బెంగాల్‌లో మారని సీన్.. ఆరో విడతలో ఆగని హింస..

బెంగాల్‌లో మారని సీన్.. ఆరో విడతలో ఆగని హింస..
x
Highlights

సార్వత్రిక ఎన్నికల ఆరో దశలోభాగంగా బెంగాల్‌లో 8 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరిగింది. గత ఐదు దశల్లో ఎన్నికల రోజు హింస చెలరేగిన నేపథ్యంలో ఎలక్షన్...

సార్వత్రిక ఎన్నికల ఆరో దశలోభాగంగా బెంగాల్‌లో 8 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరిగింది. గత ఐదు దశల్లో ఎన్నికల రోజు హింస చెలరేగిన నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ పోలింగ్ స్టేషన్ల వద్ద భద్రత పెంచింది. అయినప్పటికీ బెంగాల్‌లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో పలుచోట్ల బీజేపీ, తృణమూల్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు.

పశ్చిమ బెంగాల్‌లో సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్‌ సందర్భంగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వివిధ ప్రాంతాల్లో బీజేపీ,టీఎంసీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఘటాల్‌లో లోక్‌సభ నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. ఆ ప్రాంత బీజేపీ అభ్యర్థి భారతీఘోష్‌పై తృణమూల్ మహిళా కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. నియోజకవర్గ పరిధిలోని ఓ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లిన ఆమెను చుట్టుముట్టిన టీఎంసీ కార్యకర్తలు బీజేపీ వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో భారతి మరో పోలింగ్ కేంద్రానికి వెళ్లగా.. అక్కడ కూడా స్థానిక మహిళలు అడ్డుకోవడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈలోగా భారతి వాహనంపై కొందరు దాడికి పాల్పడ్డారు.

భారతీ ఘోష్‌పై దాడి వెనుక టీఎంసీ కార్యకర్తల హస్తం ఉందని బీజేపీ ఆరోపించింది. ఇదిలా ఉంటే భారతీ ఘోష్ సెల్‌ఫోన్‌తో పోలింగ్ బూత్‌లోకి ప్రయత్నించి వీడియో తీసే ప్రయత్నం చేశారని టీఎంసీ ఆరోపించింది. ఈ ఘటనపై ఎలక్షన్ కమిషన్ పూర్వాపరాలను పరిశీలించింది. భారతీ ఘోష్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని స్థానిక పోలీసు అధికారులను ఆదేశించింది. పోలింగ్ బూత్‌కు 100 మీటర్ల సమీపానికి సెక్యూరిటీ సిబ్బందిని తీసుకుని పోయారనే కారణంగా ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఈసీ నిర్ణయించింది.

మరో ఘటనలో తూర్పు మిడ్నాపూర్‌లోని భగబన్‌పూర్‌లో ఇద్దరు బీజేపీ కార్యకర్తలపై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో గాయపడ్డ ఆ ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అదే విధంగా బాంకురా ప్రాంతంలో కూడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకవైపు హింసాత్మక ఘటనలు జరుగుతున్నా మరోవైపు ఓటర్లు భారీ స్థాయిలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. దీంతో పశ్చిమబెంగాల్‌లో 6వ విడత పోలింగ్‌లో 80 శాతానికి పైగా ఓటింగ్ జరగడం విశేషం.

Show Full Article
Print Article
Next Story
More Stories