Terrace Gardening: సాఫ్ట్‌వేర్ ఉద్యోగి....మిద్దె సాగుబాట

Terrace Gardening by Software Employee Sampath
x

Terrace Gardening: సాఫ్ట్‌వేర్ ఉద్యోగి....మిద్దె సాగుబాట

Highlights

Terrace Gardening: మిద్దెతోట ఇంటిల్లిపాదికి సంవత్స రం పొడవునా తాజా కూరగాయలు, పండ్లు, పూలు ఇస్తుంది.

Terrace Gardening: మిద్దెతోట ఇంటిల్లిపాదికి సంవత్స రం పొడవునా తాజా కూరగాయలు, పండ్లు, పూలు ఇస్తుంది. ఆరోగ్యానికి భరోసా కల్పిస్తుంది. యాంత్రిక జీవనంతో దూరమైన మానసిక ఉల్లాసాన్ని తిరిగి తెస్తుంది. అన్నిటికి మించి ప్రకృతితో స్నేహం నేర్పిస్తుంది. తద్వారా కోల్పోయిన జీవన మాధుర్యాన్ని అందిస్తుంది. సృజనాత్మకతను పెంచుతూ, మంచి ఆలోచనలు పురుడుపోసుకోవడానికి అనువైన వాతావరణం కల్పిస్తుంది మిద్దెతోట.

హైదరాబాద్ లోని ఎల్బీనగర్‌ కు చెందిన సంపత్ ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ఉద్యోగరీత్యా ఎప్పుడూ గజిబిజి జీవితమే గడిపేవాడు. ప్రశాంతత అంటే తెలియని పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. కానీ ఆ బిజీ టైం లోనూ కాస్త సమయాన్ని వెచ్చించి మొక్కల పెంపకం వైపు దృష్టి సారించాడు. మార్కెట్ లో లభిస్తున్న ఆహార ఉత్పత్తుల్లో నాణ్యత కొరవడడాన్ని గురించిన సంపత్ తానే స్వయంగా ఇంటి అవసరాలకు సరిపడా ఆహారాన్ని పండించుకోవాలని నిర్ణయించుకున్నాడు. మిద్దె తోటల సాగుకు శ్రీకారం చుట్టాడు. గత రెండున్నర సంవత్సరాలుగా తాము ఉంటున్న అద్దె ఇంట్లోనే అందమైన తోటను నిర్మించుకున్నాడు. వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ మిద్దె పైన సుమారు 150 కుండీల్లో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నాడు సంపత్. తన తోటలో ఏ మొక్కను పెంచినా అందులో ఉన్న పోషకవిలువలకే ఈ సాగుదారు ముందుగా ప్రాధాన్యం ఇస్తారు. అందుకే ఆకుకూరలను అధికంగా పండిస్తున్నాడు సంపత్. చిన్న చిన్న కుండీలనే అందంగా మిద్దె మీద వరుస క్రమంలో ఏర్పాటు చేసుకుని వివిధ రకాలు కూరగాయలు పండిస్తున్నాడు. మిద్దె సాగుకు అవసరమైన విత్తనాలను మొదట ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేసి ఆ తరువాత తానే స్వయంగా విత్తనాన్ని ఉత్పత్తి చేసుకుంటున్నాడు. తాను ఇంట్లో మిద్దె తోటలను సాగు చేయడమే కాదు తమ చుట్టు పక్కన ఉన్న మిద్దె తోట సాగుదారులంతా ఓ సంఘంగా ఏర్పడి వారు వారు సాగు చేసే కొత్త రకం విత్తనాలను ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకుంటుంటారు. విత్తన ఉత్పత్తి, సేకరణ ద్వారా విత్తన ఖర్చు తగ్గడంతో పాటు నాణ్యమైన ఉత్పత్తి లభిస్తుందంటున్నాడు సంపత్.

సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు శారీరక శ‌్రమ తక్కువ. కానీ పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. రూఫ్ గార్డెన్ పని చేయడం వల్ల ఎంతో ప్రశాంతంగా ఉంటుందని సంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు సంపత్. అరగంట సేపు మిద్దె తోటలో సమయం గడిపితే వ్యాయామాలు చేయాల్సిన పని లేదని జిమ్ములకు వేలకు వేలు ఖర్చు చేయాల్సిన అవసరం రాదంటున్నాడు సంపత్. అంతేకాదు పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు మనకు అందుబాటులో ఉంటాయంటున్నాడు. రానున్న కాలంలో కూరగాయల కొరత అధికంగా ఉంటుందని పౌష్టిక ఆహారం దొరికే పరిస్థితి ఉండదంటున్నాడు. అందుకే అర్బన్ ఫార్మర్స్ పెరగాలని మిద్దెల మీద పంటలు పండించుకోవాలని సూచిస్తున్నాడు. ఆరోగ్యవంతమైన జీవితాన్ని కొనసాగించడానికి మిద్దెతోటలు మంచి మాధ్యమం అని చెబుతున్నాడు.

ప్రారంభంలో మిద్దె సాగులో చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యాయి. చీడపీడలు ఆశించడంతో కాస్త ఇబ్బందులు పడ్డాడు సంపత్. ఏం చేయాలో తెలియని పరిస్థితి. అయినా వెనకడుగు వేయలేదు. సామాజిక మాధ్యమాల నుంచి కాస్త సమాచారాన్ని సేకరించి నిపుణుల సలహాలు తీసుకుని తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇప్పుడు పచ్చటి వనాన్ని టెర్రస్ మీద ఏర్పాటు చేసుకున్నాడు. అయితే మిద్దె సాగు చేయాలనుకునే వారు చీడపీడలు ఆశించిన తరవాత నివారణ చర్యలు తీసుకోకుండా ముందు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నాడు.

మొక్కలకు కావాల్సిన పోషకాలన్నింటిని తన ఇంటి కిచెన్ నుంచి వచ్చే వేస్ట్‌తోనే తయారు చేసుకుంటున్నాడు. కిచెన్ వేస్ట్‌తో తయారైన కంపోస్ట్ మిశ్రమాన్నే మిద్దె తోటల సాగుకు వినియోగిస్తున్నాడు. మట్టిని తక్కువ మొత్తంలోనే వినియోగిస్తున్నాడు. ఈ సేంద్రియ ఎరువును చాలా తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చని అంటున్నాడు సంపత్.

మిద్దె తోటను సుందరంగా తన బడ్జెట్ లో నిర్మించుకున్నాడు సంపత్. మేడ మీద అడుగు పెట్టగానే కనిపించే వర్టికల్ స్టాంట్స్ ఈ మిద్దెతోటలకు స్పెషల్ అట్రాక్షన్. ఈ స్టాండ్స్ లో తీగజాతి కూరగాయలు పండిస్తున్నాడు సంపత్. ఆ పక్కనే రెండు వర్టికల్ టవర్ లను ఏర్పాటు చేశాడు. ఓ టవర్ లో పూల మొక్కలను పెంచితే మరో టవర్ లో ఆకుకూరలు సాగు చేస్తున్నాడు. మేడ మీదకు వచ్చే ప్రతీ సారి మిద్దె తోట అందాలను చూస్తూ తాను పడిన శ్రమనంతా మరిచిపోతానంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు సంపత్. టెర్రస్ గార్డెన్‌ల వల్ల ఆరోగ్యంతో పాటు పర్యావరణాన్ని కాపాడిన వారము అవుతామంటున్నాడు. ఆసక్తి ఉన్నవారు వెంటనే మిద్దె సాగుకు ఉపక్రమించాలని సూచిస్తున్నాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories