Vakka Sagu: ఏకపంటగా వక్క సాగు.. ఖర్చులు పోను రూ.2లక్షల లాభం..

Vakka Sagu Betel Nut Farming Profit in Telugu
x

Vakka Sagu: ఏకపంటగా వక్క సాగు.. ఖర్చులు పోను రూ.2లక్షల లాభం..

Highlights

Vakka Sagu: కిళ్ళీ, తాంబూలంలో వినియోగించే వక్కసాగు కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో అధికంగా ఉంటుంది.

Vakka Sagu: కిళ్ళీ, తాంబూలంలో వినియోగించే వక్కసాగు కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో అధికంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, గోదావరి జిల్లాల రైతులు వక్క సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఒకసారి పెట్టుబడి పెడితే దీర్ఘకాలం ఆదాయం వచ్చే పంట కావడం, తక్కువ శ్రమ, చీడపీడల సమస్యలు పెద్దగా లేకపోవడంతో వక్క సాగు చేసిన రైతులు లాభాలను పొందుతున్నారు. అలాంటి వక్కసాగుపై దృష్టి సారించారు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన అభ్యుదయ రైతు. సాధారణంగా కొబ్బరి, కోకో వంటి తోటల్లో వక్కను చాలా మంది రైతులు అంతర పంటగా సాగు చేస్తున్నారు. కానీ ఈ రైతు మాత్రం ప్రయోగాత్మకంగా ఏకపంటగా వక్క పండిస్తున్నారు. చక్కటి దిగుబడులు సొంతం చేసుకుంటూ ఆర్ధికాభివృద్ధి సాధిస్తున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం పొలాసగూడెంలో కొండపల్లి దివాకర్ అనే రైతు వక్క పంటను సాగు చేస్తున్నారు. ఈ సాగుదారుకు కొబ్బరి, కోకో, మిరియం పంటలు సాగు చేసే అనుభవం ఉంది. అయితే వక్కను మిశ్రమ పంటగా సాగు చేయడం పరిపాటి. ఈ రైతు మాత్రం ప్రయోగాత్మకంగా వక్క పంటను ఏక పంటగా సాగు చేస్తున్నారు. చక్కటి దిగుబడులను సొంతం చేసుకుంటూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

మిశ్రమ పంట అయితే ఎకరానికి 300 నుంచి 600 మొక్కలు వేస్తారు. అయితే దివాకర్ ఏక పంటగా సాగు చేయడం తో ఒక ఎకరానికి 940 మొక్కలు నాటుకున్నారు. వరుసల మధ్య ఎనిమిది అడుగులు ,మొక్కలు మధ్య ఆరు అడుగులు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఐదేళ్ల క్రితం మొక్కలు నాటడానికి ఎకరాకి 35 వేల రూపాయిలు వరకు ఖర్చు చేశారు. ఈ వక్క పంటలో రైతు మొదటి రెండు సంవత్సరాలు అరటిని అంతర పంటగా పండించారు. వక్క పంట వేయడానికి అయిన ఖర్చు అరటి ద్వారా రైతుకు వచ్చేసింది.

రైతు వక్క పంట వేసి ఐదు సంవత్సరాలు పూర్తి కావడంతో మొదటి ఫలసహాయం పొందుతున్నారు. పంట దించి ఎండబెట్టిన తరువాత ఎకరాకి సుమారుగా 1000 కేజీల కాయ దిగుబడి లభిస్తోంది. వీటిని మార్కెట్లో అమ్మగా 2 లక్షల 80 వేలు రూపాయిల వరకు ఆదాయం ఆర్జించారు. ఇందులో సాగు ఖర్చులు 80 వేలు తీసెయ్యగా 2 లక్షల రూపాయిలు రైతుకి లాభం వచ్చింది.

వక్క పంటకు చీడపీడలు సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ రైతు. సమయానుకూలంగా చెట్లకు నీరు అందిస్తుండటంతో పాటు, రెండు నెలలకు ఒకసారి కూలీలను పెట్టి తోటలో కలుపు మొక్కలను తీయిస్తున్నారు. మొక్కలకు ఎండ తగలకుండా ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేశారు. సాగులో మెళకువలను పాటిస్తూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories