ఆంధ్రప్రదేశ్‌లో కులం బలమెంత?

ఆంధ్రప్రదేశ్‌లో కులం బలమెంత?
x
Highlights

సార్వత్రిక సమరానికి సిద్దమవుతున్న ఆంధ్రదేశ్‌లో, కులాల సమీకరణ కూడా జెట్‌ స్పీడ్‌గా సాగుతోంది. వివిధ కులాలను ప్రసన్నం చేసుకునేందుకు పథకాలు, ఆయావర్గం...

సార్వత్రిక సమరానికి సిద్దమవుతున్న ఆంధ్రదేశ్‌లో, కులాల సమీకరణ కూడా జెట్‌ స్పీడ్‌గా సాగుతోంది. వివిధ కులాలను ప్రసన్నం చేసుకునేందుకు పథకాలు, ఆయావర్గం నేతల ఆకర్షించేందుకు ప్రత్యేక వ్యూహాలు పదునెక్కుతున్నాయి. కాపు కోట్ల కోసం టీడీపీ, వైసీపీలు రకరకాల స్ట్రాటజీలు వేస్తుంటే, అటు తెలంగాణ మాజీ మంత్రి తలసాని కూడా, యాదవ గర్జన పేరుతో అమరావతిలో, సభ నిర్వహించేందుకు సిద్దం అన్నారు. అంతేకాదు, నేతల మాటలు కూడా, కుల చిచ్చును రగిలిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో కులాల లెక్కలు పక్కాగా సరిచూసుకున్నవారిదే విజయమా? అందుకోసం పార్టీల వ్యూహాలేంటి?

ఎన్నికల ముంగిట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో, కుల రాజకీయం రసవత్తరంగా మారుతోంది. టీడీపీ, వైసీపీలు తమదైన వ్యూహాలతో క్యాస్ట్ ఈక్వేషన్స్‌ వండివారుస్తున్నాయి. బూత్‌ లెవల్‌లో కుల లెక్కలను పక్కాగా చూసుకుంటున్నాయి. ఎవరు కాదన్నా, అవునన్నా, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, వైసీపీ, జనసేనలు మూడు ప్రాబల్య సామాజికవర్గాల నాయకత్వంలో ఉన్నాయి. తమ ఓటు బ్యాంకు పటిష్టంగా ఉందని భావిస్తూనే, గెలుపుకు కీలకమైన ఇతర వర్గాల మద్దతు కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎన్నికలు దగ్గరపడ్డంతో, చాపకిందనీరులా క్యాస్ట్ స్ట్రాటజీలను అప్లై చేస్తున్నాయి. 2014 ఎన్నికల్లో కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో తెలుగుదేశం, వైసీపీ మీద విజయం సాధించింది. ఆ రెండు శాతం కాపు సామాజికవర్గమేనని, పవన్‌ కల్యాణ్ సపోర్ట్ చేయడం వల్లే, ఆ ఓట్లన్నీ తెలుగుదేశానికి పడ్డాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తారు. పవన్ దూరం కావడంతో, ఇప్పడా లోటును పూడ్చుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది టీడీపీ.

అందులో భాగంగానే కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లకు ప్రతిపాదించింది చంద్రబాబు సర్కారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కల్పించిన అత్యంత వెనకబడిన వర్గాలకు పది శాతం కోటాలో, ఐదు శాతం కాపులకు ఇస్తామని తీర్మానించింది. రిజర్వేషన్ సాధ్యాసాధ్యాలు పక్కనపెడితే, ఈ నిర్ణయంతో కాపులు తిరిగి తమకే పట్టంకడతారని, ఆగ్రహం చల్లారి తమ చెంతనే ఉంటారని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రభుత్వ పరమైన నిర్ణయమే కాదు, రాజకీయ వ్యూహాలకు పదునుపెట్టారు చంద్రబాబు. కాపు సామాజికవర్గానికి చెందిన కీలకమైన నేత వంగవీటి రాధాను తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వైసీపీకి రాధా రాజీనామా చేసినా, ఇప్పటివరకూ ఏ పార్టీలోనూ చేరలేదు. చంద్రబాబుపై ప్రశంసలు కురిపించడంతో, సహజంగానే ఆయన టీడీపీలో చేరతారని అందరూ ఊహించారు. అయితే, తండ్రిని చంపిన పార్టీలోకే, ఎలా వెళతారంటూ రాధాపై సొంత అనుచరుల నుంచే నిరసన వ్యక్తమైనట్టు తెలిసింది. దీంతో ఆయన సందిగ్దంలో పడ్డారని సమాచారం. కాపు వర్గమే నాయకత్వం వహిస్తున్న జనసేన తలుపులు కూడా రాధాకు, తెరిచే ఉన్నాయని తెలుస్తోంది. అయితే, రాధాను ఎలాగైనా టీడీపీలోకి ఆహ్వానించి, కాపులకు మరింత దగ్గరకావాలన్నది చంద్రబాబు వ్యూహం.

అటు చంద్రబాబు కాపులకు దగ్గరయ్యేందుకు అనేక స్ట్రాటజీలు వేస్తుంటే, వైసీపీ అధినేత జగన్‌ కూడా అదే రీతిలో పావులు కదుపుతున్నారు. కాపు వర్గానికి చెందిన కీలకమైన నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకాపల్లి టీడీపీ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన అవంతి శ్రీనివాస్‌లు ఇప్పటికే వైసీపీలో చేరిపోయారు. వీరిద్దరూ కాపువర్గంలో ముఖ్యమైన నాయకులు. కాపులు అత్యధికంగా ఉండే, ఉభయ గోదావరి జిల్లాల్లో, ఆ వర్గం ఓట్ల ఏకీకరణకు, కీలకమైన నేతలను ఆకర్షించేందుకు, వీరితో రాయబారం నడుపుతున్నారు జగన్. అంతేకాదు, వైసీపీ కండువా కప్పుకున్న తర్వాత, మీడియాతో మాట్లాడిన అవంతి, ఆమంచిలు కమ్మ-కాపు సామాజికవర్గాలపై చేసిన కామెంట్లు చర్చనీయాంశమయ్యాయి. కాపులకు చంద్రబాబు చేసిందేమీ లేదని, తన కోటరిని మొత్తం తన వర్గంతోనే నింపుకున్నారని ఆరోపించారు.

కాపు వర్గానికే చెందిన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, ఆమంచి, అవంతిలతో టచ్‌లో ఉన్నారని సమాచారం. ఎప్పుడైనా ఆ‍యన వైసీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని తెలుస్తోంది. ఇలా కాపువర్గంపై రకరకాల స్ట్రాటజీలు వేస్తున్నారు జగన్. 2014లో తనకు విజయాన్ని దూరం చేసిన రెండు శాతం ఓట్లను పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు, ఓట్లను చీల్చి, అంతిమంగా తనకు ఇబ్బంది కలిగించే అవకాశమున్న పవన్ కల్యాణ్‌‌ను సైతం ఉక్కిరిబిక్కిరి చేయాలని ఆలోచిస్తున్నారు. పవన్‌కు అండగా నిలిచే, కాపు ఓట్లను తమవైపు తిప్పుకుంటూ, ఆ వర్గం నేతలను వైసీపీలోకి ఆకర్షిస్తున్నారు. మరోవైపు బీసీ ఓట్లపై గురిపెట్టాయి ప్రధాన పార్టీలు. ఇప్పటికే చంద్రబాబు బీసీ గర్జన నిర్వహించారు. అనేక వరాలు ప్రకటించారు. వైసీపీ కూడా భారీ ఎత్తున బీసీ సభలకు ప్లాన్ చేస్తోంది.

మరోవైపు మార్చి 3న అమరావతిలో యాదవ బీసీ గర్జన నిర్వహిస్తామన్నారు తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గుంటూరు ఇన్నర్ రోడ్‌లో జరిపే సభను విజయవంతం చేయాలని కోరారు. కాపులకు 5శాతం రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఇస్తుందని ప్రశ్నించారు తలసాని. ఇలా అన్ని రాజకీయ పార్టీలు కుల సమీకరణలతో సమరానికి సిద్దమయ్యాయి. అన్ని కులాలకూ వలవేస్తున్నాయి. ఒకవైపు కుల రహిత సమాజం ప్రసంగాలు దంచేస్తూనే, మరోపక్క క్యాస్ట్ ఈక్వేషన్స్‌ను పక్కాగా చూసుకుంటున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories