షిణ చెన్నైని కూడా సమస్యలు చుట్టుముడుతున్నాయి. పళ్లికరణైలో రోజూ సుమారు 2,400 మెట్రిక్ టన్నుల చెత్త డంప్ చేస్తున్నారు. వర్షాలకు ఈ చెత్తతో కలిసే నీరు సమీపంలోని తాగునీటి వనరుల్లో కలుస్తూ, భూగర్భంలోకి ఇంకుతుండటంతో స్థానికులు దశాబ్దాలుగా బాధపడుతున్నారు. 1957 నుంచి 15 సార్లు జరిగిన ఎన్నికల్లో డీఎంకే ఏడుసార్లు, కాంగ్రెస్ ఐదు, అన్నాడీఎంకే మూడు సార్లు గెలిచాయి.
ఇక ఉత్తర చెన్నై. డీఎంకే ఈ స్థానంలో సునాయాసంగా గెలవొచ్చని భావిస్తోంది. గత ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థి విజయానికి కృషి చేసిన వెట్రివేల్ ప్రస్తుతం ఏఎంఎంకేలో ఉండటం, అదే నియోజకవర్గంలో ప్రాధాన్యం ఉన్న అన్నాడీఎంకే నేత శేఖర్‌బాబు డీఎంకేలోకి రావడం అనుకూలిస్తాయని అంచనా. అయినా పోటీలో రాజీ లేకుండా బలమైన అభ్యర్థి కళానిధి వీరాస్వామిని బరిలోకి దించింది. ఈయన మాజీ మంత్రి ఆర్కాడు వీరాస్వామి కుమారుడు. డీఎంకే వైద్య విభాగంలో సుదీర్ఘకాలంగా ఉన్న ఆయనకు పోటీ చేసే అవకాశం లభించింది. డీఎండీకే అభ్యర్థిగా అళగాపురం ఆర్.మోహన్ రాజ్, ఎంఎన్‌ఎం నుంచి విశ్రాంత పోలీసు ఐజీ ఏజీ మౌర్య బరిలో ఉన్నారు.
సమస్యల విషయానికొస్తే ఈ నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. కాశిమేడు ఫిషింగ్ హార్బరు విస్తరణ కోసం జాలర్ల కుటుంబాలను తరలించడంపై అసంతృప్తి ఉంది. తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. 1957 నుంచి డీఎంకే పది సార్లు, అన్నాడీఎంకే ఒక సారి, మూడు సార్లు కాంగ్రెస్, ఓసారి స్వతంత్ర అభ్యర్థి గెలిచారు.
శ్రీ పెరుంబుదూరు. చెన్నై పొరుగున కాంచీపురం జిల్లాలో ఉన్న నియోజకవర్గం. ఈ లోక్‌సభా స్థానంలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో మూడు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయి. ఈ స్థానం చెన్నైలోనే ఉన్నట్టు పార్టీల లెక్క. డీఎంకే కేంద్ర మాజీ మంత్రి, పార్టీ ముఖ్య నేత టీఆర్ బాలుని రంగంలోకి దించింది. ఈ నియోజకవర్గంలో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే వన్నియరు సామాజికవర్గానికి చెందిన డాక్టర్ ఎ.వైద్యలింగం పీఎంకే తరపున(అన్నాడీఎంకే కూటమి) పోటీ చేస్తున్నారు. ఏఎంఎంకే కూడా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నారాయణన్‌ను నిలిపింది.
ఇక సమస్యల గురించి చెప్పుకుంటే పారిశ్రామిక ప్రాంతమైన శ్రీపెరుంబుదూరులో ఇటీవల కాలంలో కార్మికుల తొలగింపు ఆందోళనలకు కారణమవుతోంది. చెన్నై నుంచి దక్షిణ, పశ్చిమ జిల్లాలకు వెళ్లేందుకు మదురవాయల్ ప్రధాన ప్రాంతమవడంతో వాహన రద్దీ నెలకొంది. దీనికోసమే 2009లో మదురవాయల్-హార్బర్ ఎలివేటెడ్ రోడ్డు ప్రాజెక్టు ప్రకటించారు. ఈ ప్రాజెక్టు సగం కూడా పూర్తికాలేదు. ఇప్పటి వరకు డీఎంకే 8, అన్నాడీఎంకే, కాంగ్రెస్ 3 సార్లు వంతున గెలిచాయి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire