Oil Crops: యాసంగిలో అనువైన నూనె పంటలు

Suitable Oil Crops in Yasangi
x

Oil Crops: యాసంగిలో అనువైన నూనె పంటలు

Highlights

Oil Crops: అక్టోబరు నుంచి రబీ పంటల సాగు మొదలవుతుంది.

Oil Crops: అక్టోబరు నుంచి రబీ పంటల సాగు మొదలవుతుంది. సరైన ప్రణాళిక ద్వారా పంటలు, రకాల ఎంపిక, యాజమాన్య పద్ధతులను పాటించడం వల్ల రైతులు మంచి దిగుబడిని ఆదాయాన్ని పొందే వీలుంటుంది. ఇక ప్రధానంగా నూనెగింజ పంటల సాగు విషయానికి వస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులు అనేక రకాల నూనెగింజ పంటలను పండిస్తున్నారు. అందులో వేరుశనగ, కుసుమ, నువ్వులు, ఆముదం, పొద్దుతిరుగుడు పంటలను సాగు చేస్తున్నారు. మరి వీటిల్లో ఏ రకాలను ఎన్నుకోవాలి రైతులకు అధిక దిగుబడులు అందించే రకాలు ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం.

వేరుశనగలో సాధారణంగా కదిరి-6 రకం రైతుల్లో బాగా ప్రాచుర్యం పొందింది. ఇటీవల విడుదలైన కదిరి లేపాక్షి రకం చాలా తక్కువ సమయంలో ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ రకం బెట్టను తట్టుకుని అధిక దిగుబడినిస్తుంది. రసంపీల్చే దోమ, తామర పురుగులను తట్టుకుంటుంది. వేరుశనగ పంట విత్తిన తరువాత 20 నుంచి 25 రోజుల వరకు ఎటువంటి నీటితడిని ఇవ్వకూడదు. కూలీల కొరతను అధిగమించేందుకు కలుపు నివారణకు సరైన విధానాలు అవలంభించాలి. విత్తడం, పంట కోత, నూర్పిడి కోసం యంత్రాలను వినియోగించాలి. సమగ్ర ఎరువులు, నీటి యాజమాన్యాన్ని పాటించడం వల్ల చక్కటి దిగుబడిని సొంతం చేసుకోవచ్చు.

కుసుమ పంటను రబీలో నల్లరేగడి నేలల్లో నిల్వ ఉన్న తేమతో సాగు చేసుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్న కుసుమ పువ్వు రేకులను గ్రీన్‌ టీగా వాడితే మంచి ప్రయోజనాలుంటాయి. ఈ దిశలో మార్కెటింగ్‌పై దృష్టిసారిస్తే మంచి ఆదాయాన్ని పొందవచ్చు. రబీలో సాగుకు మంజీర, టి.ఎస్‌.ఎఫ్‌-1 రకాలు అనువైనవి. మంజీర రకం 115 నుంచి 120 రోజుల్లో పంటకొచ్చి ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ఇది పసుపు, నారింజ రంగు పూలున్న తెల్లగింజ రకం. గింజల్లో 27 నుంచి 30 శాతం నూనె ఉంటుంది. టి.ఎస్‌.ఎఫ్‌-1 రకం 125 నుంచి 130 రోజుల్లో పంటకొచ్చి ఎకరాకు 6 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ఇది తెల్లపూల రకం. ఎండుతెగులు, పేనుబంకను కొంత వరకు తట్టుకుంటుంది.

ఆముదం పంటను సాధారణంగా వర్షాధారంగా సాగు చేస్తున్నారు. ఈ పంటలో అకాల వర్షాల వల్ల బూజుతెగులు సోకి రైతులు పంటను నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆముదంను నీటి వసతి కలిగిన భూముల్లో డ్రిప్ ద్వారా పండిస్తే అధిక దిగుబడులను పొందవచ్చు. ఆముదంలో హరిత, ప్రగతి, డి.ఎస్‌.సి-107 సూటి రకాలు, పి.సి.హెచ్‌-111, 222, ఇతర హైబ్రిడ్ రకాలను సాగుకు ఎంచుకోవచ్చు. భారత నూనెగింజల పరిశోధన సంస్థ నుంచి విడుదలైన డి.సి.ఎస్‌-107, డి.సి.హెచ్‌-117, 519, ఐ.సి.హెచ్‌-66 రకాలను సాగు చేసుకోవచ్చు.

నువ్వులను వేసవి పంటగా జనవరి రెండో పక్షం నుంచి ఫిబ్రవరి మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు. శ్వేత, హిమ, రాజేశ్వరి, చందన, శారత రకాలు సాగుకు అనువైనవి. రైతులు పొద్దుతిరుగుడు పంటను కనీసం 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో వెసుకుంటే పక్షుల బెడద తక్కువగా ఉంటుంది. డి.ఆర్‌.ఎస్‌.హెచ్‌-1, ఎన్‌.డి.ఎస్‌.హెచ్‌-1, కె.బి.ఎస్‌.హెచ్‌-44 హైబ్రిడ్ రకాలను సాగుకు ఎంచుకోవాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories