Woman Farmer Rupireddy Lakshmi: వెదజల్లే పద్ధతిలో వరి సేద్యం.. మహిళా రైతుకు జాతీయస్థాయిలో గుర్తింపు

Woman Farmer Rupireddy Lakshmi: వెదజల్లే పద్ధతిలో వరి సేద్యం.. మహిళా రైతుకు జాతీయస్థాయిలో గుర్తింపు
x
Highlights

Woman Farmer Rupireddy Lakshmi: ఆత్మవిశ్వాసం, పట్టుదలతో పాటు చేసే పని మీద నమ్మకం ఆమెను విలక్షణంగా నిలిపింది. చివరకు కేంద్ర ప్రభుత్వ దృష్టిని సైతం...

Woman Farmer Rupireddy Lakshmi: ఆత్మవిశ్వాసం, పట్టుదలతో పాటు చేసే పని మీద నమ్మకం ఆమెను విలక్షణంగా నిలిపింది. చివరకు కేంద్ర ప్రభుత్వ దృష్టిని సైతం ఆకర్షించేలా చేసింది. వ్యవసాయంలో ప్రయోగాలు చేస్తూ సత్పలితాలు సాధించి శభాష్‌ అన్పించుకుంటుంది యువ ఆదర్శ రైతు లక్ష్మి.'ఆకాశంలో సగం.. అన్నింటా సమానం' అనే నినాదం స్ఫూర్తితో ముందుకు సాగుతూ వరి సాగులో సరికొత్త పద్ధతికి శ్రీకారం చుట్టిన మహిళా రైతు రూపిరెడ్డి లక్ష్మిపై ప్రత్యేక కథనం.

రూపిరెడ్డి లక్ష్మి స్వగ్రామం కొండపల్కల. ఇది కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ మండలంలో ఉంది. లక్ష్మీ వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. పెద్దగా చదువుకోలేదు. అయినా, తెలివితేటల్లో తక్కువేమీ కాదు. కొండపల్కల గ్రామానికి చెందిన రూపిరెడ్డి లక్ష్మి తన భర్త తిరుపతిరెడ్డితో కలిసి వరిసాగులో సరికొత్త పద్ధతులను ఆవిష్కరిస్తున్నారు. 'వెదజల్లే విధానం'లో 12 ఎకరాలను సాగుచేస్తున్నారు. కూలీల అవసరం లేకుండా ఏటా 430 నుంచి 450 క్వింటాళ్ల ధాన్యం పండిస్తున్నారు ఈ మహిళా రైతు.

సాధారణంగా రైతులు వరి నారు పోసి, పొలం దున్ని, జంబు (దమ్ము) చేసి, కూలీల చేత నాటు వేయిస్తుంటారు. లక్ష్మి మాత్రం వరి విత్తనాలు వెదజల్లి పంట పండిస్తున్నారు. ఈ పద్ధతిలో నాలుగైదు బస్తాలు ఎక్కువగా దిగుబడి తీస్తున్నారు. వడ్లను నానబెట్టి మొలకెత్తిన తర్వాత సిద్ధం చేసిన పొలంలో చల్లుతూ కొయ్యకాళ్లనే వర్మీ కంపోస్టుగా మార్చి ఎరువుగా వినియోగిస్తున్నారు. 90 శాతం సేంద్రియ ఎరువులను వినియోగిస్తూ అధిక దిగుబడులను పొందుతున్నారు లక్ష్మి దంపతులు.

ఐసీఏఆర్‌ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వినూత్నంగా వ్యవసాయం చేస్తున్న రైతులను ప్రోత్సహించేందుకు ఏటా పురస్కారాలు అందజేస్తున్నారు. ఈ యేడాది దేశవ్యాప్తంగా 11 జోన్ల నుంచి ఎంట్రీలను స్వీకరించగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ , పుదుచ్చెరి సంయుక్తంగా ఉన్న 10వ జోన్‌ నుంచి 12 మంది రైతుల పేర్లను ఉత్తమ రైతు విభాగాలకు ప్రతిపాదించగా అందులో వెదజల్లే పద్ధతిలో సాగు చేస్తున్న రూపిరెడ్డి లక్ష్మి పేరును కేవీకే శాస్త్రవేత్తలు పంపించారు. మొత్తం 12 మందిలో లక్ష్మి సాగు విధానం తెలుసుకొని చూసిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ఉత్తమ మహిళా రైతు అవార్డుకు ఎంపిక చేశారు.

జగ్జీవన్‌రామ్‌ పురస్కారంతోపాటు 50 వేల నగదు, ప్రశంసాపత్రాన్ని ఐసీఏఆర్‌ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో అందజేయాల్సి ఉండగా, కరోనా నేపథ్యంలో పురస్కారాన్ని నేరుగా లక్ష్మి ఇంటికే పంపించారు. రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్‌ ప్రవీన్‌రావు, కలెక్టర్‌ శశాంక, కేవీకే శాస్త్రవ్తేతలు వెంకటేశ్వర్‌రావు, తదితరులు ఉత్తమ రైతు లక్ష్మికి ఫోన్‌ ద్వారా ప్రశంసలు, అభినందనలు అందుకుంది.



Show Full Article
Print Article
Next Story
More Stories