Rabbit Farming: ఓటమే విజయానికి తొలిమెట్టు. ఆ సూత్రాన్నే నమ్మాడు అతడు.
Rabbit Farming: ఓటమే విజయానికి తొలిమెట్టు. ఆ సూత్రాన్నే నమ్మాడు అతడు. సమస్య వచ్చిందని వెనుకడుగు వేయలేదు ఒటమినే గుణపాఠంగా తీసున్నాడు సమస్యల్లోనే పరిష్కారాల మార్గాలను అన్వేషించాడు. తన విజయానికి బలమైన పునాది వేసుకున్నాడు రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతు రవికుమార్. కుందేళ్ల పెంపకం ప్రస్తుతం ప్రోత్సాహకరంగా ఉన్నా. గతంలో మార్కెటింగ్ ఇబ్బందులు రైతులను తీవ్రంగా వేధించేవి. ఆ సమస్యతోనే తొలుత నష్టాలతో కూరుకుపోయిన తరుణంలో ఈ రైతు ఆత్మవిశ్వాసమే ఓటమిని జయించేలా చేసింది. నేడు సొంతంగా మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని పది మంది రైతులకు ఆదర్శంగా నిలిచేలా చేసింది. కుందేళ్ల పరిశ్రమని ఒక గాడిలో పెట్టి దీని ప్రాధాన్యతను పెంచే దిశగా ముందడుగు వేస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు రైతు రవి కుమార్.
కుందేళ్ల పెంపకం ఒకప్పుడు వ్యాపకం కానీ నేడు అది ఓ వ్యాపారంగా మారింది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో చక్కటి ఉపాధి అందించే పరిశ్రమగా మారింది. చికెన్, మటన్ మాత్రమే కాదు కుందేళ్ల మాంసానికి ప్రస్తుతం మార్కెట్ లో మంచి గిరాకీ ఉంది. వీటి పెంపకాన్ని వ్యాపార సరళిలో చేపట్టి ఎంతో మంది నిరుద్యోగుల ఉపాధి పొందుతున్నారు. మాంసం ఉత్పత్తినిచ్చే మిగతా జీవాలతో పోల్చితే కుందేళ్లలో సంతాన వృద్ధి చాలా వేగంగా జరుగుతుంది. స్వల్పకాలంలోనే మంచి ఆదాయం పొందేవీలుంది. అందుకే ఈ పరిశ్రమ వైపు యువతరం అడుగులు పడుతున్నాయి.
అయితే ఇప్పుడున్నంత మార్కెటింగ్ వ్యవస్థ గతంలో లేదనే చెప్పాలి. కుందేళ్లు కేవలం ఇంటి వరకు పెంచుకునేవిగానే భావించేవారు. కానీ 8 ఏళ్ల క్రితమే ఈ పరిశ్రమకు భవిష్యత్తులో మంచి గిరాకీ ఉంటుందని గుర్తించారు రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట్‌కు చెందిన రవికుమారు. ఆరంభంలో కాస్త ఆటుపోట్లు ఎదురైనా నేడు వేనుకడుగు వేయకుండా విజయపథంలో ముందుకెళ్తున్నారు. తక్కువ శ్రమ, తక్కువ ఖర్చుతో అధిక లాభాలు గడిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
రవికుమార్ కుందేళ్ల ఫాం పెట్టడానికి ముందు ఓ కిరాణా షాపు నిర్వహిస్తూ జీవనం సాగించేవారు. లాభాలతోనే నడిచినా అనివార్య కారణాల వల్ల షాపు మూసివేయాల్సి వచ్చింది. జీవనోపాధి కోసం పెద్ద అంబర్ పేట వచ్చిన రవికుమార్ కిరాణా బిజినేస్ లో ఉన్న పోటీ వల్ల మళ్ళీ దాని జోలికి వెళ్లకూడదనుకున్నారు. ఇదే క్రమంలో కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నారు. తనకు పోటీ ఉండకూడదే ఉద్దేశంతో ఈయన దృష్టి కుందేళ్ల పెంపకంపై పడింది.
కేరళా నుంచి 100 బ్రీడర్ల ను తీసుకువచ్చి పెంపకం ప్రారంభించారు రవికుమార్. పరిశ్రమ నెలకొల్పిన రెండు, మూడు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు. పరిశ్రమైతే పెట్టారు కానీ బ్రీడర్లను కొనేవారు లేరు. వీటి పోషణకైనా డబ్బులు కావాలి దీనితో ఆలోచనలో పడ్డ రవి కుమార్ తానే స్వయంగా మార్కెట్‌కు వెళ్లి బన్నీలను అమ్మారు. గంటలో బన్నీలన్నీ అమ్ముడుపోవడంతో ఈ రంగంలో లాభాలు ఉన్నాయని గుర్తించారు. దీనితో మౌత్ పబ్లిసిటీ ప్రారంభించారు. నమ్మకమే పెట్టుబడిగా వినియోగదారులకు నాణ్యమైన బ్రీడర్లను అందిస్తూ మార్కెట్ రంగంలో రాణిస్తున్నారు.
ఏ రంగంలో అయినా లాభనష్టాలు సహజం అంటారు ఈ రైతు. ముఖ్యంగా కుందేళ్ల పెంపకంలో విజయం సాధించాలంటే పెంపకందారులు జంతు ప్రేమికులై ఉండాలంటున్నారు. ఓర్పు , నేర్పు తప్పనిసరి అని సూచిస్తున్నారు. ఆ విజయ సూత్రమే తనని ఈ రంగంలో నిలబెట్టిందని చెబుతున్నారు రవికుమార్. కుందేళ్ల పెంపకం చేపట్టే ప్రతి ఒక్కరు పెంపకంపై అవగాహన తోనే రావాలంటున్నారు. లేదంటే సమస్యలు తప్పవంటున్నారు. ఎంతో సున్నితమైన కుందేళ్లను చంటి పిల్లల్లా పెంచాలంటున్నారు. దాణా దగ్గరి నుంచి కాలాన్ని బట్టి షెడ్డులో వాతావరణం కల్పించడం వరకు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.
కుందేళ్లు చాలా సున్నితమైన జీవులు కావున వాటిని కంటికి రెప్పల్లా జాగ్రత్తగా పెంచాలంటున్నారు రవి కుమార్. కుందేళ్లు ఎదకు వచ్చినప్పుడు, క్రాసింగ్ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. పిల్లలు పెట్టిన తరువాత తల్లి కుందేళ్లకు పోషకాల దాణాను అందించాలంటున్నారు. ఆ పిల్లలు పాలు దాగుతున్నాయి లేదా అన్నది గమనించాలంటున్నారు. ఒక్కరోజు పాలు తాగకపోయినా మరణించే అవకాశం ఉందంటున్నారు. నిర్ధేశించిన వాతావరణ పరిస్థిుల మధ్య ప్రత్యేకంగా షెడ్డు నిర్మించి కుందేళ్లను జాగ్రత్తగా పెంచాల్సి ఉంటుంది. వేసవిలో మాత్రం షెడ్డులో చల్లటి వాతావరణాన్ని తప్పనిసరిగా కల్పించాలి. 25 నుంచి 30 డిగ్రీల వాతావరణాన్ని కల్పించినట్లైతు మోర్టాలిటీ రేటును తగ్గించుకోవచ్చంటున్నారు ఈ రైతు.
మొక్కజొన్న పిండి, గోధుమ పొట్టు, పల్లీచెక్క , మినరల్ మిక్చర్ తో కలిపిన దాణాను కుందేళ్లకు అందిస్తున్నారు. వీటితో పాటే హెడ్జ్ లూసర్న్ గ్రాసాలను, అజొల్లాను ఇస్తున్నారు. బ్రీడర్స్ మంచి బరువు, ఎదుగుదలకు వచ్చేందుకు నానబెట్టిన శనగలను ప్రతి రోజూ దాణాగా అందిస్తున్నారు.
సంవత్సరానికి ఒక కుందేలు నుంచి 5 నుంచి 6 ఈతలు తీయవచ్చు. మార్కెట్ గిరాకీ ఉందని తెలుసుకుని ఎక్కువ మంది ఈ రంగం వైపుగా వస్తున్నారు. కానీ సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంటోంది. లక్షల్లో ఆదాయం వస్తుందని ప్రారంభంలోనే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నారు. అవగాహన లోపంతో నష్టపోతున్నారు. అందుకే కొద్ది మొత్తంలో పెంపకం చేపట్టి లోటు పాట్లను గమనిస్తూ నిదానంగా వాటి సంఖ్యను పెంచుతూ ఉండాలంటున్నారు. వంద కుందేళ్లను పెంచితే నెలకు అన్ని ఖర్చులు పోను 40 వేల వరకు మిగులుతాయని అనుభవపూర్వకంగా చెబుతున్నారు ఈ రైతు. బన్నీలను విక్రయించడం వల్ల రైతుకు నికర ఆదాయం లభిస్తుందని సూచిస్తున్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire