Spirulina Cultivation: సూపర్‌ ఫుడ్‌ స్పిరులినా సాగుతో స్ఫూర్తిగా నిలుస్తున్న యువరైతు

Young Farmer Bharath Reddy Spirulina Cultivation Success Story
x

Spirulina Cultivation: సూపర్‌ ఫుడ్‌ స్పిరులినా సాగుతో స్ఫూర్తిగా నిలుస్తున్న యువరైతు

Highlights

Spirulina Cultivation: భూమి మీద అత్యధిక పోషకాలు కలిగిన ఆహారం ఏదైనా ఉందా అంటే అది స్పిరులినానే తల్లిపాలతో పరిపాటిగా చూస్తున్న ఏకైక ఆహారం స్పిరులినా అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Spirulina Cultivation: భూమి మీద అత్యధిక పోషకాలు కలిగిన ఆహారం ఏదైనా ఉందా అంటే అది స్పిరులినానే తల్లిపాలతో పరిపాటిగా చూస్తున్న ఏకైక ఆహారం స్పిరులినా అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎన్నో ఉపయోగాలు , పోషకాలు ఉన్నా ఈ సూపర్ ఫుడ్‌ మన దేశంలో చాలా మందికి తెలియని ఆహారంగా మిగిలిపోతోంది. ఇప్పుడిప్పుడే శాస్త్రీయ పద్ధతుల్లో స్పిరులినాను పెంచేందుకు ఔత్సాహికులు ఆసక్తి కనబరుస్తున్నారు. నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేటలోని ఒక చిన్న గ్రామానికి చెందిన భరత్‌ రెడ్డి హోటెల్ మానేజ్మెంట్ కోర్సు పూర్తి చేశాడు. ఉద్యోగాల కోసం ప్రయత్నించాడు. అయితే పంటల సాగులో నష్టాలనే చవిచూస్తున్న తన తండ్రి బాధను కళ్లారా చూసిన భరత్ నలుగురికి ఉపయోగపడే విధంగా నష్టాలు లేని వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. సముద్రపు నాచు మొక్కను శాస్త్రీయ పద్ధతుల్లో తక్కువ పెట్టుబడితో పెంచుతూ ప్రతి నెల నికర ఆదాయం పొందుతూ నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాడు.

ఆలోచన బాగానే ఉంది. అయితే స్పిరులినా పెంపకాన్ని ఎలా ప్రారంభించాలి? అందుబాటులో ఉన్న ఆధునిక పద్ధతులేమిటి? మదర్ కల్చర్ ఎక్కడ లభిస్తుంది వంటి వివరాలను చెన్నై వంటి ప్రాంతాలకు స్వయంగా వెళ్లి తెలుసుకున్నాడు. అయితే చాలా మంది ఎక్కువ పెట్టుబడితో స్పిరులినా సాగు చేస్తుండటం గమనించిన భరత్ అందరికంటే భిన్నంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది కూలీలు అవసరం లేకుండా స్పిరులినా సాగు చేయాలనుకున్నాడు. తనకున్న పొలంలో ముందుగా పాండ్స్ ను నిర్మించుకున్నాడు. అవి దీర్ఘకాలం ఎలాంటి లీకేజులు లేకుండా నాణ్యంగా ఉండేందుకు టర్పాలిన్ షీట్‌లను ఏర్పాటు చేసుకున్నాడు. సెన్సార్ మోటార్ల ను అమర్చుకుని స్పిరులినా కల్చర్ ను అభివృద్ధి చేస్తున్నాడు.

సముద్రంలో పెరిగే నాచును శాస్త్రీయ పద్ధతుల్లో పెంచాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నాడు ఈ యువరైతు. ముందుగా నీటి పరీక్ష చేసుకోవాలని సూచిస్తున్నాడు. సముద్రపు నీరు ఉప్పుగా ఉంటుంది కాబట్టి ఆ ప్రకారమే నీటిని సిద్ధం చేసుకోలాని చెబుతున్నాడు. నీటిలో పీహెచ్‌ స్థాయిలను మెయిన్‌టేన్ చేసేందుకు కళ్లుప్పును వాడుతున్నాడు. స్పిరులినా పెరిగేందుకు వంట సోడా, నీమాయిల్ , సన్‌ఫ్లవర్ నూనెలను ఉయోగిస్తున్నాడు. సీడ్ వదలగానే 15 రోజుల పాటు కదిలించకుండా ఉంచాలని ఆ తరువాత 16వ రోజు నుంచి ప్రతి రోజు పంటను తీసుకోవచ్చని భరత్ చెబుతున్నాడు.

స్పిరులినా పెంపకంలో మార్కెటింగ్ అనేది పెద్ద ఛాలెంజ్ అంటున్నాడు భరత్. పంట సాగుకంటే ముందే మార్కెట్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నాడు. అదే విధానాన్నితాను అనుసరించాలని చెబుతున్నాడు. స్పిరులినా సాగు కంటే ముందే దీని వినియోగం ఎంత, ఎవరెవరికి ప్రయోజనకరంగా ఉంటుందో పరిశీలించానంటున్నాడు. స్పిరులినాను అనేక రకాలైన ట్యాబ్లెట్స్‌లో వాడతారని మానవ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది ఎంతో మెరుగ్గా పని చేస్తుందని చెబుతున్నాడు. అదే విధంగా పశువులకు దాణాగా, రొయ్యలకు మేతగాను ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందంటున్నాడు. స్పిరులిన వాడిన చాలా మంది రైతుల నుంచి మంచి స్పందన లభించిందంటున్నాడు.

ప్రతి రోజు 60 కేజీల వెట్ స్పిరులినా అందుతోంది. దానిని ఆరబెట్టడం వల్ల 6 కేజీల డ్రై స్పిరులినా చేతికి వస్తోంది. ఇలా 30 రోజుల లెక్కన చూసుకున్నా180 కేజీల ఉత్పత్తి అందుతోందని భరత్ చెబుతున్నాడు. ఇందులో వంద కేజీలు నెలకు అమ్ముకున్నా 45 వేల వరకు ఆదాయం లభిస్తుందని ఖర్చులు పోను 30 వేల లాభం ఉంటుందంటున్నాడు. వ్యవసాయంలో నష్టంలేని సాగు ఏదైనా ఉందంటే అది స్పిరులినానే అని అంటున్నాడు ఈ యువరైతు. ఆసక్తి గల వారు తనను సంప్రదిస్తే మదర్ కల్చర్ తో పాటు సాగులో పాటించాల్సిన మెళకువలపైన అవగాహన కల్పిస్తానంటున్నాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories