Water Champion: ఊరు వాడ ఏకం చేసింది.. రైతుల్లో చైతన్యం తీసుకువచ్చింది

Water Champion Changes Farmers Lives
x

 పారేశమ్మ

Highlights

Water Champion: సాగు నీటి కోసం రైతులు పడే కష్టాలు ఆమెను కదిలించాయి.

Water Champion: సాగు నీటి కోసం రైతులు పడే కష్టాలు ఆమెను కదిలించాయి. సమయానికి వానలు కురువక బోర్ల నుంచి చుక్క నీరు రాక అన్నదాతలు పడే అవస్థలు ఆ కళ్లు చిన్నప్పిటి నుంచి చూశాయి. రైతు కంట్లో చెమ్మను తుడిచి నిటి తడులను అందించాలని సంకల్పించుకుంది. ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో జల సంరక్షణకు నడుం బిగించింది. ఊరు వాడ కాళ్లరిగేలా తిరిగింది రైతన్నలను ఏకం చేసింది వారిలో చైతన్యం తీసుకువచ్చింది. ఆ కష్టమే తనకు అరుదైన గౌరవం దక్కేలా చేసింది. కరవు సీమలో కాంతులు నింపుతోన్న చిత్తూరు జిల్లాకు చెందిన పారేశమ్మపై ప్రత్యేక కథనం.

చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లె మండలం గోపిదిన్నె గ్రామానికి చెందిన పారేశమ్మ ఐటీఐ పూర్తి చేసింది. ప్రస్తుతం ఫౌండేషన్ ఫర్ ఎకోలాజికల్ సెక్యూరిటీ సంస్థలో రిసోర్స్‌ పర్సన్‌గా పనిచేస్తోంది. గుజరాత్ కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థ రెండు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా పర్యావరణ పునరుద్ధరణ, వనరుల పరిరక్షణ వంటి అంశాల్లో కృషి చేస్తోంది. ఈ సంస్థ కార్యకర్తలుగా ఉన్న వారు ఈ విధానాలను పల్లెలకు వెళ్లి రైతులకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఈ పని పారేశమ్మకు కొత్తేమి కాదు. రైతు కుటుంబానికి చెందిన పారేశమ్మ సాగులో రైతులు ఎదుర్కొటున్న సమస్యలను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగింది. అప్పట్లో సాగు నీటి కోసం అక్కడి రైతులు పడిన బాధలు ఆమెను కలచివేసేవి. వాన రాక , భూగర్భజలాలు లేక, సాగు నీటి కోసం ఎన్ని బావులు తొవ్వినాచుక్క నీరు దొరకాలంటే గగనంగా ఉండేదు. అందుకే రైతులకు మేలు చేసే ఈ బాధ్యతలను తాను ఎంతో ఇష్టంగా స్వీకరించింది పారేశమ్మ.

ఆయా ప్రాంతాల్లో భూసారం ఎంత? నీళ్లు ఎంత లోతులో ఉన్నాయి? ఏఏ పంటలను అక్కడ పండించవచ్చు? జాగ్రత్త పడకపోతే కలిగే నష్టాలేంటి.? ఇలా ఒక్కో అంశాన్ని రైతులకు అర్థమయయేలా సవివరంగా వివరించేది పారేశమ్మ. రైతులందరినీ ఒక తాటిపైకి తీసుకురావడానికి చాలా కష్టపడింది. అవమానాలు, ఛీత్కారాలు, హేళనలు ఎన్ని ఎదురైనా వీసమంత నిరుత్సాహం కూడా అమెలో నెలకొనలేదు. వాటినే ఆయుధాలుగా మార్చుకుని తన లక్ష్యం వైపు అడుగులు వేసింది పారేశమ్మ. వ్యవసాయం గురించి నీకేం తెలుసు అని ప్రశ్నించిన వారే. అమ్మా ఈ సారి ఏ పంట వేయమంటారు అని అడిగేలా వారిలో నమ్మకం కలిగించింది. చుట్టు పక్కల గ్రామాల రైతులకు ఏ సమస్య వచ్చినా ఇప్పుడు పారేశమ్మ వైపే చూస్తున్నారు.

నీటి సంరక్షణ, వినియోగం , వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను రైతులకు వివరించి వారిలో చైతన్యం తీసుకువచ్చే బాధ్యతను భుజానకెత్తుకుంది పారేశమ్మ. అందుకోసం రైతుల వ్యవసాయ క్షేత్రాలకు స్వయంగా వెళ్లి వారు అవలంభించాల్సిన పద్ధతులను వివరించే ప్రయత్నం చేసింది. అయితే ప్రారంభంలో ఆమెను రైతులంతా హేళన చేసేవారు వ్యవసాయం గురించి నీకేం తెలుసునని ప్రశ్నించేవారు. మరోమారు ఇటువైపు రావొద్దంటూ విసుక్కునేవారు అయినా వెనుతిరుగలేదు. రైతులు ఏమనుకున్నా ఏమాత్రం విసుగు, నిరుత్సాహం చెందకుండా ప్రతి రోజు ఓపికతో వారిని కలుస్తుండేది.

స్థానికంగా నీట లభ్యత తక్కువగా ఉండటం, భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో అధిక మొత్తంలో వరి, టమాటా పంటలు సాగు చేసే రైతులు నష్టపోతుండేవారు. అయితే వారికి నీటి కుంటలు, చెక్ డ్యాముల వల్ల భూగర్భజలాలు ఎలా ఆదా అవుతాయి? చిరుధాన్యాలు ,వేరుశనగ పంటల సాగువల్ల తక్కువ నీటితో సాగు చేయడం ఎలా అనే అంశాలపై అవగాహన కల్పించేంది. నీటి నిర్వహణపై సరదా ఆటలు ఆడించేది. వివిధ ప్రయోగాలు చేయించేది. మెల్లిగా తంబళ్ళపల్లె మండలం ఆ చుట్టు పక్కన పదహారు గ్రామాల్లో పట్టు తెచ్చుకుంది. క్రమంగా వారంతా ఉపాధి హామీ పనుల్లో భాగంగా నీటి కుంటలు, చెరువులు, ట్రెంచ్‌లు, చెక్‌డ్యామ్‌లు నిర్మించుకున్నారు. రైతులు ఆమె చెప్పిన పద్ధతుల్లోనే పంటలు సాగు చేయడం వల్ల విజయాలు సాధిస్తున్నారు. దీంతో మండలంలో పారేశమ్మ సలహాలు, అవగాహన కార్యక్రమాలు ప్రాచుర్యం పొందాయి.

ఇలా గత ఐదేళ్లుగా నిర్విరామ కృషి చేస్తూ స్థానిక రైతుల్లోనూ , వ్యవసాయ పద్ధతుల్లోనూ అనేక మార్పులు తీసుకువచ్చింది పారేశమ్మ. ఆమె శ్రమకు గుర్తింపుగా యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్, నేషనల్ వాటర్ మిషన్‌లు నేషనల్ ఉమెన్ వాటర్ ఛాంపియన్ అవార్డును ప్రకటించాయి. ఇలాంటి పురస్కారాలు తనకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తాయని పారేశమ్మ చెబుతోంది.

నీటి కొరత లేదు. భూగర్భ జలాలు పెరిగాయి. ఫలితంగా పంటలు వాటితో పాటే రైతు మంచి ఆదాయం అందుకుంటున్నాడు. దీనంతటికీ పారేశమ్మ తన లక్ష్య సాధన కోసం నిబ్బరంగా చేసి కృషేనని చెప్పక తప్పదు. పారేశమ్మ స్ఫూర్తిగా ప్రతి ఒక్కరు నీటి సంరక్షణకు పంట మార్పిడికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


Show Full Article
Print Article
Next Story
More Stories