Dragon Fruit Cultivation: డ్రాగన్ ఫ్రూట్ సాగుతో లక్షల్లో ఆదాయం అర్జిస్తున్న యువరైతు

Software Employee Turned Dragon Fruit Farmer
x

డ్రాగన్ ఫ్రూట్ సాగుతో లక్షల్లో ఆదాయం అర్జిస్తున్న యువరైతు

Highlights

Dragon Fruit Cultivation: కరవుకు నిలయమైన రాయలసీమలో కాసులు పంటను పండిస్తున్నాడు ఓ యవరైతు.

Dragon Fruit Cultivation: కరవుకు నిలయమైన రాయలసీమలో కాసులు పంటను పండిస్తున్నాడు ఓ యవరైతు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వీడి సేద్యం వైపు మళ్లి తోటి యువకులకు స్ఫూర్తి నిలుస్తున్నాడు . ఒకప్పుడు విదేశాలకు మాత్రమే పరిమితమైన పండును కరవు సీమలో విజయవంతంగా పండిస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నాడు. సాగులో రాణించలేమనుకునే చాలా మందికి ఓ దిశను చూపిస్తున్నాడు. ఎడారి జాతికి చెందిన డ్రాగన్ ఫ్రూట్ సాగులో రాణిస్తున్నాడు చిత్తూరు యువరైతు ప్రదీప్ విజయగాథ.

వియత్నాం, థాయ్‌లాండ్, ఇజ్రాయిల్, శ్రీలంక వంటి విదేశాల్లో విరివిగా సాగయ్యే డ్రాగన్ పండ్లు మన ప్రాంతంలో ఎక్కువగా కనిపించవు. కానీ అలాంటి అరుదైన పంట సాగుకు చిత్తూరు జిల్లా మొలకల చెరువు మండలం యేసువారిపల్లె కేంద్ర బిందువుగా మారింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రదీప్ ఏడున్నర ఎకరాల్లో డ్రాగన్‌ ఫ్రూట్ సాగు చేస్తున్నాడు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన ప్రదీప్ ఉద్యోగంలో సంతృప్తి పొందలేక పొలం బాట పట్టాడు. అందరిలా పంటలు సాగు చేయకుండా వినూత్నంగా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేపట్టాడు. శ్రమలేని సేద్యం చేస్తూ అధిక ఆదాయం ఆర్జిస్తున్నాడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

ఈ పంట సాగుకు నీటి అవసరం చాలా తక్కువ. పూత, కాయ సమయాల్లో 3 నుంచి 4 తడులు అందించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని రైతు చెబుతున్నాడు. మొక్కల ఎదుగుదలకు ఊతం అనేది అతి ప్రధానమైనది. అందుకే ఎకరానికి 600 వరకు సిమెంట్‌ స్తంభాలను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతి స్తంభానికి నాలుగు వైపులా నాలుగు మొక్కలను నాటాడు. స్తంభానికి పైన సిమెంటు చక్రం అమర్చుకున్నాడు. ఇవి మొక్క నుంచి వచ్చిన కొమ్మలు విరిగిపోకుండా జారిపోకుండా ఎప్పటికప్పుడు దిమ్మెలను అల్లిస్తున్నాడు. ఎకరానికి సుమారుగా 2400 వరకు మొక్కలు పడతాయని రైతు అంటున్నాడు. ఈ పంట ఒకసారి నాటితే 30 సంవత్సరాల వరకు దిగుబడిని అందిస్తుందని అంటున్నాడు.

సాధారణంగా డ్రాగన్ మొక్కలు తొలికాపు వచ్చేందుకు రెండు నుంచి మూడు సంవత్సరాల సమయం పడుతుంది. పూత, కాయ సీజన్‌ జూన్ నుంచి అక్టోబర్ నెల వరకు ఉంటుంది పంట పొలంలో విద్యుత్ దీపాలను అమర్చితే వేసవిలో కూడా పంటను పొందవచ్చు. డ్రాగన్ సాగుకు ఎకరానికి 4 నుంచి 5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఎకరాకు మూడు సంవత్సరాల తరువాత 8 నుంచి 10 టన్నుల వరకు దిగుబడి అందుతుందని ప్రదీప్ చెబుతున్నాడు.

కోతకు వచ్చిన డ్రాగన్ పండ్లను విశాఖ, విజయవాడ, హైదరాబాద్, మదనపల్లె ,బెంగళూర్ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నాడు ఈ రైతు. కరోనా సమయంలో కాస్త రేటు తగ్గినా పంట సాగుకు ఇబ్బంది కలుగలేదంటున్నాడు. పంట వేసిన మూడు సంవత్సరాల తరువాత ఈ పండ్ల ద్వారా ఎకరాకు సుమారు 8 లక్షల వరకు ఆదాయం వస్తుంది అని చెబుతున్నాడు ప్రదీప్.

చిన్నపాటి పరిశ్రమను ఏర్పాటు చేసి ఇక్కడి నుంచే డ్రాగన్ ఫ్రూట్స్ నుండి వైన్, జ్యూస్, డ్రై చిప్స్, పొడులను తయారుచేసి భారత్‌తో పాటు విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడు. తోటి రైతులకు తన వంతు చేయూతగా తన వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన నర్సరీ నుంచి డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను అందిస్తున్నాడు ప్రదీప్. మొక్కలతో పాటు సూచనలు, సలహాలు, తన స్వానుభావాలను తోటి రైతులకు అందిస్తూ అదర్శంగా నిలిస్తున్నాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories