Taiwan Guava Cultivation: ప్రతి రోజు 2 టన్నుల దిగుబడి.. తైవాన్ జామలో నికర రాబడి
Taiwan Guava Cultivation: బీఎస్సీ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ చదివాడు.
Taiwan Guava Cultivation: బీఎస్సీ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ చదివాడు. ప్రముఖ ఫార్మా కంపెనీలో ఐదేళ్లు ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేశాడు. కానీ ఉద్యోగం అతడికి సంతృప్తిని ఇవ్వలేదు. వ్యవసాయం చేయాలనుకున్నాడు. సొంతూరు కదిలాడు. అందరిలా వరి సాగు కాకుండా కొత్తగా ఏదో చేయాలనుకున్నాడు. వ్యవసాయ అనుబంధ రంగమైన పాడిపైన దృష్టిసారించాడు. అయితే డెయిరీ రంగంలో నష్టాలు ఎదురయ్యాయి. అయినా కుంగిపోలేదు. సేద్యంలోనే రాణించాలని నిర్ణయించుకున్నాడు మిత్రుడి సలహాతో హైడెన్సిటీ పద్ధతిలో జామ తోటల సాగు చేపట్టాడు. శ్రమకు కాస్త నైపుణ్యతను జోడిస్తే సాగులో అద్భుతాలు సాధించవచ్చని నిరూపిస్తున్నాడు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన యువరైతు బాలవర్ధన్ రెడ్డి.
ఈ జామ తోట మహబూబ్ నగర్ జిల్లా గండేడ్ మండలం అంచెన్ పల్లి గ్రామంలో ఉంది. ఈ జామ తోట సాధారణంగా మనం చూసే జామ తోటలకు భిన్నంగా కనిపిస్తోంది. హైడెన్సిటీ విధానంలో 8 ఎకరాల విస్తీర్ణంలో తైవాన్ జామను సాగు చేస్తున్నాడు యువరైతు బాలవర్థన్ రెడ్డి. నికర ఆదాయం పొందుతూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
బాలవర్థన్ రెడ్డి బీఎస్సీ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ చదివాడు. ప్రముఖ కంపెనీలో ఐదేళ్లు ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేశాడు. 2015 సంవత్సరంలో ఉద్యోగం మానేసి వ్యవసాయం వైపు అడుగులు వేశాడు. సొంత పొలం 6 ఎకరాలు ఉంది దీంతో వ్యవసాయం చేసుకోవాలని స్వగ్రామం చేరుకున్నాడు. అయితే గ్రామంలో అధిక శాతం రైతులు వరి మిగతా పంటలు సాగు చేస్తుండటం గమనించాడు వారిలా కాకుండా కొత్తగా ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. డెయిరీ వైపు దృష్టి సారించాడు. కానీ వర్షాలు సరిగా పడక గ్రాసాలు అందుబాటులో లేక పశుపోషణపై ప్రభావం చూపింది. దీంతో నష్టాలు ఎదురయ్యాయి. పోగొట్టుకున్న చోటే పొందాలన్నది ఈ రైతు ఉద్దేశం. అందుకే వెనకడుగు వేయలేదు. ఉద్యాన పంటలపై దృష్టి సారించాడు. మిత్రుడి సలహా మేరకు జామ సాగు మొదలు పెట్టాడు.
సొంత పొలం రహదారికి దూరంగా ఉండటంతో మార్కెటింగ్ కు ఇబ్బంది కలుగకూడదన్న ఉద్దేశంతో 14 ఎకరాలు లీజుకు తీసుకున్నాడు. ప్రభుత్వం అందించిన సబ్సిడీతో డ్రిప్ పైపులు ఏర్పాటు చేసుకున్నాడు. బెంగుళూరు నుంచి మొక్కలను తీసుకువచ్చాడు. 2019లో సాగు మొదలుపెట్టాడు. 8 నెలలకే మొదటి పంట రావడంతో రైతుకు పెట్టుబడి అందివచ్చినట్లైంది. వినియోగదారులకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన పండ్లను అందించడమే లక్ష్యంగా సాగులో పూర్తి సేంద్రియ ఎరువులనే వినియోగిస్తున్నాడు బాలవర్థన్ రెడ్డి.
దేశవాళీ ఆవు నుంచి వచ్చే పేడ, మూత్రాలను ఎరువుగా చెట్లకు అందిస్తున్నాడు. ఉద్యానాధికారుల సహకారంతో తోటలోనే చిన్న పాండ్‌ను ఏర్పాటు చేసుకుని అందులో చేపలను పెంచుతున్నాడు. ఆ చేపల నుంచి వచ్చిన వ్యర్థాలను పంటకు ఎరువుగా పారిస్తున్నాడు. ఇక జామ చెట్లల్లో ప్రధానంగా ఎదురయ్యే పిండినళ్లి, నిమటోడ్స్ సమస్యలను సేంద్రియ విధానంలో పరిష్కరిస్తున్నాడు. సాగులో సత్పలితాలు సాధిస్తున్నాడు.
సాధారణంగా జామ సాగుకు ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపరు. పెద్దగా లాభాలు రావని భావిస్తుంటారు పంట కోసం ఏడాదంతా నిరీక్షించాల్సి వస్తుందని ముందుకు రారు అయితే యువరైతు బాలవర్థన్ రెడ్డి మాత్రం మండలంలోనే ప్రయోగాత్మకంగా పూర్తి సేంద్రియ విధానంలో జామ సాగు చేస్తున్నాడు. ఏడాదంతా కాయ దిగుబడి వచ్చే విధంగా ప్రణాళికా బద్ధంగా జామ సాగు చేస్తున్నాడు. తక్కువ పెట్టుబడితోనే అధిక దిగుబడిని సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు. అందుకోసం పంటకు కావాల్సిన పోషకాలను సేంద్రియ ఎరువుల ద్వారానే అందిస్తున్నాడు. జీవామృతం, ఘనజీవామృతం, బ్రహ్మాస్త్రం, మీనామృతం, వేప కషాయాలతో పాటు వేస్ట్ డీకంపోజర్‌ను సమయానుకూలంగా జామ తోటకు అందిస్తూ మంచి దిగుబడిని అందిపుచ్చుకుంటున్నాడు.
ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఎదురైనా రసాయనాలు, పురుగుమందులు వాడలేదు జామ తోటల్లో అధికంగా ఎదురయ్యే పిండినళ్లి, నిమటోడ్స్ వంటి సమస్యలను సేంద్రియ పద్ధతిలోనే పరిష్కారిస్తున్నాడు. గంజి , ఇంగువ ద్రావణాలతో పాటు వేప కషాయాలను పిచికారీ చేస్తున్నాడు. మొదట్లో అందరూ ఈ పద్ధతిలో సాగు చేస్తే రాణించలేవని వారించినా పట్టుదలతో విజయాన్ని సాధించి ఇప్పుడు వారిచేతే సహభాష్ అనిపించుకుంటున్నాడు ఈ యువరైతు. వినియోగదారులకు రసాయనాలు లేని ఆహారాన్ని అందించడమే తన ప్రధాన లక్ష్యం అంటున్నాడు.
వ్యవసాయంలో వస్తున్న వినూత్న మార్పులు పండ్ల తోటల సాగును కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. ఎకరాకు వంద మొక్కలు ఉండే చోట 11వందల మొక్కలను నాటుతూ 5 టన్నుల దిగుబడి వచ్చే చోట 15 టన్నుల దిగుబడి వస్తుండటంతో రైతులు సాగులో నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా ఈ పద్ధతి జామ సాగు రైతులకు లాభాల పంట పండిస్తోంది. మిగతా పంటలతో పోల్చితే జామ పండ్లకు ఏడాదంతా గిరాకీ ఉండటంతో హైడెన్సిటీ పద్ధతులను ఆచరిస్తూ తైవాన్ జామ సాగు చేస్తూ ఆర్ధికాభివృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తున్నాడు ఈ యువరైతు మొదటి ఏడాదిలోనే పెట్టిన పెట్టుబడి చేతికంది నికర ఆదాయం పొందుతున్నాడు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
పేదవారి ఆపిల్ గా పిలుచుకునే జామకు పండ్లలో విశిష్ట స్థానం ఉంది. దేశీయంగా , అంతర్జాతీయంగా సుమారు 40 దేశాలలో జామ మార్కెట్ అవుతోంది. సంప్రదాయ పద్ధతిలో జామ సాగు చేపట్టినప్పుడు చెట్లు బాగా పెద్దగా పెరిగి సరైన దిగుబడి ఇవ్వలేక పోతున్నాయి. ఈ పద్ధతిలో ఎకరానికి కేవలం 4 నుంచి 5 టన్నుల దిగుబడి మాత్రమే లభిస్తుంది. ఈ క్రమంలో అధిక, అత్యధిక సాంద్రతలో మొక్కలు నాటి సాగు చేసే పద్ధతి అందుబాటులోకి రావడంతో రైతు హైడెన్సిటీ విధానాన్ని అందిపుచ్చుకున్నాడు. ఎకరాకు 1100 మొక్కలు నాటాడు. ఎటు చూసినా మొక్కకు మొక్కకు మధ్య 6 అడుగుల దూరం ఉండే విధాంగా చూసుకున్నాడు. అంతర కృషికి కాస్త ఇబ్బందిగా ఉన్నా హైడెన్సిటీ పద్ధతిలో మొక్కలు దగ్గరగా నాటుకోవడం వల్ల అధక దిగుబడులు అందుతున్నాయంటున్నాడు. ప్రస్తుతం 8 ఎకరాలకు గాను 9వేల 500 మొక్కలు ఉన్నాయి. ఇవే మొక్కలు పాత పద్ధతిలో సాగు చేసుకున్నట్లైతే 30 ఎకరాలు అవసరమయ్యేదంటున్నాడు.
ఈ పద్ధతిలో మొక్క పరిమాణాన్ని అవసరం మేరకు నియంత్రించుకుంటూ మొక్కకు కావాల్సిన వెళుతురు, గాలి ప్రసరణ జరిగేలా చూసుకుంటున్నాడు. కొమ్మ కత్తిరింపులు, సస్యరక్షణ చర్యలు మొదలైన పనులను ఎప్పటికప్పుడు చేసుకోవడం వల్ల మంచి ఆదాయం వస్తుందటున్నాడు. దళారులపై ఆధారపడకుండా తానే స్వయంగా పండ్లను విక్రయిస్తున్నాడు. రహదారి దగ్గరగా ఉండటంతో తోట వద్దే పండ్లను అమ్ముతున్నాడు. కిలోకి 30 నుంచి 40 రూపాయల చొప్పున ప్రతి రోజు 2 క్వింటాళ్ల వరకు పండ్లను విక్రయిస్తున్నాడు. తద్వారా లాభదాయకమైన నికర ఆదాయం లభిస్తోందని ఈ యువరైతు చెబుతున్నాడు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire