కాసుల కౌజులు: కౌజుల పెంపకంలో రాణిస్తున్న నల్గొండ యువరైతు..

కాసుల కౌజులు: కౌజుల పెంపకంలో రాణిస్తున్న నల్గొండ యువరైతు..
x

కాసుల కౌజులు: కౌజుల పెంపకంలో రాణిస్తున్న నల్గొండ యువరైతు..

Highlights

70 గజాల స్థలం . పెట్టుబడి 70 వేలకు మించదు. తక్కువ శ్రమతో అధిక లాభం. ఇదంతా కౌజు పిట్టల పెంపకంతోనే సాధ్యమని నిరూపిస్తున్నాడు నల్గొండ జిల్లాకు చెందిన...

70 గజాల స్థలం . పెట్టుబడి 70 వేలకు మించదు. తక్కువ శ్రమతో అధిక లాభం. ఇదంతా కౌజు పిట్టల పెంపకంతోనే సాధ్యమని నిరూపిస్తున్నాడు నల్గొండ జిల్లాకు చెందిన యువరైతు పవన్ . రెండు పదుల వయస్సులోనే నెలకు సాఫ్ట్ వేర్ ఉద్యోగి మాదిరి నికర ఆదాయం పొందుతున్నాడు. ఇంటి ఆవరణలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో కౌజు పిట్టల పెంపకంలో రాణిస్తున్నాడు. డిగ్రీ పట్టా పుచ్చుకుని ఉద్యోగాల కోసమని , కాళ‌్లరిగేలా కంపెనీల చుట్టూ ప్రదక్షిణలు చేసే యువకులకు భిన్నంగా కౌజు పిట్టల పెంపకంతో స్వయం ఉపాధి పొందుతూ తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

వ్యవసాయ అనుబంధ రంగాల వైపు యువత మెళ్లిగా అడుగులు వేస్తోంది. స్వశక్తితో ఎదగాలన్న తపన పెరుగుతోంది. పట్టణాల్లో ప్రైవేటు కంపెనీల్లో చేసే ఉద్యోగాల కన్నా కాస్త కష్టపడితే స్వయం ఉపాధి పొందవచ్చన్న భావన నేటి గ్రామీణ యువకుల్లో మొదలవుతోంది. ఈ కోవలోకే వస్తాడు నల్గొండ జిల్లా గాంధీనగర్ కు చెందిన యువరైతు పవన్. డిగ్రీ వరకు చదువుకున్న పవన్ తోటి యువకుల్లా ఉద్యోగమంటూ ఉన్న ఊరును, కన్నవారిని వదిలిపెట్టలేదు. చిన్నప్పటి నుంచి జీవాల పెంపకం అంటే పవన్ కు ఎంతో ఇష్టం...ఇప్పుడు ఆ ఇష్టమే, స్వయం ఉపాధి పొందే మార్గమైంది. లాక్ డౌన్ సమయంలో తోటి యువకులు ఉద్యోగాలు పోగొట్టుకుని గ్రామాల బాట పడితే పవన్ మాత్రం ఇదే సరైన సమయమనుకుని కౌజు పిట్టల పెంపకం చేపట్టాడు. కౌజు పిట్టల్లో ఉన్న పోషక విలువలను తెలుసుకుని వాటికి మార్కెట్ లో ఉన్న డిమాండ్ ను గుర్తించి పెంపకాన్ని మొదలు పెట్టాడు. జిల్లాలోనే మొదటి సారిగా కౌజులను పెంచుతున్న యువరైతుగా గుర్తింపు పొందుతున్నాడు పవన్.

నాటుకోళ‌్ల పెంపకం కంటే కౌజు పిట్టల పెంపకం కాస్త సులువనుకున్నాడు పవన్. నాటుకోళ‌లతో పోల్చుకుంటే కౌజుల్లో మరణాల సంఖ్య తక్కువ. వీటి పెంపకానికి పెద్దగా జాగ్రత్తలు తీసుకోవాల్సి అవసరం ఉండదు. ఎంతో సులువుగా వేరే వ్యాపకం చేసుకుంటూనే కౌజులను పెంచుకోవచ్చు. సామాజిక మాధ్యమాల ద్వారా కౌజుల పెంపకంపై అవగాహన పెంచుకున్న పవన్ పరిసర ప్రాంతాల్లో మార్కెట్ ను ముందుగానే పరిశీలించి ఇంటి ఆవరణలోనే షెడ్డును నిర్మించుకున్నాడు. కేవలం 70 గజాల స్థలంలోనే షెడ్డును ఏర్పాటు చేసుకున్నాడు. షెడ్డుతో పాటు ఇతర సదుపాయల కోసం ప్రారంభ పెట్టుబడి కింద 70 రూపాయల వరకు ఖర్చు చేశాడు.

హైదరాబాద్ లోని ఘట్కేసర్ ప్రాంతం నుంచి జపనీస్ కౌజు చిక్ లను కొనుగోలు చేశాడు పవన్. మొదట 500 చిక్ లతో పెంపకాన్ని ప్రారంభించాడు. కౌజుల పెంపకం లాభదాయకంగా ఉండటంతో ప్రస్తతుం 2వేల కౌజు పిట్టలను పెంచుతున్నాడు. ఒక్కో కౌజుకు నెలకు అర కిలో వరకు దాణాను అందిస్తున్నాడు పవన్. దాణా స్వయంగా తయారుచేసుకునే సదుపాయాలు లేకపోవడం బ్రాయిలర్ ఫీడ్ నే కౌజులకు అందిస్తున్నాడు. బ్రాయిలర్ ఫీడ్ ద్వారా కౌజులు మంచి ఎదుగుదలకు వస్తున్నాయి. నెలలోనే కౌజులు 250 గ్రాముల బరువు తూగుతున్నాయి. అనుకున్న బరువుకు కౌజులు రాగానే మార్కెట్ కు తరలిస్తున్నాడు. నెలవారీ లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతున్నాడు.

ఎండాకాలమైనా వర్షాకాలమైనా సీతాకాలమైన సీజన్ ఏదైనా కౌజులకు ప్రత్యేక జాగ్రత్తలు , ఏర్పాట్లు ఏమీ పెద్దగా అవసరం ఉండదంటున్నాడు ఈ యువరైతు. పెంపకం ప్రారంభించే ముందు బ్రూడింగ్ జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుందని చెబుతున్నాడు. మిషన్ ల ద్వారా చిక్స్ ను పొదిగిస్తారు కాబట్టి కాలాన్ని బట్టి వారం నుంచి 10 రోజుల వరకు బ్రూడింగ్ చేసుకోవాలంటున్నాడు. బ్రూడింగ్ ను జాగ్రత్తగా చేసుకుంటే ఆ తరువాత కౌజులు వాటంతట అవే ఆరోగ్యంగా పెరుగుతాయంటున్నాడు.

కౌజుల పెంపకంలో రాణించాలంటే ముందుగా మార్కెట్‌ను ప‌రిశీలించాలని యువరైతు పవన్ సూచిస్తున్నాడు. కౌజు పిట్టల గుడ్లకు, మాంసానికి ఎక్కడ ఎక్కువ గిరాకీ ఉందో తెలుసుకోవాలంటున్నాడు. ఆ త‌రువాతే పెంపకాన్ని చేపట్టాలని చెబుతున్నాడు పవన్. డిమాండ్ ఉంది కదా అని ఆరంభంలోనే అధిక మొత్తంలో పెట్టుబడులు పట్టి దగా పడకుండా తక్కువ ఖర్చుతోనే కౌజుల పెంపకాన్ని ప్రారంభించాలని సూచిస్తున్నాడు. లాభాలు వస్తున్నాయని గుర్తించిన తరువాతే పెంపకాన్ని విస్తరించాలంటున్నాడు.

చేపలు, చికెన్ లాగే కౌజు పిట్టల మాంసంలోనూ పోషకాలు అధికంగా ఉంటాయి. మాంసం కూడా రుచిగా ఉండటంతో మార్కెట్ లో కౌజు మాంసానికి ఈ మధ్యకాలంలో డిమాండ్ ఏర్పడింది. కౌజులను పెంచేందుకు తక్కువ స్థలం సరిపోతుంది. పెట్టుబడి కూడా తగ్గువగానే అవుతుంది. కౌజులను పెంచేందుకు పెద్దగా పరిజ్ఞానం అవసరం లేదు. వీటికి కోళ్లకు సాధారణంగా వచ్చే వ్యాధులు రావు. కౌజుల్లో రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుంది. ఎలాంటి టీకాలు వేయించాల్సిన అవసరం లేదు. అయితే కౌజులను పెంచే పరిసరాలతో పాటు వాటికి అందించే దాణా , నీరు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలంటున్నాడు యువరైతు పవన్.

ఒక కౌజు నెలకు అరకిలో వరకు దాణా తీసుకుంటుంది. వీటికి బ్రాయిలర్ కోళ్ల దాణానే అందిస్తున్నాడు పవన్. కౌజు పిట్టల సంరక్షణ కోసం పెద్దగా సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం లేదంటున్నాడు. ఉదయం , సాయంత్రం దాణా, నీరు సమయానుకూలంగా అందిస్తే సరిపోతుందని చెబుతున్నాడు. వేరే వ్యాపకాలు చేసుకుంటూనే కౌజుల పెంపకం చేసుకోవచ్చంటున్నాడు. ఇలా నెలలో చేతికి అందివచ్చిన కౌజులను నల్గొండ జిల్లాలోనే కాకుండా హైదరాబాద్, విజయవాడ, సూర్యాపేటకు ఎగుమతి చేస్తున్నాడు. కౌజులకు మార్కెట్ లోనూ మంచి డిమాండ్ ఉండటంతో ప్రతి నెల నికర ఆదాయాన్ని పొందుతున్నాడు.

ఇళ్ల మధ్యలో పెంచుతున్నారు కదా ఏదైనా వాసన వస్తే చుట్టుపక్కన వారి నుంచి సమస్య వస్తుందని కదా అని సందేహం రావచ్చు. కానీ దీనికి ఓ పరిష్కారాన్ని ఆలోచించాడు పవన్. పెంపకం మొదలు పెట్టే ముందే వరి పొట్టును నేల మీద పరుస్తున్నాడు. దీనితో ఆ సమస్యకు చెక్ పెట్టాడు. ఈ వరిపొట్టును వృథాగా పోనియ్యడు. దానికి అయిన కాడికి రైతులకు విక్రయిస్తుంటాడు. మాంసంగానే కాదు కౌజుల గుడ్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. డాక్టర్ల సూచన మేరకు షుగర్ పేషంట్లు కౌజు గుడ్లు తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనితో కౌజు పిట్ట గుడ్లను ఉత్పత్తి చేస్తున్నాడు పవన్.

నెలకు 2 వేల వరకు కౌజు పిట్టలను హోల్ సేల్ గా, రీటేల్ గా విక్రయిస్తుంటాడు. తద్వారా నెలకు 30 నుంచి 60 వేల వరకు ఆదాయాన్ని పొందుతున్నాడు. రానున్న కాలంలో ఇదే ఉత్సాహంతో కౌజులతో పాటు నాటు కోళ్లను పెంచాలనే ఆలోచన చేస్తున్నాడు పవన్. తక్కువ పెట్టుబడితో ప్రతి నెల లాభదాయకమైన ఆదాయం పొందుతున్న పవన్ తోటి యువకులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఆసక్తి ఉన్న యువకులు ముందుగా మార్కెట్ చూసుకుని ఈ రంగంలోకి అడుగుపెట్టాలని సూచిస్తున్నాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories