రైతన్నకు తీరని యూరియా కష్టాలు

రైతన్నకు తీరని యూరియా కష్టాలు
x
Highlights

ప్రభుత్వం ఓ పక్క యూరియా కొరత లేదని చెబుతున్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కడ చూసిన నో స్టాక్ బోర్డులే కనిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా...

ప్రభుత్వం ఓ పక్క యూరియా కొరత లేదని చెబుతున్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కడ చూసిన నో స్టాక్ బోర్డులే కనిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతన్నలు యూరియా కొరతతో తీవ్ర అవస్ధలు పడుతున్నారు. విక్రయ కేంద్రాల వద్ద రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. యూరియా కోసం ఉదయం నుంచే బారులు తీరుతున్నారు. సకాలంలో యూరియా వేయకపోతే పంటలు దెబ్బతింటాయని దీంతో దిగుబడి కూడ తగ్గుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో యూరియా కొరత వ్యాపారులకు వరంగా రైతులకు శాపంగా మారింది. ప్రస్తుతం కురిసిన వర్షాలకు రైతులు వరి, పత్తిపంటను వేయాలని యూరియా కోసం ఎగబడుతున్నారు. రోజుల తరబడి షాపుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఈ ఏడాది సంవృద్దిగా వర్షాలు కురవడంతో అంచనాలకు మించి సాగు విస్తీర్ణం పెరిగింది. ఓవైపు అధికారులు తెప్పించిన యూరియా ఎందుకూ సరిపోవడం లేదు..? ప్రభుత్వం యూరియా బస్తాకు...266.50 పైసల ధర నిర్ణయించగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కొంత మంది ప్రైవేట్ డీలర్లు 350 నుంచి 360 రూపాయల వరకు అమ్ముతున్నారు. ఇంత ధర ఏమిటని నిలదీసిన ఆ రైతుకు ఇక యూరియా దొరకనట్టే అన్న పరిస్థితులను కల్పిస్తున్నారు.

ముఖ్యంగా జడ్చర్ల, గద్వాల, పెబ్బేరు, వనపర్తి, మహబూబ్ నగర్‌కు చెందిన కొందరు బడా వ్యాపారులు నేరుగా కంపెనీల నుంచి కొన్న యూరియాను సైతం రైతులకు ఎక్కువ ధరకు యూరియాను విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. యూరియా అంతంత మాత్రంగానే వస్తుండటంతో రైతులు గత్యంతరం లేక ఎక్కువ ధరకు కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడింది. అయితే ఎక్కువ ధరకు కొన్నా బిల్లుల్లో మాత్రం బస్తా 266.50 పైసలకే విక్రయించినట్టు వేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో వ్యాపారులు డబ్బే ధ్యేయంగా రైతులకు తమదగ్గరున్న గులికల మందును సైతం బలవంతంగా అంటగడుతున్నారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరిగింది. కోవిడ్ కారణంగా వలస వెళ్లిన ఎంతో మంది తిరిగి స్వగ్రామాలకు చేరుకున్నారు. దీంతో ఉపాధి కోసం బీడు భూములన్నింటిని పంట పొలాలుగా మార్చుతున్నారు. ఈ సమయంలో ప్రభుత్వం రైతులకు పూర్తి స్థాయిలో యూరియా అందిస్తే జిల్లా సస్యశామలంగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories