Sheep Farming: గొర్రెల పెంపకంలో రాణిస్తున్న కీసరకు చెందిన తాహెర్‌

Sheep Farming Guide By Ideal Young Farmer Taher
x

Sheep Farming: గొర్రెల పెంపకంలో రాణిస్తున్న కీసరకు చెందిన తాహెర్‌

Highlights

Sheep Farming: ఒకరి కింద ఉద్యోగిగా పనిచేయడం కాదు తన కాళ్ల మీద తాను నిలబడి నలుగురికి ఉపాధి కల్పించాలనుకున్నాడు.

Sheep Farming: ఒకరి కింద ఉద్యోగిగా పనిచేయడం కాదు తన కాళ్ల మీద తాను నిలబడి నలుగురికి ఉపాధి కల్పించాలనుకున్నాడు. ఆ లక్ష్యం సాధించే దిశగా వ్యవసాయ అనుబంధ రంగాలవైపు ఆసక్తి చూపాడు. జీవాల పెంపకాన్ని చేపట్టాడు. మొదట్లో పెంపకం తెలీక ఎదురుదెబ్బలు తగిలాయి. అయినా నిరుత్సాహ పడలేదు. ఇదే రంగంలో నిలదొక్కుకోవాలనుకున్నాడు. పట్టుదలతో నైపుణ్యాన్ని పెంచుకుని ఆధునిక పద్ధతులను అవలంభించి జీవాల పెంపకంలో రాణిస్తున్నాడు కీసరకు చెందిన తాహెర్. లాభాల దిశగా అడుగులు వేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

మేడ్చల్ జిల్లా కీసరకు చెందిన తాహెర్ కు జీవాల పెంపకం అంటే ఇష్టం. చదువు పూర్తైన తరువాత తాహెర్ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేశేవాడు. ఉద్యోగంతో పాటు స్వయం ఉపాధి పొందాలనుకున్నాడు. తనకు ఇష్టమైన రంగాన్నే ఉపాధి పొందే మార్గంగా ఎన్నుకున్నాడు. 2014లో 70 గొర్రెలతో జీవాల పెంపకాన్ని మొదలుపెట్టాడు. ప్రారంభంలో పెంపకంపై అవగాహన లేకపోవడంతో నష్టాలను చవిచూశాడు. ఆ తరువాత డెయిరీ ఫామ్‌ ను ఏర్పాటు చేశాడు అందులోనూ పెద్దగా కలిసిరాలేదు. దీంతో ఉద్యోగాన్ని వీడి పూర్తి స్థాయిలో నైపుణ్యతను సాధించి మళ్లీ గొర్రెల పెంపకం ప్రారంభించాడు. ప్రస్తుతం విజయపథంలో వెళుతూ తోటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నాడు తాహెర్.

రెండు రకాల బ్రీడ్లను పెంచుతున్నాడు ఈ పెంపకందారు. తెలంగాణ లోకల్ వెరైటీతో పాటు మాచర్లకు చెందిన బ్రీడ్ లు ఫామ్ లో ఉన్నాయి. ఈ రకాలు 3 నుంచి 4 కిలోల బరువుతో పుడతాయి. 6 నుంచి 8 నెలల్లో అవి 25 నుంచి 30 కిలోల బరువుకు వస్తాయి. ప్రతి 8 నెలలకు ఒక ఈత ఉంటుంది. ఒక్కో గొర్రె 8 నుంచి 10 పిల్లలను ఇస్తుంది. అయితే ఈ రంగంలో రాణించాలనుకునే వారు పూర్తిగా పెంపకంపై అవగాహన పెంచుకుని స్థానిక రకాలనే పెంచుకోవాలని తాహెర్ సూచిస్తున్నాడు.

తనకున్న నాలుగు ఎకరాల స్థలంలో అరెకరంలో గొర్రెల కోసం ఎలివేటెడ్ షెడ్డును ఏర్పాటు చేసుకున్నాడు తాహెర్‌. ఈ షెడ్డు ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నాడు . మిగిలి మూడున్నర ఎకరాల భూమిలో రెండు ఎకరాల్లో సూపర్ నేపియర్, ఎకరం విస్తీర్ణంలో హెడ్జ్‌లూసర్న్ గ్రాసాలను పెంచుతున్నాడు. సాంప్రదాయ పద్ధతులతో పాటు సాంద్ర పద్ధతుల్లోనూ గొర్రెల పెంపకం చేస్తున్నాడు తాహెర్. పచ్చిక బీళ్ళు అందుబాటులో ఉన్న సమయంలో గొర్రెలను బయట మేపుతుంటాడు వేసవి సమయంలో, కొరత ఏర్పడినప్పుడు పచ్చిమేత గ్రాసాలను ఇస్తున్నాడు. ఇవే కాకుండా శనగ పొట్టు, పల్లి పొట్టును జీవాలకు వేస్తున్నాడు. ఉదయం పచ్చి గ్రాసాలు అందిస్తే సాయంత్రం వేలలో డ్రై ఫీడ్ ను అందిస్తున్నాడు. దీంతో జీవాలు ఎంతో ఆరోగ్యంగా పెరుగుతున్నాయి. రైతుకు లాభాలు తెచ్చిపెడుతున్నాయి.

అప్పుడే పుట్టిన జీవాలను సురక్షిత పద్ధతుల్లో సంరక్షించుకుంటున్నాడు ఈ యువరైతు. అదే తన విజయపు రహస్యమంటున్నాడు. సాధారణ షెడ్డుల్లో గొర్రెలను పెంచడం శ్రమతో కూడుకున్న పని అంటాడు తాహెర్‌. అంతే కాదు వాటి విసర్జాలు షెడ్డులో ఉండటం వల్ల గొర్రెలు వ్యాధులబారిన పడతాయంటున్నాడు. ఈ ఎలివేటెడ్ షెడ్డు ఏర్పాటు చేసుకోవడం వల్ల ప్రతి రోజు శుభ‌్రం చేసుకునే శ్రమ తప్పిందంటున్నాడు. కూలీలు అవసరం కూడా తగ్గుతుందంటున్నాడు. తాను ఏర్పాటు చేసుకున్న షెడ్డులో సుమారు 150 పిల్లలను పెంచుకోవచ్చంటున్నాడు. అదే విధంగా పిల్లల్లో జీర్ణశక్తి పెరిగేందుకు మినరల్ బ్రిక్‌లను అందుబాటులో ఉంచాడు.

తన పొలంలో సాగు చేస్తున్న గ్రాసాలను సైలేజ్‌గా మార్చి ఏడాదంతా వినియోగిస్తున్నాడు తాహెర్. గొర్రెలకు గ్రాసాల కొరత రాకుండా చూసుకుంటున్నాడు. షెడ్డు ఉన్న ప్రాంతంలోనే యంత్రాన్ని ఏర్పాటు చేసుకుని సురక్షితమైన పద్ధతిల్లో గ్రాసాలను నిలువ చేసుకుంటున్నాడు. ఈ సైలేజ్ గడ్డి ఒక్కసారి తయారు చేసుకుంటే సంవత్సరం వరకు పాడవకుండా ఉంటుందంటున్నాడు. మేత కోసం పెట్టే ఖర్చు తగ్గుతుంది. ముఖ్యంగా గొర్రెల పెంపకంలో మేత మీద ఖర్చును తగ్గించుకోవడంతో పాటు గొర్రెల పిల్లలను కాపాడుకోగలిగితే ప్రతి ఒక్కరు లాభాలు పొందవచ్చంటున్నాడు. గొర్రెలతో పాటే ప్రయోగాత్మకంగా ఉత్తర ప్రాంతానికి చెందిన కొత్తరకం మేకలను ఫామ్‌లో పెంచుతున్నాడు. బర్‌బరీ జాతికి చెందిన మేకలను రాజస్థాన్‌ నుంచి తీసుకొచ్చాడు తాహెర్‌.


Show Full Article
Print Article
Next Story
More Stories